Read more!

English | Telugu

సినిమా పేరు:లైగ‌ర్
బ్యానర్:పూరి క‌నెక్ట్స్‌, ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌
Rating:2.00
విడుదలయిన తేది:Aug 25, 2022

సినిమా పేరు: లైగ‌ర్‌
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్యా పాండే, ర‌మ్య‌కృష్ణ‌, మైక్ టైస‌న్‌, రోణిత్ రాయ్‌, విష్‌, అలీ, చంకీ పాండే, మ‌క‌రంద్ దేశ్‌పాండే, గెట‌ప్ శ్రీ‌ను
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్: పూరి జ‌గ‌న్నాథ్‌
మ్యూజిక్: త‌నిష్క్ బాగ్చి, లిజో జార్జ్‌-డీజే చేతాస్‌, జానీ
బ్యాగ్రౌండ్ స్కోర్: సునీల్ క‌శ్య‌ప్‌
సినిమాటోగ్ర‌ఫీ: విష్ణుశ‌ర్మ‌
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి
ఆర్ట్: జానీ షేక్ బాషా
స్టంట్స్: కెచ్చా
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, హిరూ య‌శ్ జోహార్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌
బ్యాన‌ర్స్: పూరి క‌నెక్ట్స్‌, ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌
విడుద‌ల తేదీ: 25 ఆగ‌స్ట్ 2022

విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో ఎప్పుడూ చూడ‌నంత క్రేజ్‌, హైప్ వ‌చ్చిన సినిమా 'లైగ‌ర్‌'. తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో నిర్మాణ‌మై, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో డ‌బ్ అయిన ఈ మూవీని పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేశాడు. సీనియ‌ర్ హిందీ యాక్ట‌ర్ చంకీ పాండే కుమార్తె అన‌న్యా పాండే హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాని పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మితో పాటు హిందీ అగ్ర ద‌ర్శ‌క‌-నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మించాడు. లెజెండ‌రీ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కూడా న‌టించిన‌ ఈ సినిమాపై రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌య్యే కొద్దీ హైప్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ అంబ‌రాన్ని చుంబించే స్థాయిలో పెరిగిపోయాయి. అయితే రిలీజ్‌కు ముందు #BoycottLiger అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌లోకి రావ‌డం వార్త‌ల్లో నిలిచింది. దానికి ప్ర‌తిగా #ISupportLiger, #UnstoppableLiger అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను విజ‌య్ అభిమానులు ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఇలాంటి నేప‌థ్యంలో వ‌చ్చిన 'లైగ‌ర్' ఎలా ఉన్నాడ‌య్యా అంటే...

క‌థ‌
భ‌ర్త ఎంఎంఏ నేష‌న‌ల్ ఛాంపియ‌న్స్‌లో ఫైన‌ల్స్‌లో ఓడ‌డ‌ట‌మే కాకుండా, చ‌నిపోవ‌డంతో కొడుకును ఎలాగైనా ఆ స్పోర్ట్స్‌లో నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌గా చూడాల‌నుకుంటుంది బాలామ‌ణి (ర‌మ్య‌కృష్ణ‌). భ‌ర్త‌ను ల‌య‌న్‌గా, త‌న‌ను టైగ‌ర్‌గా సంబోధించుకొనే ఆమె కొడుక్కి లైగ‌ర్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) అనే పేరు పెట్టుకుంటుంది. క‌రీంన‌గ‌ర్ నుంచి ముంబైకి వ‌చ్చి చాయ్ బండి న‌డుపుకుంటూ జీవ‌నం సాగిస్తుంటారు ఆ త‌ల్లీకొడుకులు. ఓ బాక్సింగ్ ట్రైన‌ర్ (రోణిత్ రాయ్‌) ద‌గ్గ‌ర కొడుకుని చేర్పిస్తుంది బాలామ‌ణి. అక్క‌డ తానియా (అన‌న్యా పాండే) అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు లైగ‌ర్‌. ఆమె అన్న సంజూ (విష్‌) కూడా బాక్స‌రే. లైగ‌ర్‌, సంజూ ప్ర‌త్య‌ర్థులుగా మార‌తారు. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో నేష‌న‌ల్ ఛాంపియ‌న్ కావాల‌నే త‌ల్లి క‌ల‌ను లైగ‌ర్ నెర‌వేర్చాడా?  త‌ల్లి అభిప్రాయానికి విరుద్ధంగా తానియాను ప్రేమించిన లైగ‌ర్ ల‌వ్ స్టోరీ ఏ మ‌లుపు తిరిగింది? అనే విష‌యాల‌కు స‌మాధానాలు త‌ర్వాత క‌థ‌లో తెలుస్తాయి.


