Read more!

English | Telugu

సినిమా పేరు:జేమ్స్ బాండ్
బ్యానర్:ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియ ప్రవేట్ లిమిటెడ్
Rating:2.00
విడుదలయిన తేది:Jul 24, 2015

మినిమం గ్యారెంటీ హీరో అని పేరు తెచ్చుకొన్నాడు న‌రేష్‌. అత‌ని సినిమా అంటే తీసినోళ్ల‌కు, చూసినోళ్ల‌కు పైగా వ‌సూల్‌. అయితే... ఈ ట్రాక్ రికార్డ్ కొన్ని సినిమాలుగా త‌ప్పుతూనే ఉంది. కామెడీ పేరుతో న‌రేష్ ఎన్ని కుప్పిగంతులేసినా.. జ‌నం చూడ‌డం లేదు. ఎన్ని ప్ర‌యోగాలు చేసినా బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసులు రాల‌డం లేదు. అందుకే ఈసారి త‌న‌కు అచ్చొచ్చిన అమాయ‌క‌పు ఫేసుతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించేయాల‌ని ప్ర‌తిన బూని మ‌రీ... జేమ్స్‌బాండ్ అనే సినిమా చేశాడు. మ‌రింత‌కీ ఈసారైనా న‌రేష్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యిందా?  ఈ జేమ్స్ బాండ్ గురైనా కుదిరిందా, లేదా?  చూసేద్దాం.. ప‌దండి.

స్టోరీ :

బుల్లెట్ (సాక్షి చౌద‌రి) దుబాయ్‌లో ఓ లేడీ డాన్‌.  దుబాయ్ లో దందా న‌డిపిస్తూ... త‌న‌కు ఎదురు లేద‌ని చాటుతుంది. అయితే ఇండియాలో త‌న‌కు అమ్మ ఉంద‌ని, తాను కాన్స‌ర్ తో బాధ‌ప‌డుతూ చివ‌రి స్టేజీలో ఉంద‌ని తెలిసి ఇండియాకొస్తుంది. అమ్మ కోసం ప‌ద్ధ‌తైన అమ్మాయిలా న‌టిస్తుంది. డాన్ వ్య‌వ‌హారాల‌న్నీ కొంత‌కాలం ప‌క్క‌న పెడుతుంది. చివ‌రికి అమ్మ కోసం పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకొంటుంది. అయితే కొన్ని ష‌ర‌తులుపెడుతుంది. అమ్మ కోస‌మే తాను ఈ పెళ్లి చేసుకొంటున్నాన‌ని, ఆ త‌ర‌వాత ఎవ‌రి దారి వాళ్ల‌దే అంటుంది. ఈ ష‌ర‌తులు చూసి, బుల్లెట్ బ్యాక్‌గ్రౌండ్ చూసి పెళ్లికొడుకులంతా పారిపోతుంటారు. కానీ.. నాని (అల్ల‌రి న‌రేష్‌) మాత్రం బుల్లెట్‌ని చూసి తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. బుల్లెట్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోకుండా, ష‌ర‌తులేం ప‌ట్టించుకోకుండా... తాళి క‌ట్టేస్తాడు. ఆ త‌ర‌వాత తెలుస్తుంది - బుల్లెట్ ఓ మాఫియా డాన్ అని. నానికి ర‌క్త‌మంటేనే భ‌యం. కానీ బుల్లెట్ మ‌ర్డ‌ర్లుమీద మ‌ర్డ‌ర్లు చేస్తుంటుంది. ఈ గ‌య్యాళి పెళ్లాంతో నాని ఎలా వేగాడు?  వీళ్ల కాపురం ఎలా సాగింది?  ఈ సంగ‌తులు తెలుసుకోవాలంటే... జేమ్స్ బాండ్ చూడాల్సిందే.


ఎనాలసిస్ :

బొండాంలాంటి భార్య‌తో ఓ బ‌క్క మొగుడు ఎలా వేగాడ‌న్న పాయింట్‌తో కిత‌కిత‌లు సినిమా వ‌చ్చింది. నిజంగానే ఆ సినిమా కిత‌కిత‌లు పెట్టించింది. న‌రేష్‌, గీతా సింగ్‌ల కాంబినేష‌న్ చూడ‌గానే న‌వ్వొచ్చేసేది. క‌థ‌లో ఉన్న కంటెంట్‌, కామెడీ, కిత‌కిత‌లు.. వెర‌సి సినిమాని హిట్ చేశాయి.  అయితే జేమ్స్‌బాండ్‌లో మాత్రం అవేం లేకుండా పోయాయి. సాక్షి చౌద‌రి - న‌రేష్ కెమిస్ట్రీనే సెట్ కాలేదు. టామ్ అండ్ జెర్రీ గేమ్ విల‌న్‌, హీరో మ‌ధ్య అయితే బాగుంటుంది, ఇది మ‌రీ మొగుడుపెళ్లాలాట‌. అందుకే శ్రుతి త‌ప్పింది. న‌రేష్‌ సినిమాల నుంచి ఆశించే కామెడీ మ‌టుమాయమైపోయింది. కిత‌కిత‌ల ఆడ్ర‌స్సే లేదు. పంచ్‌లు ఇంచు కూడా క‌నిపించ‌లేదు. వినిపించ‌లేదు. ఇక‌.. ప్రేక్ష‌కుడు ఆశించే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాల‌ని అరిస్తే బీపీ వ‌స్తుందిగానీ - బిపాసాబ‌సు రాదు అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. ప్రేక్ష‌కుడూ అలానే అనుకొని త‌న బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవ‌డం మిన‌హా మ‌రో మార్గం లేదాయె.

