Read more!

English | Telugu

సినిమా పేరు:లంబసింగి
బ్యానర్:కాన్సెప్ట్ ఫిలింస్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 15, 2024

సినిమా పేరు: లంబసింగి
తారాగణం: భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు.
డీఓపీ: కె.బుజ్జి
సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్
ఎడిటర్: కె.విజయ్ వర్ధన్
రచన, దర్శకత్వం: నవీన్ గాంధీ
సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత: ఆనంద్.టి
బ్యానర్: కాన్సెప్ట్ ఫిలింస్
విడుదల తేదీ: మార్చి 15, 2024

బిగ్ బాస్ ఫేమ్ దివి హీరోయిన్ గా నటించిన సినిమా 'లంబసింగి'. భరత్ రాజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సమర్పకులు కావడం విశేషం. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:
వీరబాబు(భరత్ రాజ్)కి పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం రావడంతో పోస్టింగ్ మీద లంబసింగికి వస్తాడు. అక్కడకు రాగానే నర్స్ గా పనిచేసే హరిత(దివి)ని మార్కెట్ లో చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే లంబసింగి ప్రాంతంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడి ఎస్పీ ప్రోద్భలంతో పలువురు నక్సలైట్లు లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొస్తారు. అలా లొంగిపోయిన నక్సలైట్లు ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది. వారిలో హరిత తండ్రి కోనప్ప కూడా ఉంటాడు. అయితే కోనప్ప కాలికి గాయం కావడంతో.. అతని దగ్గరకు వెళ్లి సంతకం తీసుకునే బాధ్యత వీరబాబుపై పడుతుంది. సంతకం కోసం రోజూ కోనప్ప ఇంటికి వెళ్తూ, అతని కూతురు హరితకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు వీరబాబు. కానీ హరిత మాత్రం వీరబాబు ప్రేమను అంగీకరించదు. అయితే ఓసారి ఒక పేషెంట్ ని రక్షించడంలో వీరబాబు సాయం చేయడంతో.. అతని పట్ల హరితకు సదాభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ పేషెంట్ స్థానిక ఎమ్మెల్యే కారణంగా చనిపోతాడు. దీంతో నక్సల్స్ ఎమ్మెల్యేని దారుణంగా హత్య చేస్తారు. ఆ ఘటన మరువక ముందే పోలీస్ స్టేషన్ లో నైట్ డ్యూటీలో ఉన్న వీరబాబుపై నక్సల్స్ దాడి చేసి ఆయుధాలు తీసుకెళ్ళిపోతారు. ఈ క్రమంలో హరిత గురించి వీరబాబుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. హరిత బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె వీరబాబు ప్రేమకి ఎందుకు నో చెప్పింది? హరిత కారణంగా వీరబాబు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఎమ్మెల్యే హత్య వెనుక వ్యక్తి ఎవరు? చివరికి వీరబాబు-హరిత ఒక్కటయ్యారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

తెలుగులో నక్సల్స్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నక్సల్స్ నేపథ్యాన్ని, ప్రేమ కథని ముడిపెడుతూ కూడా పలు సినిమాలు వచ్చాయి. 'లంబసింగి' కూడా నక్సల్స్ నేపథ్యంలో సాగే ప్రేమ కథనే. ఈమధ్య నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తగ్గిపోయాయి. ఒకట్రెండు వచ్చినా ఈ జనరేషన్ ప్రేక్షకులు ఆదరించడంలేదు. అందుకేనేమో 'లంబసింగి' విషయంలో దర్శకుడు కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా చూసుకున్నాడు.

ఫస్టాఫ్ హీరో-హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగుతుంది. హీరోయిన్ వెంట హీరో పడే సన్నివేశాలు అక్కడక్కడా నెమ్మదిగా సాగినట్లు అనిపించినా.. లంబసింగి అందాలు ఆ ఫీలింగ్ ని మర్చిపోయేలా చేస్తాయి. ఎమ్మెల్యే హత్య తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకే హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. అప్పటివరకు సరదాగా సాగిన సినిమా.. ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. సెకండాఫ్ మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటుంది. అయినప్పటికీ హీరో, హీరోయిన్ ల లవ్ ట్రాక్ మెప్పిస్తుంది. యాక్షన్, ఎమోషన్స్ ని సమపాళ్లలో జోడించి ప్రేమ కథని నడిపిన తీరు బాగుంది. అయితే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కి ఎంతో స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు దానిని పూర్తిగా వాడుకోలేకపోయాడు. ఇక ఊహించని ట్విస్ట్ తో ఎమోషనల్ గా సినిమాని ముగించిన తీరు ఆకట్టుకుంది.

కె.బుజ్జి కెమెరా పనితనం బాగుంది. ఆర్ఆర్.ధ్రువన్ సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పాటలతో, నేపథ్యంతో మ్యాజిక్ చేశాడు. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
పోలీస్ కానిస్టేబుల్ వీరబాబు పాత్రలో భరత్ రాజ్ చక్కగా రాణించాడు. అతనికి నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇక హరిత పాత్రలో దివి చక్కగా ఒదిగిపోయింది. ఆ పాత్రలో ఉన్న వేరియేషన్ ని చక్కగా ప్రదర్శించింది. వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరకెక్కిన 'లంబసింగి' బాగానే ఉంది. కొన్ని డ్రా బ్యాక్స్ ఉన్నప్పటికీ.. ట్విస్ట్ లు, లవ్, ఎమోషనల్ సన్నివేశాల కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.