Read more!

English | Telugu

సినిమా పేరు:కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ
బ్యానర్:రామ లక్ష్మి క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jun 19, 2015

ప్రేమ క‌థ‌లు కొత్త‌గా ఉండ‌క్క‌ర్లెద్దు. ఎందుకంటే ప్రేమ మ‌న‌కెప్పుడూ కొత్త‌గానే క‌నిపిస్తుంది. ప్రేమ‌పై మ‌న‌కంత ప్రేమ‌! ప్రేమ‌లోని భావోద్వేగాల్ని, సున్నిత‌మైన సంగ‌తుల్నీ, తొలి వ‌ల‌పు ప‌రిమ‌ణాల్నీ, ఎడ‌బాటులోని క‌న్నీళ్ల‌నీ చ‌క్క‌గా క్యారీ చేయ‌గ‌లిగితే చాలు.. ల‌వ్ స్టోరీ ఎప్పుడైనా హిట్ట‌యిపోతుంది. అయితే ఈమ‌ధ్య కాలంలో అంత డెప్త్ ఉన్న క‌థ‌లు తెలుగులో రావ‌ట్లేదు. అందుకే ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ కూడా ప‌ర‌భాషా 'చార్మినార్‌'ని వెతుక్కొని కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ పేరుతో ఇక్క‌డ రీమేక్ చేయాల్సొచ్చింది. 'చార్మినార్‌' సూప‌ర్ హిట్ మూవీ. అందులో థీమ్ చెడిపోకుండా.. చార్మినార్ ద‌ర్శ‌కుడు చంద్రూకే రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ‌రి చంద్రూ ఆ క‌థ‌ని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు ఆవిష్క‌రించాడా, లేదా.?? ఈ కృష్ణ‌మ్మ తెలుగు తెర‌పై ఎలా ప‌ర‌వ‌ళ్లు తొక్కింది?? తెలుసుకొందాం రండి.

కథ:

కృష్ణాపురం అనే అంద‌మైన ప‌ల్లెటూరు. అక్క‌డ కృష్ణ (సుధీర్‌బాబు) ది దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. స్కూలు చ‌దవే రోజుల్లో రాధ (నందిత‌)ని ప్రేమిస్తాడు. ప్రేమంటే తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో పుట్టిన ప్రేమ వ‌య‌సుతో పాటు పెరిగి మ‌హా వృక్ష‌మ‌వుతుంది. స్కూలు ముగిశాక ఇద్ద‌రూ ఒకే కాలేజీలో చేర‌తాడు. ఆ స‌మ‌యంలో రాధ‌పై కృష్ణ‌కు ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది. కాక‌పోతే.. త‌న‌దెప్పుడూ వ‌న్ సైడ్ ల‌వ్వే. ప్రేమ‌పై రాధ‌కు స‌రైన అభిప్రాయం ఉండ‌దు. ఇంజ‌నీరింగ్ చ‌దువు కోసం... కృష్ణ హైద‌రాబాద్ వెళ్లిపోతాడు. అలా... రాధకు దూర‌మ‌వుతాడు కృష్ణ‌.  అత‌ని ఇంట్లో ప‌రిస్థితులు, త‌న బాధ్య‌త‌లు, ల‌క్ష్యం ఇవ‌న్నీ ప్రేమ‌కు అడ్డుప‌డుతూనే ఉంటాయి. ఇవ‌న్నీ కృష్ణ ఎలా ఎదుర్కొన్నాడు?  విధిని సైతం ఎదిరించి త‌న ప్రేమ‌ని ఎలా ద‌క్కించుకొన్నాడు?  వీళ్లిద్ద‌రినీ క‌ల‌ప‌డంలో కృష్ణ‌మ్మ పాత్ర ఎంత‌?  అనేవి తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్ :

