Read more!

English | Telugu

సినిమా పేరు:కోట బొమ్మాళి పీఎస్‌
బ్యానర్:GA2 పిక్చర్స్
Rating:2.75
విడుదలయిన తేది:Nov 24, 2023

నటీనటులు : శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, మురళీశర్మ, ప్రవీణ్‌, బెనర్జీ తదితరులు
సంగీతం : రంజిన్‌ రాజ్‌, మిథున్‌ ముకుందన్‌
డిటింగ్‌ : కార్తీక శ్రీనివాస్‌
కథ : షాహి కబీర్‌
మాటలు : నాగేంద్ర కాశీ
సినిమాటోగ్రఫీ : జగదీష్‌ చీకటి
నిర్మాతలు : బన్ని వాస్‌, విద్య కొప్పినీడి    
బ్యానర్‌ : జిఎ 2 పిక్చర్స్‌
దర్శకత్వం : తేజ మార్ని
విడుదల తేదీ: 24.11.2023
సినిమా నిడివి: 138 నిమిషాలు

ఒక డిఫరెంట్‌ టైటిల్‌తో రూపొందిన ‘కోట బొమ్మాళి పిఎస్‌’ సినిమాపై మొదటి నుంచి మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. బొమ్మాళి అనే పేరు వినగానే ఇదొక హారర్‌ సినిమానా అనే ఫీల్‌ కలుగుతుంది. చాలా కాలం తర్వాత శ్రీకాంత్‌ ఒక విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌తో కూడిన పాత్ర చేశాడు. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘నాయట్టు’ చిత్రానికి ఇది రీమేక్‌. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్‌ను ఎంతవరకు సక్సెస్‌ఫుల్‌గా తియ్యగలిగారు? సినిమాలోని ఏయే అంశాలు ఆడియన్స్‌ని థ్రిల్‌ చేశాయి? హీరో శ్రీకాంత్‌కి ఈ సినిమా ఎలాంటి పేరు తెచ్చింది? క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఏమేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఈ సినిమా టైటిల్‌ ‘కోట బొమ్మాళి పిఎస్‌’. ఈ టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా మొత్తం పోలీసుల చుట్టూనే తిరుగుతుంది. కోట బొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ పోలీస్‌ ఆఫీసర్‌ రామకృష్ణ(శ్రీకాంత్‌), అదే స్టేషన్‌లో కొత్తగా కానిస్టేబుల్‌గా చేరిన ఓ పోలీస్‌ కుమారుడు రవి(రాహుల్‌ విజయ్‌), అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కుమారి(శివాని రాజశేఖర్‌). ఓ 12 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో నలుగురు నిందితుల్ని అడవిలోకి తీసుకెళ్ళి ఎన్‌కౌంటర్‌ చేస్తారు. ఆ ఆపరేషన్‌కి హెడ్‌ రజియా అలీ(వరలక్ష్మీ శరత్‌కుమార్‌). ఆ టీమ్‌లో రామకృష్ణ కూడా ఉంటాడు. ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేస్తారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలవుతుంది. అధికార పార్టీని గెలిపించి మళ్ళీ అధికారంలోకి తీసుకు రావాలని హోం మినిస్టర్‌(మురళీశర్మ) అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒక సామాజిక వర్గం ఓట్లు తమకు పడితేనే మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని హోం మంత్రిని సి.ఎం. ఎలర్ట్‌ చేస్తుంటాడు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన మున్నా అనే వ్యక్తితో రామకృష్ణ, రవి పోలీస్‌ స్టేషన్‌లోనే గొడవ పడతారు. ఇది జరిగిన తర్వాత ఓ రోజు పోలీస్‌ వ్యాన్‌లో రామకృష్ణ, రవి, కుమారి ఇంటికి వెళుతుండగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా పోలీస్‌ వ్యాన్‌కి డాష్‌ ఇచ్చి పడిపోతాడు. ఆ సమయంలో వ్యాన్‌ను రామకృష్ణ మేనల్లుడు రాహుల్‌ డ్రైవ్‌ చేస్తుంటాడు. ఈ ఘటన జరిగిన వెంటనే రాహుల్‌ అక్కడి నుంచి పారిపోతాడు. యాక్సిడెంట్‌కి గురైన వ్యక్తిని ముగ్గురూ హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. కానీ, అప్పటికే అతను చనిపోతాడు. అయితే ఆ చనిపోయిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన మున్నా అనుచరుడు. మద్యం సేవించి పోలీసులు కారు నడిపి ఓ వ్యక్తిని చంపారనే వార్త గుప్పుమంటుంది. ఏ సామాజిక వర్గం ఓట్లయితే అధికార పార్టీకి అవసరమో ఆ వర్గానికి చెందిన వ్యక్తి మృతికి పోలీసులు కారణం కావడంతో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే ముగ్గురూ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి సి.ఐ.కి విషయం చెబుతారు. ఆ ముగ్గురినీ పోలీస్‌ స్టేషన్‌లో చంపేందుకు పథకం వేస్తారు కొందరు. ఇది గ్రహించిన రామకృష్ణ మిగతా ఇద్దరు పోలీసులతో కలిసి తప్పించుకుంటాడు. దీంతో హోం మినిస్టర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ముగ్గురు పోలీసులను పట్టుకోలేకపోతే ఓటు బ్యాంకు చీలిపోతుంది. ఖచ్ఛితంగా అధికార పార్టీ ఓడిపోతుంది. ఈ విషయంలో పట్టుదలగా ఉన్న హోం మినిస్టర్‌ 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని మీడియా ముందు ప్రతిజ్ఞ చేస్తాడు. ఎన్నో ఎన్‌కౌంటర్లు, మరెన్నో కీలకమైన ఆపరేషన్స్‌లో పాల్గొన్న రామకృష్ణను పట్టుకోవడం అంత ఈజీ కాదని డిజిపి.. హోం మినిస్టర్‌కి స్పష్టం చేస్తాడు. అప్పుడు రామకృష్ణ టీమ్‌ను పట్టుకునే బాధ్యతను పోలీస్‌ ఆఫీసర్‌ రజియా అలీకి అప్పగిస్తారు. ఇక అప్పటి నుంచి అసలైన వేట మొదలవుతుంది. రామకృష్ణను పట్టుకునేందుకు అలీ ఎలాంటి ప్లాన్స్‌ వేసింది? దానికి ధీటుగా ఆలోచించే రామకృష్ణ ఆమెకు దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు? యాక్సిడెంట్‌లో వ్యక్తి చనిపోవడానికి కారణం ఆ ముగ్గురు పోలీసులు కాదు. మరి ఆ విషయాన్ని ప్రూవ్‌ చేశారా? హోం మినిస్టర్‌ ప్రతిజ్ఞ చేసినట్టు 24 గంటల్లో నిందితుల్ని అరెస్ట్‌ చేశారా? ఈ కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 