ఎనాలసిస్ :

ఫిల్మ్ మేకింగ్‌లో పూరి జ‌గ‌న్నాథ్ బ‌లాలేమిటో ఆయ‌న తీసిన ప‌లు సినిమాల్లో మ‌నం చూశాం. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ విష‌యాల్లో జ‌గ‌న్ ఆరితేరిన‌వాడ‌ని మ‌న‌కు తెలుసు. 'లైగ‌ర్' మూవీలో ఇవే బ‌ల‌హీనంగా క‌నిపించి ఆశ్చ‌ర్య‌పోతాం. 'సాలా క్రాస్‌బ్రీడ్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. "ఒక ల‌య‌న్‌కి, టైగ‌ర్‌కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ‌." అని బాలామ‌ణి ఒక సంద‌ర్భంలో చెప్తుంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఆధార‌ప‌డింది ఆ డైలాగ్ మీదే. బాలామ‌ణి త‌న‌ను టైగ‌ర్‌గా, భ‌ర్త బ‌ల‌రామ్‌ను ల‌య‌న్‌గా సంబోధిస్తుంది. టైగ‌ర్ శ‌క్తిమంత‌మైన‌ క్యారెక్ట‌రైజేష‌న్ మ‌నం చూస్తాం. మ‌రి ల‌య‌న్ ఎక్క‌డ‌?  ల‌య‌న్ అని బాలామ‌ణి చెప్పే బ‌ల‌రామ్‌.. సినిమాలో ఎక్క‌డా, ఎప్పుడూ ఒక్క‌సారి కూడా క‌నిపించ‌డు. ఎందుకంటే సినిమాలో అత‌ని పాత్ర కేవ‌లం బాలామ‌ణి చెప్పే మాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. లైగ‌ర్ చిన్న‌త‌నంలోనే అత‌ను బాక్సింగ్ బ‌రిలో చ‌నిపోయాడ‌నే విష‌యంలో ఆమె మాట‌ల ద్వారా మ‌న‌కు తెలుస్తుంది. ఇది హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను శ‌క్తిమంతంగా మ‌న‌ముందు ప్రెజెంట్ చేయ‌డంలో ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఆ ల‌య‌న్‌ను మ‌న‌కు ప‌రిచ‌యం చేసిన‌ట్ల‌యితే, స్క్రీన్‌ప్లే మ‌రింత గ్రిప్పింగ్‌గా, బ‌లంగా మారి వుండేది. ఈ ప్రాథ‌మిక అంశాన్ని పూరి జ‌గ‌న్నాథ్ ఎలా మిస్స‌య్యాడో అర్థం కాదు. ఇది సినిమాకు తీవ్ర న‌ష్టాన్ని చేకూర్చింది.

ఇక లైగ‌ర్‌కు న‌త్తి అనే శారీర‌క లోపాన్ని పెట్ట‌డం కూడా అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్‌కు న‌ష్టాన్ని చేకూర్చింది. సినిమాలో అత‌ను న‌త్తిగా మాట్లాడ‌బోయిన‌ప్పుడ‌ల్లా అత‌ని చుట్టూ ఉండే పాత్ర‌లు ఇబ్బంది ప‌డుతుంటాయి. చూస్తున్న మ‌న‌ది కూడా అదే స్థితి. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఈ లోపం బాగా దెబ్బ‌కొట్టింది. అది మిన‌హాయిస్తే ఒక ఫైట‌ర్‌గా అత‌డిని బాగానే చూపించాడు జ‌గ‌న్‌. ఎంఎంఏ ఛాంపియ‌న్ కావాల‌నేది హీరో ల‌క్ష్యం. త‌న‌క‌స‌లు అమ్మాయి వ‌ద్దు అని గ‌ట్టిగా చెప్తాడు కూడా. త‌ల్లి, ట్రైన‌ర్‌.. ఇద్ద‌రూ ఫోక‌స్ బాక్సింగ్ మీద పెట్ట‌మ‌ని చెప్తే, త‌లూపిన లైగ‌ర్‌.. అందుకు భిన్నంగా, అతి సునాయాసంగా తానియా ప్రేమ‌లో ప‌డిపోవ‌డం మింగుడుప‌డ‌ని విష‌యం. ఇది.. స్క్రీన్‌ప్లేలో దొర్లిన మ‌రో పెద్ద లోపం. హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్ ఘోరంగా ఉంది. మొద‌ట్నుంచీ ఆమె ప్ర‌వ‌ర్త‌న మ‌న‌కు ఏవ‌గింపు క‌లిగిస్తుంటుంది. ఆమె క్యారెక్ట‌ర్‌తో ఎవ‌రూ క‌నెక్ట్ కాలేరు. 

