Read more!

English | Telugu

సినిమా పేరు:నేనే వస్తున్నా
బ్యానర్:వి క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 29, 2022

సినిమా పేరు: నేనే వస్తున్నా
తారాగణం: ధనుష్, ఇందుజా రవిచంద్రన్, ఇల్లి అవ్రమ్, సెల్వ రాఘవన్, ప్రభు, యోగి బాబు
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
నిర్మాత: క‌లైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: సెల్వ రాఘవన్
బ్యానర్: వి క్రియేషన్స్
విడుదల తేదీ: 29 సెప్టెంబర్ 2022

తమిళ్ హీరో ధనుష్ కి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. 'రఘువరన్ బి.టెక్' సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఓటీటీలోనూ ఇక్కడ ధనుష్ సినిమాలు చూసేవారి సంఖ్య ఎక్కువే. పైగా ఇటీవల 'తిరు' సినిమాతో ఆకట్టుకున్నాడు. ధనుష్ సినిమా వస్తుందంటే తెలుగులోనూ అంతోఇంతో బజ్ ఉండటం సహజం. అయితే అతని తాజా చిత్రం 'నేనే వస్తున్నా' గురించి  మాత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు. పైగా ఈ చిత్రానికి '7G బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. దానికితోడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది. అయినప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్రంపై పెద్దగా బజ్ లేదు. మరి సైలెంట్ గా వచ్చిన ఈ చిత్రం అంతే సైలెంట్ గా వెళ్లిపోయేలా ఉందో లేక మౌత్ టాక్ తో హిట్ కొట్టేలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ఇది కవల సోదరుల కథ. ప్రభు(ధనుష్), కథిర్(ధనుష్) కవల సోదరులు. ప్రభు సాధారణంగా ఉంటే, కథిర్ మాత్రం చిన్నతనం నుంచే వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పదేళ్ల వయస్సులోనే మనషుల ప్రాణాలు తీసే అంత పైశాచికంగా అతని ప్రవర్తన ఉంటుంది. దీంతో కథిర్ కి భయపడి ప్రభుని దూరంగా తీసుకెళ్లి పెంచుతుంది తల్లి. ప్రభు పెద్దవాడై మంచి ఉద్యోగం చేస్తూ భార్య, కూతురితో ఆనందంగా జీవిస్తుంటాడు. అయితే కూతురికి 10-12 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఒకసారి ముగ్గురు కలిసి ఉత్తరభారదేశం ట్రిప్ కి వెళ్లి వస్తారు. అప్పటి నుంచి కూతురి ప్రవర్తనలో మార్పు వస్తుంది. తనకు మాత్రమే కనిపించే ఓ అదృశ్య వ్యక్తితో మాట్లాడుతుంటుంది. అసలు ఆ అదృశ్య వ్యక్తి ఎవరు? కథిర్ కి, అతనికి సంబంధమేంటి? ఈ కుటుంబాన్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? అతని నుంచి కూతురిని రక్షించుకోవడం కోసం ప్రభు ఏం చేశాడు? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

ట్రైలర్ చూసి 'నేనే వస్తున్నా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ అనుకుంటాం. అయితే సినిమా చూసేటప్పుడే తెలుస్తుంది ఇందులో హారర్ ఛాయలు కూడా ఉన్నాయని. ఫస్టాఫ్ ప్రభు, కథిర్ ల చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో మొదలై.. ప్రభు పెద్దవాడయ్యాక జరిగే కథతో సాగుతుంది. కూతురు వింతగా ప్రవరిస్తుండటం, ఆమెకి ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో తండ్రి మదనపడటం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం ఆసక్తికరంగానే నడుస్తుంది. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో 2008లో వచ్చిన జగపతిబాబు 'రక్ష' సినిమా ఛాయలు కనిపిస్తాయి. అయితే రక్ష సినిమాలోలాగా ఇందులో చేతబడి ఉండదు. ఇంటర్వెల్ కి ముందు 15 నిముషాలు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది.

ఫస్టాఫ్ అంతో ఇంతో ఆకట్టుకునేలా ఉండి, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యేలా ఉంటుంది. అయితే ఆ ట్విస్ట్ కి తగ్గట్లుగా సెకండాఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. ద్వితీయార్థం ప్రారంభమైన కాసేపటికే ఆ అదృశ్య వ్యక్తి ఎవరో, కూతురిని కాపాడుకోవడం కోసం ప్రభు ఏం చేయాలో తెలిసిపోతుంది. ఇక్కడి నుంచి అంతా ప్రేక్షకుల ఊహకు అందేలా నడుస్తుంది. గాడి తప్పిన కథనం, పేలవమైన సన్నివేశాలతో ఏ మాత్రం ఆసక్తి కలిగించేలా ఉండదు. కథిర్ సన్నివేశాలు మాత్రమే ఒకట్రెండు కాస్తో కూస్తో ఆకట్టుకుంటాయి. మిగతా అంతా సాదాసీదాగా ఊహకందేలా ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా సాగుతుంది.

ఈ సినిమా నిడివి రెండు గంటలే కావడం కలిసొచ్చే అంశం. అయితే సెకండాఫ్ లో గాడి తప్పిన కథనం, బలంలేని సన్నివేశాల కారణంగా అక్కడక్కడా ల్యాగ్ అనిపిస్తుందన్న ఫీలింగ్ కలగకుండా చేయలేకపోయాడు ఎడిటర్ భువన్ శ్రీనివాసన్. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నైట్ ఎఫెక్ట్స్, ఫారెస్ట్ సన్నివేశాలు చక్కగా క్యాప్చర్ చేశాడు. పాటలతో అంతగా ఆకట్టుకోలేకపోయిన యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతంతో మాత్రం ఆకట్టుకున్నాడు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో తనదైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. 

నటీనటుల పనితీరు:

ఈ సినిమాకి ప్రధాన బలం ధనుష్. ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. కూతురిని రక్షించుకోవడం కోసం మదనపడే తండ్రిగా ఎంతగా మెప్పించాడో.. నెగటివ్ షేడ్స్ ఉన్న సైకో లాంటి కథిర్ పాత్రలో అంతకుమించి రాణించాడు. రెండు పాత్రలలో వైవిద్యం చక్కగా చూపించాడు. ముఖ్యంగా కథిర్ పాత్రలో ధనుష్ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంది. ధనుష్ కూతురి పాత్రలో నటించిన అమ్మాయి కూడా పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సెల్వ రాఘవన్, ఇందుజా రవిచంద్రన్, ఇల్లి అవ్రమ్, ప్రభు, యోగి బాబు తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ధనుష్, సెల్వ రాఘవన్ కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం. అయితే ఈ 'నేనే వస్తున్నా' సినిమా సగం ఉడికించి ప్రేక్షకుల మీదకు వదిలిన సైకలాజికల్ థ్రిల్లర్. కొన్ని కొన్ని సన్నివేశాలు, ధనుష్ నటన కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు.

-గంగసాని