ఎనాలసిస్ :

తెలంగాణలోనూ ఎలక్షన్స్‌ సందడి మొదలైన నేపథ్యంలో అలాంటి కథావస్తువుతోనే రూపొందిన ఈ సినిమాను ఎన్నికలకు వారం రోజుల ముందు రిలీజ్‌ చెయ్యడం వల్ల ఈ సినిమా కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలక్షన్స్‌ టైమ్‌లో తమ స్వార్థం కోసం పోలీసులను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు అనేది అందరికీ అర్థమయ్యేలా చూపించారు. రాజకీయ నాయకుల వల్ల పోలీసులు ఎలా చులకన అవుతున్నారు. సమాజంలో వారికి ఎలాంటి అపకీర్తి వస్తుంది అనేది స్పష్టమైన డైలాగులతో అందరికీ తెలిసేలా చెప్పారు. సినిమా ప్రారంభం నుంచి ఎలాంటి అనవసరమైన సన్నివేశాలకు తావు ఇవ్వకుండా ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది, తప్పించుకున్న పోలీసులు అలీ టీమ్‌కి దొరుకుతారా? దొరక్కపోతే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది? అధికార పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనే అంశాల పట్ల ఎంతో క్యూరియాసిటీ కలిగించారు. ప్రతి సీన్‌ని ఎంతో ఆసక్తికరంగా మలచిన దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. రాజకీయం, పోలీసులు అనే అంశాలనే కాకుండా ఫ్యామిలీ, సెంటిమెంట్‌, తండ్రీ కూతుళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్‌ వంటి సెన్సిటివ్‌ ఎలిమెంట్స్‌ని కూడా బాగా డీల్‌ చేశారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ దశలోనూ ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవ్వరు. నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీతోనే సినిమాను చూస్తారు. అన్నింటినీ మించి క్లైమాక్స్‌ ఎంతో హార్ట్‌ టచ్చింగ్‌గా అనిపిస్తుంది. అందులో చూపించిన అంశాలు నిజజీవితంలో కూడా జరుగుతున్నాయి కదా అనే భావన కలిగిస్తుంది.

నటీనటులు :

