Read more!

English | Telugu

సినిమా పేరు:విక్రమ్
బ్యానర్:రాజ్ కమల్ ఫిలిమ్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jun 3, 2022

సినిమా పేరు: విక్రమ్
తారాగ‌ణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య
సంగీతం: అనిరుధ్
సినిమాటోగ్ర‌ఫీ: గిరీష్ గంగాధరమ్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
నిర్మాత: కమల్ హాసన్, మహేంద్రన్
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
బ్యాన‌ర్: రాజ్ కమల్ ఫిలిమ్స్
విడుద‌ల తేదీ: జూన్ 3, 2022


యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ళ తర్వాత 'విక్రమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో 1986 లో ఏజెంట్ విక్రమ్ గా అలరించిన ఆయన మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే రోల్ తో పలకరించడం విశేషం. పైగా 'ఖైదీ', 'మాస్టర్' చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో పాటు.. కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్.. గెస్ట్ రోల్ లో సూర్య నటించడంతో 'విక్రమ్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ:- ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు కర్ణన్(కమల్ హాసన్)ను కొందరు ముసుగు వ్యక్తులు హత్య చేసి ఆ వీడియోలను పోలీస్ డిపార్ట్మెంట్ కి పంపుతారు. ఈ కేసుని ఛేదించి ఆ ముసుగు వ్యక్తులను పట్టుకునే బాధ్యతను.. సీక్రెట్ ఏజెన్సీ ద్వారా అండర్ కవర్ ఆపరేషన్స్ చేసే అమర్(ఫహద్ ఫాసిల్)కు అప్పగిస్తారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో డ్రగ్స్ వ్యాపారి సంతానం(విజయ్ సేతుపతి) గురించి, అతనికి చెందిన వేల కోట్ల విలువ చేసే సరుకు మిస్ అవ్వడం గురించి తెలుస్తుంది. అసలు ఆ ముసులు వ్యక్తులు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? వాళ్ళకి సంతానంకి సంబంధం ఏంటి? కర్ణన్ ఎవరు? అతనికి, విక్రమ్ కి సంబంధం ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

అసలే యాక్టింగ్ పవర్ హౌస్ కమల్ సినిమా. ఆయనకు తోడు విజయ్, ఫహద్, సూర్య ఉన్నారంటే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా తెరకెక్కించడంలో లోకేష్ కొంతవరకే సక్సెస్ అయ్యాడు. పేరుకిది కమల్ సినిమానే అయినప్పటికీ ఫస్టాఫ్ లో ఆయన కనిపించేది చాలా తక్కువ సేపే. ఇది కమల్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచే అంశం. పేరుకి ఆయన పాత్ర చుట్టూనే కథ తిరుగుతున్నట్లు ఉంటుంది కానీ ఫస్టాఫ్ లో స్క్రీన్ పై ఎక్కువగా ఫహద్, విజయ్ నే కనిపిస్తారు.

కమల్ హత్య, ఇన్వెస్టిగేషన్, డ్రగ్స్ మాఫియా వంటి వాటితో సినిమా ఆసక్తికరంగానే ప్రారంభమవుతుంది.. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఆడియన్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్ గా మారింది. సెకండాఫ్ లోనే అసలు పాయింట్ రివీల్ అవుతుంది. అయితే కమల్ ఓల్డ్ మూవీ విక్రమ్ చూసినవాళ్లకే అది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం మాటలతో చెప్పించిన ఆ పాయింట్ కొత్తగా చూసేవాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం. అలాగే సెకండాఫ్ ని పిల్లాడి(కర్ణన్ మనవడు) ఎమోషనల్ ట్రాక్ తో రన్ చేసే ప్రయత్నం చేశాడు లోకేష్. కాని అది అంతగా వర్కౌట్ అవ్వలేదు.

కొన్ని సీన్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ సినిమా ఎక్కడా ఆడియన్స్ ని కట్టిపడేసేలా లేదు. ఇది రివేంజ్ కాదని సినిమాలో కమల్ పాత్రతో చెప్పించినా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం రొటీన్ రెగ్యులర్ రివేంజ్ డ్రామాలానే అనిపిస్తుంది. ఒక ప్రోపర్ స్టోరీ లైన్ తీసుకొని డెవలప్ చేస్తే రిజల్ట్ బాగుందేమో. కానీ లోకేష్ మల్టీవర్స్ పేరుతో ప్రయోగం చేసి కలగూర గంప చేసేశాడు. 'ఖైదీ'ని, పాత 'విక్రమ్'ని లింక్ చేస్తూ చూపించిన ఈ సినిమాకి కొనసాగింపు కూడా ఉన్నట్లుగా చివరిలో హింట్ ఇచ్చారు. అంటే లోకేష్ తన మల్టీవర్స్ కోసం విక్రమ్ ని ఓ వారధిలా వాడుకున్నాడు అంతే.

'ఖైదీ'లో గ్లామర్ ఉండదు, కేవలం ఒక్క నైట్ లో జరిగే కథ. అయినా ఎక్కడ బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించి మెప్పించాడు లోకేష్. ఇప్పుడు 'విక్రమ్'లో ఇంతమంది స్టార్లు ఉన్నా ఎక్కడా లోకేష్ మార్క్ కనిపించలేదు. పైగా నిడివి ఈ సినిమాకి పెద్ద మైండ్ అని చెప్పొచ్చు. 2 గంటల 52 నిమిషాల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టి అలరించే అంత కంటెంట్ ఇందులో లేదు.

అనిరుధ్ మ్యూజిక్ ఎప్పటిలాగే బాగుంది. ఉన్న రెండు సాంగ్స్ పెద్దగా ఆకట్టుకునేలా లేకపోయినప్పటికీ, బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. గిరీష్ గంగాధరం సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ కత్తెరకు చాలా పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విడువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:-

కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఇది ఆయనకు ఏ మాత్రం ఛాలెంజింగ్ పాత్ర కాదు. పెద్దగా కష్టపడకుండానే సునాయాసంగా చేసేశారు. ఇందులో ఫహద్ ఫాసిల్ ది పవర్ ఫుల్ రోల్. అమర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఫస్టాఫ్ చాలా వరకు తన భుజాలపైనే మోశాడు. ఇక సంతానం పాత్రలో విజయ్ సేతుపతి విశ్వరూపం చూపించాడు. డిఫరెంట్ బాడీ ల్యాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ తో పాత్రని నిలబెట్టాడు. సూర్య స్క్రీన్ పై కనిపించింది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ చూపించాడు. నిజానికి సూర్యది గెస్ట్ రోల్ కాదు. లోకేష్ మల్టీవర్స్ లో అది కీ రోల్ అన్నట్లుగా చూపించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెద్దగా యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్' అంచనాలకు తగ్గ స్థాయిలో లేదు. నలుగురు స్టార్ల నట విశ్వరూపం కోసం ఒకసారి చూడొచ్చు.