సినిమాకు క్లైమాక్స్ ఆయువుప‌ట్టు లాంటిది. మైక్ టైస‌న్ లాంటి లెజెండ‌రీ బాక్స‌ర్‌ను పెట్టుకొని, అత్యంత పేల‌వంగా, ఇంకా చెప్పాలంటే కామెడీగా క్లైమాక్స్‌ను తీసి తీవ్రంగా నిరుత్సాహ‌ప‌రిచాడు జ‌గ‌న్‌. మైక్ టైస‌న్‌ను ఈ సినిమాలో హీరో లైగ‌ర్ ఆరాధించే మార్క్ ఆండ‌ర్స‌న్ అనే బాక్స‌ర్‌గా చూపించారు. ఆ మార్క్ ఆండ‌ర్స‌న్ పాత్ర క‌నిపించే తీరు అత్యంత పేల‌వంగా ఉంది. సినిమాకు మ‌రో మైన‌స్ పాయింట్.. లైగ‌ర్‌కు త‌గ్గ బ‌ల‌మైన విల‌న్ లేక‌పోవ‌డం. హీరోయిన్ అన్న సంజూ పాత్ర ఉన్న‌ప్ప‌టికీ, అది మెయిన్ విల‌న్ క్యారెక్ట‌ర్ కాదు. అస‌లు సినిమాలో మెయిన్ విల‌న్ అంటూ ఎవ‌రూ లేరు. జ‌గ‌న్ సినిమాలో ఇది మ‌నం ఏమాత్రం ఊహించ‌ని అంశం. ఇక జ‌గ‌న్ అమ్ముల‌పొదిలో ఉండే మ‌రో ప్ర‌ధానాస్త్రం డైలాగ్స్‌. 'లైగ‌ర్‌'లో ఆ అస్త్రాన్ని ఆయ‌న స‌రిగా వాడ‌లేక‌పోయాడు. ఆయ‌న సినిమాల్లో డైలాగ్స్ తూటాల్లా పేలుతుంటాయ్ క‌దా.. మ‌రి ఈ సినిమాలో ఏంటి.. చాలా చోట్ల అసంద‌ర్భ ప్రేలాప‌న‌ల్లా క‌నిపిస్తుంటాయ్‌! అస‌లు ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది జ‌గ‌నేనా? అనే సందేహం క‌లిగితే.. అది మ‌న త‌ప్పు కాదు.

పూరి జ‌గ‌న్నాథ్ టేకింగ్ వేరే లెవ‌ల్‌లో ఉంటుంద‌ని ఆశించిన వాళ్ల‌ను ఒక్క‌దెబ్బతో ఆయ‌న‌ నీరుకార్చేశాడు. ఒక క‌సితో ఈ సినిమాని ఆయ‌న రూపొందించి ఉంటాడ‌ని భావించిన‌వాళ్ల‌ను ఆయ‌న తీవ్రంగా నిరుత్సాహ‌ప‌రిచాడు. త‌ల్లీకొడుకుల మ‌ధ్య బంధాన్ని ఆయ‌న చూపించిన విధానం బాగానే ఉన్నా, మిగ‌తా అంశాల్లో ఆయ‌న ఫెయిలైపోయాడు. 

సినిమాకి సంబంధించిన మైన‌స్ పాయింట్స్ అంత‌టితో ఆగ‌లేదు. త‌నిష్క్ బాగ్చి, జానీ, లిజో జార్జ్‌-డీజే చేతాస్ మ్యూజిక్ స‌మ‌కూర్చిన పాట‌ల్లో "అకిడి ప‌కిడి.." అనే పాట‌ మాత్ర‌మే వింటానికీ, చూడ్డానికీ బాగుంది. మిగ‌తావేవీ అల‌రించ‌లేదు. ఇక‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అవ‌కాశాన్ని పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌కు ఇవ్వ‌డంతో, ఇంత దాకా ఈ స్థాయి సినిమాకు ప‌నిచేయ‌ని సునీల్ క‌శ్య‌ప్‌.. త‌న‌కు అంది వ‌చ్చిన ఛాన్స్‌ను ఎలా అందిపుచ్చుకోవాలో తెలీద‌న్న‌ట్లు రీరికార్డంగ్ ఇచ్చాడు. మ్యూజిక్ కార‌ణంగా ఫ‌లానా సీన్ ఎలివేట్ అయ్యింది.. అని మ‌నం మెచ్చుకొనే అవ‌కాశాన్ని అత‌నివ్వ‌లేదు. జునైద్ సిద్దిఖి ఎడిటింగ్ సినిమాకు ఎలాంటి మేలూ చేకూర్చ‌లేదు. స్క్రీన్‌ప్లే ఎంత లోప‌భూయిష్టంగా ఉందో, ఎడిటింగ్ కూడా దానికి త‌గ్గ‌ట్లే వీక్‌గా ఉంది. ఈ యాక్ష‌న్ డ్రామాకు అత్యంత కీల‌క‌మైనవి స్టంట్స్‌. సినిమాకు సంబంధించిన అతికొద్ది బ‌లాల్లో బ్యాంకాక్‌కు చెందిన కెచ్చా డిజైన్ చేసిన ఫైట్స్ ముఖ్య‌మైన‌వి. అవి హీరో క్యారెక్ట‌ర్‌ కొంత‌మేర‌ ఎలివేట్ కావ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయి. విష్ణుశ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ కూడా టాప్ క్లాస్‌గా ఉంది. ప‌లు సంద‌ర్భాల్లో కెమెరా ప‌నిత‌నం స్ప‌ష్టంగా క‌నిపించింది.

