Read more!

English | Telugu

సినిమా పేరు:జపాన్‌
బ్యానర్:డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
Rating:2.00
విడుదలయిన తేది:Nov 10, 2023

నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్‌, సునీల్‌, కె.ఎస్‌.రవికుమార్‌, విజయ్‌ మిల్టన్‌, జితన్‌ రమేష్‌, వాగై చంద్రశేఖర్‌, బావా చెల్లదురై తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ: రవివర్మన్‌
ఎడిటర్‌: ఫిలోమిన్‌ రాజ్‌
పాటలు: భాస్కరభట్ల, రాకేందుమౌళి వెన్నెలకంటి
మాటలు: రాకేందుమౌళి వెన్నెలకంటి
ఫైట్స్‌: అనల్‌ అరసు
నిర్మాత: ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
బ్యానర్‌: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజు మురుగన్‌
విడుదల తేదీ: 10.11.2023

విభిన్నమైన కథలను, విలక్షణమైన క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ తన ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండేలా చూసుకునే హీరో కార్తీ. తాజాగా మరో కొత్త తరహా సినిమా ‘జపాన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌, తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలైంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని ఓ కొత్త తరహా క్యారెక్టర్‌ని ‘జపాన్‌’ చిత్రంలో చేశాడు. రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించింది. మరి ‘జపాన్‌’ సినిమా కథలో కార్తీకి నచ్చిన ఆ కొత్త అంశం ఏమిటి? దాన్ని దర్శకుడు రాజు మురుగన్‌ తెరకెక్కించడంలో ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? కార్తీ కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్‌ అవుతుంది? ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్‌ అయింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

కథ :

ఈ సినిమాలో కథ ఇదీ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని దాన్ని రెండున్నర గంటల సినిమాగా మలిచేందుకు దర్శకుడు కృషి చేశాడు. సినిమా ప్రారంభంలోనే ఓ జ్యూయలరీ షాప్‌లో 200 కోట్ల రూపాయల విలువైన నగలు మాయమవుతాయి. కట్‌ చేస్తే... జపాన్‌ అనే పేరు మోసిన దొంగ. దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగారం షాపులను కొల్లగొట్టి కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని దోచుకెళ్లడమే పనిగా పెట్టుకుంటాడు. అయితే దోచుకున్న బంగారాన్ని పేదలకు పంచిపెడుతూ మంచి దొంగ అని కూడా అనిపించుకుంటారు. అన్ని రాష్ట్రాల పోలీసులు అతని కోసం గాలిస్తుంటారు. 200 కోట్ల విలువైన బంగారం దొంతనం కూడా జపాన్‌ పనేనని అందరూ నమ్ముతారు. ఈ బంగారానికి సంబంధించి హోం మినిస్టర్‌ కూడా ఇన్‌వాల్వ్‌ అయి ఉండడంతో ఈ కేసును పోలీసులు ఒక ఛాలెంజ్‌గా తీసుకొని జపాన్‌ను పట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. పోలీసులు చేసిన స్కామ్‌లకు సంబంధించిన ఎవిడెన్స్‌ జపాన్‌ దగ్గర ఉంటుంది. దాన్ని చేజిక్కించుకోవాలనేదే పోలీసుల ప్రధాన లక్ష్యం. జపాన్‌ దగ్గర నుంచి ఆ ఎవిడెన్స్‌ను సంపాదించి 200 కోట్ల బంగారం దొంగతనం కేసులో ఎవరో ఒకర్ని ఇరికించాలని పోలీసులు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఒక అమాయకుడిని అరెస్ట్‌ చేసి అతనే దొంగతనం చేశాడని ఒప్పించేందుకు అతన్ని చిత్రహింసలకు గురి చేస్తారు. ఈ కేసు విచారణ చేసే క్రమంలోనే అసలు ఆ దొంగతనం జపాన్‌ చేయలేదని తెలుస్తుంది. మరి ఆ దొంగతనం ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అమాయకుడైన యువకుడిని చివరికి పోలీసులు ఏం చేశారు? జపాన్‌ పోలీసులకు చిక్కాడా? అనేది మిగతా కథ. 


ఎనాలసిస్ :

