English | Telugu
బ్యానర్:వారాహి చలన చిత్రం
Rating:3.00
విడుదలయిన తేది:Aug 5, 2016
ఈమధ్య కొన్ని సినిమాల రివ్యూల్లో "కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు" అనే పదం చాలా ఎక్కువసార్లు కనిపిస్తుంటుంది. మా "తెలుగువన్" రివ్యూల్లో కూడా ఆ పదాన్ని మీరు ఇదివరకే చాలాసార్లు చదివి ఉంటారు. అయితే.. కమర్షియల్ ఎలిమెంట్ అంటే ఓ పందిమందిని ఉతికిపడేసే ఫైట్లో, చాలీచాలని బట్టలేసుకొని ఎవరో అమ్మాయి వేసే డ్యాన్సో లేక ద్వంద్వార్ధంతో కూడుకొన్న వెకిలి కామెడీ పంచ్ లు కాదు. మంచి కథ, ఆ కథను నడిపించే అద్భుతమైన కథనం. ఈ రెండే సినిమాకి కావాల్సిన అతిపెద్ద కమర్షియల్ ఎలిమెంట్స్. అటువంటి కీలకమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా "మనమంతా".
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ రూపొందించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వయోబేధం లేకుండా అందర్నీ అమితంగా ఆకట్టుకొనే "మనమంతా" చిత్రాన్ని ఎందుకు మిస్సవ్వకుండా చూడాలో మా సమీక్షను చదివి తెలుసుకోండి..!!
కథ: ఎదుగుతున్న పిల్లల కోసం సంపాదన పెరిగితే బాగుండని ఆశించే తండ్రి సాయిరామ్ (మోహన్ లాల్). కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలనుకొనే తల్లి గాయత్రి (గౌతమి). చదువు కంటే ఇష్టపడ్డ అమ్మాయికే ప్రాధాన్యత ఇచ్చి.. ప్రేమ విఫలమవ్వడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించే నవతరం యువకుడు అభిరామ్ (విశ్వాంత్). రోడ్డు మీద ఆడుకొనే నాలుగేళ్ల నిరుపేద కుర్రాడ్ని ఎలాగైనా చదివించాలని ఆశపడే ఓ పదేళ్ళ పాప మహిత (రైనా రావ్).
కారణాలు వేరైనా.. ఒకే ఒక్క సందర్భం వీరి జీవితాల్ని మార్చేస్తుంది?
ఏంటా సందర్భం? వారి జీవితాలు తిరిగిన మలుపులు ఏంటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు.. అంతే ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేను జోడించి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఎక్కడా లాజిక్ మిస్సవ్వకుండా చెప్పిన సమాధానాల సమాహారమే "మనమంతా" చిత్ర కథాంశం.
ఎనాలసిస్ :
నటీనటుల పనితీరు: ఓ సూపర్ మార్కెట్ లో పనిచేసే మధ్యతరగతి వ్యక్తిగా మోహన్ లాల్ "సాయి రామ్" అనే పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. అయితే.. ఆ పాత్రకు ఆయన కష్టపడి డబ్బింగ్ చెప్పకుండా ఉండి ఉంటే క్యారెక్టర్ లోని డెప్త్ ఆడియన్స్ పై ఇంకాస్త ఇంపాక్ట్ చూపే అవకాశం ఉండేది. "గాయత్రి" పాత్ర గౌతమి కోసమే పుట్టింది అన్నట్లుగా ఆ పాత్రలో జీవించేసిందావిడ. భర్త-పిల్లలే ప్రపంచంగా బ్రతికే సగటు గృహిణిగా ఆమె నటన ప్రశంసనీయం. నవతరం యువకుడిగా విశ్వాంత్ తన పాత్ర పరిధిమేరకు చక్కగా నటించాడు. మోహన్ లాల్ తర్వాత సినిమాలో తన నటనతో ఆకట్టుకొన్న మరో నటి రైనా రావ్. కల్మషం ఎరుగని మహిత పాత్రలో ఒదిగిపోయింది. ప్రత్యేక పాత్రలో తారకరత్న పాజిటివ్ రోల్ లో ఆకట్టుకొన్నాడు. వెన్నెల కిషోర్, ధనరాజ్ లు సన్నివేశానికి తగ్గట్లు నటించి కాస్త నవ్వించారు.
