English | Telugu
బ్యానర్:కిశోర్ పిక్చర్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 17, 2022
సినిమా పేరు: జేమ్స్
తారాగణం: పునీత్ రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్‌కుమార్, ఆదిత్య మీనన్, ముఖేష్ రిషి, రంగాయన రఘు, అను ప్రభాకర్, సాధుకోకిల, తిలక్ శేఖర్, అవినాశ్, చిక్కన్న, కేతన్ కరండే, షైన్ శెట్టి, మధుసూదన్, శివ రాజ్‌కుమార్ (గెస్ట్)
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: చేతన్ కుమార్
సంగీతం: చరణ్‌రాజ్
బ్యాగ్రౌండ్ స్కోర్: హరికృష్ణ
సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ
ఎడిటింగ్: దీపు ఎస్. కుమార్
నిర్మాత: కిశోర్ పత్తికొండ
దర్శకత్వం: చేతన్ కుమార్
బ్యానర్: కిశోర్ పిక్చర్స్
విడుదల తేదీ: 17 మార్చి 2022
కర్ణాటక రత్న పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమాగా ప్రచారం పొందిన 'జేమ్స్' మూవీ విడుదల కోసం కన్నడిగులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూశారు. పునీత్ మృతి చెందినప్పుడు తెలుగువాళ్లు కూడా ఎంతో విషాదాన్ని అనుభవించారు. వారు కూడా పునీత్ చివరగా నటించిన సినిమా కోసం వెయిట్ చేశారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ట్రైలర్.. మూవీపై ఆసక్తిని రేకెత్తించింది. పునీత్ జయంతి అయిన మార్చి 17న వచ్చిన 'జేమ్స్' మూవీ.. ఆయనకు సరైన నివాళి అందించేలా ఉందా?
కథ:- మాఫియా డాన్ విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) తండ్రిని ప్రత్యర్థులు హతమారుస్తారు. విజయ్‌కు మూడు నెలల పాటు సెక్యూరిటీ ఇవ్వడానికి అంగీకరిస్తాడు ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన సంతోష్ (పునీత్ రాజ్‌కుమార్). విజయ్ చెల్లెలు నిష (ప్రియా రామన్) విదేశాల నుంచి డాక్టర్ చదువు పూర్తిచేసుకొని వస్తుంది. ఒకసారి ఆ కుటుంబంపై మరో మాఫియా డాన్ (ముఖేష్ రిషి) మనుషులు ఎటాక్ చేస్తే, సింగిల్‌గా వారందరినీ తుదముట్టించి విజయ్ కుటుంబాన్ని కాపాడతాడు సంతోష్. క్రమేణా సంతోష్‌తో ప్రేమలో పడుతుంది నిష. ఆమెకు మరొకరితో ఎంగేజ్‌మెంట్‌ను ఏర్పాటుచేసి ముఖేష్ రిషి, అతని ముగ్గురు కొడుకుల్ని ఆహ్వానిస్తాడు విజయ్. ఆ గ్యాంగ్‌ను చంపేస్తాడు సంతోష్. ఆ తర్వాత ఒక ఈవెంట్ ఏర్పాటుచేసి తన చెల్లెలు నిషకు తన వ్యాపారాల్లో కీలక పదవి ఇస్తున్నట్లు ప్రకటిస్తాడు విజయ్. అదే వేదికపై సంతోష్‌ను ఆహ్వానించి అన్నాచెల్లెళ్లు ప్రశంసిస్తారు. వాళ్లను షాక్‌కు గురిచేస్తూ అక్కడున్న విజయ్ గ్యాంగ్‌నంతా కాల్చిపారేస్తాడు సంతోష్. ఆ షాక్ నుంచి వాళ్లు తేరుకోకముందే అతడి ప్రత్యర్థి ఆంటోనీ గ్యాంగ్ మనుషులు వచ్చి, సంతోష్‌ను చూసి భయంతో వణికిపోతారు. ప్రధాన అనుచరుడు తమ బాస్‌కు ఫోన్ చేసి, జేమ్స్ బతికే వున్నాడని చెప్తాడు. ఆ వెంటనే కత్తితో అతడి తల నరికేస్తాడు సంతోష్. తమ కళ్ల ముందు ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయంలో పడిపోతారు విజయ్, నిష. అసలు సంతోష్ ఎవరు? జేమ్స్ అనే పేరు అతడికి ఎందుకుంది? విజయ్‌కు సెక్యూరిటీగా వచ్చిన సంతోష్.. అతడి గ్యాంగ్‌నే ఎందుకు మట్టుబెట్టాడు? అనే ప్రశ్నలకు సెకాండాఫ్‌లో సమాధానాలు లభిస్తాయి.
