Read more!

English | Telugu

సినిమా పేరు:జయమ్మ పంచాయితీ
బ్యానర్:వెన్నెల క్రియేషన్స్
Rating:2.75
విడుదలయిన తేది:May 6, 2022

సినిమా పేరు: జయమ్మ పంచాయితీ
తారాగ‌ణం: సుమ కనకాల, దేవి ప్రసాద్, దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్, నికిత, గణేష్ యాదవ్, భువన్ సాలూరు, గేదెల త్రినాధ్, అమ్మ రామకృష్ణ, మాయానంద్ ఠాకూర్ రెడ్డి, డి హేమ
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సినిమాటోగ్ర‌ఫీ: అనూష్ కుమార్
ఎడిటింగ్: రవితేజ గిరజాల
నిర్మాత: బలగ ప్రకాష్
ద‌ర్శ‌క‌త్వం: విజయ్ కుమార్ కలివరపు
బ్యాన‌ర్: వెన్నెల క్రియేషన్స్
విడుద‌ల తేదీ: మే 06,2022

బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల చాలా కాలం తర్వాత 'జయమ్మ పంచాయితీ' సినిమాతో వెండితెర ప్రేక్షకులను పలకరించింది. విజయ్ కుమార్ కలివరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. టీవీ షోలు, సినిమా ఈవెంట్ లతో యాంకర్ గా ఎందరో అభిమానాన్ని సొంతం చేసుకున్న సుమ ప్రధాన పాత్ర పోషించిన సినిమా కావడంతో 'జయమ్మ పంచాయితీ'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యాంకర్ గా తన పంచ్ లతో ఎంటర్టైన్ చేసే సుమ యాక్టర్ గా జయమ్మ పాత్రకు ఎంతవరకు న్యాయం చేసింది? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:- శ్రీకాకుళం జిల్లాలోని ఓ పల్లెటూరులో నివసించే జయమ్మ(సుమ) కుటుంబం కష్టాన్ని నమ్ముకొని కౌలు వ్యవసాయం చేసుకొని బతుకుతుంటుంది. ఒకప్పుడు బాగానే బతికిన ఈ కుటుంబం అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సాయాలు, ఈడులు(చదివింపులు) పేరుతో ఈ స్థితికి చేరుతుంది. అయినప్పటికీ ఉన్నంతలో బాగానే బతుకుతున్న ఈ కుటుంబానికి ఒకే సమయంలో ఓ మంచి వార్త, ఓ చెడు వార్త తెలుస్తాయి. జయమ్మ పెద్ద కూతురు పుష్పవతి అవుతుంది. అయితే కూతురుకి ఫంక్షన్ జరపాలని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో జయమ్మ భర్త(దేవి ప్రసాద్)కి గుండె జబ్బు ఉందని, ఆపరేషన్ కి నాలుగు లక్షలు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. అప్పు కోసం ప్రయత్నించి విసిగిపోయిన జయమ్మకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పటిదాకా ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వేలల్లో ఈడులు చదివించాం.. ఇప్పుడు తన ఇంట్లో ఫంక్షన్ జరిగితే కనీసం ఐదు లక్షలైనా చదివింపులు వస్తాయని భావించిన జయమ్మ ఘనంగా ఫంక్షన్ జరిపిస్తుంది. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్లుగా.. తన ఈడుల ప్లాన్ బెడిసికొట్టి అది పెద్ద పంచాయితీకి దారి తీస్తుంది. జయమ్మ ఈడుల పంచాయితీకి ఆ ఊరిలోని కొందరి కథలు ముడిపడి ఉంటాయి. అసలు జయమ్మ పంచాయితీ ఏంటి? ఆ పంచాయితీకి ముడిపడి ఉన్న కథలేంటి? ఆ పంచాయితీలో జయమ్మ విజయం సాధించి భర్తకు ఆపరేషన్ చేయించగలిగిందా? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

