English | Telugu
బ్యానర్:సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్
Rating:1.00
విడుదలయిన తేది:Oct 14, 2016
తెలుగు సినిమాకి గ్రాఫిక్స్ ఎలా వాడుకోవాలో నేర్పించింది కోడి రామకృష్ణనే. అన్ని రకాల సినిమాల్నీ తీసిన కోడికి.. సోషియో ఫాంటసీ చిత్రాలు మాత్రం ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అరుంధతితో ఆయన మార్క్ మరోసారి తెలిసొచ్చింది. అరుంధతి తరవాత.. గ్రాఫిక్స్ వాడకం తెలుగులో మరింత ఎక్కువైంది. అరుంధతి తరవాత కోడి నుంచి మరో గొప్ప సినిమా రాలేదు. నాగభరణం సినిమా ఆలోటు తీరుస్తుందని ఆ చిత్ర బృందం, తెలుగు సినీ భిమానులు గంపెడాశలు పెట్టుకొన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కోడి రామకృష్ణ మార్క్‌లో ఉందా, లేదా? ఈ విషయాలన్నీ రివ్యూ చదివి తెలుసుకోవాల్సిందే.
* కథ
సూర్య గ్రహణం సమయంలో దేవుళ్లంతా శక్తులు కోల్పోతారు. ఆ సమయంలో దుష్ట శక్తులు విజృంభిస్తుంటాయి. ఈ సంగతి తెలిసిన దేవతలంతా.. తమ శక్తుల్ని ఓ కలశంలో పొందుపరచి భూమ్మీదకు పంపిస్తారు. ఆ కలశాన్ని శివయ్య (సాయికుమార్) రక్షిస్తుంటాడు. శివయ్యని చంపి కవచాన్ని చేజిక్కించుకోవాలని కపాలి (వివేక్ రాజేష్) అనే దుష్ట శక్తి ప్రయత్నిస్తుంటుంది. ఆ పోరాటంలో శివయ్య చనిపోతాడు కూడా. అయితే శివయ్య కుమార్తె నాగమ్మ (రమ్య) ఈసారి కవచాన్ని రక్షించే బాధ్యత తీసుకొంటుంది. ఆ కలశాన్ని శివాలయం ముందు ప్రతిష్టించే ప్రయత్నంలో కపాలితో పోరాడి.. అతన్ని చంపేస్తుంది. తన ప్రాణాలూ త్యాగం చేస్తుంది. అయితే ఆ కలశం కోసం కపాలి, నాగమ్మలు మరో జన్మ ఎత్తుతారు. ఈ జన్మలో కలశం దుర్మార్గుల చేతికి చిక్కకుండా నాగమ్మ ఏం చేసింది? ఎవరిని ఆయుధంగా మలచుకొంది? అనేదే ఈ చిత్ర కథ.
ఎనాలసిస్ :
* విశ్లేషణ
కథ చూస్తే సోషియో ఫాంటసీ కి తగ్గట్టుగానే ఉంది. పునర్జన్మలు, కలశాన్ని కాపాడడం, దైవ శక్తి... ఇవన్నీ ఆకట్టుకొనే పాయింట్లే. కానీ.. తెలుగు సినిమాకి కొత్తేం కాదు. మొన్నామధ్య వచ్చిన అఖిల్ సినిమా కూడా దాదాపుగా ఇదే పాయింట్ తో తీసింది. ఇలాంటి చిత్రాలకు ధ్రిల్ కలిగించే సన్నివేశాలు కీలకం. వాటిని తెరకెక్కించడంలో కోడి రామకృష్ణ సిద్ద హస్తుడు కూడా. అయితే ఆయన మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు. దివంగత నటుడు విష్ణు వర్థన్ ని ఈ సినిమా కోసం మళ్లీ బతికించామని, ఆయన పాత్రని గ్రాఫిక్స్ లో చూపించామని చాలా గొప్పగా చెప్పుకొచ్చింది చిత్రబృందం. అయితే ఆ సన్నివేశాలన్నీ తేలిపోయాయి. మరీ ముఖ్యంగా ఆ పాత్ర కోసం వాడిన గ్రాఫిక్స్ నాణ్యత చికాకు తెప్పిస్తుంది. ఆ సన్నివేశం మాత్రమే కాదు.. సినిమాలో వాడిన గ్రాఫిక్స్ ఏమాత్రం ఆకట్టుకోవు. ఈగ, బాహుబలిని చూసిన కళ్లతో నాగభరణం చూడాలంటే చాలా చాలా కష్టం. ఓ సన్నివేశానికీ, మరో సన్నివేశానికీ కంటిన్యూ లేకపోవడం, ఏది ఎందుకు జరుగుతుందో అర్థం కాకపోవడం.. ఈ సినిమాలో ప్రధాన మైన లోపాలు. ఎమోషన్, కామెడీ.. ఇలా ఏది తీసుకొన్నా... అన్నీ ఫోర్స్డ్‌గానే కనిపిస్తాయి. ఆఖరికి గ్రాఫిక్స్ కూడా. ఓ దశలో అరుంథతి సినిమానే మళ్లీ చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అరుంథతి సినిమా వచ్చి ఆరేళ్లు దాటింది. అయినా.. ఆ నాణ్యత, టేకింగ్ ఈ సినిమాలో కొంచెం కూడా కనిపించలేదు. అరుంధతి సినిమా హిట్టయిందంటే కారణం.. విజువల్ ఎఫెక్ట్స్ కాదు. జేజమ్మ పాత్రలో ఉన్న బలం. ఆ బలం.. ఈ సినిమాలోని ఏ పాత్రలో వెదికినా కనిపించదు. పతాక సన్నివేశాల్లో విష్ణువర్థన్‌ని చూపించారు. ఆయా సన్నివేశాలు కన్నడ ప్రేక్షకులకు సైతం రుచించక పోవొచ్చు. పాము పాత్రలో చూపించిన కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకొంటాయంతే.
* నటీనటులు
రమ్య నటన అంతంత మాత్రమే. ఎమోషన్ పండించే సన్నివేశాల్లో అయితే... రమ్య మరీ తేలిపోయింది. సాయికుమార్ కనిపించింది కాసేపే. అయినా ఆకట్టుకొన్నాడు. దిగంత్ తెలుగబ్బాయి కాదు. అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్ననటీనటులు ఈ సినిమాలో చాలా తక్కువగా కనిపిస్తారు. రాజేష్ వివేక్, ముకుల్ దేవ్ నటన మరీ తేలిపోయింది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ గ్రాఫిక్స్ వల్ల.. నటీనటుల ప్రతిభ కూడా కనుమరుగైపోయింది.
* సాంకేతికంగా
గురు కిరణ్ అందించిన నేపథ్య సంగీతంలో హోరు తప్ప ఇంకేం కనిపించలేదు. డబ్బింగ్ నాణ్యత కూడా నిశిరకంగా ఉంది. ఏ గొంతూ సరిపోలేదు. గ్రాఫిక్స్ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. ఓ సాధారణమైన కథని శక్తిమంతంగా చూపించే కోడి రామకృష్ణ కూడా చేతులెత్తేయడం.. దురదృష్టం. సన్నివేశాల్లో బలం లేకపోవడం, గ్రాఫిక్స్ రక్తికట్టకపోవడం, బలహీనమైన స్క్రీన్ ప్లే నాగభరణాన్ని.. భారంగా మార్చేశాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
చివరిగా: శిరోభారం.. నాగభరణం