div id="zbutton">
Read more!

English | Telugu

సినిమా పేరు:మట్టి కుస్తీ
బ్యానర్:ఆర్.టీ. టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
Rating:2.50
విడుదలయిన తేది:Dec 2, 2022

సినిమా పేరు: మట్టి కుస్తీ
తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, అజయ్, శత్రు, మునీష్ కాంత్, గజరాజ్, శ్రీజ రవి, కాళీ వెంకట్, రెడిన్ కింగ్స్లీ, హరీశ్ పేరడీ
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ప్రసన్న జీకే
రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్
బ్యానర్స్: ఆర్.టీ. టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2022 

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మట్టి కుస్తీ'. ఇది తమిళ్ సినిమా అయినప్పటికీ చిత్ర నిర్మాణంలో మాస్ మహారాజ రవితేజ భాగస్వామి కావడంతో దీనిపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? నిర్మాతగా రవితేజకు విజయాన్ని అందించేలా ఉందో లేదో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
కేరళలో నివసించే తెలుగు కుటుంబానికి చెందిన కీర్తి(ఐశ్వర్య లక్ష్మి) చిన్నతనం నుంచి తన బాబాయ్(మునీష్ కాంత్) వల్ల కుస్తీపై మక్కువ పెంచుకుంటుంది. దూకుడు స్వభావం గల ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా రెజ్లర్ గా మారుతుంది. అబ్బాయిల్లా కటింగ్ చేయించుకొని కుస్తీలు పట్టే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. మరోవైపు ఆంధ్రాలో నివసించే కుర్రాడు వీర(విష్ణు విశాల్) తల్లిదండ్రులు చనిపోవడంతో మావయ్య(కరుణాస్) అడుగుజాడల్లో నడుస్తుంటాడు. ఏ పని చేయకుండా ఉన్న ఆస్తులు కరగదీస్తూ మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ ఫ్రెండ్స్ తో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. ఎనిమిదో తరగతి వరకు చదివిన వీర.. తనకంటే తక్కువ చదువుకున్న, బాగా పొడవు జుట్టు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే వీర మావయ్యకి కీర్తి బాబాయ్ స్నేహితుడు కావడంతో.. ఒకసారి వీరని చూసిన కీర్తి బాబాయ్, కుర్రాడు బుద్ధిమంతుడు అని భావించి.. డీగ్రీ చదివిన కీర్తిని ఏడు వరకే చదువుకుందని, ఆమెకు పొడవు జడ కూడా ఉందని అబద్దం చెప్పి పెళ్లి జరిపిస్తాడు. రెండు అబద్దాలతో మొదలైన వారి వివాహ బంధం ఎలాంటి మలుపులు తీసుకుంది? ఆ అబద్దాల కారణంగా వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? భార్యాభర్తలిద్దరూ కుస్తీ పోటీకి దిగడానికి కారణమేంటి? ఇద్దరి మధ్య జరిగిన పోరులో ఎవరు పైచేయి సాధించారో తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

ట్రైలర్ చూసినప్పుడే ఇది పూర్తిస్థాయి స్పోర్ట్స్ డ్రామా కాదనే విషయం అర్థమైపోతుంది. ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా సరదాగా సాగిపోయింది. కథాకథనాల్లో బలం లేకపోయినా సన్నివేశాలు, సంభాషణలు ద్వారా వచ్చే హాస్యం వల్ల ఫస్టాఫ్ బోర్ కొట్టకుండా నడిచింది. ఏ పని లేకుండా ఆవారాగా తిరిగే వీర తన మావయ్య మాటలు విని భార్యను గ్రిప్ లో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ముందు బిల్డప్పులు ఇచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అలాగే భర్త ముందు అమాయకంగా నటిస్తూ.. విగ్గు ఊడిపోయి బండారం బయటపడుతుందన్న భయంతో అవస్థలు పడే కీర్తి సన్నివేశాలు కూడా నవ్వులు పూయిస్తాయి. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచింది. పేరుకి అది ఫైట్ సీన్ అయినా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు.

సెకండాఫ్ లో కూడా కొంతవరకు కామెడీ డోస్ బాగానే ఉంటుంది. వీరాకు తన భార్య రెజ్లర్, ఆమెది పొట్టి జుట్టు అని తెలిశాక వచ్చే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. అప్పటివరకు కామెడీతో బాగానే నడిపించిన దర్శకుడు.. కీలక సన్నివేశాల్లో మాత్రం కాస్త తడబడ్డాడు. భార్యని దూరం చేసుకున్నాక.. ఆమె గురించి తెలుసుకుని వీరా రియలైజ్ అయ్యే సన్నివేశాలు ఇంకా బలంగా ఉంటే బాగుండేది. అలాగే భార్యభర్తల మధ్య కుస్తీ పోరు అంటూ వచ్చే సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక ఈ చిత్రం ద్వారా ఇచ్చిన సందేశం బాగుంది. మహిళలకు ఎంతో సాధించాలని ఉన్నా కుటుంబసభ్యుల మద్దతు లేక వారు ఇంటికే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా వారు అబ్బాయిల్లా ఆటలాడటం తప్పు అన్నట్టుగా భావిస్తారందరూ. అలా కాకుండా వారికి మద్దతుగా నిలిస్తే వారు ఎంతో సాధిస్తారు అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు.

ఈ చిత్రంలో సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఫస్టాఫ్ లో సంభాషణలు ఎంతలా నవ్వించాయో, సెకండాఫ్ సంభాషణలు అంతలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. అయితే కొన్ని పాత్రల తెలుగు డబ్బింగ్ సహజంగా లేదు. పాటలతో ఆకట్టుకోలేకపోయిన జస్టిన్ ప్రభాకరన్ నేపథ్య సంగీతంతో పర్లేదు అనిపించుకున్నాడు. రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ప్రసన్న జీకే సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
వీర పాత్రలో విష్ణు విశాల్ చక్కగా ఒదిగిపోయాడు. ఆవారాగా తిరిగే పల్లెటూరి కుర్రాడిగా మెప్పించాడు. భార్యను గుప్పిట్లో పెట్టుకోవాలనుకొని, చివరికి ఆమెను చూసే భయపడే భర్తగా అలరించాడు. యాక్షన్, ఎమోషన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి పాత్ర చాలా కీలకం. కొన్ని సన్నివేశాల్లో హీరోనే డామినేట్ చేసేలా ఉండే పాత్ర ఆమె పోషించింది. ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. కుటుంబం కోసం తన దూకుడు స్వభావాన్ని, తన లక్ష్యాన్ని పక్కన పెట్టి బాధపడే యువతిగా.. తనవాళ్ళకు హాని జరుగుతుందంటే తిరగబడే శక్తి ఉన్న మహిళగా ఆమె నటన మెప్పించింది. కరుణాస్, అజయ్, శత్రు, మునీష్ కాంత్, గజరాజ్, శ్రీజ రవి, కాళీ వెంకట్, రెడిన్ కింగ్స్లీ, హరీశ్ పేరడీ తదితరులు పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

టైటిల్ చూసి ఇది పూర్తిస్థాయి స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే పొరపాటే. అబద్దాలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు అలరిస్తాయి. కథాకథనాల్లో బలం లేకపోయినా హాస్యం బాగుంది. సందేశం కూడా ఉంది. అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడదగ్గ కుటుంబ కథా చిత్రం.

-గంగసాని