న‌టీన‌టుల ప‌నితీరు

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించిన లైగ‌ర్‌, అత‌డిలోని ఫైట‌ర్‌ను కూడా వెలికితీసింది. అత‌ను ఫైట్లు చేసిన విధానం సూప‌ర్బ్‌. ఇంత‌దాకా మ‌నం చూసిన విజ‌య్ వేరు, లైగ‌ర్‌గా క‌నిపించిన విజ‌య్ వేరు. ఆ పాత్ర‌లో చాలా ఇష్టంగా ఒదిగిపోయాడు విజ‌య్‌. బాక్సింగ్ బ‌రిలో లైగ‌ర్‌గా గ‌ర్జించి ఆక‌ట్టుకున్న అత‌ను.. ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ ఆక‌ట్టుకున్నాడు. ఎటొచ్చీ ఒక మేన‌రిజంగా పెట్టిన న‌త్తి న‌త్తిగా మాట్లాడేట‌ప్పుడు మాత్రం అత‌ను ఇబ్బంది పెట్టాడు. పూరి జ‌గ‌న్నాథ్ తీర్చిదిద్దిన ఈ లైగ‌ర్‌ను మ‌నం పూర్తిగా ప్రేమించ‌కుండా ఆ క్యారెక్ట‌రైజేష‌న్ అడ్డుప‌డింది. ఆ లైగ‌ర్‌ను క‌న్నత‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న గురించి ఏం చెప్పాలి! ఇప్ప‌టికే ఎన్నో ఫెరోషియ‌స్ క్యారెక్ట‌ర్ల‌తో రంజింప‌జేసిన ఆమె, మ‌రోసారి అదే త‌ర‌హా పాత్ర‌లో జీవించేసింది. హీరోయిన్‌గా అన‌న్యా పాండే గ్లామ‌ర్‌ను బాగానే ఒలికించింది కానీ, ఆమె పాత్ర తీరువ‌ల్ల ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. విజ‌య్‌తో ఆమె కెమిస్ట్రీ కూడా పండ‌లేదు. మైక్ టైస‌న్ క్యారెక్ట‌ర్ మ‌న‌ల్ని ఆక‌ట్టుకోదు. సంజూగా విష్ ఓకే. త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. బాక్సింగ్ ట్రైన‌ర్‌గా రోణిత్ రాయ్ మంచి న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడు. హీరోయిన్ తండ్రిగా ఆమె నిజ జీవిత తండ్రి చంకీ పాండే క‌నిపించాడు. అలీ, గెట‌ప్ శ్రీ‌ను త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పూరి జ‌గ‌న్నాథ్ తీర్చిదిద్దిన 'లైగ‌ర్‌'ను ఇన్‌స్టంట్‌గానే కాదు, నెమ్మ‌దిగా కూడా లైక్ చేయ‌లేం. విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంత బాగా చేసినా లైగ‌ర్ క్యారెక్ట‌రైజేష‌న్‌లోని లోపాలు, అస‌లు అత‌ని తండ్రి పాత్ర‌ను చూపించ‌క‌పోవ‌డం సినిమాకు తీవ్ర న‌ష్టాన్ని చేకూర్చాయి. ఇది మ‌నం ఊహించిన‌ పైసా వ‌సూల్ సినిమా కాదు. విడుద‌ల‌కు ముందు విజ‌య్ క్రేజ్‌ను, మార్కెట్ వాల్యూను ఎన్నో రెట్లు పెంచుతుంద‌ని న‌మ్మ‌కం క‌లిగించి, తీరా విడుద‌ల‌య్యాక తుస్సుమ‌నిపించిన సినిమా.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి