Read more!

English | Telugu

సినిమా పేరు:క‌న్మ‌ణి రాంబో ఖ‌తీజా
బ్యానర్:రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
Rating:2.25
విడుదలయిన తేది:Apr 28, 2022

సినిమా పేరు: క‌న్మ‌ణి రాంబో ఖ‌తీజా
తారాగ‌ణం: విజయ్ సేతుపతి, నయనతార, సమంత
సంగీతం: అనిరుధ్
సినిమాటోగ్రఫీ: య‌స్‌.ఆర్‌. క‌దిర్
ఎడిటర్: ఎ. శ్రీ‌క‌ర‌ప్ర‌సాద్
బ్యానర్: రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
నిర్మాతలు: విఘ్నేశ్ శివ‌న్, నయనతార, లలిత్ కుమార్
రచన, దర్శకత్వం: విఘ్నేశ్ శివ‌న్
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2022

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సేతుపతి 'ఉప్పెన' సినిమాతో మరింత దగ్గరయ్యాడు. తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అదే 'క‌న్మ‌ణి రాంబో ఖ‌తీజా'. విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్స్ గా నటించారు. మరో విశేషమేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కి ఇది 25 వ సినిమా. ఇంతమంది స్టార్స్, ఇన్ని విశేషాలు ఉన్నప్పటికీ ఎందుకనో ఈ సినిమాపై రావాల్సినంత హైప్ రాలేదు. మరి హైప్ లో వెనకపడిపోయిన ఈ సినిమా అలరించడంలో సక్సెస్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ:- రాంబో(సేతుపతి) వంశానికి ఓ శాపం ఉంటుంది. ఆ వంశంలోని వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళు చనిపోతారు లేదా ఏదైనా కీడు జరుగుతుంది. ఆ శాపం కారణంగా ఆ వంశంతో సంబంధం కలుపుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒక తరం అంతా పెళ్లి పెటాకులు లేకుండా మిగిలిపోతుంది. అయితే ఇదంతా మూఢ నమ్మకమని, ఈ అపోహని పోగొట్టడం కోసం రాంబో తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలం జీవితం సాఫీగానే సాగిపోతుంది. కానీ రాంబో పుట్టగానే తండ్రి చనిపోతాడు, తల్లి గతం మర్చిపోతుంది. దీంతో ఊరంతా రాంబోని దురదృష్టవంతుడు అంటుంది. రాంబో కూడా తనని తాను దురదృష్టవంతుడిగా భావించి.. తాను దూరంగా ఉంటేనే తన తల్లికి మంచి జరుగుతుంది అనుకొని ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అలా చిన్న చిన్న పనులు చేస్తూ పెరిగి పెద్ద వాడైన రాంబో.. రోజంతా క్యాబ్ నడుపుతూ, రాత్రిపూట పబ్ లో వర్క్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తాను క‌న్మ‌ణి(నయనతార), ఖతీజా(సమంత) ఇద్దరితో ఒకేసారి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత రాంబో జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ ఇద్దరిలో రాంబో ఎవరిని సిన్సియర్ గా లవ్ చేశాడు? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

ఈ సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకోవడానికి ముందు ఈ సినిమా టైటిల్, ప్రమోషన్స్ గురించి ఓ సారి మాట్లాడాలి. ఈ మధ్య తమిళ్ డబ్బింగ్ సినిమాలకు ఏవేవో టైటిల్స్ పెట్టి తెలుగు ప్రేక్షకుల మీదకు వదులుతున్నారు. ఇటీవల 'వలిమై' ఇప్పుడు 'క‌న్మ‌ణి రాంబో ఖతీజా'. సినిమాలోని ప్రధాన పాత్రల పేర్లే టైటిల్ గా పెట్టినప్పటికీ.. అది తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా లేదు, ఆకట్టుకునేలా అసలే లేదు. దానికి తోడు ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన ముగ్గురు స్టార్స్ ఉన్నప్పటికీ.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు. ప్రమోషన్స్ అంత దారుణంగా ఉన్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. ఇద్దరితో ఒకేసారి ప్రేమలో పడి మధ్యలో హీరో నలిగిపోయే స్టోరీలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి స్టొరీనే తీసుకొని, ముగ్గురు స్టార్స్ తో ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు విఘ్నేశ్. కానీ అతను ఎంటర్టైన్మెంట్ అందించడంతో కొంతవరకే సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇది చాలా సరదా లైన్. ఆడియన్స్ ని నాన్ స్టాప్ గా నవ్వించొచ్చు. కానీ విఘ్నేశ్ అక్కడక్కడా మాత్రమే నవ్వించి చాలా చోట్ల విసుగు తెప్పించాడు. మొదట్లో బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ పోను పోను.. చెప్పిందే చెబుతూ, చూపించిందే చూపిస్తూ డైలీ సీరియల్ గా సాగదీశాడు. రొటీన్ సీన్స్, రొటీన్ కామెడీతో సినిమాని నడిపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. రాంబో ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడ్డాడని హీరోయిన్స్ కి తెలియజేయడం కోసం పెట్టిన టీవీ షో ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ఏ మాత్రం పండలేదు.

అయితే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ మాత్రం బాగున్నాయి. హీరో దురదృష్టాన్ని ఐస్ క్రీమ్, వర్షంతో ముడిపెట్టి.. దానిని హీరోయిన్ల లవ్ తో లింక్ చేయడం బాగుంది. అలాగే  ప్రీ క్లైమాక్స్ లో మతాంతర వివాహాలు, అందరూ కలిసి విందు చేయడం ఆకట్టుకుంది. ఇలా సినిమాలో కొన్ని సన్నివేశాలు మెప్పిస్తాయి. ముఖ్యంగా సేతుపతి, నయన్, సమంతల నడుమ వచ్చే కొన్ని సన్నివేశాలు అలరిస్తాయి.

అనిరుధ్ అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా 'ఐ లవ్ యూ టూ' సాంగ్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. అయితే తన ల్యాండ్ మార్క్ మూవీ రేంజ్ లో లేదు. కదిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ శ్రీకరప్రసాద్ కత్తెరకు ఇంకా పని చెప్పి ఉండాల్సింది. ఈ సినిమాకి నిడివి రెండున్నర గంటలు ఉండటం ఇబ్బందికరంగా ఉంది. కనీసం మరో 15 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు.

న‌టీన‌టుల ప‌నితీరు:- విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది. ముగ్గురూ అదరగొట్టారు. రాంబో పాత్రలో సేతుపతి ఒదిగిపోయాడు. ఓ వైపు దురదృష్టవంతుడిగా ఫీలవుతూ, మరోవైపు ఇద్దరి ప్రేమలో పడిపోయిన ప్రేమికుడిగా చక్కగా నటించాడు. ఇక నయనతార, సమంత.. అందంలో, అభినయంలో పోటీ పడ్డారు. నయన్ చీరలు, చుడీదార్స్ తో కట్టి పడేస్తే.. సమంత మోడ్రన్ డ్రెస్ లతో ఆకట్టుకుంది. రాంబో నా వాడంటే నా వాడు అంటూ ఇద్దరూ పోటాపోటీగా నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'కన్మణి రాంబో ఖతీజా' సినిమా అక్కడక్కడా మాత్రమే అలరిస్తుంది. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ఈ ముగ్గురు స్టార్స్ కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు.

-గంగసాని