English | Telugu
బ్యానర్:ఎ స్టూడియోస్, పెన్ స్డూడియోస్
Rating:2.00
విడుదలయిన తేది:Feb 11, 2022
సినిమా పేరు: ఖిలాడి
తారాగణం: రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌధరి, అనసూయ భరద్వాజ్, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ముఖేశ్ రిషి, రావు రమేశ్, సచిన్ ఖెడేకర్, నికితిన్ ధీర్, ఠాకూర్ అనూప్ సింగ్, ఉన్ని ముకుందన్, బేబీ శాన్విత
కథ, కథనం: రమేశ్ వర్మ
మాటలు: శ్రీకాంత్ విస్సా, సాగర్
పాటలు: శ్రీమణి
సంగీతం: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జి.కె. విష్ణు
ఎడిటింగ్: అమర్‌రెడ్డి
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం: రమేశ్ వర్మ
బ్యానర్స్: ఎ స్టూడియోస్, పెన్ స్డూడియోస్
విడుదల తేదీ: 11 ఫిబ్రవరి 2022
'క్రాక్' లాంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత రవితేజ, 'రాక్షసుడు' లాంటి సక్సెస్‌ఫుల్ సినిమా తర్వాత రమేశ్ వర్మ పనిచేసిన సినిమా కావడంతో, దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు కొన్ని పాపులర్ కావడంతో 'ఖిలాడి' మూవీపై చెప్పుకోదగ్గ అంచనాలే ఏర్పడ్డాయి. ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది. 'పుష్ప' రైటర్ శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాయగా మన ముందుకు వచ్చిన 'ఖిలాడి' ఎలా ఉందంటే...
కథ:- తన ఫ్రెండ్‌కు సాయం చేయడంలో భాగంగా జైల్లో ఉన్న మోహన్ గాంధీ (రవితేజ) అనే వ్యక్తిని కలుస్తుంది ప్రియ (మీనాక్షి చౌధరి) అనే క్రిమినాలజిస్ట్. ఆమె సాయం చేస్తాననడంతో తన కథ చెప్తాడు గాంధీ. ఇంటలిజెన్స్ ఐజీ అయిన తండ్రి జయరామ్ (సచిన్ ఖెడేకర్) లెటర్ హెడ్‌తో ఆయన సంతకం ఫోర్జరీ చేసి, ఒక లెటర్ రాసి, బెయిల్ సృష్టించి గాంధీని బయటకు తీసుకువస్తుంది ప్రియ. అప్పుడే అతను తనను ట్రాప్‌చేసి, జైల్లోంచి బయటకు వచ్చాడనీ, అతను చెప్పిన కథ నిజానికి రామకృష్ణ (ఉన్ని ముకుందన్) అనే మరో వ్యక్తిదనీ ప్రియకు తెలుస్తుంది. హోమ్ మినిస్టర్ గురుసింగం (ముఖేశ్ రిషి)కి చెందిన రూ. 10 వేల కోట్లు మాయమవుతాయి. ఆ డబ్బును సొంతం చేసుకోవడం కోసం ఒకవైపు గురుసింగం, మరోవైపు గాంధీ ప్రయత్నిస్తుంటే, దాన్ని కనిపెట్టడంతో పాటు క్రిమినల్స్‌ను పట్టుకోవాలని సీబీఐ జాయింట్ డైరెక్టర్ అర్జున్ భరద్వాజ్ (అర్జున్) ప్రయత్నిస్తుంటాడు. రకరకాల ట్విస్టులు, పాత్రలు వచ్చే ఈ గేమ్‌లో చివరకు ఏమవుతుంది? అసలు మోహన్ గాంధీ ఎవరు? అతని ఐడెంటిటీ ఏంటి?
ఎనాలసిస్ :
పది వేల కోట్ల రూపాయల మనీ చుట్టూ తిరిగే కథగా 'ఖిలాడి'ని రాసుకున్నాడు దర్శకుడు రమేశ్ వర్మ. ఈ తరహా కథలు మనం ఇప్పటికే బోలెడు చూసేశాం. రవితేజ స్వయంగా ఇదే తరహా కథతో ఇదివరకే 'కిక్' మూవీ చేశాడు. మరి 'ఖిలాడి'లో కొత్తగా కనిపించేదేమిటి? ఫస్టాఫ్‌లో ప్రియకు జైల్లో ఉన్న గాంధీ వినిపించే కథ ఒకింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అతను పరిచయం చేసే పాత్రలు, అతను చెప్పే లవ్ స్టోరీ.. ప్రియతో పాటు ప్రేక్షకులకూ వినోదాన్ని పంచుతాయి. కానీ ఆ ఎపిసోడ్ ఉండేది కొద్దిసేపే. ఆ తర్వాత మోహన్ గాంధీ పెద్ద ఖిలాడి అనే విషయం బయటపడిపోతుంది. అక్కడ్నుంచీ కథనం గజిబిజిగా సాగుతూ, మధ్యమధ్యలో చికాకు పెడుతూ వస్తుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆశించిన రీతిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించలేకపోయాయి. గాంధీ చేసే పనులతో మనం కనెక్ట్ కాలేకపోవడం ఈ సినిమా కథనానికి సంబంధించిన పెద్ద లోపం.
