Read more!

English | Telugu

సినిమా పేరు:కిక్ 2 మూవీ రివ్యూ
బ్యానర్:ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్
Rating:2.50
విడుదలయిన తేది:Aug 21, 2015

తిరుప‌తి ల‌డ్డూ తిరుప‌తి ల‌డ్డూనే! ఆ రుచి, ప‌విత్ర‌త వేరు. అలాంటి ల‌డ్డూనే మ‌న ఇంట్లోనూ త‌యారు చేసేసి, దానికి  తిరుప‌తి ల‌డ్డూ 2 అని పేరు పెట్టేస్తే ఎలా?   సీక్వెల్ సినిమాల క‌థ అంతే. ఎప్పుడో ఓ సినిమా హిట్ట‌వుతుంది. ఆ పేరు వాడేసుకొని ప‌క్కన 2 అనే అంకె త‌గిలించేస్తే ఆ మ్యాజిక్ మ‌ళ్లీ వ‌ర్క‌వుట్ అయిపోద్ద‌ని కొంత‌మంది గుడ్డి న‌మ్మ‌కం. సినిమా హిట్ట‌య్యేది పేరు వ‌ల్లే కాదని, అందులో క‌థ‌వ‌ల్ల‌ని, కంటెంట్ వ‌ల్ల‌ని ఇప్ప‌టికీ అర్థం కాలేదు. ఏడేళ్ల క్రితం కిక్ వ‌చ్చింది. అందులో వినోదం, ఎమోష‌న్స్‌, సంగీతం, ర‌వితేజ... ఇవ‌న్నీ క‌ల‌సి ఆ సినిమాని హిట్ చేశాయి. ఇప్పుడు కిక్ 2 అనే పేరుతో దానికి సీక్వెల్ తీశారు. ఇందులో ర‌వితేజ - ఆ టైటిల్ త‌ప్ప కిక్ లో ఉన్న స‌రుకు, మ్యాజిక్ లేకుండా పోయింది. మ‌రింత‌కీ కిక్ 2 క‌థేంటి?  ఇందులో కిక్కిచ్చే విష‌యాలేంటి?  చూసేద్దాం.. రండి.

త‌న కిక్ కోసం ప‌క్కోడి ప్రాణాల‌తో చెడుగుడు ఆడేసుకొన్న పాత్ర కల్యాణ్‌ (ర‌వితేజ‌)ది. త‌న కొడుకే... రాబిన్ వుడ్ (ర‌వితేజ‌).  క‌ల్యాణ్‌కి కిక్ కావాలి.. రాబిన్ వుడ్‌కి కంఫ‌ర్ట్ కావాలి. త‌న  కంఫర్ట్ కోసం  7 నెలలకే త‌ల్లి క‌డుపు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు.  అమెరికాలో చ‌దువుకొని, అక్క‌డే డాక్ట‌ర్‌గా స్థిర‌ప‌డాల‌నుకొంటాడు. ఆసుప‌త్రి క‌ట్ట‌డానికి డ‌బ్బులు కావాల్సొచ్చి ఇండియాలో ఉన్న ఆస్తుల్ని అమ్మేయాల‌నుకొంటాడు రాబిన్‌. అందుకే ఇండియా వ‌స్తాడు. ఇక్క‌డ చైత్ర (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌) కంఫ‌ర్ట్‌ని ప్రేమిస్తుంది. `నువ్వు న‌న్ను ఎంతైనా ప్రేమించుకో.. న‌న్ను మాత్రం ప్రేమించ‌మ‌ని అడ‌క్కు` అంటాడు. ఈ ఆఫ‌ర్ న‌చ్చి కంఫ‌ర్ట్ వెనుక ప‌డుతుంది చైత్ర‌.  ఇక్క‌డ ఆస్తుల్ని అమ్మేసి రాబిన్ హుడ్ అమెరికా వెళ్లిపోవాల‌నుకొంటాడు. కానీ ఫ్లైట్‌లో చైత్ర గుర్తొస్తుంది. అది ప్రేమే అని తెలుసుకొని  ప్ర‌యాణం మానుకొని చైత్ర ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. ఇంత‌లో చైత్ర‌ని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు.  చైత్ర డైరీ చూస్తే.. త‌న‌ది బీహార్ లోని విలాస్ పూర్ అనే గ్రామం అని తెలుస్తుంది. అక్క‌డ‌ సోలోమాన్ సింగ్ ఠాకూర్(రవి కిషన్), అతని కొడుకు (కబీర్ సింగ్)లు అరాచ‌కాలు సృష్టిస్తుంటారు. ఆ గ్రామంలో అడుగుపెట్టాక ఏం జ‌రిగింది? అస‌లు చైత్ర ఎవ‌రు?  కంఫ‌ర్ట్‌ని ఎందుకు ప్రేమించింది? ఈ సంగ‌తి తెలియాలంటే కిక్ 2 చివ‌రి వ‌ర‌కూ చూడాలి.


ఎనాలసిస్ :

కిక్ లో కథానాయ‌కుడి పాత్ర చిత్ర‌ణ‌, అత‌ని అల‌వాట్లు, ఇష్టాలూ ఇవన్నీ కొత్త‌గా ఉంటాయి. అత‌ని పాత్ర చుట్టూనే క‌థ న‌డుస్తుంది. కాక‌పోతే.. ఆ సినిమాలో ఎమోషన్స్ కూడా ఉంటాయ్‌. అవ‌న్నీ బ‌లంగా పండాయి. అయితే కిక్ 2లో కేవ‌లం క‌థానాయ‌కుడి పాత్ర చిత్ర‌ణ‌నే న‌మ్ముకొన్నారు. ఇందులోనూ ఎమోషన్స్ పండించ‌డానికి ఆస్కారం ఉంది. కానీ ద‌ర్శ‌కుడు ఆ సంగ‌తి మ‌ర్చిపోయి... కేవ‌లం కంఫ‌ర్ట్‌పైనే దృష్టి పెట్టాడు. క‌థానాయ‌కుడి ఎంట్రీ, త‌న ప‌రిచ‌యం, బ్ర‌హ్మానందంతో ఆడుకోవ‌డం, ర‌కుల్ తో ప్రేమాయ‌ణం.. ఇలాంటి స‌న్నివేశాల‌తో సినిమా ఓకే అనిపించేలా మొద‌ల‌వుతుంది. కానీ సినిమాలో స‌న్నివేశాలే త‌ప్ప‌... `క‌థ‌` క‌నిపించ‌దు. ఎంత‌కీ సినిమా ఓ గిరి గీసుకొని దాని చుట్టూనే తిరుగుతుంటుంది. అంతే త‌ప్ప‌... క‌థ అనే బోర్డ‌ర్‌పైనా కాలు పెట్ట‌లేదు. సెకండాఫ్‌లో బీహార్‌లోకి ఎంట‌ర్ అవుతుంది. అక్క‌డైనా హీరో త‌న క‌ర్తవ్యం తెలుసుకొని విల‌న్ల భ‌ర‌తం ప‌డ‌తాడ‌నుకొంటే అదీ లేదు. సెకండాఫ్‌లో కూడా స‌న్నివేశాల్ని సాగ‌దీసి సాగ‌దీసి గంద‌ర‌గోళం సృష్టించాడు ద‌ర్శ‌కుడు. విల‌న్ - హీరోల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష ఘ‌ర్ష‌ణ‌కు ఒక్క‌సారి కూడా ఛాన్స్ ఇవ్వ‌లేదు. క‌థానాయ‌కుడు, ప్ర‌తినాయ‌కుడు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ లేకపోతే ఇక ఇలాంటి క‌థ‌ల్లో మ‌జా ఏం ఉంటుంది. ఇద్ద‌రూ ఎదురుప‌డేదే ప్రీ క్లైమాక్స్ లో,  దాన్ని బ‌ట్టి స్ర్కీన్ ప్లే ఎంత పేల‌వంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఓ ఊరు ఊరంతా ఓ గొప్ప మ‌నిషి కోసం, త‌మ‌ని కాపాడే దేవుడి కోసం, త‌మ‌ని న‌డిపించే నాయ‌కుడి కోసం ఎదురుచూస్తుంటుంది. అలాంటివాడు ఆ ఊరొస్తాడు. అప్పుడు ఎన్ని బ‌ల‌మైన భావోద్వేగాలు పండించాలి?  అక్క‌డ ఎంత ప‌దునైన స‌న్నివేశాల్ని రాసుకోవాలి?  కానీ అవేం ప‌ట్టించుకోకుండా ఆ సీన్ల‌న్నీ తేల్చేశారు. లాజిక్‌కి అంద‌ని స‌న్నివేశాల‌తో నింపేశారు. ఊరు ఊరంతా వ‌ల్ల‌కాడులా ఉంటుంది. కానీ కంఫ‌ర్ట్ ఇల్లు మాత్రం రాజ‌భోగాల‌తో వ‌ర్థిల్లుతుంటుంది. ఊరంతా హీరో కోసం తెలుగు నేర్చుకొన్నారు స‌రే, మ‌రి విల‌న్ కూడా తెలుగులోనే మాట్లాడ‌తాడు. త‌నెప్పుడు తెలుగు నేర్చుకొన్నాడో  మ‌రి. అదంతా మ‌న కంఫ‌ర్ట్ కోసం అనుకోవాలి.

