English | Telugu
బ్యానర్:శ్రీ కృష్ణ క్రియేషన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Nov 3, 2023
సినిమా పేరు: మా ఊరి పొలిమేర 2
తారాగణం: సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాసరి, అక్షత శ్రీనివాస్
సంగీతం: గ్యాని
డీఓపీ: ఖుషేందర్ రమేష్ రెడ్డి
ఎడిటర్: శ్రీవర
రచన, దర్శకత్వం: అనిల్ విశ్వనాథ్
నిర్మాత: గౌరీ కృష్ణ
బ్యానర్: శ్రీ కృష్ణ క్రియేషన్స్
విడుదల తేదీ: నవంబర్ 3, 2023
2021లో ఎలాంటి అంచనాల్లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర' ఊహించని స్పందన తెచ్చుకుంది. ఓటీటీలో ఈ సినిమా చూసిన వారంతా ఫిదా అయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ కట్టిపడేసింది. దాంతో రెండో భాగంపై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా 'మా ఊరి పొలిమేర 2' థియేటర్లలో విడుదలైంది. మరి రెండో భాగం ఎలా ఉంది? మొదటి భాగం స్థాయిలో మెప్పిస్తుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
మొదటి భాగంలో కవిత(రమ్య) అనే గర్భిణి అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. కవితని చేతబడి చేసి చంపేశాడనే అనుమానంతో కొమురయ్య అలియాస్ కొమిరి(సత్యం రాజేష్)ని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేస్తారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ అయిన కొమిరి తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) న్యాయ పోరాటానికి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి ఊహించని విషయాలు తెలుస్తాయి. తన అన్న కొమురయ్య నిజంగానే చేతబడి చేస్తాడని, అంతేకాదు అతను ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకుంటాడు. అలాగే, చనిపోయిందనుకున్న కవిత కూడా కొమిరితో కలిసి వేరే రాష్ట్రానికి పారిపోయినట్లు మొదటి భాగం చివరిలో చూపించి ట్విస్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి రెండో భాగం కథ మొదలవుతుంది. కొమురయ్యను వెతుక్కుంటూ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా జంగయ్య ఎక్కడికో వెళ్తాడు. అతన్ని వెతుక్కుంటూ ఈ కేసుని ఎలాగైనా ఛేదించాలంటూ కొత్తగా వచ్చిన ఎస్సై నాయక్(రాకేందు మౌళి) వెళ్తాడు. అసలు కొమిరి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇదంతా ఎందుకు చేశాడు? అతనికి, ఆ ఊరి పొలిమేరలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధం ఏంటి? వందేళ్లుగా మూసి ఉన్న ఆ గుడిపై కొందరి కన్ను ఎందుకు పడింది? కొమిరి తను అనుకున్నది చేయగలిగాడా లేక పోలీసులకు చిక్కాడా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాలి.
ఎనాలసిస్ :
'మా ఊరి పొలిమేర' మొదటి భాగం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడానికి కారణం చేతబడి నేపథ్యమున్న థ్రిల్లర్ కథ కావడం, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండటం, ముఖ్యంగా పతాక సన్నివేశాలు కట్టిపడేయటం. ఇప్పుడు రెండో భాగం అంతకుమించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు ఉంటేనే ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ప్రచార చిత్రాలు, మూవీ టీం మాటలను బట్టి చూస్తే ఇది మొదటి భాగానికి మించి ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలకు అందుకోవడంతో పార్ట్-2 పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకొని సినిమాకి వెళ్తే మాత్రం కాస్త నిరాశ చెందే అవకాశముంది.
కొమిరిని వెతుక్కుంటూ జంగయ్య వెళ్ళడం, జంగయ్య ఆచూకీ కోసం ఎస్సై నాయక్ విచారణ మొదలుపెట్టే సన్నివేశాలతో సినిమా ప్రారంభమైంది. ప్రారంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగానే సాగుతున్నట్టు అనిపిస్తాయి. కొమిరి పాత్ర ఎంటరై అసలు కథలోకి వెళ్ళాక, సినిమాలో వేగం పెరుగుతుంది. ప్రజెంట్ ని, పాస్ట్ ని కలుపుతూ దర్శకుడు కథనాన్ని ఆసక్తికరంగా రాసుకున్నాడు. మరీ దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ లు లేనప్పటికీ, బోర్ కొట్టకుండా ఫస్టాఫ్ నడిచింది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ముఖ్యంగా ద్వితీయార్థం ప్రారంభంలో వచ్చే ట్విస్ట్ సర్ ప్రైజ్ చేస్తుంది. అక్కడి నుంచి సినిమా ఎంతో ఆసక్తికరంగా నడిచింది. గుడిని లింక్ చేస్తూ వచ్చే సన్నివేశాలు గతంలో చూసినట్టుగా ఉన్నప్పటికీ బోర్ అయితే కొట్టలేదు. అలాగే పతాక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. మొదటి భాగం స్థాయిలో అయితే మెప్పించలేదని చెప్పాలి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ని ఇంకా బాగా డిజైన్ చేసుకొని ఉండాల్సింది. క్లైమాక్స్ బాగానే ఉంది. పార్ట్-3 కి లీడ్ ఇస్తూ కొన్ని ప్రశ్నలను అలాగే వదిలేశారు. ఆ ప్రశ్నలకు సమాధానం కోసం మరో భాగం వచ్చేవరకు ఎదురుచూడాలి.
డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మరోసారి స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో బాగానే సక్సెస్ అయ్యాడు కూడా. ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతమని చెప్పవచ్చు. గ్యాని తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. థ్రిల్లర్ సినిమాలకు అతను బెస్ట్ ఛాయిస్ అవుతాడు. ఖుషేందర్ రమేష్ రెడ్డి కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంది. కథ నేపథ్యానికి తగ్గట్టుగా అతని ఫ్రేమింగ్, లైటింగ్ ఉంది. ఎడిటర్ శ్రీవర సినిమాని బాగానే ప్రజెంట్ చేశాడు. అయితే కొన్ని సన్నివేశాలు మరింత షార్ప్ గా కట్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు మాత్రం తేలిపోయాయి.
నటీనటుల పనితీరు:
కొమిరి పాత్రలో సత్యం రాజేష్ చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా చేతబడి సన్నివేశాల్లో అతని నటన కట్టిపడేసింది. మొదటి భాగంతో పోలిస్తే ఇందులో కామాక్షి భాస్కర్ల పాత్రకి, నటనకి ఎక్కువ ఆస్కారముంది. ఆ పాత్రకి ఆమె న్యాయం చేసింది. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఆమె నటన మెప్పించింది. ఈ భాగంలో బాలాదిత్య పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. కొమిరి స్నేహితుడు బలిజ పాత్రలో గెటప్ శ్రీను మరోసారి మెప్పించాడు. రాకేందు మౌళి, సాహితి దాసరి, అక్షత శ్రీనివాస్, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
'మా ఊరి పొలిమేర' నచ్చినవారికి, దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ రెండో భాగం కూడా నచ్చుతుంది. అయితే మరీ ఎక్కువ అంచనాలతో వెళ్తే మాత్రం కాస్త నిరాశ చెందే అవకాశముంది. చేతబడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాకి సున్నిత మనస్కులు దూరంగా ఉండటమే మంచిది.
-గంగసాని