English | Telugu

సినిమా పేరు:లక్కీ లక్ష్మణ్
బ్యానర్:ద‌త్తాత్రేయ మీడియా
Rating:2.00
విడుదలయిన తేది:Dec 30, 2022

సినిమా పేరు: లక్కీ లక్ష్మణ్
తారాగణం: సోహైల్‌, మోక్ష‌, దేవీ ప్ర‌సాద్‌, స‌మీర్, రాజా ర‌వీంద్ర‌‌, కాదంబ‌రి కిర‌ణ్‌, యాదమ్మ రాజు, గీతు, కెవ్వు కార్తీక్ 
సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రచన, దర్శకత్వం: ఏఆర్ అభి
నిర్మాత: హరిత గోగినేని
బ్యానర్: ద‌త్తాత్రేయ మీడియా
విడుదల తేదీ: డిసెంబర్ 30, 2022

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్‌ హీరోగా నటించిన చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. ఈమధ్య చిన్న సినిమాలు పెద్ద విజయాలను అందుకొని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం కూడా అలాంటి సర్ ప్రైజ్ ఏమైనా ఇస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. పైగా ప్రమోషన్స్ లో సోహైల్‌ కూడా ఈ మూవీ విజయం పట్ల చాలా నమ్మకం వ్యక్తం చేశాడు. మరి సోహైల్‌ నమ్మకం నిజమవుతుందా? 'లక్కీ లక్ష్మణ్'తో అతనికి లక్ కలిసొస్తుందా?.

కథ:
ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన లక్ష్మణ్(సోహైల్‌) చిన్నతనం నుంచి తన తల్లితండ్రుల తీరు పట్ల కోపంగా ఉంటాడు. డబ్బుల్లేవంటూ తను అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా వారు తీర్చకపోవడమే అతని కోపానికి కారణం. వయసు పెరిగేకొద్దీ ఆ కోపం కూడా అలా పెరుగుతూ వస్తుంది. మరోవైపు చిన్నప్పటి నుంచే ప్రేమ, అమ్మాయిలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్.. స్కూల్ లో తన క్లాస్ గర్ల్ కారణంగా చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. అప్పటి నుంచి అమ్మాయిలపై మరింత కోపం పెంచుకుంటాడు. అలాంటి లక్ష్మణ్ జీవితంలోకి రిచ్ ఫ్యామిలీకి చెందిన శ్రేయ(మోక్ష) వస్తుంది. ఒకే కాలేజ్ లో చదివే వారిద్దరూ మొదట ఫ్రెండ్స్, ఆ తర్వాత లవర్స్ అవుతారు. తన తల్లిదండ్రుల వల్ల కలగని సంతోషం ఆమె వల్ల దక్కడంతో లక్ష్మణ్ చాలా లక్కీ అని ఫీలవుతాడు. ఇంటిని పూర్తిగా వదిలేసి తల్లిదండ్రులకు దూరంగా బతుకుతుంటాడు. ఈ క్రమంలో ఒక చిన్న సంఘటన లక్ష్మణ్, శ్రేయ విడిపోవడానికి దారితీస్తుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా తలకిందులయ్యాయి? తన తల్లిదండ్రుల గురించి, శ్రేయ గురించి లక్ష్మణ్ తెలుసుకున్న నిజాలేంటి? చివరికి అతను కన్నవాళ్ళకి, ప్రేమించిన అమ్మాయికి దగ్గరయ్యాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

"డబ్బు కంటే బంధం గొప్పది. డబ్బున్నా కలగని సంతోషం.. ప్రేమించిన వ్యక్తి పక్కనుంటే కలుగుతుంది" అనే పాయింట్ ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నారు. ఇదే పాయింట్ ని ఓ ఐదు పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ ద్వారా కూడా చెప్పొచ్చు. సినిమాగా చెప్పాలనుకుంటే మాత్రం రెండు గంటల పాటు బోర్ కొట్టకుండా చేయగలగాలి. ఆ విషయంలో ఈ చిత్ర రచయిత, దర్శకుడు ఏఆర్ అభి సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి.

సినిమా మొదలవ్వడమే చాలా డల్ గా మొదలవుతుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే అది వినే పాత్రధారికే కాదు.. చూసే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుందన్న విషయాన్ని దర్శకుడు గమనించలేకపోయాడు. సన్నివేశాలు మరీ సాదాసీదాగా ఉన్నాయి. కాలేజ్ లో హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకునేలా లేవు. ఏమాత్రం కొత్తదనం లేకుండా ఎప్పుడో చూసేసిన సన్నివేశాల్లా ఉన్నాయి. కాలేజ్ లో ర్యాగింగ్ సన్నివేశాలు గానీ, హీరో ఫ్రెండ్స్ సన్నివేశాలు గానీ ఏవి కూడా నవ్వించేలా లేవు. కామెడీ వర్కౌట్ కాకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. యాదమ్మ రాజు, గీతు, కెవ్వు కార్తీక్ వంటి వారితో కామెడీ చేసే ప్రయత్నం చేశారు గాని వర్కౌట్ కాలేదు. కనీసం కామెడీ వర్కౌట్ అయినా ఆడియన్స్ కి బోర్ అనే ఫీలింగ్ రాకుండా ఉండేది. ఎమోషన్స్ కూడా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. చాలా సన్నివేశాలు ఫోర్స్ ఫుల్ గా పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే సినిమాని ముగించిన విధానం మాత్రం బాగానే ఉంది. కానీ ఐదు నిమిషాల ముగింపు కోసం ప్రేక్షకులు రెండు గంటల పాటు సహనంతో కూర్చోవడం కష్టమే. కాస్త ఆ ప్రేమ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాల రైటింగ్ మీద దృష్టి పెట్టినట్లయితే.. అవుట్ పుట్ మెరుగ్గానే ఉండేది.

ఈ సినిమాకి పేరున్న టెక్నిషియన్స్ పని చేసినప్పటికీ వారు కూడా సేవ్ చేయలేకపోయారు. అనూప్ రూబెన్స్ తన మ్యూజిక్ తో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనుకునేలా ఉన్నాయంతే. ఆండ్రూ సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకుంది. సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఎడిటర్ ప్రవీణ్ పూడి కనీసం ఇంకో పది నిముషాలు కోత పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
లక్ష్మణ్ పాత్రలో సోహైల్‌ ఆకట్టుకున్నాడు. తన లుక్, డ్యాన్స్ లు బాగున్నాయి. అయితే యాక్టింగ్ పరంగా కొన్ని కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాడు. ఇంకా మెరుగు పడాల్సి ఉంది. శ్రేయ పాత్రలో మోక్ష మెప్పించింది. పాత్ర స్వభావానికి తగ్గట్లు నడుచుకుంది. లక్ష్మణ్ తండ్రి పాత్రలో దేవి ప్రసాద్ తనదైన శైలిలో రాణించారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. సినిమాకి కీలకమైన ఆ పాత్రకి ఆయన న్యాయం చేశారు. సమీర్, రాజా రవీంద్ర, కాదంబరి కిరణ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'లక్కీ లక్ష్మణ్'తో హీరోగా తన లక్ పరీక్షించుకోవాలి అనుకున్న సోహైల్‌ కి లక్ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. రొటీన్ కథాకథనాలతో సాగే ఈ చిత్రం రెండు గంటల పాటు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి.. చివరిలో మాత్రం కాస్త పర్లేదు అనుకునేలా ఉంటుంది.

-గంగసాని