బ్ర‌హ్మానందం - ర‌వితేజ మ‌ధ్య న‌డిచే కామెడీ కిక్ కి బ‌లం. ఆ కామెడీ కూడా ఈ సినిమాలో పండ‌లేదు. స‌రిక‌దా, విసుగు తెప్పించింది. పోసాని కృష్ణ‌ముర‌ళి ఎపిసోడ్ అయితే మ‌రీ లెంగ్తీగా ఉండి.. బోర్ కొట్టించింది. ఆ సీన్స్ వ‌ర్క‌వుట్ అయితే.. ఫ‌స్టాఫ్ ఓకే అనిపించేదేమో. సీన్లు పండ‌కపోవ‌డం వ‌ల్ల కిక్ 2 ఫ‌స్ట్ ఆఫ్ గ‌డిచేస‌రికి సినిమా చూసినంత సీర‌సం వ‌చ్చేస్తుంది. సెకండాఫ్‌లో బ‌ల‌మైన సీన్లు లేక‌పోవ‌డం వ‌ల్ల అది కాస్త తేలిపోయింది. చివ‌ర్లో క‌థానాయ‌కుడు శ‌త్రు సంహారం చేయ‌డంతో రొటీన్ గా సినిమా ముగుస్తుంది.

ర‌వితేజ కోస‌మే రాసుకొన్న క్యారెక్ట‌ర్ కాబ‌ట్టి.. త‌న‌కు టైల‌ర్ మేడ్ అని చెప్పొచ్చు. త‌న ఎన‌ర్జీతో ఈ సినిమాకి కిక్ ఇవ్వ‌డానికి త‌న వంతు కృషి చేశాడు. అయితే అది స‌రిపోలేదు. బాగా స‌న్న‌బ‌డ‌డం వ‌ల్ల మొహంలో క‌ళ పోయింది. కొన్ని చోట్ల వ‌య‌సు ప్ర‌భావం కూడా క‌నిపించింది. గ్లామ‌ర్ పాత్ర‌లో ర‌కుల్ మెప్పించింది. లిప్ లాక్ కూడా ఇచ్చేసి కుర్ర‌కారుని క‌వ్వించింది. బ్ర‌హ్మానందం పాత్ర‌ని స‌రిగా వాడుకోలేదు. పోసాని, భ‌ర‌ణి.. ఇలా ఉద్దండులున్నారే గానీ.. వాళ్లు కూడా ఏమాత్రం ఆన‌లేదు. రేసుగుర్రంలో మెప్పించిన ర‌వికిష‌న్ ఈ సినిమాలో తేలిపోయాడు. అరుపులు త‌ప్ప అత‌ని న‌ట‌న క‌నిపించ‌లేదంటే ఆ పాత్ర తీర్చిదిద్దిన విధాన‌మే త‌ప్పు. క‌బీర్‌నీ ద‌ర్శ‌కుడు స‌రిగా వాడుకోలేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

సాంకేతికంగా ఈ సినిమా ఎంత గొప్ప‌గా ఉంటే ఏంటి?  ఎన్ని డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తే ఏంటి?  సినిమాలో విష‌యం లేనప్పుడు అదంతా వృథానే. ఖ‌ర్చు త‌ప్ప తెర‌పై ఏం క‌నిపించ‌లేదు. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస ఫొటోగ్ర‌ఫీ బాగుంది. బీహార్ లొకేష‌న్ల‌ను గ్రాండ్ త‌న కెమెరాలో బంధించ‌గ‌లిగాడు. త‌మ‌న్ పాట‌ల్లో ద‌రువే త‌ప్ప ఏం వినిపించ‌లేదు. ఆర్‌.ఆర్‌లోనూ అదే మోత‌. వక్కంతం క‌థ‌లో ద‌మ్ములేదు. మాటల్లో పంచ్ లేదు. ఇక సురేంద‌ర్ రెడ్డి త‌న స్ర్కీన్ ప్లే టెక్నిక్స్ అన్నీ మ‌ర్చిపోయాడు. సాదాసీదా క‌థ‌ని రొటీన్ ఫార్మెట్‌లో ముగించేశాడు.

కిక్ పేరు ఉంద‌ని, కంఫ‌ర్ట్‌గా సీట్ల‌లో కూర్చుంటే.. స‌గం సినిమా అయ్యే స‌రికి అన్ కంఫ‌ర్ట్‌నెన్ మొద‌ల‌వుతుంది. కిక్ 2 చూశాక‌.. కిక్‌పై మీకున్న ప్రేమ త‌గ్గితే అది మీ త‌ప్పు మాత్రం కాదు.

పంచ్‌:  కంఫ‌ర్ట్ మిస్‌