Read more!

English | Telugu

సినిమా పేరు:మిస్టర్ పెర్ఫెక్ట్
బ్యానర్:.
Rating:3.00
విడుదలయిన తేది:Apr 21, 2011

బ్యానర్ - శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత - రాజు

కథ, దర్శకత్వం - దశరథ్

సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ - విజయ్.కె.చక్రవర్తి

మాటలు - అబ్బూరి రవి

పాటలు - చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, సత్యమూర్తి

ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్

ఆర్ట్ - రవీందర్

యాక్షన్ - పీటర్ హెయిన్స్

తారాగణం - కళాతపస్వి, డాక్టర్ కె.విశ్వనాథ్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి, ప్రకాష్ రాజ్, మురళీ మోహన్, నాజర్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, బెనర్జీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణుడు, గౌతం రాజు, సమీర్, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, తులసి, ప్రగతి, ఉష తదితరులు...

కథ -

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విక్కీ(ప్రభాస్) ఆస్ట్రేలియాలో ఉండే భారతీయ కుర్రాడు. తనకు నచ్చినట్లు జీవించాలన్నది అతని ఫిలాసఫీ. తన ఇష్టాన్ని ఇతరుల కోసం త్యాగం చేయటం, వేరే వాళ్ళకి నచ్చినట్లు బ్రతకటం అతనికి నచ్చని పని. ఆ ఆలోచన కరెక్ట్ కాదని అతని తండ్రి అతనికి ఎంత నచ్చచెప్పాలని చూసినా అతనికి అర్థం కాదు. అతనికి ఇండియాలో ఉండే ప్రియ (కాజల్) అనే తన స్నేహితుడి కూతురితో వివాహం చేయాలని విక్కీ తండ్రి విక్కీని ఇండియాకి పిలుస్తాడు. ముందు విక్కీ తనకు నచ్చకపోయినా తర్వాత విక్కీని ప్రేమిస్తుంది ప్రియ. ఇండియాకి వచ్చాక విక్కీ కోసం ప్రియ తన ఇష్టా ఇష్టాలను మార్చుకోవటం చూసిన విక్కీకి అది నచ్చదు. తనలాగే ఆలోచించే అమ్మాయినే తాను పెళ్ళిచేసుకుంటానని చెప్పి ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళిపోతాడు. అందుకు ఎవరు బాధపడినా విక్కీ పట్టించుకోడు.

 

 ఆస్ట్రేలియాలో క్యాడ్బరీ చాక్లెట్ కంపెనీ పెట్టిన పోటీలో ఆరున్నర లక్షల మందిలో తనలాగే ఆలోచించే అమ్మాయి (తాప్సి) కూడా ఉందని తెలుసుకుని ఆమెను కలుస్తాడు. కానీ ఆమె తండ్రి (ప్రకాష్ రాజ్) "మీరిద్దరూ కలసి బ్రతకలేరు. మా పెద్దమ్మాయి పెళ్ళికి నువ్వురా. ఆ పెళ్ళికి వచ్చిన నలుగురిలో ఏ ఇద్దరు నువ్వు నచ్చావని చెప్పినా మీ ఇద్దరి పెళ్ళి చేస్తా"నని అంటాడు. ఆ పెళ్ళికి పెళ్ళి కొడుకు తరపున ప్రియ కూడా వస్తుంది. ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ఇది ఫీల్ గుడ్ ఫిల్మ్. ఒక విధంగా చెప్పాలంటే దిల్ రాజు తను తీసిన "బొమ్మరిల్లు", "బృందావనం" రెండు సినిమాలను కలిపి ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్"గా తీశాడని చెప్పవచ్చు. ఒక విధంగా దర్శకుడు దశరథ్ పై రెండు చిత్రాలకు తోడు తన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ "సంతోషం" చిత్రం ఫ్లేవర్ ని కూడా కలిపాడు. ఆ విధంగా ఈ చిత్రాన్ని యూత్ కీ, ఫ్యామిలీ ఆడియన్స్ కీ నచ్చే విధంగా ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని తీశాడు. చాలా రోజులుగా హిట్ లేని కసిని ఈ చిత్రం తీయటంలో చూపించాడు దశరథ్. ఆ విధంగా ఒక హిట్ చిత్రాన్ని సొంతం చేసుకున్నాడు దశరథ్.