ఎనాలసిస్ :
రెండున్నర గంటల సినిమా అయినప్పటికీ, మూడు గంటల సినిమా చూసినంత బరువైన ఫీలింగ్‌ను ఇచ్చింది 'జేమ్స్' మూవీ. ప్రతి పది నిమిషాలకు ఓసారి పది నిమిషాల సేపు సాగే బీభత్సమైన గన్ ఫైటింగ్ వచ్చి థియేటర్ అంతా ధడ్ ధడ్ ధడ్ మనే సౌండ్‌లతో దద్దరిల్లిపోతూ రావడం యాక్షన్ ప్రియులను అలరిస్తుంది కానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిజానికి దేశభక్తి, స్నేహం అనే అంశాల చుట్టూ అల్లుకున్న ఈ యాక్షన్ డ్రామాను ఇంకా బాగా తీసి ఉండవచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ మీద బాగా శ్రద్ధపెట్టిన దర్శకుడు డ్రామా విషయంలో పట్టు తప్పాడు. తిరుపతిలో కొండచరియలు విరిగిపడి కుటుంబాలను కోల్పోయి, అనాథలుగా మారిన ఐదుగురు అబ్బాయిలు ఒక ఆర్మీ ఆఫీసర్ (శివ రాజ్‌కుమార్) చెప్పిన మాటలకు ప్రేరేపితులై, గాఢ స్నేహితులుగా మారి, దేశానికి, సమాజానికి రక్షణగా నిలిచే వ్యవస్థల్లో భాగంగా మారతారని చెప్పే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను మాత్రం బాగా తీశాడు. హీరో క్యారెక్టరైజేషన్ అంతా ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మీద బేస్ అయి వుంటుంది.
డ్రగ్ మాఫియా కారణంగా సంతోష్.. తన ప్రాణానికి ప్రాణమైన నలుగురు స్నేహితుల్నీ, వారి కుటుంబాల్నీ కూడా కోల్పోయే సన్నివేశాలు భావోద్వేగపూరితంగా వచ్చాయి. అందుకు రివెంజ్ తీర్చుకోవడంతో పాటు, దేశానికి వెన్నెముక అయిన యువతను దారితప్పేట్లు చేసే డ్రగ్ మాఫియాను తుదముట్టించే బాధ్యతను తలకెత్తుకున్న సంతోష్ దాని కోసం చేసే పనులను ఇంప్రెసివ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చిత్రీకరించడంలో సగమే విజయం సాధించాడు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే పునీత్ మృతి చెందారు. అందుకని ఒక ఫైట్‌లో అతడిని పూర్తిగా ముసుగుమనిషి రూపంలో చూపించారు. అంటే అక్కడ పునీత్ బదులు బాడీ డబుల్ నటించాడన్న మాట. అయితే దాని వల్ల సినిమాకు అదనంగా కలిగిన నష్టమేమీ లేదు.