ఒక విలేజ్ డ్రామా, అందులోనూ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీతో దర్శకుడిగా తొలి అడుగు వేయాలనుకోవడం విజయ్ కుమార్ ని ముందుగా అభినందించాల్సిన విషయం. శ్రీకాకుళం ప్రాంతంలో తాను చూసిన మనుషులు, సంఘటనలు ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు విజయ్. అందుకేనేమో ప్రతి సన్నివేశంలోనూ శ్రీకాకుళం మట్టివాసన కనిపించేలా చూసుకున్నాడు. చదివింపులు అనే పాయింట్ తో కథ రాసుకోవడం, దానికి మరికొన్ని కథలు ముడిపెట్టడం అనే ఆలోచన బాగుంది. అయితే ఆ ఆలోచనను ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో కొంతవరకే సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ విజయ్.

జయమ్మ పాత్రను మలిచిన విధానం బాగుంది. అయితే ఆమె పాత్రలో ఎంతో పెయిన్ ఉంది కానీ ఆ పెయిన్ ని ఆడియన్స్ అంతగా ఫీల్ అవ్వలేరు. ఆమె బాధని పంచాయితీ రూపంలోనో, మాటల రూపంలోనో ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అలా కాకుండా రెండు మూడు బలమైన సన్నివేశాలు పడి ఉంటే ఎమోషనల్ గా మరింత కనెక్ట్ అయ్యేది. అలాగే పంచాయితీకి ముడిపెడుతూ రాసుకున్న కథలు, పాత్రలు బాగున్నాయి. కానీ వాటికి తగ్గ బలమైన సన్నివేశాలు పడలేదు. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్ రెండూ ఉన్నాయి కానీ అవి ఆడియన్స్ ని కట్టిపడేసే అంతగా లేవు.

ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ బాగున్నాయి. గుడిలో పూజ చేయడానికి కావాల్సిన అర్హత కులం కాదు.. గుండెల నిండా భక్తి అనే సున్నితమైన విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అలాగే చాలా ప్రాంతాల్లో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొందరిని దూరంగా ఉంచి, ఊళ్ళో ఎవరికి ఏం జరిగినా వాళ్లపై దాడి చేస్తుంటారు. ఇలా ఈ చిన్న సినిమాలోనే ఎన్నో కథలు, ఎన్నో పాయింట్స్ చూపించాడు దర్శకుడు. అయితే రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో ఎక్కువగా జయమ్మ పంచాయితీ గురించే ఉంది. విన్న మాటలే మళ్ళీ వింటూ, చూసిన సన్నివేశాలే మళ్ళీ చూస్తూ అక్కడక్కడా సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

ఎంఎం కీరవాణి సంగీతం బాగుంది. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఊరి వాతావరణాన్ని, ప్రకృతి అందాలను మరింత అందంగా చూపించాడు. ఎడిటర్ రవితేజ గిరజాల తన కత్తెరకు మరింత పని చెప్పి ఉండాల్సింది. సినిమా నిడివి ఎక్కువగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల పనితీరు:- జయమ్మ పాత్రకు సుమ పూర్తి న్యాయం చేసింది. యాంకర్ గా పంచ్ లు వేస్తూ బాగా ఎంటర్టైన్ చేసే సుమ.. విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జయమ్మ పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందో అనే అనుమానాలు ఉండేవి. కానీ తన నటనతో ఆ అనుమానాలను అన్నింటిని పటాపంచలు చేసింది. ఆహార్యంలోనూ, అభినయంలోనూ జయమ్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఇక జయమ్మ భర్త పాత్రలో దేవీప్రసాద్ ఆకట్టుకున్నాడు. దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్, నికిత, గణేష్ యాదవ్, భువన్ సాలూరు ,గేదెల త్రినాధ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

తీర్పు పూర్తిగా విజయానికి అనుకూలంగా రాకపోయినా ఓ మాదిరిగా ప్రేక్షకులను అలరించే సినిమా 'జయమ్మ పంచాయితీ'. సుమ నటన కోసం, పల్లె మట్టి వాసన కోసం ఈ సినిమాకి ఒకసారి చూసేయొచ్చు.

-గంగసాని