Read more!

English | Telugu

సినిమా పేరు: కింగ్
బ్యానర్: కామాక్షి కాళా మూవీస్
Rating:2.75
విడుదలయిన తేది:Dec 25, 2008
ఇదొక విభిన్నమైన కథ. ఒక విధంగా చెప్పాలంటే "ఢీ" చిత్రాన్ని "చంద్రముఖి" చిత్రాన్ని కలిపి, ఆ చిత్రంలో నాగార్జున త్రిబుల్‌ యాక్షన్‌ చేయగా సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా వుంటుంది. ఇక కథ విషయానికొస్తే కోయంబత్తూర్‌ రాజా రవి చందర్‌ వర్మకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు కింగ్‌ (నాగార్జున). అతన్ని వ్యాపారంలో దెబ్బతీయలేని భగత్‌ అనే వ్యాపారి, కింగ్‌ని చంపటానికి ప్లాన్‌ చేస్తాడు. అతనితో పాటు కింగ్‌ని చంపటానికి అతని అత్తయ్యల భర్తలు (జయప్రకాష్‌ రెడ్డి, కృష్ణభగవాన్‌, షామాజీ షిండే) కూడా తమ ప్రయత్నాలు చేస్తుంటారు. కింగ్‌ దగ్గర మేనేజర్‌గా పనిచేసిన సూర్య అనే అతను తన మీద పడిన నిందకు బాధపడి ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో అతని కూతురు (మమతామోహన్‌దాస్‌) కింగ్‌ని చంపటానికి భగత్‌తో చేతులు కలిపి కింగ్‌ని చంపేస్తుంది. ఇదిలా వుంటే హైదరాబాద్‌లో జ్ఞానేశ్వర్‌ అనే గూండాకి పోటీగా బొట్టు శీను అనే గూండా పుట్టుకొస్తాడు. జ్ఞానేశ్వర్‌ చెల్లి (త్రిష)ని చూసిన బొట్టు శీను ఆమెమీద మనసు పడతాడు. ఆమెకు శరత్‌ (సునీల్‌) అనే సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సంబంధం వస్తే, ఆమెతో ప్రేమించబడటానికి, ఆమెను పెళ్ళి చేసుకోటానికి బొట్టుశీనుతో తన చెల్లికి ఎంగేజ్‌మెంట్‌ జరుపుతాడు జ్ఞానేశ్వర్‌. ఇంతలో కింగ్‌ అనుకుని బొట్టుశీను మీద ఎటాక్‌ జరుగుతుంది. శరత్‌,బొట్టు శీనుల కన్‌ఫ్యూజన్‌ వల్ల విసిగిపోయిన జ్ఞానేశ్వర్‌, తాను కింగ్‌లా కనిపించే బొట్టుశీనుని కింగ్‌ కోసం వేతికే వారికి అప్పగించటానికి డీల్‌ కుదుర్చుకుంటాడు. తీరా అక్కడ కింగ్‌ పెద్దమామ బొట్టుశీనుని చూసి అతన్ని కింగ్‌లా నటించమంటాడు. అందుకు కోటి రూపాయలిస్తానంటాడతను. దాంతో బొట్టు శీను యాక్సిడెంట్లో అంతా మరిచి పోయిన కింగ్‌లా ఆ రాజప్యాలెస్‌లోకి అడుగు పెడతాడు. ఆ తర్వాతేమయిందనేది మిగిలిన కథ. కింగ్‌ని ఎవరు చంపారనేది ఈ సినిమాలో కీలకమైన అంశం. కింగ్‌, బొట్టు శీను, శరత్‌లతో ఎవరు జ్ఞానేశ్వర్‌ చెల్లిని పెళ్ళి చేసుకుంటాడనేది క్లైమాక్స్‌లో గానీ మనకి తెలీదు.