సినిమాలో 80 శాతానికి పైగా మాఫియా గ్యాంగ్‌ల చుట్టూతా నడవడం ఈ సినిమాకు మైనస్. అందువల్ల ఆడియెన్స్ ఆయా సన్నివేశాలతో రిలేట్ కాలేరు. గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్స్ ఎక్కువవడం ఇంకో మైనస్ పాయింట్. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌కు అవకాశమున్నా, దర్శకుడు ఆ దిశగా ఎక్కువ దృష్టి పెట్టలేదు. గన్ ఫైట్లు ఎక్కువవడంతో బ్యాగ్రౌండ్ స్కోర్‌లో సౌండ్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో సౌండ్ డిజైనర్ పాత్ర కూడా ఎక్కువే. స్వామి గౌడ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా ఉంది. ఫైట్లు మరీ ఎక్కువవడంతో ఎడిటర్ పని సులువైంది.
ప్లస్ పాయింట్స్
పునీత్ రాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన నటన
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోని ఎమోషనల్ కంటెంట్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
హెవీ అనిపించే యాక్షన్ సీన్లు, అవి సృష్టించే శబ్ద కాలుష్యం
కథలో ఎక్కువభాగం మాఫియా గ్యాంగ్స్ చుట్టూ నడవడం
హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ మిస్సవడం
ఆడియెన్స్ కనెక్ట్ కాలేని పాత్రలు, సన్నివేశాలు
నటీనటుల పనితీరు:- సంతోష్ కుమార్ అలియాస్ జేమ్స్‌గా పునీత్ రాజ్‌కుమార్‌లోని యాక్షన్ స్టార్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆయన స్పీడ్ మామూలుగా లేదు. ఇలాంటి దృఢమైన శరీరాకృతి కలిగి, హుషారుగా కనిపించే ఆయన నిజ జీవితంలో అర్ధంతరంగా ఎలా గుండెపోటుతో మృతి చెందారా అని హృదయం తల్లడిల్లుతుంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్నప్పుడు సరదాగా ఉండే సన్నివేశాల్లో ఎంత హుషారుగా కనిపించారో, టెర్రరిస్టుల్ని తుదముట్టించే సన్నివేశాల్లో ఒక దేశభక్తుడైన సోల్జర్‌గా అంతటి ధీరోదాత్తంగా కనిపించారు. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి కూడా పెట్టించారు. అంటే జేమ్స్ అనే సినిమా అచ్చంగా పునీత్ అనే వన్ మ్యాన్ షో.
హీరోయిన్ నిషాగా ప్రియా ఆనంద్ ఆకట్టుకుంది. ఆమె పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్దినట్లయితే ఇంకా ఆకట్టుకునేదే. విజయ్ గైక్వాడ్‌గా కీలకమైన పాత్రలో శ్రీకాంత్ రాణించాడు. అతడిని మించి ఆంటోనీ క్యారెక్టర్‌లో శరత్‌కుమార్ విలనిజాన్ని ప్రదర్శించాడు. మిగతా గ్యాంగ్‌స్టర్స్ పాత్రధారుల్లో ఆదిత్య మీనన్, ముఖేష్ రిషి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాధుకోకిల నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ అది పండదు. సైన్యంలోనూ, బయటా సంతోష్‌కు అనుచరుడిగా రంగాయన రఘు మెప్పించాడు. ఆర్మీ ఆఫీసర్‌గా శివ రాజ్‌కుమార్ గెస్ట్ అప్పీరెన్స్ ఆకట్టుకుంటుంది. పునీత్ ఫ్రెండ్స్‌గా నటించిన నలుగురూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌తో పాటు యాక్షన్ సినీ ప్రియుల్ని కూడా 'జేమ్స్' అలరిస్తాడు. ఫ్యామిలీ ఆడియెన్స్, సగటు సినీ ప్రియులు మాత్రం మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు, ఆ సన్నివేశాలు సృష్టించే శబ్ద కాలుష్యాన్ని తట్టుకోవడం కష్టం. పునీత్ నటించిన చివరి సినిమా కాబట్టి, ఆయనకు నివాళిగా ఈ సినిమాని చూద్దామనుకుంటే.. సరే!