ఒక డిఫరెంట్‌ లుక్‌, డిఫరెంట్‌ మేనరిజమ్‌తో జపాన్‌ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌. సినిమాలో బలమైన కథ అంటూ ఏమీ లేదు. చిన్న పాయింట్‌ను తీసుకొని దాన్నే అటు తిప్పి ఇటు తిప్పి చూపించిన సీన్లే మళ్ళీ మళ్లీ చూస్తున్నామని ఫీల్‌ వచ్చేలా సినిమాని నడిపించిన తీరు చూస్తే ఈ కథను ఎలా నడపాలి, ఎలా ప్రేక్షకుల్ని ఇందులో ఇన్‌వాల్వ్‌ చెయ్యాలి అనే దానిపై దర్శకుడికి ఎలాంటి క్లారిటీ లేదనేది అర్థమవుతుంది. రెండున్నర గంటలకుపైగా ఉన్న ఈ సినిమాలో అనవసరమైన సీన్సే ఎక్కువగా ఉన్నాయి. సినిమాలో ఎన్నిసార్లు జపాన్‌ను పోలీసులు చుట్టి ముట్టినా వాళ్ళ కళ్ళు గప్పి ఇట్టే తప్పించుకోవడం అనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది. మధ్యలో హీరోయిన్‌తో లవ్‌ ఉన్నట్టు కొన్ని సీన్స్‌ చూపించారు. ఆ తర్వాత హీరోయిన్‌ కనిపించదు. మాటి మాటికీ జపాన్‌ను పోలీసులు చుట్టుముట్టడం, తప్పించుకోవడం, వెంటనే ఛేజ్‌.. ఇలా సినిమాలో ఈ సీన్స్‌ రీపీటెడ్‌గా ఉండడం విసుగు పుట్టిస్తుంది. అయితే కొంత మెరుగైన విషయం ఏమిటంటే.. అక్కడక్కడా కొన్ని జోక్స్‌ బాగా పేలాయి. ఆ రిలీఫ్‌ తప్ప కథపరంగా, సీన్స్‌ పరంగా ఎక్కడా ఆడియన్స్‌కి ఆసక్తి కలగదు.

నటీనటులు :

హీరో కార్తీకి ఇది ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ అనే చెప్పాలి. గెటప్‌, మేనరిజం, డైలాగ్‌ మాడ్యులేషన్‌, బాడీ లాంగ్వేజ్‌.. ఇలా ప్రతి విషయంలోనూ కార్తీ కొత్తగా కనిపించాడు. డిఫరెంట్‌ మాడ్యులేషన్‌లో కార్తీ చెప్పిన డైలాగ్స్‌ చాలా సందర్భాల్లో నవ్వించాయి. జపాన్‌ క్యారెక్టర్‌కి నటుడిగా కార్తీ పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్‌ ఇమ్మానుయేల్‌ క్యారెక్టర్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేదు. అసలు ఆ క్యారెక్టర్‌ సినిమాలో ఉన్నా, లేకపోయినా పెద్ద తేడా ఏం ఉండదు అనేలా ఉంటుంది. సునీల్‌ చేసిన పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ కూడా రొటీన్‌గానే ఉంది, అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా అలాగే ఉంది. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటులు వారి పరిధి మేరకు ఫర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణులు :

సాంకేతిక పరంగా సినిమాలో చెప్పుకోదగ్గ మెరుపులు ఏమీ లేవు. రవివర్మన్‌ సినిమాటోగ్రఫీ నేచురల్‌గా బాగానే ఉంది. అతను ఎక్స్‌ట్రార్డినరీగా ప్రతిభ చూపించాల్సిన అవసరం లేని కథ కావడంతో ఉన్నంతలో బాగానే చేశాడు. జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీతం కూడా షరా మామూలే. పాటలుగానీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గానీ ఏ దశలోనూ ఆకట్టుకోదు. ఎడిటింగ్‌ విషయానికి వస్తే.. సినిమా 2 గంటల 36 నిమిషాల నిడివితో ఉంది. కొన్ని రిపీటెడ్‌ సీన్స్‌ను తీసేస్తే మరో 20 నిమిషాలు తగ్గేది. సినిమాలో కొన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయి. వాటిని ఖర్చుకు వెనకాడకుండా చేసినట్టు అర్థమవుతుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఒక బలమైన కథను తయారు చేసుకోవడంలో విఫలమయ్యాడు. తీసుకున్నది చిన్న పాయింటే అయినా దాన్ని సమర్థవంతంగా నడిపించలేకపోయాడు. హీరో గెటప్‌పైన, మేనరిజమ్‌ పైన.. ఇంకా మిగతా విషయాలపై పెట్టిన శ్రద్ధ కథను ప్రేక్షకులకు నచ్చేలా తయారు చేసుకోవడంలో పెట్టలేదు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఇప్పటి వరకు కార్తీ చేసిన సినిమాలన్నింటినీ ప్రేక్షకులు ఆదరిస్తూనే వస్తున్నారు. తన ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండాలని కోరుకునే కార్తీకి ఈ సినిమా మైనస్‌ అవుతుందనే చెప్పొచ్చు. సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎమోషన్స్‌గానీ, సెంటిమెంట్‌గానీ లేదు. కొన్ని సన్నివేశాల్లో అది చూపే ప్రయత్నం చేసినా అది కూడా కామెడీగానే అనిపిస్తుంది తప్ప మనసుకు హత్తుకునేలా లేదు. సినిమా చూస్తున్నంత సేపు ఏ దశలోనూ నెక్స్‌ట్‌ ఏం జరుగబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో అసలు కలగదు. ఫైనల్‌గా చెప్పాలంటే.. ప్రేక్షకులనే కాదు, కార్తీని కూడా నిరాశపరిచే సినిమా ‘జపాన్‌’.

 

- జి.హరా