20 సంవత్సరాలుగా ఎన్నో మంచి సినిమాల్లో నటించిన శ్రీకాంత్‌కి ఇది చాలా రేర్‌ సినిమా అనే చెప్పాలి. ఫ్యామిలీ హీరోగా అప్పట్లో ఒక వెలుగు వెలిగిన శ్రీకాంత్‌ ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు అతని కెరీర్‌లో చేసిన ఎన్నో క్యారెక్టర్ల కంటే ఈ సినిమాలో చేసిన రామకృష్ణ క్యారెక్టర్‌ అందరికీ బాగా గుర్తుండిపోతుంది. ఆ క్యారెక్టర్‌కి శ్రీకాంత్‌ జీవం పోశాడనే చెప్పాలి. ముఖ్యంగా కూతురి విషయంలో అతనికి ఎలాంటి ప్రేమ ఉంది అనే విషయాలను చెప్పే సన్నివేశాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. రవి పాత్రను పోషించిన రాహుల్‌ విజయ్‌ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. కుమారిగా  నటించిన శివాని కూడా ఫర్వాలేదు అనిపించింది. ఆమె క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ లేనప్పటికీ ఆమె పరిధి మేరకు ఓకే అనిపించింది. రజియా అలీ పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఎంతో డిగ్నిఫైడ్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఎక్స్‌లెంట్‌గా ఉంది. రఫ్‌గా కనిపించే ఓ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌కి ఆమె నూటికి నూరు శాతం న్యాయం చేసింది. హోం మినిస్టర్‌గా నటించిన మురళీశర్మ కూడా తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పోలీసులు వారి చేతిలో ఎలా కీలుబొమ్మలుగా మారతారు అనే విషయాల గురించి చెప్పే సీన్లు అద్భుతంగా రావడానికి అతని పెర్‌ఫార్మెన్స్‌ ఎంతగానో ఉపయోగపడిరది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :

సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌గా చెప్పుకోదగింది బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌. రంజిన్‌ రాజ్‌ అందించిన మ్యూజిక్‌ సినిమాకి చాలా ప్లస్‌ అయింది. సీన్‌లోని ఎమోషన్స్‌, టెన్షన్స్‌ను క్యారీ చేయడంలో ఎంతగానో ఉపయోగపడిరది. మిథున్‌ ముకుందన్‌ కంపోజ్‌ చేసిన ‘లింగి లింగి లింగిడి’ పాట ఆడియన్స్‌లో కొంత ఉత్సాహాన్ని నింపింది. జగదీష్‌ చీకటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని నైట్‌ సీన్స్‌ని కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు జగదీష్‌. ఇక కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిడివి ఎక్కువ కాకుండా 2 గంటల 18 నిమిషాల్లో సినిమాని పూర్తి చేయడంతో ఆడియన్స్‌ ఎంతో రిలీఫ్‌ ఫీల్‌ అవుతారు. ముఖ్యంగా మాటల రచయిత నాగేంద్ర కాశీ గురించి చెప్పుకోవాలి. సినిమాలోని ఎన్నో డైలాగ్స్‌ ఎంతో అర్థవంతంగా ఉండడమే కాకుండా సామాజిక స్పృహతో కూడుకొని ఉన్నాయి. అందర్నీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఓటు విలువ గురించి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి అతను రాసిన డైలాగ్స్‌కి కొన్నిచోట్ల చప్పట్లు మోగాయి. జిఎ 2 పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ కూడా బాగున్నాయి. సినిమాకి అవసరమైన కొన్ని లొకేషన్స్‌ను ఎంతో కేర్‌ తీసుకొని సెలెక్ట్‌ చేసుకొని అక్కడ షూటింగ్‌ చేయడం సినిమాకి బాగా ప్లస్‌ అయింది. ఇక దర్శకుడు తేజ మార్ని గురించి చెప్పాలంటే.. ఇది రీమేక్‌ సినిమా అయినప్పటికీ కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా నడిపించడంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. అలాగే ఆర్టిస్టుల నుంచి చక్కని పెర్‌పార్మెన్స్‌ రాబట్టుకోవడంలో తన టాలెంట్‌ను చూపించాడు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మలయాళంలో రెండేళ్ళ క్రితం విడుదలై సూపర్‌హిట్‌ అయిన ‘నాయట్టు’ చిత్రాన్ని రీమేక్‌ చెయ్యాలనుకోవడంలోనే కొంత సాహసం కనిపిస్తుంది. ఎందుకంటే ఒరిజినల్‌ కథను యధాతథంగా నడిపించడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు ఎక్కడా తప్పు చేయకుండా అదే ఫీల్‌ను తీసుకొచ్చాడు. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం చేసే సందర్భాల్లో సినిమా కాస్త స్లో అనిపించినా అది సినిమాకి ఏమాత్రం మైనస్‌ అవ్వదు. ఎక్కడా బోర్‌ ఫీలవకుండా కథను ముందుకు నడిపించిన తీరు అభినందనీయం. ఈమధ్యకాలంలో ఈ తరహా సినిమా రాలేదనే చెప్పాలి. సెకండాఫ్‌ చూస్తున్నంత సేపు మనకు వెంకటేష్‌ చేసిన ‘దృశ్యం’ సినిమా గుర్తొస్తుంది. తన ఫ్యామిలీని పోలీసుల నుంచి రక్షించుకునేందుకు ఆ సినిమాలో హీరో  వేసే ఎత్తుగడలను పోలి వుంటూ ఈ సినిమా కూడా నడుస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ‘కోట బొమ్మాళి పిఎస్‌’ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది.

-  జి.హరా