Read more!

English | Telugu

సినిమా పేరు:మంగళవారం
బ్యానర్:ముగ్ధ మీడియా వర్క్స్‌, ఎ క్రియేటివ్‌ వర్క్స్‌
Rating:2.75
విడుదలయిన తేది:Nov 17, 2023

మూవీ: మంగళవారం మూవీ రివ్యూ
నటీనటులు: పాయల్‌ రాజ్‌పుత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమీర్‌, 
ముళీధర్‌ గౌడ్‌, చైతన్య కృష్ణ, అజయ్‌ ఘోష్‌, రవీంద్ర విజయ్‌, ప్రియదర్శి తదితరులు
సంగీత: బి.అజనీష్‌ లోకనాథ్‌
ఎడిటింగ్‌: మాధవ్‌కుమార్‌ గుళ్ళపల్లి
సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి
నిర్మాతలు: స్వాతి గునుపాటి,  సురేష్‌వర్మ ఎం., అజయ్‌ భూపతి
బ్యానర్స్‌: ముగ్ధ మీడియా వర్క్స్‌, ఎ క్రియేటివ్‌ వర్క్స్‌
రచన, దర్శకత్వం: అజయ్‌ భూపతి
విడుదల తేదీ: 17.11.2023
సినిమా నిడివి: 145.42 నిమిషాలు

ఆర్‌ఎక్స్‌ 100 వంటి డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన దర్శకుడు అజయ్‌ భూపతి.. ఆ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించడమే పెద్ద ప్లస్‌ అయింది. ఆ తర్వాత అజయ్‌ భూపతి చేసిన మహాసముద్రం చిత్రానికి ఆశించిన ఆదరణ లభించకపోవడంతో మరో ప్రయత్నంగా చేసిన సినిమా ‘మంగళవారం’.  ఈ సినిమాలోనూ పాయల్‌ రాజ్‌పుత్‌ను ప్రధాన పాత్రలో తీసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్స్‌ సినిమాపై మంచి హైప్‌ని తీసుకొచ్చాయి. ఇదొక మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా మొదటి నుంచి డైరెక్టర్‌ చెప్తూ వచ్చాడు. మరి ఈ సినిమా అజయ్‌ భూపతికి ఎలాంటి పేరు తెచ్చింది? ఈ సినిమా కోసం ఎంచుకున్న కథాంశం ఏమిటి? ‘మంగళవారం’ ఆడియన్స్‌ని ఏమేరకు ఆకట్టుకుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఇది 1986లో మొదలైన కథ. శైలజ, రవి అనే ఇద్దరు పిల్లలతో కథ మొదలవుతుంది. ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉండే ఇద్దరూ కొన్ని పరిస్థితుల కారణంగా దూరమవుతారు. కట్‌ చేస్తే.. 1996లో ఆ ఊరిలో జంట హత్యలు సంచలనం సృష్టిస్తాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న వారి పేర్లను గోడపై ఎవరో రాస్తారు. అప్పటికే ఆ ఇద్దరు హత్య చేయబడి ఉంటారు. ఇలా రెండు జంట హత్యలు జరుగుతాయి. అసలు గోడలపై ఆ రాతలు ఎవరు రాస్తున్నారు? ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు అనే విషయాలు గ్రామస్తులకు అంతుపట్టదు. ఇక ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్‌.ఐ. మీనా(నందిత శ్వేత) ఆ హత్యల మిస్టరీని ఛేదించాలని ప్రయత్నిస్తుంది. కట్‌ చేస్తే.. ఆమె పేరు శైలజ(పాయల్‌ రాజ్‌పుత్‌). ఆమెకు ఓ విచిత్రమైన వ్యాధి ఉంటుంది. హైపర్‌ సెక్సువల్‌ డిజార్డర్‌. దీని వల్ల తన ప్రమేయం లేకుండా పురుష సాంగత్యం కోరుకుంటుంది. దాంతో ఎంతో మంది ఆమెను అనుభవిస్తారు. దాన్నుంచి బయట పడాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో తనని తాను గాయపరుచుకుంటుంది. కథలో ఓ పక్క ఎవరు హత్యలు చేస్తున్నారనే సస్పెన్స్‌ నడుస్తూ ఉంటుంది, మరో పక్క తనవాళ్ళను కోల్పోయి అనాధగా మిగిలిపోయిన శైలజ గమ్యం లేని పయనం.. ఇలా రెండు విషయాలూ సమాంతరంగా వెళుతుంటాయి. అయితే ఆ గ్రామంలో ఆ హత్యలు చేస్తున్నది ఎవరు? దాని వెనుక వున్న అసలు కారణం ఏమిటి? ఎన్నో వ్యధల మధ్య సాగుతున్న శైలజ జీవితం ఎలా ముందుకు సాగింది? ఆమెకు, ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? ఆమె జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగాయి? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ. 


