Read more!

English | Telugu

సినిమా పేరు:కబాలి
బ్యానర్:వి క్రియేషన్స్
Rating:1.50
విడుదలయిన తేది:Jul 22, 2016

ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మొట్టమ్దటిసారిగా ఓ యువ దర్శకుడి నిర్దేశకత్వంలో నటించిన సినిమా "కబాలి". పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను నిర్మించారు. తెలుగు, తమిళ సినిమా అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ వీరాభిమానులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో, లేట్ చేయకుండా సినిమా సమీక్షను చదివేద్దాం..!!

కథ: కబాలీశ్వరన్ (రజనీకాంత్) ఇండియా నుంచి మలేసియాకి వలస వెళ్ళిన గ్రాడ్యూయేట్. అక్కడి ప్రభుత్వం భారతీయులకు చేస్తున్న అన్యాయాన్ని చూస్తూ భరించలేక "కబాలి" అవతారమెత్తి వారికి అండగా నిలుస్తాడు. ఈ క్రమంలో మలేసియాలో భారతీయులకు పెద్ద దిక్కు లాంటి సీతారామరాజు (నాజర్)కు బాగా దగ్గరవుతాడు. కబాలి అంటే పడని టోనీ లీ (వింస్టన్ చావ్), వీరశంకర్ (కిషోర్) గ్యాంగ్ కుట్ర పన్ని కబాలి మరియు అతడి భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే)పై దాడి చేస్తారు. ఆ దాడిలో కబాలిని పోలీసులు అరెస్ట్ చేయగా.. గర్భవతిగా ఉన్న కుందనవల్లిని హాస్పిటల్ లో చేర్చుతారు. పాతికేళ్ళ తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన కబాలి తన భార్య కోసం సాగించిన అన్వేషణ, ఆ అన్వేషణ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యల సమాహారమే "కబాలి" చిత్రం!

 


ఎనాలసిస్ :

నటీనటుల పనితీరు: 65 ఏళ్ల రజనీకాంత్ ను సూటు బూటులో యమ స్టైలిష్ గా చూడడం అనేది రజనీ వీరాభిమానులందరికీ పండగే. ముఖ్యంగా రజనీ మేనరిజమ్స్ చప్పట్లు కొట్టించే రేంజ్ లో ఉంటాయి. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోశాడు రజనీ. వయోభారం కారణంగా యాక్షన్ సీన్స్ లో ఇంతకుముందులా హుందాగా కనిపించలేకపోయాడు. రజనీ మార్క్ స్టైల్ డ్రెస్సింగ్ తో తప్పితే సినిమాలో ఎక్కడా కనిపించదు. ప్రతినాయక పాత్రలో కిషోర్ మినహా మరో నటుడి గురించి చెప్పుకోవాల్సిన స్థాయిలో ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం గమనార్హం. టోనీ అనే డాన్ పాత్రలో విదేశీ నటుడు వింస్టన్ చావ్, కబాలికి బాడీగార్డ్ జీవా క్యారెక్టర్ లో "అట్టకత్తి" ఫేమ్ దినేష్ చేసిన ఓవర్ యాక్టింగ్ కి నవ్వుకోవాలో, లేక సదరు సన్నివేశంలోని సీరియస్ నెస్ ను ఫీల్ అవ్వాలో అర్ధం కానీ అయోమయంలో ఉంటాడు ప్రేక్షకుడు. రజనీకాంత్ కూతురు యోగి పాత్రలో ధన్సిక పవర్ ఫుల్ క్యారెక్టర్ ను చక్కగా ప్లే చేసింది. రజనీ భార్యగా రాధికా ఆప్టేకు నటించడానికి పెద్దగా ఆస్కారం లభించలేదు. సినిమాలో దాదాపుగా ఆమెను బ్యాగ్రౌండ్ ఫిల్ చేయడం కోసమే వాడుకొన్నారు.
 

సాంకేతికవర్గం పనితీరు: రజనీకాంత్ తర్వాత "కబాలి" సినిమాలో మెచ్చుకోదగ్గ అంశం ఏదైనా ఉంది అంటే అది కేవలం సంతోష్ నారాయణ్ మ్యూజిక్ మరియు బ్రాగ్రౌండ్ స్కోర్ మాత్రమే. సన్నివేశానికి తగ్గట్లుగా గ్యాప్ మెయింటైన్ చేశాడు. జి.మురళి కెమెరా పనితనం బాగుంది. అయితే.. మాగ్జిమమ్ సీన్స్ కు బ్రైట్ లైట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కు గ్రే టింట్ వాడడం వలన కంటెంట్ జనాలకు కనెక్ట్ అవ్వలేదు. చాలా వరకూ సీన్స్ లో మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ రజనీకాంత్ ను ఓవర్ ల్యాప్ చేసేస్తుంటారు. తెలుగబ్బాయి ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ బాలేదనే చెప్పాలి. చాలా సీన్స్ కు అసలు మీనింగ్ ఉండదు. ఉదాహరణకు కూతురు స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకొని నీళ్ళలో ప్రశాంతగా తేలుతూ ఉంటుంది.. పక్కన చైర్ లో రజనీ కూర్చొని ఉంటాడు. అసలు ఆ షాట్ ఎందుకు పెట్టారో, లేక ఎడిటింగ్ లో కట్ చేయగా మిగిలింది అలా వదిలేశారో అన్నది డైరెక్టర్ మరియు ఎడిటర్ లకే తెలియాలి. రాకరాక రజనీకాంత్ తో సినిమా తీసే అవకాశం వచ్చిందనో లేక నిజంగానే దర్శకుడు పా.రంజిత్ చెప్పిన కథ నచ్చిందో తెలియదు కానీ.. నిర్మాణ పరంగా, పబ్లిసిటీ పరంగా నిర్మాత కలైపులి థాను డబ్బును నీళ్లలా ఖర్చు చేశాడు. అందువల్ల ప్రతి ఫ్రేమూ చాలా రిచ్ గా ఉంటుంది.

"అట్టకత్తి, మద్రాస్" లాంటి సినిమాలను చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయగలిగిన దర్శకుడు పా.రంజిత్ తన మూడో సినిమాకే సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే సువర్ణావకాశం సొంతం అవ్వడంతో దర్శకుడిగానే కాక కథకుడిగానూ తడబడ్డాడు. రెగ్యులర్ మాఫియా డాన్ సినిమా తీయకూడదు అనుకొంటూనే పాత రొట్టగొట్టుడు సినిమాను ప్రేక్షకులపైకి వదిలాడు. రజనీకాంత్ లుక్స్, డ్రెస్సింగ్ పై పెట్టిన దృష్టి కథనంపై కూడా పెట్టి ఉంటే రిజల్ట్ కాస్త బెటర్ గా ఉండేదేమో. అయితే.. "కబాలి" సినిమాతో మాత్రం దర్శకుడిగా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యాడు రంజిత్.  

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రజనీకాంత్ సినిమా అంటే రజనీకాంత్ ను చూడడానికే జనాలు వస్తారు. ఇది వెయ్యి శాతం నిజం, అలా అని సినిమా మొత్తం రజనీ స్లోమోషన్ షాట్స్, టైట్ క్లోజ్ లు పెట్టేసి "సూపర్ స్టార్ సినిమా చూడండి" అని జనాలు చూడరు. రజనీకాంత్ చరీష్మాతోపాటు ఆకట్టుకొనే కథ, అలరించే కథనం కావాలి. ఆ రెండు "కబాలి" సినిమాలో లోపించాయి. మొదటి 15 నిమిషాలు మినహా క్లైమాక్స్ వరకూ సినిమాలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ అంశం లేకపోవడం సినిమా అభిమానికి బాధాకరమైన విషయం. మహేష్ బాబు "ఆగడు" సినిమాలో "కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే.. పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది" అనే డైలాగ్ ఉంటుంది. అది "కబాలి" సినిమాకి సరిగ్గా సూట్ అయ్యింది. సో, రజనీకాంత్ వీరాభిమానులు తప్పితే.. ఓపికపాళ్ళు ఎక్కువగ్గ ఉన్నవాళ్ళు మాత్రమే "కబాలి" సినిమా థియేటర్ల వరకూ వెళ్లండి.