ముందే చెప్పిన‌ట్టు ప్రేమ‌క‌థ‌లో కొత్త‌ద‌నం అవ‌స‌రం లేదు. ఆ భావాల్ని మ‌న‌సుకు హ‌త్తుకొనేలా ఆవిష్క‌రిస్తే చాలు. థియేట‌ర్లో కూర్చున్న ప్రేక్ష‌కుడు ఇది మ‌న క‌థే క‌దా.. అనుకొంటే చాలు. ఆ సినిమా స‌క్సెస్ అయిన‌ట్టే. ఈ క‌థ‌లోనూ అలాంటి పాయింట్లు ఉన్నాయి. వాటిని ద‌ర్శ‌కుడు కూడా కాస్త బాగానే క్యారీ చేశాడు. మూడు ద‌శ‌ల్లో ఓ అబ్బాయి, ఓ అమ్మాయిపై పెంచుకొన్న ప్రేమ‌.. ఈ చిత్రానికి నాంది, ఆయువు. స్కూలు పిల్లాడు, కాలేజీ కుర్రాడు, ఓ బాధ్య‌త తెలిసి అబ్బాయి.. ఈ మూడు ద‌శ‌ల్లో ఓ అమ్మాయిని కృష్ణ ఎంత ఘాఢంగా ప్రేమించాడు, త‌న ప్రేమ‌ని కాపాడుకోవ‌డం కోసం ఏం చేశాడు.? అనే పాయింటే క‌థ‌ని న‌డిపించింది. ఈ మూడు ద‌శ‌ల్లోనూ ప్రేక్ష‌కుడు ఎక్క‌డో ఓ చోట క‌నెక్ట్ అవుతాడు. దాంతో... సినిమాలో లీన‌మ‌య్యే ఛాన్సుంది. ప్రేమ క‌థ అన‌గానే వెకిలి చేష్ట‌లూ, హ‌ద్దుదాటిన మాట‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అయితే ఈ క‌థ‌లో వాటికి ర‌వ్వంత ఆస్కారం కూడా ఇవ్వ‌కుండా సినిమా క‌థ‌ని `స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌` చుట్టూనే తిప్ప‌డానికి చంద్రు చేసిన ప్ర‌య‌త్నాన్ని అభినందించాల్సిందే.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అయితే ఇది ఈనాటి క‌థ కాదు. ఓ ఇర‌వై ఏళ్ల క్రింద‌ట ప్రేమ క‌థ‌లు ఎలా ఉండేదో.. ఈ సినిమా అలా ఉంది. ఇప్పుడంతా వాట్స‌ప్ ప్రేమ‌లు, ఫేస్ బుక్ ఛాటింగుల బ్యాచే! మ‌రి ఈ యంగ్ త‌రంగ్‌కి ఆనాటి క‌ల్మ‌షం లేని ప్రేమ‌గాధ‌లు ఎక్కుతాయా? లేదంటే సిల్లీగా అనిపిస్తాయా? అనేదే పెద్ద ప్ర‌శ్న‌. సినిమా ఆద్యంతం హుషారుగా ఏం సాగిపోదు. చాలా స్లో నేరేష‌న్‌తో అలా అలా ముందుకెళ్తుంది. అన‌వ‌స‌ర‌మైన సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి. దానికి తోడు పాట‌లు సినిమా వేగానికి స్పీడు బ్రేక‌ర్లు వేస్తుంటాయి. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ 40 కి.మీ స్పీడులో వెళ్లిన సినిమా.. ఆత‌ర‌వాత మ‌రో ప‌ది కి.మీ వేగం త‌గ్గించుకొంది. అయితే సినిమా ముగియ‌డానికి ఇంకో అర‌గంట ఉండ‌గా.. ఎమోష‌న్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. దాంతో.. అప్ప‌టి వ‌ర‌కూ కాస్త బోరింగ్ గా అనిపించినా, చివ‌రికి హార్ట్ ట‌చింగ్ ఎండింగ్ ఇవ్వ‌డంతో ప్రేక్ష‌కుడు కాస్త సంతృప్తి చెందే అవ‌కాశంఉంది.

సుధీర్ బాబు న‌టన ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని చెప్పాలి. సుధీర్‌లోని పూర్తిస్థాయి పెర్‌ఫార్మర్ ఈ సినిమాతో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మూడు ద‌శ‌ల్లో రూపు రేఖ‌ల్ని బాగా మార్చుకోగ‌లిగాడు. న‌ట‌న ప‌రంగానూ సుధీర్ మార్పు చూపించాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక నందిత గురించి చెప్ప‌క్క‌ర్లెద్దు. తానూ చాలా డీసెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకెళ్లిపోయింది. పోసాని కృష్ణ ముర‌ళి పాత్ర, అత‌ను ప‌లికే సంభాష‌న‌లు ఆక‌ట్టుకొంటాయి. న‌టీన‌టుల ప‌రంగా ఎవ్వ‌రూ త‌క్కువ చేయ‌లేదు. ఎవ‌రి పాత్ర వారు స‌మ‌ర్థంగా పోషించారు. సాంకేతికంగా హ‌రి అందించిన బాణీలు బాగున్నాయి. ట్యూన్లు క్యాచీగా ఉన్నాయి. అయితే పాట‌లు ఎక్క‌వ‌వ్వ‌డంతో.. కాస్త బోర్ కొడుతుంది. ఖ‌దీర్ బాబు క‌లం బాగానే ప‌రుగులు పెట్టింది. లెంగ్తీ డైలాగులు రాశారాయ‌న‌. కొన్ని చోట్ల ఎమోష‌న్ కోసం కావాల‌నే డైలాగ్ ఇరికించిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

మొత్తానికి ఇదో పీల్ గుడ్ ల‌వ్ స్టోరీ. గంట‌ల‌కు 40 కిలో మీట‌ర్ల వేగంతో సాగే ఆహ్లోద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ‌. సినిమా స్లో గా ఉన్న ఫ‌ర్వాలేదు. ఫీల్ ఉంటే చాలు అనుకొంటే కృష్ణ‌మ్మ మీకు ఆహ్లోదాన్ని అందిస్తుంది. గంట‌కు వంద కి.మీ వేగంతో సాగిపోయే సినిమా కావాలంటే.. ఈ థియేట‌ర్‌కి వంద అడుగుల దూరంలో నిలిచిపోండి.