ఎనాలసిస్ :
దర్శకుడు శ్రీను వైట్ల ఖాతాలో మరో సూపర్‌హిట్‌ చిత్రం "కింగ్‌" పేరుతో వచ్చి చేరింది తయారు చేసిన కథే కొంచెంగా ఉంది. కానీ ఈ కథని దర్శకుడు శ్రీను వైట్ల టాకిల్‌ చేసిన విధానం బాగుంది. స్ర్కీన్‌ప్లే పకడ్బందీగా ఉండటం వల్ల 2 గంటల 50 నిమిషాల నిడివున్నా సినిమా మనకు ఎక్కడా బోర్‌ కొట్టదు. అందుకు ఈ చిత్రంలోని ఎంటర్‌టైన్‌మెంట్‌ ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఎప్పుడు ఏ పాత్రను ప్రవేశపేడితే సినిమా బోర్‌ కొట్టకుండా ఉంటుందో శ్రీను వైట్లకు బాగా తెలిసినట్లుంది. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాథాన్యతనిచ్చాడు దర్శకుడు. తద్వారా ప్రేక్షకులను ఈ సినిమాకి రప్పించాలన్నదే అతని ప్రయత్నంగా కనపడుతుంది. ప్రేక్షకుడు కొనే టిక్కెట్టుకి సరిపడేదానికన్నా ఎక్కువగానే ఈ చిత్రంలో వినోదం ఉంది. చివరి పాటలో ఎనిమిది మంది హీరోయిన్లతో పాట మన తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క నాగార్జునకే సాధ్యమయ్యింది.నటన:- ఇక కింగ్‌గా, బొట్టుశీనుగా, శరత్‌గా నాగార్జున నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆయన మరింత గ్లామరస్‌గా కనిపించటం విశేషం. డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో ఆయన స్పీడ్‌ కుర్ర హీరోలతో పోటీపడుతుంది. హీరోయిన్‌ త్రిష తన పాత్ర వరకూ ఒ.కె. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సింది శ్రీహరి పాత్ర గురించి. శ్రీహరి ఈ చిత్రంలో జనాన్ని మరింతగా ఆకట్టుకుంటారు. ఆయన నటనలోని "ఢీ" మార్క్‌ సీరియస్‌ కామెడీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. వేణుమాధవ్‌, సునీళ్‌ ఉన్నది తక్కువ సమయమే అయినా మనల్ని బాగానే నవ్విస్తారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు జయసూర్యగా బ్రహ్మానందం నటన మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ పాత్రకు స్ఫూర్తి మన తెలుగు సినీ సంగీత దర్శకుల్లో ఎవరన్నది బ్రహ్మానందం గెటప్‌ చూస్తేనే మనకర్థమవుతుంది. ఢీ, రెడీ చిత్రాల్లో బ్రహ్మానందం మనల్ని నవ్వించిన దానికన్నా ఎక్కువగానే ఈ చిత్రంలో మనల్ని నవ్విస్తారు. ఇక మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సంగీతం:- బాగుంది. ఈ చిత్రం ఆడియో పెద్ద హిట్టయ్యింది. పాటలన్నీ బాగున్నాయి. రీ-రికార్డింగ్‌ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ:- బాగుంది. పాటల్లో, ఫైట్స్‌లో ఇంకా బాగుంది. కింగ్‌ ఆత్మ బొట్టుశీనుని అవహించినప్పుడు కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్‌:- బాగుంది. నీట్‌గా, షార్స్‌గా కట్‌ చేశారు. ఆర్ట్‌:- ఒ.కె. కొరియోగ్రఫీ:- అన్ని పాటల్లోనూ బాగుంది. యాక్షన్‌:- బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సకుటుంబంగా ఓ రెండున్నర గంటల పాటు సరదాగా ఎంజాయ్‌ చేయాలనుకుంటే ఈ "కింగ్‌" చిత్రాన్ని చూడండి. ఈ మాట తెలుగువన్‌ ఈ చిత్రానికి అఫీషియల్‌ మీడియా పార్టనర్‌ అని వ్రాయటం లేదు. ఈ సినిమా చూస్తే ఈ మాట నిజమని మీరే ఒప్పుకుంటారు.