Read more!

English | Telugu

సినిమా పేరు:కేజీఎఫ్ చాప్ట‌ర్ 2
బ్యానర్:హోంబ‌ళే ఫిలిమ్స్‌
Rating:3.75
విడుదలయిన తేది:Apr 14, 2022

సినిమా పేరు: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2
తారాగ‌ణం: య‌శ్‌, శ్రీ‌నిధి శెట్టి, సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, రావు ర‌మేశ్‌, ఈశ్వ‌రీ రావు, అచ్యుత్ కుమార్‌, ప్ర‌కాశ్ రాజ్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, జాన్ కొక్కెన్‌, అర్చ‌నా జాయిస్‌, మాళ‌వికా అవినాశ్‌, టి.ఎస్‌. నాగాభ‌ర‌ణ‌, హ‌రీశ్ రాయ్‌, బాల‌కృష్ణ‌, శ‌ర‌ణ్ శ‌క్తి
మాట‌లు: హ‌నుమాన్ చౌద‌రి
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి
మ్యూజిక్: ర‌వి బ‌స్రూర్‌
సినిమాటోగ్ర‌ఫీ: భువ‌న్ గౌడ‌
ఎడిటింగ్: ఉజ్వ‌ల్ కుల‌క‌ర్ణి
స్టంట్స్: అన్బ‌రివ్‌
నిర్మాత: విజ‌య్ కిరంగ‌దూర్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ నీల్‌
బ్యాన‌ర్: హోంబ‌ళే ఫిలిమ్స్‌
విడుద‌ల తేదీ: 14 ఏప్రిల్ 2022

'కేజీఎఫ్' సినిమా చూసిన‌వాళ్లు ఆ సినిమాకూ, అందులో హీరోగా న‌టించిన య‌శ్‌కూ, దాన్ని డైరెక్ట్ చేసిన ప్ర‌శాంత్ నీల్‌కూ అభిమానులైపోయారు. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' వ‌స్తోందంటే వాళ్లంతా ఎంత ఆనంద‌ప‌డ్డారో చెప్ప‌లేం. దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన క్రేజ్‌నూ, ఎక్స్‌పెక్టేష‌న్స్‌నూ అందుకున్న 'చాప్ట‌ర్ 2' ఎలా ఉంటుందో చూడాల‌ని దేశంలోని సినీ ప్రియులంతా క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తూ వ‌చ్చారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోకి వెళ్లి దానికి రాజైన గ‌రుడ‌ను హ‌త‌మార్చిన రామ‌కృష్ణ అలియాస్ రాకీని చూసిన మ‌నం, 'చాప్ట‌ర్ 2'లో ఆ కేజీఎఫ్‌ను రాకీ భాయ్ ఎలా ఏలాడో చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతూ వ‌చ్చాం. మ‌న అంచ‌నాల‌ను ఏ రేంజ్‌లో అందుకునేట్లు 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' ఉందంటే...

