Read more!

English | Telugu

సినిమా పేరు:మధురపూడి గ్రామం అనే నేను
బ్యానర్:లైట్ హౌస్ సినీ మ్యూజిక్
Rating:3.00
విడుదలయిన తేది:Oct 13, 2023

సినిమా పేరు: మధురపూడి గ్రామం అనే నేను  
తారాగణం: శివ కంఠమనేని,క్యాథలిన్ గౌడ ,భరణి శంకర్ తదితరులు 
సంగీతం:మణిశర్మ 
రచన, దర్శకత్వం: మల్లి 
నిర్మాతలు: కె.ఎస్ శంకరరావు ,ఆర్.వెంకటేశ్వరావు  
బ్యానర్ : లైట్ హౌస్ సినీ మ్యూజిక్  
విడుదల తేదీ: అక్టోబర్ 13, 2023 

తెలుగు సినీ పరిశ్రమలోని కొంత మంది పెద్దలకి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తారతమ్యం ఉందేమో గాని తెలుగు ప్రేక్షకులకి మాత్రం ఆ తారతమ్యం ఉండదు. ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలని చూడాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. సినిమా బాగుంటే చాలు సూపర్ డూపర్ హిట్ చేస్తారు. సినిమా నచ్చకపోతే ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన పెద్ద సినిమానే ఫట్ అంటారు. నచ్చితే చిన్న సినిమా అయినా సరే హిట్ అంటారు. మరి ఈ రోజు విడుదల అయిన మధురపూడి గ్రామం అనే నేను సినిమా  ప్రేక్షకుల చేత ఏమని అనిపిస్తుందో చూద్దాం.

కథ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలుకి దగ్గరలో ఉన్న మధురపూడి అనే గ్రామములో ఈ కథ ప్రారంభం అవుతుంది. మధురపూడి గ్రామమే తన కథని తాను చెప్పుకుంటుందనే వాయిస్ ఓవర్ తో సినిమా  ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సూరి (శివ కంఠమనేని) మరియు బాబ్జి మంచి స్నేహితులు. బాబ్జి బయటకి చెప్పకుండానే బాబ్జి మనసులో ఉన్నదీ తెలుసుకొని బాబ్జి సంతోషం కోసం సూరి ఏమైనా చేస్తాడు. ఎవరినైనా చంపుతాడు. బాబ్జి తండ్రి తన చిరకాల కోరిక అయిన ఎంఎల్ఏ అవ్వకుండానే చనిపోతే బాబ్జి ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. అందులో భాగంగా సూరి సహకారంతోనే బాబీ జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు. ఈ క్రమంలో ఒక పార్టీ బాబ్జి కి ఎంఎల్ఏ టిక్కెట్ ఇవ్వడానికి ముందుకొస్తుంది. ఇలా జరుగుతున్న కథలోకి హీరోయిన్ క్యాథలిన్ గౌడ  ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి ప్రజలికి అవగాహన కలిగించడం కోసం ఆ గ్రామంలోకి ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే క్యాథలిన్ ని సూరి ప్రేమిస్తాడు. ఆ తర్వాత అనాధ అయిన క్యాథలిన్ కూడా సూరిని ప్రేమిస్తుంది. బాబ్జి కి ఆడవాళ్లంటే పిచ్చి. చాలా సార్లు  సూరినే బాబ్జి దగ్గరికి అమ్మాయిలని తీసుకెళ్తాడు. ఈ క్రమంలో ఒకసారి బాబ్జి తనకి క్యాథలిన్ కావాలని అడుగుతాడు. తన ప్రేమని చంపుకొని స్నేహం కోసం సూరి క్యాథలిన్ ని బాబ్జి దగ్గరకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? క్యాథలిన్ ని నిజంగా బాబ్జి తన కోరిక తీర్చుకోవడానికే తీసుకురమ్మన్నాడా? బాబ్జి ఎంఎల్ఏ కోరికని సూరి నెరవేర్చాడా? క్యాథలిన్ కి సూరి గురించి అసలు నిజం తెలిసిందా? సూరి, క్యాథలిన్ ల ప్రేమ నెరవేరిందా? అనేదే మిగతా కథ.