ఎనాలసిస్ :

ఒక విధంగా ఇది శైలజ కథగానే చెప్పొచ్చు. కానీ, చిన్నతనంలో ఆమె పాత్రను చూపించారు. ఆ తర్వాత సెకండాఫ్‌లో ఆ క్యారెక్టర్‌ ఎంటర్‌ అవుతుంది. కానీ, సినిమా మొదలైనప్పుడు ఆమె కథ ప్రధానం కాదు అన్నట్టు ఉంటుంది. ఫస్ట్‌హాఫ్‌ అంతా జంట హత్యల చుట్టూనే తిరుగుతుంది. కానీ, ఫస్ట్‌హాఫ్‌లో కథ ఏమాత్రం ముందుకు వెళ్లదు. ఎంత సేపటికీ హత్యలు ఎవరు చేశారు, గోడల మీద రాతలు ఎవరు రాస్తున్నారు. వారిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలతోనే సరిపోతుంది. అసలు కథ సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అప్పటివరకు చూపించిన సన్నివేశాలన్నీ ఒక ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చెయ్యడానికే తప్ప కథను ముందుకు నడిపించేందుకు అవి ఎంత మాత్రం ఉపయోగపడలేదు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, అప్పటివరకు కనిపించిన పాత్రల తీరు ఏదో జరిగిపోతోంది అనే భావన కలిగిస్తుంది. అజయ్‌ఘోష్‌, అతని శిష్యుడు చేసే కామెడీ వల్ల అక్కడక్కడా కాస్త రిలీఫ్‌ అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ని ఏదో ఒకలా నడిపించి సెకండాఫ్‌లో అసలు కథకు వచ్చాడు దర్శకుడు. అప్పటివరకు ఒక మర్డర్‌ మిస్టరీగా, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా బిల్డప్‌ ఇచ్చిన దర్శకుడు సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరోయిన్‌ చుట్టూనే కథను నడిపాడు. అసలు ఆ హత్యలకు, హీరోయిన్‌కి వున్న సంబంధం ఏమిటి, హీరోయిన్‌కి జరిగిన అన్యాయం ఏమిటి అనేది చూపించే ప్రయత్నం చేశాడు. ఒక దశలో చనిపోయిన హీరోయిన్‌ దెయ్యంగా వచ్చి అందరిపై ప్రతీకారం తీర్చుకుంటోంది అనే బిల్డప్‌ కూడా ఇచ్చారు. ఫస్ట్‌హాఫ్‌ మూడ్‌ నుంచి డైవర్ట్‌ అవ్వడానికి ఆడియన్స్‌కి కొంత సమయం పడుతుంది. శైలజ ప్రేమ విఫలం కావడం, అమ్మమ్మ దూరం కావడం, తనకి ఉన్న ఆరోగ్య సమస్య, గ్రామ బహిష్కరణ... ఇవన్నీ శైలజ పాత్రపై సింపతీని తీసుకు రావాలి. కానీ, అలాంటి సిట్యుయేషన్‌ కనిపించదు. ఏదో కథలో ఒక భాగంగా అది కూడా నడుస్తోంది అనే ఫీలింగ్‌ కలుగుతుంది తప్ప ఆమెపై సింపతీ రాదు. ఎందుకంటే మొదటి నుంచీ ఆమె పాత్ర ప్రేక్షకుల్లో నాటుకోకపోవడం, ఫస్ట్‌హాఫ్‌ అంతా మర్డర్‌ మిస్టరీ, అనవసరమైన గొడవలు, కొన్ని కామెడీ సీన్స్‌... ఇలా నడవడంతో సడన్‌గా శైలజ ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఆమెకు జరిగిన అన్యాయం గురించి ఆడియన్స్‌ ఆలోచించే వ్యవధి లేదు. అయితే చివరి అరగంట సినిమాను ఉత్కంఠగా నడపడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. అదీగాక సినిమాలో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. వాటిని ప్రేక్షకుల ఊహకు అందకుండా చేయడంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. 

నటీనటులు :

శైలజ పాత్రలో పాయల్‌ రాజ్‌పుత్‌ అద్భుతంగా చేసింది. అలాంటి క్యారెక్టర్‌ చెయ్యాలంటే సాధారణంగా హీరోయిన్లు ఒప్పుకునే అవకాశాలు తక్కువ. సెక్స్‌ కోసం పరితపించే అమ్మాయిగా కొన్ని సన్నివేశాల్లో బాగా చేసింది. డైరెక్టర్‌ మీద ఉన్న నమ్మకంతోనే ఆమె ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి ఓకే చెప్పినట్టు అనిపిస్తుంది. మిగతా పాత్రల్లో అజయ్‌ఘోష్‌ కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కవుట్‌ అయ్యింది. జమీందారు పాత్రలో చైతన్యకృష్ణ ఓకే అనిపించాడు. సినిమాలో కీలకమైన డాక్టర్‌ పాత్రను రవీంద్ర విజయ్‌ ఎంతో సమర్థవంతంగా పోషించాడు. మిగతా క్యారెక్టర్స్‌ చేసిన ఆర్టిస్టులు కూడా వారి వారి క్యారెక్టర్స్‌కు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :

టెక్నీకల్‌గా సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అజనీష్‌ లోకనాథ్‌ మ్యూజిక్‌. పాటల పరంగా, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పరంగా అజనీష్‌ మంచి ఎఫర్ట్‌ పెట్టాడు. అయితే సినిమాలో చాలా సన్నివేశాల్లో అతను ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాంతార సినిమాను గుర్తు చేస్తుంది. మ్యూజిక్‌  బాగా లౌడ్‌గా ఉన్నప్పటికీ వర్కవుట్‌ అయింది. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ఉపయోగపడిరది. ఆడియన్స్‌కి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చక్కని ఫోటోగ్రఫీ అందించాడు. ఈ సినిమాకి ఎక్కువ అవసరమైంది ఎడిటింగ్‌. దాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా చేశాడు ఎడిటర్‌ మాధవ్‌కుమార్‌. ఇక దర్శకుడు అజయ్‌ భూపతి గురించి చెప్పాలంటే.. ఎంచుకున్న కథాంశం, బ్యాక్‌డ్రాప్‌, హీరోయిన్‌కి ఓ కొత్తరకమైన సమస్య.. ఇవన్నీ బాగానే సెట్‌ చేసుకున్నాడు. కాకపోతే ఫస్ట్‌హాఫ్‌ మొత్తం ఇదేం సినిమా అనుకునేలా సీన్స్‌ రాసుకోవడంతో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చెయ్యలేకపోయాడు. ఫస్ట్‌హాఫ్‌ కంటే సెకండాఫ్‌లోనే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సినిమా ఎండిరగ్‌లో ‘టు బి కంటిన్యూడ్‌’ అని వేయడంతో ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉంటుందని తెలుస్తోంది. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఇది ఒక జోనర్‌ అని చెప్పే వీలులేని సినిమా. ఇందులో ఎన్నో కథలు, మరెన్నో మలుపులు ఉన్నాయి. వాటన్నింటినీ దర్శకుడు సమర్థవంతంగా హ్యాండిల్‌ చేసినప్పటికీ.. సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది ఫస్ట్‌హాఫ్‌. సినిమా స్టార్ట్‌ అవ్వడమే స్లో నేరేషన్‌తో చాలా సాదాసీదాగా మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే మర్డర్‌ మిస్టరీలతోనే సగం సినిమా నడిపించడంతో ఆడియన్స్‌ సహనం కోల్పోతారు. ఇక సెకండాఫ్‌లో ఏం ఉంటుందిలే అనుకునే టైమ్‌లో సెకండాఫ్‌లో అసలు కథకు వచ్చి ఎండిరగ్‌ వరకు అదే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తూ తీసుకెళ్ళాడు. సినిమాలో కొన్ని మైనస్‌లు వున్నప్పటికీ దానికి తగ్గట్టుగానే ప్లస్‌లు కూడా వున్నాయి. ఇది అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా కాకపోయినా మాస్‌ ఆడియన్స్‌ని మాత్రం ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. 

- జి.హరా