క‌థ‌:- గ‌రుడ‌ను అత‌ని మ‌నుషుల మ‌ధ్య‌లోనే ఒక్క క‌త్తివేటుతో తెగ‌న‌రికిన రాకీ (య‌శ్‌) కేజీఎఫ్‌ను త‌న హ‌స్త‌గ‌తం చేసుకుంటాడు. అక్క‌డ కూలీలుగా ప‌నిచేస్తోన్న వేలాది మందికి అత‌ను దేవుడ‌వుతాడు. కానీ గ‌రుడ‌ను చంపి గోల్డ్ మైన్స్‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నుకున్న అత‌ని దాయాదుల‌కు ఇది కంట‌గింపుగా మారుతుంది. గ‌రుడ‌ను చంప‌డానికి తాము పంపిన మ‌నిషే, ఆ బంగారు గ‌నుల సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొని రాజు అవ‌డం భ‌రించ‌లేని వారు రాకీని చంప‌డానికి అత్యంత కిరాత‌కుడైన‌ అధీర (సంజ‌య్ ద‌త్‌)ను రంగంలోకి దించుతారు. కేజీఎఫ్‌ను నిర్మించిన వారిలో అధీర ఒక‌డు. అత‌డిని గ‌రుడ చంపేశాడ‌ని అప్ప‌టిదాకా అంద‌రూ అనుకుంటూ వ‌స్తారు. వ‌చ్చీ రాగానే తుపాకి తూటాతో రాకీని దెబ్బ‌తీసి, ప్రాణాల‌తో వ‌దిలేసి, కేజీఎఫ్‌ను స్వాధీనం చేసుకోవ‌డానికి వ‌స్తాన‌ని చెప్తాడు అధీర‌. మ‌రోవైపు కేజీఎఫ్ గురించి పాతికేళ్లుగా ప‌రిశోధ‌న చేస్తూ వ‌చ్చిన సీబీఐ చీఫ్ క‌న్నెగంటి రాఘ‌వ‌న్ (రావు ర‌మేశ్‌) అప్పుడే ఎన్నిక‌ల్లో గెలిచి, ప్ర‌ధాన మంత్రి అయిన ర‌మికా సేన్ (ర‌వీనా టాండ‌న్‌)కు త‌ను తెలుసుకున్న విష‌యాల‌ను ఆమెకు చెప్తాడు. కేజీఎఫ్ గురించీ, రాకీ గురించీ తెలుసుకొని షాక్‌కు గురైన ర‌మికా సేన్‌, అత‌డిని ప‌ట్టుకోవాల‌ని పంతం ప‌డుతుంది. ఒక‌వైపు అధీర‌, మ‌రోవైపు ర‌మికా సేన్‌.. వీళ్ల దాడుల నుంచి రాకీ త‌న‌ను తాను కాపాడుకుంటూ, కేజీఎఫ్‌ను కాపాడుకున్నాడా, లేదా? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

'కేజీఎఫ్‌'తో డైరెక్ట‌ర్‌గా త‌ను ఏ స్థాయివాడో చూపించిన ప్ర‌శాంత్ నీల్‌, 'చాప్ట‌ర్ 2'తో తాను దేశంలోని అగ్ర‌శ్రేణి ద‌ర్శ‌కుల్లో ఒక‌డిన‌నే విష‌యాన్ని మ‌రోసారి చాటిచెప్పాడు. 'చాప్ట‌ర్ 2' అనేది కూడా నిస్సందేహంగా డైరెక్ట‌ర్ సినిమా. క్యారెక్ట‌రైజేష‌న్స్ కానీ, స్క్రీన్‌ప్లే కానీ, సీన్ల పిక్చ‌రైజేష‌న్ కానీ వేరే లెవ‌ల్ అన్న‌ట్లు ఉన్నాయి. డైరెక్ట‌ర్ మైండ్‌ను అర్థం చేసుకున్న‌వారిలా యాక్ట‌ర్లు, టెక్నీషియ‌న్లు చెల‌రేగిపోయి ప‌నిచేశారు. అమ్మకిచ్చిన మాట కోసం ప‌దిమందిలో ఒక‌డిలా కాకుండా, త‌నే ఒక శ‌క్తిలా రాకీ ఎలా ఎదిగాడో ఫ‌స్ట్ చాప్ట‌ర్‌లో మ‌నం చూశాం. దుర్బేధ్య‌మైన కేజీఎఫ్‌లోకి వెళ్లి, ఆ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న గ‌రుడ‌ను చివ‌ర‌లో ఒక్క‌వేటుతో తెగ‌న‌రికి అంద‌ర్నీ షాక్‌కు గురిచేసిన రాకీని చూశాం. ఇప్పుడు ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కు త‌నే రాజై, అక్క‌డ ప‌నిచేసే కూలీల‌కు అత‌ను దేవుడిలా ఎలా మారాడో 'చాప్ట‌ర్ 2'లో మ‌నకు ఆద్యంతం ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగించే, రోమాలు నిక్క‌బొడుచుకొనే సీన్ల‌తో చూపించాడు ద‌ర్శ‌కుడు. మ‌న‌ల్ని మ‌రో లోకంలా అనిపించే కేజీఎఫ్ లోకంలోకి తీసుకెళ్లిపోయాడు.

