Read more!

English | Telugu

సినిమా పేరు:కళ్యాణ్ రామ్ కత్తి
బ్యానర్:యన్ టి ఆర్ ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 12, 2010
గతంలో అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ తో అనేక సినిమాలు,ఆనాటి "రక్తసంబంధం" నుంచి నిన్న మొన్నటి "అన్నవరం"వరకూ అనేక చిత్రాలు అలాటి కథలతో వచ్చాయి.ఇది కూడా అలాంటి చిత్రమే.కాకపోతే ట్రీట్ మెంట్ కాస్త విభిన్నంగా ఉండేలా జాగ్రత్తపడ్డారు.రామకృష్ణ ఒక ఫుట్ బాల్ ప్లేయర్.అతనికి తండ్రి,ఇద్దరు పెళ్ళయిన అన్నలు,ఒక చెల్లెలూ ఉంటారు.చెల్లి హారిక అంటే రామకృష్ణ కు ప్రాణం.ఆమె చేసే అన్ని తప్పుల్నీ అతను కవర్ చేస్తూ ఉంటాడు.ఆమె ఉన్నట్టుండి ఆమె పెళ్ళి చూపులు జరిగేరోజు నుంచీ కనపడకుండా పోతుంది.ఆమెను కిక్ శ్యామ్ తన అనుచరులతో కలసి వెంటాడుతుండగా,ఆమెను రైల్లోకి లాగి కాపాడతాడు రామకృష్ణ.ఇక్కడ ఇంటర్వెల్.అప్పుడామె తాను కిక్ శ్యామ్ తో పరిచయం ఎలా జరిగిందీ,అతన్ని ఎలా ప్రేమించిందీ,అతను పెళ్ళిచేసుకుని వాళ్ళఊరు తీసుకెళితే అక్కడ ఏమ జరిగిందో అన్నయ్యకు చెప్పుకుని "చిన్నప్పటి నుంచీ చాలా తప్పులు కాసావు.ఈ ఒక్క తప్పు కాసి నన్ను మనింటికి తీసుకెళ్ళన్నయ్యా" అంటూంది. దానికి ఆ అన్నయ్య ఏం చేశాడు...?ఎలా చెల్లి కాపురాన్ని తీర్చిదిద్దాడన్నది మిగిలిన కథ
ఎనాలసిస్ :
దర్శకత్వం - దర్శకుడు మల్లి కార్జున్ తన శక్తియుక్తులన్నీ కలబోసి మరీ కష్టపడ్డాడు.నిజానికి ఈ చిత్రంలోని ఓపెనింగ్ సీన్ క్లైమాక్స్ కు ముందు వస్తుంది.సినిమాని అక్కడ మొదలుపెట్టటం అనేది "బాషా"సినిమా నుంచి వస్తున్నదే.ఇక టేకింగ్ గురించి చెప్పాలంటే చూడ చక్కగా ఉంది.సినిమా టెంపోని సడలకుండా స్క్రీన్ ప్లేని మెయింటైన్‍ చేశారు. నటన -ఈ చిత్రానికి హీరో,నిర్మాత అయిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో తన పాత్రకు పూర్తి పరిణితితో న్యాయం చేశాడు.చెల్లితో సెంటిమెంట్ సీన్లలో చక్కని నటన కనపరిచాడు.ఇక రౌద్రరసంలో అతని కళ్ళు నిప్పులు కురిపించాయని చెప్పొచ్చు.ఇక డ్యాన్సుల్లో"నాటు కోడి పులుసు"పాటలో ఒంటిచేత్తో ఎగిరి వేసిన స్టెప్పుకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ఒక విధంగా కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోశాదని చెప్పొచ్చు.ఈ చిత్రంతో ఆల్ రౌండ్ ప్రతిభ కనపరిచాడు కళ్యాణ్ రామ్.ఖర్చుకి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణపు విలువలు కూడా చాలా బాగున్నాయి.హీరోయిన్ సనాఖాన్ కి పెద్దగా నటించేందుకు ఏం లేదు.సెంటిమెంట్ సీన్లలో శరణ్య నటన ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోట శ్రీనివాసరావు నటన గురించి.ముత్యం పాత్రలో కోట నటన బహుధా ప్రశంసనీయం.అతని డైలాగ్ మాడ్యులేషన్,నటన,ఎక్స్ ప్రెషన్స్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.బ్రహ్మానందం కామెడీ ,ధర్మవరపు పాత్ర కూడా హీరో పాత్ర ఎలివేషన్ కు బాగానే దోహదపడింది.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సంగీతం- పాటలన్నీ బాగానే ఉన్నాయి.పాతలన్నింటిలో ముఖ్యంగా సాహిత్యం వినపడటం ఈ చిత్రం సంగీతంలోని ప్రత్యేకత.ముఖ్యంగా "నాటుకోడి పులుసు"పాట అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్.మాస్ ప్రేక్షకులను అది బాగా ఆకట్టుకుంటుంది.రీ-రికార్డింగ్ కూడా సందర్భోచితంగా ఉండి బాగుంది. సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది.ముఖ్యంగా సి.గి.వర్క్ కి అనుగుణంగా ఈ చిత్రంలోని ఫోటోగ్రఫీ చక్కగా ఉంది.ఇక పాటల్లో, ఫైటుల్లో సినిమాటోగ్రఫీ ఇంకా బాగుంది.సర్వేష్ మురారీని ఇందుకు ప్రత్యేకంగా అభినందించాలి. మాటలు - రాజమౌళి సినిమా రేంజ్‍ లో ఈ చిత్రంలోని మాటలున్నాయి.యమ్.రత్నానికి మాస్ పల్స్ చాలా బాగా తెలుసు.కనుక "తల తెగే వరకూ తొడకొట్టి నిలబడతా"వంటి డైలాగులు ఈ చిత్రంలో బాగా పండాయి. ఎడిటింగ్ - గౌతంరాజు అపారమైన అనుభవజ్ఞుడు.ఆయన ఎడిటింగ్ కి వంకపెట్టగలమా...? ఆర్ట్ - చాలా బాగుంది. కొరియోగ్రఫీ - కళ్యాణ్ రామ్ చేత చాలా కష్టమైన స్టెప్పులేయించటం చూస్తే కొరియోగ్రఫీకి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో అర్థమవుతుంది. యాక్షన్ - యాక్షన్ కంపోజ్ చేయటంలో రామ్-లక్ష్మణ్ రాను రానూ హాలీవుడ్ స్థాయికి ఎదుగుతున్నారు.అందుకీ సినిమా మరో ఉదాహరణ.ఈ చిత్రమలోని యాక్షన్ సిన్లన్నీ చాలా బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇది అన్నాచెల్లెలు సెంటిమెంట్‍ మీద,అన్ని కమర్షియల్‍ హంగులతో తీసిన అవుట్‍ అవుట్ మాస్ చిత్రం.ఈ చిత్రాన్ని హ్యాపీగా చూడొచ్చు.