నటన - ప్రభాస్ తన నటనకు ఈ చిత్రంలో మరింత పదును పెట్టాడు. డైలాగ్ మాడ్యులేషన్ లో పరిణితి కనపడింది. హావభావాలు ప్రకటించటంలో కూడా అతనిలో మెరుగుదనం కనపడింది. మానసికంగా విక్కీ పాత్ర పడే యాతన, ఆ ఘర్షణ ప్రభాస్ చాలా బాగా చూపించాడు. ఇక యాక్షన్ సీన్లలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదుగా. మొత్తంగా ప్రభాస్ ఒక మంచి నటుడిగా రూపాంతరం చెందుతున్నాడు. కాజల్, తాప్సిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం కామెడీ కాస్త పండింది. మిగిలిన చాలా మంది నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.  

సంగీతం - పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో "చలి చలి" పాట ట్యూన్ ని సిగ్నేచర్ ట్యూన్ గా అవసరమైనప్పుడల్లా సినిమాలో వాడటం బాగుంది. అలాగే "రాయుడు గారబ్బాయి", "ఆకాశం బద్దలైన", "బావా ఎప్పుడువచ్చితివి" పాటలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. రీ-రికార్డింగా చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ - ఈ సినిమాకి మంచి ప్లస్ కెమెరా వర్క్. స్విమ్మింగ్ పూల్లో షూట్ చేసిన ఫైట్ లో కేమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే పాటల్లో కానీ, సినిమా అంతా కానీ, చాలా నీట్ గా చూపించటంలో కెమెరా వర్క్ బాగుంది.

మాటలు - ఈ సినిమాకి హైలైట్ అబ్బూరి రవి మాటలు. ఈ సినిమాలోని మాటలు సింపుల్ గా ఉండి, అర్థవంతంగా మనల్నిఆలోచింపచేసేవిగా ఉన్నాయి. అలాగే "బొమ్మరిల్లు" చిత్రంలోలా కొన్ని సందర్భాల్లో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి ఈ చిత్రంలోని సంభాషణలు. హేట్సాఫ్ టు హిమ్.

పాటలు - ఈ చిత్రంలోని పాటల్లో సాహిత్యం ఫరవాలేదు. కాకపోతే తెలుగు పాటల్లో ఆంగ్ల పదాల ప్రయోగమే ఆధునికత (స్టైల్) అనుకునే దౌర్భాగ్యం నుంచి మన పాటల రచయితలు ఎన్నటికి బయటపడతారో పాపం. 
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - చాలా బాగుంది. రవీందర్ తో చాలా పెద్ద తలకాయనొప్పి ఎంటంటే సినిమాలో ఏది సెట్టో ఏది ఒరిజనలో అతను మనకి చెపితే కానీ అర్థం కాదు.  
కొరియోగ్రఫీ - ఉన్నంతలో అన్ని పాటల్లోనూ బాగుందనే చెప్పాలి.
యాక్షన్ - ఈ సినిమాలో ఉన్న మూడు ఫైట్లూ బాగున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఇది ఆహో ఓహో అనేంత గొప్ప సినిమా కాకపోయినా, ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని కచ్చితంగా చెప్పాలి. అదీగాక ఈ సినిమాలో అశ్లీలత, అసభ్యతలకు తావులేకుండా తీస్తూ, మానవ సంబంధాలకు పెద్దపీట వేయటం వలన సకుటుంబంగా ఈ సినిమాని చూడవచ్చు.