Read more!

English | Telugu

సినిమా పేరు:నాయకి
బ్యానర్:గిరిధర్ ప్రొడక్షన్ హౌస్
Rating:1.00
విడుదలయిన తేది:Jul 15, 2016

తెలుగు తెరపై కథానాయికగా పదేళ్లకుపైగా చలామణి అయిన త్రిష ఈమధ్యకాలంలో స్పీడ్ తగ్గించింది. కెరీర్ ఎండింగ్ స్టేజ్ కి రావడంతో హారర్ సినిమాల బాట పట్టింది. "కళావతి" అనే సినిమాతో మొదటిసారి హారర్ జోనర్ లో నటించిన త్రిష.. వెంటనే అంగీకరించిన మరో హారర్ సినిమా "నాయకి". "లవ్ యు బంగారం" అనే బూతు సినిమాతో దర్శకుడిగా మారిన గోవి రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు.
మరి "నాయకి"గా త్రిష జనాల్ని ఏమేరకు భయపెట్టింది?
దర్శకుడిగా గోవి రెండో ప్రయత్నంలోనైనా విజయాన్ని అందుకోగలిగాడా? లేదా? అని తెలుసుకొందాం..!!

కథ:
సంజయ్ (సత్యం రాజేష్) ఒక షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్. డబ్బు మీద ఆశతో తనను ప్రేమిస్తున్న సంధ్య (సుష్మా)ను కాదనుకొని వేరే అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. తనను ప్రాణంగా ప్రేమిస్తున్న సంధ్యతో కామవాంఛ తీర్చుకోవడం కోసం తన స్నేహితుడి రిసార్ట్ కి తీసుకువెళతాడు. తీరా రిసార్ట్ కి చేరుకొన్నాక సంజయ్ కి గాయత్రి (త్రిష) ఫోన్ లో మాత్రమే కనిపిస్తూ భయపెడుతుంటుంది. అసలు గాయత్రి ఎవరు? ఆ బంగ్లాలో ఏం చేస్తుంది? సంజయ్ ను ఎందుకు భయపెడుతుంది? అనేది సినిమా కథాంశం..!!


ఎనాలసిస్ :

నటీనటుల పనితీరు:

పెద్ద అండగత్తేమీ కాకపోయినా కేవలం హావభావాల ప్రదర్శనలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుందన్న ఏకైక కారణంతో తెలుగు, తమిళ ప్రేక్షకులు త్రిషను ఇన్నాళ్ళు ఆదరిస్తూ వచ్చారు. అలాంటి త్రిష "నాయకి" సినిమాలో ఎక్స్ ప్రెషన్స్ తో చాలా ఇబ్బందిపెట్టింది. అసలు "నువ్వోస్తానంటే నేనోద్దంటానా" సినిమాలో త్రిషయేనా ఇక్కడ కనిపించేది అని అందరూ అనుమానపడే స్థాయిలో ఉంది త్రిష నటన. సత్యం రాజేష్ తన శక్తిమేరకు నవ్వించడానికి విశ్వప్రయత్నం చేశాడు. అయితే కథలోనే కాక కథనంలోనూ కంటెంట్ లేక అతడి ప్రయత్నం వృధా అయ్యింది. గణేష్ వెంకట్రామన్ రెట్రో స్టైల్ లో పండించిన విలనిజం పండలేదు. సుష్మా అమాయకపు ఎక్స్ ప్రెషన్ పెట్టిన ప్రతిసారీ "అబ్బాబ్బ" అని మాస్ ఆడియన్స్ తిట్టుకొన్నారంటే అమ్మాయిగారి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. కాకపోతే.. దెయ్యంగా మాత్రం ఫర్వాలేదనిపించే నటన కనబరిచింది. పూనమ్ కౌర్, నారా రోహిత్ లు అతిధిపాత్రల్లో మెరిశారు.

సాంకేతికవర్గం పనితీరు:

రఘు కుంచే బాణీలు, సాయి కార్తీక్ నేపధ్య సంగీతం ఒకదానితో ఒకటి పోటీపడి మరీ థియేటర్ లో ఆడియన్స్ తో ఫుట్ బాల్ ఆడుకొన్నాయి. జగదీష్ చీకటి ఛాయాగ్రహణం బాగుంది. కాకపోతే డి.ఐ కాస్త నీట్ గా చేయించి ఉంటే ఇంకాస్త బాగుండేది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ సినిమాలో ఉన్న ఏకైక ప్లస్ పాయింట్. గోడ తొలగిపోయే సీన్, త్రిష ఇంట్రో సీన్స్ లో సీజీ వర్క్ బాగుంది. జంట రచయితలు రాజేంద్ర కళ్ళూరి, హరీష్ నాగరాజ్ లు రాసిన మాటలు సన్నివేశానికి సంబంధం లేనట్లుగా ఉంటాయి. బహుశా కథలో క్లారిటీ లేకపోవడం కూడా అందుకు కారణం అయ్యుండొచ్చు. గిరిధర్ మామిడిపల్లి నిర్మాణ విలువలు బాగున్నాయి.

దర్శకుడిగా "లవ్ యూ బంగారం" అనే ఓ మినీ సెక్స్ ఫిలిమ్ తీసిన గోవి.. రెండో ప్రయత్నంలోనూ సక్సెస్ ఫుల్ గా ఫెయిల్ అయ్యాడు. అతడు ఎంచుకొన్న కథలో క్లారిటీ లేదు ఆ కథను నడిపించిన కథనంలో విషయం లేదు. అసలు త్రిష కేవలం కెమెరా కంటికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? చనిపోయిన పది నిమిషాల్లోనే దెయ్యాలుగా మారిన త్రిష అతని తండ్రి బంగ్లాకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు? తండ్రి పాత్రధారి ఎందుకు జానాల్లో తిరుగుతూ ఐపాడ్ తో ఆడుకొంటుంటాడు? వంటి విషయాలకు లాజిక్ ఏమిటో డైరెక్టర్ కి మాత్రమే తెలియాలి.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

"ఫ్లాష్ బ్యాక్ లో ఒకమ్మాయి మోసపోవడం.. ఆ తర్వాత దెయ్యంగా మారడం, తన పగ తీర్చుకోవడం, చనిపోయిన ప్లేస్ లో దెయ్యంగా సెటిల్ అవ్వడం, ఆ ప్లేస్ కి వచ్చిన వారిని కుదిరినంతలో భయపెట్టడం" గత పడేళ్ళుగా మన తెలుగు చిత్రసీమలో రూపొందిన అన్నీ సినిమాల్లోనూ ఇదే ఫార్మాట్ ను వినియోగిస్తూ వస్తున్నారు. దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవ్వగా.. వాటిలో 10% మాత్రమే విజయం సాధించాయి. ఆ విజయం సాధించిన చిత్రాల సక్సెస్ సీక్రెట్ ఆకట్టుకొనే కథనం. "నాయకి" సినిమాలో లేనిది అదే. దెయ్యం పాత్రలో త్రిష భయపెట్టడం అటుంచితే కనీసం అలరించను కూడా లేదు. అయితే.. ఆర్టిస్టులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేయడానికి విపరీతంగా ప్రయత్నించినప్పటికీ "కథ"లో విషయం లేనప్పుడు ఎన్ని తిప్పలు పడినా ఏం లాభం చెప్పండి. సో, భయపెట్టలేని "నాయకి" చిత్రాన్ని త్రిషకు వీరాభిమానులైతే తప్ప చూడకుండా ఉండడం శ్రేయస్కరం!