ఎనాలసిస్ :

తెలుగు సినిమా విజయానికి ఒక మంచి కథ తో పాటు మంచి స్క్రీన్ ప్లే, అందులోని పాత్రల ఆహార్యానికి తగ్గట్టుగా డైలాగ్స్, అద్భుతమైన దర్శకత్వం, సినిమాలో లీనమయ్యేలా చేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరహో అనిపించే ఎడిటింగ్ ఇలా అవన్నీ తోడైతే ఇంక ఆ సినిమా విజయాన్ని ఎవరు ఆపలేరు అనేది ఎంత నిజమో ఈ మధురపూడి గ్రామం అనే నేను సినిమా విజయాన్ని కూడా ఎవరు ఆపలేరు.   తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జట్ తో భారీ హీరోలతో సినిమాలు చేసే అవకాశం లేక, తమిళ, మలయాళ భాషల్లో లాగ కేవలం కథనే నమ్ముకొని సినిమా చెయ్యాలనుకునే కొత్త దర్శకులని ఈ మధురపూడి ఒక ఊపుని, నమ్మకాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అలాగే ఒక సినిమాని బీజీఎమ్ ఏ స్థాయిలో నిలబెడుతుందో కూడా ఈ సినిమా చెప్పింది. ఎడిటింగ్ కూడా సూపర్ గా ఉంది. డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

ఈ మధురపూడి గ్రామము అనే నేను సినిమా లో నటించిన ఆర్టిస్టులందరు చాలా అద్భుతంగా నటించారు. ఇంకా చెప్పాలంటే సైడ్ ఆర్టిస్టులు కూడా సూపర్ గా నటించారు. హీరోగా చేసిన శివ కంఠమనేని కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. నేనేం  హీరో ల వారసత్వం తో వచ్చిన వాడినేం కాదు పైగా అందగాడ్ని కాదు కదా తెర మీద నా యాక్టింగ్ ని చూస్తారా లేదా అని ఆలోచించకుండా తన పాత్రకి తగట్టుగా చాలా చక్కగా నటించాడు. ఈ సూరి పాత్ర తన కోసమే పుట్టిందా అనిపిస్తుంది. సినిమా మొత్తం లుంగీ కట్టులోనే కనిపించి సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్ క్యాథలిన్ గౌడ కూడా చాలా బాగా నటించింది. క్లైమాక్స్ సీన్ లో అయితే ప్రేక్షకుల కళ్ళ వెంట కన్నీళ్లు తెప్పిస్తుంది. బాబ్జి పాత్రని పోషించిన నటుడు వీర విహారం చేసాడు. ఈ సినిమా తర్వాత అతనికి చాలా సినిమాల్లో అవకాశం రావచ్చు. అలాగే మల్లి దర్శకత్వం సూపర్ గా ఉంది. గతం లో కొన్ని సినిమాలకి దర్శత్వం వహించిన మల్లి ఈ సినిమాతో మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. ముఖ్యంగా హీరోకి హీరోయిన్ మీద ఇష్టం పెరిగే సీన్ ని ఒక సీతాకోకచిలుక ఎలా పుడుతుంది. అలాగే ఒక పువ్వు మీద ఉన్న తన ఇష్టాన్ని దశల వారిగా ఎలా తన ఫీలింగ్ ఎలా చెప్తుండానే సింబాలిక్ తో పోల్చడం సూపర్ గా ఉంది. అలాగే మణిశర్మ పాటలు అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని హిట్ సినిమాగా మార్చాయి. అలాగే గౌతం రాజు గారి ఎడిటింగ్ సినిమాని ప్లస్ అయ్యింది. కెమెరా పనితనం బాగుంటే సినిమా ఎక్కడో ఉండేది. మిగతా పాత్రలో నటించిన అందరు బాగా చేసారు. భవాని శంకర్ ఉన్న కొంచం సేపు అయిన బాగా నటించాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టి ఎవడ్ని ఎవడు కాలుస్తున్నాడో, ఎందుకు కాలుస్తున్నాడో, హీరో ఒకడ్ని కొట్టగానే పది మంది ఎందుకు కింద పడతారో, హీరో ఎందుకు హీరోయిన్ తో బూతులు మాట్లాడతాడో , హీరోయిన్ తన ఇంట్లో కూడా అర్ధనగ్నంగా ఎందుకు తిరుగుతుందో  తెలియక తిక మక పడే ఆడీయన్స్ కి ఈ మధురపూడి గ్రామం అనే నేను సినిమా మంచి రిలీఫ్ అవుతుంది. ఇది ముమ్మాటికీ తన బిడ్డల బాధలని, సంతోషాలని, కోపాలని, తల రాతలని, తనలో దాచుకున్న మధురపూడి గ్రామం నేను అనే ఒక ఊరి కథ. మన అందరి ఊరి కథ కూడాను.                                                                                                       

                                                                 అరుణాచలం