సాంకేతికవర్గం పనితీరు: స్క్రీన్ ప్లే ప్రధానాంశంగా రూపొందే చిత్రాలకు అత్యంత కీలకమైనది నేపధ్య సంగీతం (బ్రాగ్రౌండ్ స్కోర్). మహేష్ శంకర్ సన్నివేశానికి తగ్గ నేపధ్య సంగీతాన్ని అందించి.. ఎమోషన్ కి తగ్గట్లుగా సన్నివేశంలో ప్రేక్షకుడు లీనమవ్వడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఫోటోగ్రఫీ "మనమంతా" చిత్రానికి వెన్నుముక. చాలా సినిమాల్లో ఎమోషన్ కి సంబంధం లేకుండా బ్రైట్ లైటింగ్ వాడేస్తారు. కానీ కెమెరాపై మాత్రమే కాక కథపై కూడా పట్టు ఉన్న కెమెరామెన్ మాత్రమే సన్నివేశంలోని ఎమోషన్ తగ్గట్లుగా లైటింగ్ ను, టింట్ ఎఫెక్ట్ ను వినియోగించి సినిమా చూసే ప్రేక్షకుడి మూడ్ ను కూడా మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. టెక్నికల్ గానే కాక క్రియేటివ్ గానూ రాహుల్ శ్రీవాత్సవ్ కి ఉన్న బ్రిలియన్స్ "మనమంతా" సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఇక జి.వి.చంద్రశేఖర్ ఎడిటింగ్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే, సినిమాలోని ఏ ఒక్క సన్నివేశమూ ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా.. చివరి వరకూ సీట్లో కూర్చోబెట్టిందంటే అది కేవలం దర్శకుడి ప్రతిభ మాత్రమే కాదు ఎడిటర్ చంద్రశేఖర్ పనితనం కూడా. సినిమాను బట్టి బడ్జెట్ ఉండాలి కానీ.. బడ్జెట్ ను బట్టి సినిమా ఉండకూడదు అనేది నేటితరం నిర్మాతల్లో చాలా మందికి తెలియని లెక్క. కానీ.. సాయి కొర్రపాటి మాత్రం సినిమాకి అవసరమైనంత ఖర్చు పెట్టి.. కంటెంట్ పరంగానే కాక క్వాలిటీ పరంగానూ ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందించి మరోమారు "అభిరుచి గల నిర్మాత" అనిపించుకొన్నారు.
కథ-కథనం-దర్శకత్వం: తెలుగులో ఉన్న అతి కొద్దిమంది సెన్సిబుల్ డైరెక్టర్స్ లో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు. ఆయన తెరకెక్కించే చిత్రాల్లో జీవం ఉంటుంది. ఒక దర్శకుడిగానే కాదు కథకుడిగా, రచయితగానూ చంద్రశేఖర్ ఏలేటి ప్రతిభ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అయితే.. "మనమంతా" చిత్రంలో ఏలేటిలోని స్క్రీన్ ప్లే రైటరే ఎక్కువ మార్కులు సంపాదించుకొన్నాడు. కథలో మూలపాత్ర అయిన "విశ్వనాధం" క్యారెక్టర్ ను ఇంకాస్త బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే.. ప్రీ క్లైమ్యాక్స్ లో ఇంటెన్సిటీ ఇంకా పెరిగేది. ఓవరాల్ గా తెలుగు ప్రేక్షకులకు "మనమంతా" అనే ఫ్యామిలీ డ్రామాతో ఒక చక్కని అనుభూతిని పంచడంలో సఫలమయ్యాడు చంద్రశేఖర్ ఏలేటి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మలయాళంలో వచ్చిన "దృశ్యం", తమిళంలో వచ్చిన "బిచ్చగాడు", హిందీలో వచ్చిన "పీకే", కన్నడలో వచ్చిన "యూ టర్న్" వంటి చిత్రాలను చూసి తెలుగులో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ థ్రిల్లర్స్ ఎందుకు రావు? అని తమలో తాము మదనపడే సినిమా అభిమానులకు చక్కని ఊరట "మనమంతా". అలాగే రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాలతో విసిగివేసారిపోయిన తెలుగు ప్రేక్షకులకు సాంత్వన చేకూర్చే చిత్రం "మనమంతా". మొత్తానికి కుటుంబంలోని ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం "మనమంతా".