అస‌లు కేజీఎఫ్‌లోకి రాకీ ఎందుకు వెళ్లాడో ఈ సినిమాలో రివీల్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్ట్ చాప్ట‌ర్ త‌ర‌హాలోనే దానికీ అమ్మ‌ను అడ్డం పెట్టుకున్నాడు. రాకీ చిన్న‌తంలో అమ్మ బంగారం గురించి ఆపేక్ష‌గా మారుతుంటే, 'బంగారం అంటే నీకు అంత ఇష్ట‌మా అమ్మా' అని అమాయ‌కంగా అడుగుతాడు. 'బంగారం అంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండ‌దు నాన్నా' అంటుంది అమ్మ‌. 'అయితే ప్ర‌పంచంలోని బంగారాన్నంతా తీసుకొస్తాను' అని అమ్మ‌కు మాటిస్తాడు రాకీ. ఈ సినిమా క‌థ మొత్తం ఆధార‌ప‌డింది ఈ సీన్‌మీదే. ప్ర‌పంచంలోని బంగారాన్నంతా అత‌ను పోగు చేయ‌క‌పోవ‌చ్చు కానీ, కేజీఎఫ్‌కు ఎందుకు వెళ్లాడో ఇప్పుడు మ‌న‌కు తెలిసిపోయింది. కేజీఎఫ్‌కు అధిప‌తి అయిన రాకీ ప్ర‌త్య‌ర్థుల నుంచి త‌న‌ను తాను కాపాడుకుంటూ, కేజీఎఫ్‌ను కాపాడుకోవ‌డ‌మ‌నే పాయింట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. కానీ ఆ పాయింట్‌ను కూడా త‌న‌కే సాధ్య‌మైన రీతిలో సూపర్బ్‌గా ప్రెజెంట్ చేశాడు ప్ర‌శాంత్ నీల్‌.

సినిమా మొత్త‌మ్మీద రాకీ, అధీర మూడంటే మూడు సార్లు ప‌ర‌స్ప‌రం తార‌స‌ప‌డ‌తారు. మొద‌టిసారి అధీర‌ది పైచేయి అయ్యి, రాకీని ప్రాణాల‌తో వ‌దిలేస్తాడు. రెండోసారి రాకీది పైచేయి అయ్యి అధీర‌కు ప్రాణ‌భిక్ష పెడ‌తాడు. మూడోసారి ఎదురైన‌ప్పుడు ఒక‌రే మిగ‌లాలి. ఈసారి యాక్ష‌న్ సీక్వెన్స్ అలా ఇలా ఉండ‌వు. ఈ సంద‌ర్భంగా అన్బ‌రివ్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీని ఎంతైనా మెచ్చుకోవాలి. యాక్ష‌న్ సీన్ల‌ను తీయ‌డంలో ఇండియ‌న్ డైరెక్ట‌ర్స్ ఇప్పుడు ప్ర‌పంచ‌స్థాయి ద‌ర్శ‌కుల‌కు ఏమాత్రం తీసిపోర‌ని 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' స్ప‌ష్టంగా మ‌రోసారి తెలియ‌జేసింది. ర‌వి బ‌స్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌, సౌండ్ డిజైన్ ఈ సినిమా స్థాయిని పెంచింది. చాప్ట‌ర్ 1 త‌ర‌హాలోనే ఈ సీక్వెల్‌లోనూ మాట‌లు త‌క్కువ‌, చేత‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఆ ఉన్న మాట‌లు కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. తెలుగు వెర్ష‌న్‌కు హ‌నుమాన్ చౌద‌రి రాసిన డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. డ‌బ్బింగ్ సినిమా డైలాగ్స్‌లా కాకుండా ఒరిజిన‌ల్ తెలుగు సినిమా డైలాగ్స్ త‌ర‌హాలో ప‌క్కాగా కుదిరాయి. మెయిన్ క్యారెక్ట‌ర్స్‌తో పాటు మిగ‌తా వాళ్ల క్యారెక్ట‌రైజేష‌న్స్‌ను కూడా శ్ర‌ద్ధ‌గా తీర్చిదిద్దాడు ప్ర‌శాంత్ నీల్‌. క్లైమాక్స్ సీన్లు నిజంగానే షాక్‌కు గురిచేస్తాయి. వీరుడ‌నేవాడు త‌న రాత‌ను త‌నే రాసుకుంటాడ‌నేందుకు రాకీ క్యారెక్ట‌ర్ ఒక నిద‌ర్శ‌నం.

