English | Telugu

బ్యానర్:పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
Rating:2.75
విడుదలయిన తేది:Jun 7, 2024
సినిమా పేరు: మనమే
తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, మాస్టర్ విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు
సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రచన, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: జూన్ 7, 2024
శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మనమే'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాలతోనే ఓ బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ చూడబోతున్నామనే భావన కలిగించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
యూకేలో ఉండే విక్రమ్(శర్వానంద్) బాధ్యత తెలియని యువకుడు. ఎప్పుడూ మందు తాగుతుండటం, అమ్మాయి కనిపిస్తే చాలు ఫ్లర్ట్ చేయడం.. ఎవరైనా అమ్మాయి ఓకే అంటే శారీరకంగా కలవడం ఇదే అతని దినచర్య. పేరెంట్స్, బెస్ట్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడటానికి కూడా సమయం కేటాయించడు. అలాంటి విక్రమ్ కి అనుకోని బాధ్యత వచ్చి పడుతుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న విక్రమ్ స్నేహితుడు అనురాగ్(అదిత్ అరుణ్).. భార్య శాంతితో సహా ఓ ప్రమాదంలో చనిపోతాడు. వాళ్లకి రెండేళ్ల కుమారుడు ఖుషి(విక్రమ్ ఆదిత్య) ఉంటాడు. కూతురు శాంతి తమకి ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. మనవడు ఖుషి బాధ్యతను తీసుకోవడానికి అమ్మమ్మ తాతయ్య ముందుకు రారు. దీంతో ఖుషిని కొద్ది నెలల పాటు చూసుకునే బాధ్యత అనురాగ్ ఫ్రెండ్ విక్రమ్, శాంతి ఫ్రెండ్ సుభద్ర(కృతి శెట్టి)పై పడుతుంది. సుభద్రకి అప్పటికే ఎంగేజ్ మెంట్ అవుతుంది. అయినప్పటికీ తన కుటుంబాన్ని ఒప్పించి.. ఖుషికి కేర్ టేకర్ గా మారుతుంది. ప్రేమ, పెళ్లి, బాధ్యత వంటి వాటికి దూరంగా ఉండే విక్రమ్ మాత్రం.. తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే కేర్ టేకర్ గా మారతాడు. ఖుషి రాకతో విక్రమ్ జీవితం ఎలా మారింది? అయిష్టంగా కేర్ టేకర్ గా మారిన విక్రమ్.. ఖుషిని వదులుకోలేనంత ఇష్టాన్ని ఎలా పెంచుకున్నాడు? అప్పటికే ఎంగేజ్మెంట్ అయి, పెళ్ళికి రెడీగా ఉన్న సుభద్రతో ప్రేమలో ఎలా పడ్డాడు? ఖుషి, సుభద్ర తనకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వస్తే విక్రమ్ ఏం చేశాడు? చివరికి వాళ్లిద్దరూ విక్రమ్ జీవితంలోకి వచ్చారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
కథగా చూసుకుంటే చాలా చిన్న కథ. పైగా ఈ స్టోరీ లైన్ కూడా.. 2010లో వచ్చిన 'లైఫ్ యాజ్ వి నో ఇట్' అనే హాలీవుడ్ ఫిల్మ్ నుంచి స్ఫూర్తి పొందినట్లుగా ఉంది. ఇలాంటి కథలకు ఎమోషన్స్ కీలకం. ఎమోషన్స్ పండితేనే ప్రేక్షకులు చివరి వరకు కూర్చొని చూడగలుగుతారు. హీరో తనకు ఇష్టంలేకుండా హీరోయిన్ తో చిన్న బాబుకి కేర్ టేకర్ గా మారడం.. ఆ తర్వాత ఆ ఇద్దరినీ వదులుకోలేనంత ఇష్టం హీరోకి కలగడం.. చివరికి ముగ్గురూ కలవడం.. సింపుల్ గా చెప్పాలంటే ఇదే స్టోరీ. ఎలాంటి మలుపులు లేని ఇలాంటి చిన్న కథతో రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోబెట్టడం అంత తేలికైన విషయం కాదు. భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేయాలి. ఈ విషయంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొంతవరకు సక్సెస్ అయ్యాడు.
ప్లే బాయ్ తరహా పాత్రలో విక్రమ్ గా శర్వానంద్ పరిచయంతో సినిమా ప్రారంభవుతుంది. అతనికి జీవితంలోకి ఖుషి, సుభద్ర రాకతో అసలు కథ మొదలవుతుంది. ఖుషిని చూసుకోలేక విక్రమ్ ఇబ్బందిపడే సన్నివేశాలు నవ్విస్తాయి. ఫస్టాఫ్ చాలా వరకు సరదాగానే నడిచింది. ఖుషి, సుభద్రకి విక్రమ్ దగ్గరయ్యే సన్నివేశాలు మెప్పించాయి. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మొత్తానికి కొంచెం ఫన్, కొంచెం ఎమోషన్ తో ఫస్టాఫ్ బాగానే నడిచింది. అయితే సెకండాఫ్ లో మాత్రం దర్శకుడు తడబడ్డాడు. కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తే, మరి కొన్ని సన్నివేశాలు అనవసరంగా ఇరికించినట్లుగా ఉన్నాయి. అయితే చివరి 30 నిమిషాలు మాత్రం ఎమోషన్స్ తో కట్టిపడేశాడని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. సెకండాఫ్ విషయంలో మరింత కేర్ తీసుకొని.. అలాగే నిడివిని కుదించినట్లయితే సినిమా అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.
'మనమే' సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఓకే. సాంగ్స్ గుర్తు పెట్టుకొని పాడుకునేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే కొన్ని బిట్ సాంగ్స్ మాత్రం వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం పరవాలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నీట్ గా ఉంది. అయితే నిడివి ఇంకా కుదించి ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో తొలి సగం విషయంలో కత్తెరకు పని చెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిందని తెరమీద స్పష్టంగా కనిపించింది.
నటీనటుల పనితీరు:
విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా రాణించాడు. కొన్ని సన్నివేశాలను తన నటనతో నిలబెట్టాడని కూడా చెప్పవచ్చు. సుభద్ర పాత్రకి కృతి శెట్టి బాగానే న్యాయం చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఖుషిగా మాస్టర్ విక్రమ్ ఆదిత్య సర్ ప్రైజ్ చేశాడు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఉన్నంతలో బాగానే నవ్వించారు. సీరత్ కపూర్, అయేషా ఖాన్ గ్లామర్ రోల్స్ లో మెరిశారు. రాహుల్ రవీంద్రన్ పాత్రని సీరియస్ విలన్ గా పరిచయం చేశారు కానీ, ముగింపు తేలిపోయింది. శివ కందుకూరి, సుదర్శన్, అదిత్ అరుణ్ తదితరులు పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కష్టంగా మొదలుపెట్టిన ప్రయాణం.. వదులుకోలేనంత ఇష్టంగా మారితే ఎలా ఉంటుంది అని చూపించే చిత్రం 'మనమే'. కథ చిన్నదే అయినప్పటికీ, కథనంలో ఊహించని మలుపులు లేనప్పటికీ.. కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లతో ఈ సినిమా బాగానే నడిచింది. కొన్ని సాగదీత సన్నివేశాల కారణంగా యువత ఈ చిత్రాన్ని రెండున్నర గంటల పాటు కూర్చొని చూడటం కష్టమే. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి.
- గంగసాని