డింపుల్ హయాతి క్యారెక్టర్‌ను బ్యూటిఫుల్‌గా పరిచయం చేసిన దర్శకుడు, తర్వాత ఆ క్యారెక్టర్‌పై ఉన్న చక్కటి ఫీలింగ్‌ను చెడగొట్టేశాడు. రవితేజ సహా ఏ క్యారెక్టరూ మనల్ని మెప్పించదు. గాంధీ క్యారెక్టర్‌కు సరైన పర్పస్ లేకపోవడం కథాగమనాన్ని దెబ్బతీసింది. రామకృష్ణ క్యారెక్టర్ సానుభూతికి ఉద్దేశించినప్పటికీ, ఆ క్యారెక్టర్‌కు సరైన ఎలివేషన్ దక్కలేదు. అందుకే, ఆ క్యారెక్టర్‌తో ముడిపడివున్న చైల్డ్ సెంటిమెంట్ కూడా వర్కవుట్ కాలేదు. రవితేజ, అనసూయ ఇద్దరూ డ్యూయల్ రోల్స్ చేశారన్నట్లు సినిమా విడుదలకు ముందు చెప్పుకొచ్చారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఇద్దరూ సింగిల్ క్యారెక్టర్లే చేశారు.
ఏ డైలాగ్స్ ఎవరు రాశారో కానీ.. శ్రీకాంత్ విస్సా, సాగర్ రాసిన డైలాగ్స్ ఓకే అనిపిస్తాయి. అయితే రవితేజ చెప్పిన షటాప్ అనే మేనరిజమ్ వర్కవుట్ కాలేదు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన పాటల్లో మూడు పాటలు వినసొంపుగా ఉన్నాయి. వాటి చిత్రీకరణ బాగానే ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఈ సినిమాకు ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు సుజిత్ వాసుదేవ్, జి.కె. విష్ణు పనిచేశారు. చాలా చోట్ల కెమెరా పనితనం చాలా రిచ్‌గా ఉండగా, కొన్నిచోట్ల సీన్లు నాసిరకంగా ఎందుకు కనిపించాయో అర్థం కాదు. తనకు ఇచ్చిన సన్నివేశాల్ని సాధ్యమైనంత ఆసక్తికరంగా ఎడిట్ చేయడానికి అమర్‌రెడ్డి గట్టి కృషి చేశాడు కానీ, ఫలితం దక్కలేదు.
ప్లస్ పాయింట్స్
రవితేజ, అర్జున్ నటన
దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ, కథనం
ఆకట్టుకోలేని క్యారెక్టర్లు
ఇంట్రెస్టింగ్‌గా లేని ట్విస్టులు
నటీనటుల పనితీరు:- మోహన్ గాంధీగా రవితేజ తనకు అలవాటైన రీతిలో సునాయాసంగా నటించాడు. ఈ తరహా పాత్రల్ని ఇదివరకు ఎలా చేశాడో, ఇప్పుడూ అలాగే చేశాడు. అతని పాత్రలో కానీ, నటనలో కానీ, బాడీ లాంగ్వేజ్‌లో కానీ కొత్తదనం ఏమీ లేదు. డింపుల్ హయాతి గ్లామరస్‌గా ఉంది. కానీ చాలా చోట్ల అనాయాసంగా అందాలు ప్రదర్శించేసి, ఆ క్యారెక్టర్‌ను వ్యాంప్ తరహాలోకి మార్చేసుకుంది. మీనాక్షి చౌధరి గ్లామరస్‌గానూ లేదు, నటిగా పెద్దగా రాణించనూ లేదు. చంద్రకళగా కనిపించినంత సేపూ మెప్పించిన అనసూయ, చాందినిగా మారాక ఆ పని చేయలేకపోయింది.
అర్జున్ భరద్వాజ్‌గా అర్జున్ సరిగ్గా సరిపోయారు. నిజానికి ఆయన క్యారెక్టర్‌కు మరింత ఎలివేషన్ ఇచ్చినట్లయితే సినిమాకు మరింత ప్లస్ అయ్యుండేది.మురళీశర్మ, వెన్నెల కిశోర్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రావు రమేశ్, ముఖేశ్ రిషి, సచిన్ ఖేడేకర్, నికితిన్ ధీర్, ఠాకూర్ అనూప్ సింగ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఉన్ని ముకుందన్ కనిపించినంత సేపూ సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రవితేజ ఫ్యాన్స్‌ను ఒకింత అలరించే 'ఖిలాడి', మిగతా ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. 'క్రాక్' లాంటి చక్కని యాక్షన్ సినిమా చేసిన రవితేజ, వెంటనే ఇలాంటి పాత చింతకాయ పచ్చడి తరహా కథతో మన ముందుకు రావడం విచారకరం.
- బుద్ధి యజ్ఞమూర్తి