న‌టీన‌టుల ప‌నితీరు:- 'కేజీఎఫ్' అనేది రాకీ సినిమా అయితే, 'కేజీఎఫ్ 2' రాకీ భాయ్ సినిమా. ఆ క్యారెక్ట‌ర్‌లో య‌శ్‌ను ల‌వ్ చేయ‌ని వాళ్లెవ‌రు! ఈ సినిమాతో అత‌ను పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ అయిపోవ‌డం త‌థ్యం. యాక్ష‌న్ సీన్ల‌లో చెల‌రేగిపోయి ఎలా ఫైట్లు చేశాడో, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో అలా ప‌ర్ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించాడు. మాట‌లతోనూ, చేత‌ల‌తోనూ, హావ‌భావాల‌తోనూ మెప్పించాడు. అత‌ని ఫ్యాన్ బేస్ ఈ సినిమాతో దేశ‌వ్యాప్తంగా ఎన్నో రెట్లు పెరుగుతుంది. అధీర పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ విశ్వ‌రూప ప్ర‌ద‌ర్శ‌నం చూస్తాం. లుక్స్ ప‌రంగా, ప‌ర్ఫార్మెన్స్ ప‌రంగా ఆ పాత్ర‌కు అచ్చుగుద్దిన‌ట్లు ఆయ‌న స‌రిపోయాడు. ప్ర‌ధాని ర‌మికా సేన్ క్యారెక్ట‌ర్‌కు ర‌వీనా టాండ‌న్ ప‌ర్‌ఫెక్టు చాయిస్‌. ఆమె సూప‌ర్బ్‌గా ఆ పాత్ర‌లో ఇమిడిపోయింది. చాప్ట‌ర్ 1లో ఎక్కువ స్క్రీన్ టైమ్ ల‌భించని హీరోయిన్ రీనా క్యారెక్ట‌ర్‌కు ఈ మూవీలో చెప్పుకోద‌గ్గ నిడివి ల‌భించింది. ఆ పాత్ర‌లో శ్రీ‌నిధి శెట్టి మెప్పించింది. కేజీఎఫ్‌లో ప‌నిచేసే ముస్లిం వ‌నిత ఫాతిమాగా ఈశ్వ‌రీ రావు, సీబీఐ చీఫ్ క‌న్నెగంటి రాఘ‌వ‌న్‌గా రావు ర‌మేశ్‌, పొలిటీషియ‌న్ గురు పాండ్య‌న్‌గా అచ్యుత్ కుమార్‌, రాకీ త‌ల్లిగా అర్చ‌నా జాయిస్‌, వాన‌రం పాత్ర‌లో అయ్య‌ప్ప శ‌ర్మ‌, మిగ‌తా వాళ్లు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కేజీఎఫ్ అనే మ‌రోలోకం లోకి తీసుకుపోయి, కుర్చీల‌పై మునివేళ్ల‌తో కూర్చోపెట్టేలా చేసి, రాకీ భాయ్ ప‌రాక్ర‌మాన్ని వేరే లెవ‌ల్‌లో చూపించే చాప్ట‌ర్ 2ను మిస్ కావ‌ద్దు. ఇది.. ప్ర‌శాంత్ నీల్ అనే ద‌ర్శ‌కుడి ప‌నిత‌నాన్ని త‌ప్ప‌కుండా చూసి, వినోదించాల్సిన సినిమా.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి