Read more!

English | Telugu

సినిమా పేరు:నేనింతే
బ్యానర్:యూనివర్సల్ మీడియా
Rating:2.50
విడుదలయిన తేది:Dec 18, 2008
ఇది కంప్లీట్‌గా సినీ పరిశ్రమకు చెందిన కథ. రవి (రవితేజ) సినీ పరిశ్రమలో అసిసెంట్‌ డైరెక్టర్‌గా ఇడీ (బ్రహ్మానందం) దగ్గర పనిచేస్తుంటాడు. దర్శకుడవ్వాలనేది అతని కల. అతనికి ఒక తల్లి (రమాప్రభ) ఉంటుంది. ఓ రోజు షూటింగ్‌లో డ్యాన్సర్‌గా వచ్చిన ఒకమ్మాయి డ్రెస్‌ వేసుకోనంటుంది. అలా రవికి పరిచయమైన డ్యాన్సర్‌ పేరు సంధ్య. ఆమెకూ రవికీ మధ్య ప్రేమ ఏర్పడినా, ఆమె బయటపడుతుంది గానీ, రవి తన ప్రేమను వెల్లడించడు. సంధ్యకు అక్క (సురేఖావాణి), సంధ్య, ఆమె అక్కల సంపాదన మీద పడి బ్రతుకుతూ, వాళ్ళని నానా బాధలు పెట్టేశాడిస్టు ఇంకా పరమ బేవార్సు బావ (కృష్ణభగవాన్‌) ఉంటారు. ఆ ఏరియాలో ఉండే ఒక రౌడీకి సంధ్య మీద ఇష్టం ఏర్పడుతుంది. ఆమెను పొందటానికి ఆ రౌడీ, సంధ్య బావను ఎప్రోచ్‌ అవుతారు. కానీ రవి పుణ్యమాని ఒకసారి అతని బారి నుంచి ఆమె తప్పించుకుంటుంది. రవి కృషి ఫలితంగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలోని చిత్రంలో సంధ్య హీరోయిన్‌గా బుక్కవుతుంది. దర్శకత్వం చేయాలనుకున్న రవికి కూడా ఒక నిర్మాత దొరుకుతాడు. సంధ్య పేరున్న హీరోయిన్‌ అవగా, రవి సినిమా డబ్బుల్లేక మధ్యలో ఆగిపోతుంది. రవి తల్లి క్యాన్సర్‌ వల్ల చనిపోతుంది. రవి నిర్మాతలకు ఒక ఫైనాన్సియర్‌ దొరకటంతో సినిమా మళ్ళీ మొదలవుతుంది. కానీ సంధ్య మీద మనసు పారేసుకున్న రౌడీయే ఆ ఫైనాన్సియర్‌ కావటంతో అతని ఆగడాలతో పాటు సంధ్య మీద ఒత్తిడి పెరుగుతాయి. సినిమా చివరి రోజున రవి ఆ రౌడీ ఫైనాన్సియర్‌ని అడ్డుకోవటంతో, అతనేం చేశాడు...? చివరికి రవి సినిమా విడుదలయిందా? రౌడీ సంధ్యని పొందగలిగాడా..? రవి, సంధ్య ఒకటయ్యారా..? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే ఈ చిత్రం చూడండి.
ఎనాలసిస్ :
ముందుగానే చెప్పాను కదా. ఇది పూర్తిగా సినీ పరిశ్రమకు సంబంధించిన కథనీ, దానికి తగ్గట్టే సినీ పరిశ్రమలోని హీరోల మనస్తత్వాలూ, నిర్మాతల బాధలూ, అభిమానులు వీరాభిమానం, దానివల్ల వారు ఎదుర్కునే ఇబ్బందులు, సినీ పరిశ్రమలో కెరీర్‌ కోసం పాట్లుపడే వారి అగచాట్లు, మీడియాలో అంటే కొన్ని వెబ్‌ సైట్లలో వ్రాసే గాలి గాసిప్స్‌, డబ్బుల కోసం వ్రాసే రివ్యూస్‌, (తెలుగువన్‌.కామ్‌ గురించి మాత్రం కాదు), వాటి వల్ల ఏర్పడే దుష్పరిణామాలు ఈ చిత్రం నిండా సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు అనేకం ఉన్నాయి. దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ గురించి, అతని దర్శకత్వం గురించీ చెప్పటం అంటే చెప్పిందే చెప్పటమవుతుంది. అతను ఈ చిత్రం కోసం రొటీన్‌ సినీ ఫార్మెట్‌లోంచి బయటకు వచ్చి, కాస్తరియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని తీయటానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో పూరీ పూర్తిగా సక్సస్సయ్యాడు. ఇక రవితేజ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. తన స్టార్‌ ఇమేజ్‌లోంచి బయటకొచ్చి నటించిన రవితేజను ప్రేక్షకులు తప్పకుండా అభినందించాలి. నూతననటి శియ గొప్ప అందగత్తె కాకపోయినా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. కాకపోతే ఆమె ఎత్తు ఆమెకు కొంతమంది హీరోల సరసన నటించేటప్పుడు బలమైన ఆటంకమవుతుందేమో, షాయాజీషిండే, వేణుమాధవ్‌, సుబ్బరాజ్‌, కృష్ణభగవాన్‌ తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ముమైత్‌ఖాన్‌ మీడియా ముందు తన బాధను వెళ్ళగక్కే సీన్‌ మనసుని కదిలిస్తుంది. సంగీతం:- పూరీ జగన్నాథ్‌ సినిమాలకు చక్రి అందించే సంగీతం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా "కృష్ణానగరే మామ కృష్ణా నగరే మామ సినిమానే లైఫ్‌రా మామ... లైఫ్‌ అంటే సినిమా మామ'' అనే పాట ప్రేక్షకులు పాడుకుంటూ ఇంటికి వెళతారు. ఈ పాటలో సాహిత్యం కూడా సంగీతంతో పోటీపడింది. రీ-రికార్డింగ్‌ కూడా బాగుంది. మాటలు:- ఈ చిత్రం మాటల్లో పూరీ జగన్నాథ్‌ మార్క్‌ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మాటలు వాస్తవానికి చాలా దగ్గరగా చాలా బాగున్నాయి. ముఖ్యంగా షాయాజీ షిండే, ముమైత్‌ఖాన్‌ల డైలాగులకు జనం బాగా స్పందించారు. సినిమాటోగ్రఫీః- శ్యాం.కె.నాయుడు ఫొటోగ్రఫి బాగుంది. ముఖ్యంగా బ్యాంకాక్‌ బీచ్‌లో తీసిన పాటలో కేమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్‌:- బాగుంది. ఆర్ట్‌‌:- ఒ.కె. కొరియోగ్రఫీ:- అన్ని పాటల్లో బాగుంది. యాక్షన్:- ఎందుకనో ఈ చిత్రంలో ఫైట్‌ సన్నివేశాలు కొంచెం సహజంగా వుండేలా జాగ్రత్తపడ్డారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ చిత్రాన్ని ఏ "పోకిరి'' చిత్రంతోనో పోల్చుకుని వెళ్ళకుండా, ఫ్రెష్‌మైండ్‌తో వెళితే మీరీ చిత్రాన్ని బాగానే ఎంజాయ్‌ చేస్తారు. అదీ గాక సినీ పరిశ్రమ గురించి కోద్దో గొప్పో మీకు కూడా తెలిసుంటే ఈ చిత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది.