English | Telugu

సినిమా పేరు:మంచి రోజులు వచ్చాయి
బ్యానర్:వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్
Rating:2.75
విడుదలయిన తేది:Nov 4, 2021

సినిమా పేరు: మంచి రోజులు వచ్చాయి
తారాగణం: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్, అజయ్ ఘోష్, పీడీ శ్రీనివాస్, కోటేశ్వరరావు, 'వెన్నెల' కిషోర్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి, రజిత, రచ్చ రవి తదితరులు
కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్ 
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: వి సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్.
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 4 నవంబర్ 2021

గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే... షూటింగ్ మధ్యలో లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్ తొలగించినా పెద్ద సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడానికి ఆలోచిస్తున్న టైమ్... ఆలోపు మారుతి 'మంచి రోజులు వచ్చాయి' అని చిన్న సినిమా తీశారు. పేరుకు చిన్న సినిమా కావచ్చు. కానీఎం యువి క్రియేషన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ దీని వెనుక ఉంది. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదవండి.     

కథ
సంతు అలియాస్ సంతోష్ (సంతోష్ శోభన్), పద్దు (మెహ్రీన్ కౌర్) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగస్తులు. లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇండియాలో తొలి కరోనా కేసు నమోదు అయిన తర్వాత వాళ్లిద్దరూ పని చేస్తున్న కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తప్పనిసరి చేయడంతో హైదరాబాద్ ప్రయాణం అవుతారు. కూతురు ఇంటికి వస్తున్న తరుణంలో ఎప్పుడూ సంతోషంగా ఉండే పద్దు తండ్రి గోపాలం (అజయ్ ఘోష్)కు, ఆ సంతోషం లేకుండా చేయాలని... కూతురు ఎవరితోనో ప్రేమలో ఉందని పక్కింటి అంకుల్స్ (కోటేశ్వరరావు, పీడీ శ్రీనివాస్) గోపాలం చెవిలో గుసగుసలు ఆడతారు. కట్ చేస్తే... గోపాలం కూతురు పద్దు నిజంగా ప్రేమలో ఉంటుంది. ఆ విషయం తెలిసి గోపాలం ఏం చేశాడు? అతడి అతి భయం ఎంత పని చేసింది? కరోనాకు, గోపాలంలో మార్పుకు సంబంధం ఏమిటి? చివరకు, సంతోష్ - పద్దు ఎలా ఒక్కటయ్యారు? అనేది మిగతా సినిమా. 


ఎనాలసిస్ :

ఓ క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకుని కథ రాయడం, ప్రేక్షకులను నవ్వించడం మారుతికి వెన్నతో పెట్టిన విద్య. మతిమరుపు మనిషిని హీరో చేసి 'భలే భలే మగాడివోయ్' తీశాడు. ఓసీడీ క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకుని 'మహానుభావుడు' తీశాడు. కరోనా కాలంలో ఓసీడీ బెటర్ అని అందరూ ఫాలో అయ్యారు. ఇక... కరోనాలో మారుతి రాసిన, తీసిన ఈ సినిమాకు చుట్టుపక్కల వ్యక్తుల మాటలు విని అతిగా భయపడే ఓ తండ్రి పాత్ర ప్రధానం. ఆ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలే సినిమా. 

కథగా చూస్తే... చాలా సింపుల్ స్టోరి ఇది. దీనికి మారుతి మార్క్ వినోదం యాడ్ అవ్వడంతో నవ్వులు పండాయి. ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, అమ్మాయికి పెళ్లి చేయాలని తండ్రి సంబంధాలు వెతకడంతో సరిపోతుంది. సెకండాఫ్ లో కామెడీ తగ్గింది. కథ రొటీన్ ఫార్మటులోకి వెళ్లింది. ఇటువంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అవసరం. సిద్ శ్రీరామ్ పాడిన 'సో సోగా...' మినహా మిగతా పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ సోసోగా ఉంది. సినిమాలో తొలి పాట 'సో సోగా...', కేబుల్ బ్రిడ్జ్ మీద తీసిన 'ఎక్కేసిందే...', కొన్ని సీన్స్ కలర్ ఫుల్ గా తీశారు. ఓ పాటలో బ్లర్ ఎఫెక్ట్ ఎందుకు ఉపయోగించారో? సినిమాలో ఎక్కువ లొకేషన్స్ లేవు. ఉన్నంతలో ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.

నటీనటుల పనితీరు

హీరోగా సంతోష్ శోభన్ పెద్దగా చేయడానికి ఏమీ లేదు. కథలో సందర్భాలకు అనుగుణంగా నటించాడు. తన వరకూ న్యాయం చేశాడు. మెహ్రీన్ చాలా సన్నబడింది. తొలి పాటలో అందంగా కనిపించింది. హీరోతో పోలిస్తే... ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. పాత్రకు తగ్గట్టు నటించింది. అతి భయస్తుడి పాత్ర‌కు అజయ్ ఘోష్ పూర్తి న్యాయం చేశారు. త‌ను ఎలాంటి పాత్ర‌లోనైనా రాణించ‌గ‌ల‌న‌ని చూపించారు. ఆయ‌న‌ పక్కింటి కన్నింగ్ అంకుల్స్ పాత్రల్లో కోటేశ్వరరావు, పీడీ శ్రీనివాస్ పర్వాలేదు. 'వెన్నెల' కిషోర్ కనిపించేది రెండు మూడు సన్నివేశాలు అయినప్పటికీ బాగా నవ్వించారు. ప్రవీణ్ నటనతో కంటే వాయిస్ తో మేజిక్ చేశాడు. వైవా హర్ష, సప్తగిరి, సుదర్శన్, రజిత తదితరులు పాత్రల పరిధి మేరకు నవ్వించారు. అజయ్ ఘోష్ తల్లి పాత్రలో నటించిన పెద్దావిడ పతాక సన్నివేశాల్లో రిజిస్టర్ అవుతారు.    


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'మంచి రోజులు వచ్చాయి'.. సినిమాలో మెదడుకు పనిచెప్పే కథ, కథనాలు అయితే లేవు. అలాగని, కథ లేదేంటి? అనే ఆలోచన రానివ్వకుండా ఫస్టాఫ్ స్పీడుగా సాగింది. ఇంటర్వెల్ తర్వాత ప్రేయసిని, ఆమె తండ్రిని ఇంప్రెస్ చేయడం కోసం... హీరోయిన్ పక్కింటి మేడ మీదకు హీరో దిగడం రొటీన్ కాన్సెప్ట్ అయినా ఓవరాల్ గా చూస్తే... కామెడీ సీన్స్ నవ్విస్తాయి. పతాక సన్నివేశాలకు వచ్చేసరికి కామెడీ కంప్లీట్ గా బ్యాక్ సీటులోకి వెళ్లి... ఎమోషన్ ఫ్రంట్ సీటులోకి రావడంతో కొంచెం బోర్ అనిపిస్తుంది. ఇందులో లాజిక్కులు వెతికితే కష్టమే. మారుతి మార్క్ వినోదం ఎంజాయ్ చేసేవాళ్లకు దీపావళికి మంచి ఆప్షన్ ఇది. సరదాగా నవ్వుకోవచ్చు. 

 

- వ‌న‌మాలి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25