అస‌లు ఇది న‌రేష్ సినిమానేనా?  అనిపిస్తుంది ఫ‌స్టాఫ్ చూస్తుంటే. ఎందుకంటే తొలి అర్థ‌భాగంలో న‌రేష్ గెస్ట్ అప్పీరియ‌న్స్‌లా అప్పుడ‌ప్పుడూ క‌నిపిస్తాడు. దందా అంతా హీరోయిన్‌దే. పోనీ అదైనా ఫ‌న్నీగా ఉందా అంటే... అక్క‌డా నిరాశే!  సాక్షి సీరియ‌స్ గా ఏదేదో చేసేస్తుంటుంది. ప‌క్క‌నున్న‌వాళ్లు వీర కామెడీ చేస్తున్న‌ట్టు పోజులిస్తుంటారు. డైలాగ్ రైట‌ర్ పేజీల‌కొద్దీ త‌న పాండిత్యాన్ని చూపించేస్తుంటాడు. ఏవేవో పాత్ర‌లొస్తుంటాయ్‌, వెళ్తుంటాయ్‌... కానీ కామెడీ రాదు. ఏవో కొన్ని సీన్లు తీసి, పేర్చిన ఫీలింగ్ త‌ప్ప‌.. ఓ క‌థ చూస్తున్నామ‌నో, సినిమా థియేట‌ర్లో కూర్చున్నామ‌నో ప్రేక్ష‌కుడికి అనిపించ‌క‌పోతే.. క‌థ‌, స్ర్కీన్ ప్లే డిపార్ట్‌మెంట్లు రెండూ విఫ‌ల‌మైన‌ట్టే. ఈ సినిమాలో అదే జరిగింది. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత క‌థ పూర్తిగా (అస‌లు ఉందా?) గాడి తప్పి గంతులేసింది. శుభం కార్డు ఎప్పుడు ప‌డుతుందా అని ఎదురుచూడ్డం మిన‌హా ప్రేక్ష‌కుడి ద‌గ్గ‌ర మ‌రో ఛాయిస్ ఉంటే ఒట్టు.

న‌రేష్ ఇదివ‌ర‌క‌టి సినిమాల్లానే వీరావేశం ప‌డిపోతూ.. డైలాగులు చెప్పాడు. మేన‌రిజంతో మెస్మ‌రైజ్ చేద్దామ‌నుకొన్నాడు. కానీ ఇది వ‌ర‌క‌టి సినిమాల్లానే ఫెయిల్ అయ్యాడు. న‌రేష్ సినిమాల్లో అత‌ని సోలో పెర్‌ఫార్మ్సెన్సే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. కానీ.. ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ పార్ట్ ఎక్కువైంది. అదీ సోసోగానే ఉండ‌డంతో ఈ సినిమా కూడా న‌రేష్ కెరీర్‌కి ఏ విధంగానూ హెల్ప్ కాలేక‌పోయింది. క‌థ‌ల విష‌యంలో స్ర్కిప్ట్‌ల విష‌యంలో న‌రేష్ ఇక‌నైనా మేలుకోవాల్సిందే. సాక్షి చౌద‌రిలో అందం, చందం రెండూ లేవు. పాప తెల్ల‌గా ఉంద‌ని హీరోయిన్ చేసేశారంతే. త‌ను సీరియ‌స్‌గా న‌టిస్తుందో, త‌న ఫేసే అలా ఉందో అర్థం కాలేదు. న‌రేష్‌కి త‌గిన హైట్ ఉంటే స‌రిపోతుందిలే అని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి ఉంటారు. అలీది మ‌రీ చిన్న పాత్ర‌. స‌ప్త‌గిరి ఉన్నా లాభం లేదు. ఫృద్వి ఎంత‌కాల‌మ‌ని బాల‌య్య డైలాగుల్నే న‌మ్ముకొంటాడో అర్థం కాదు. పోసాని ఒక్క‌డే కాస్త న‌వ్వించాడు. ఇక మిగిలిన వాళ్ల గురించి మాట్లాడుకోవ‌డానికి కూడా ఏం మిగ‌ల్లేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

సినిమాని ఉన్నంత‌లో క్వాలిటీగానే తీశారు. హీరోయిన్ ఇండ్ర‌డ‌క్ష‌న్ బాగుంది. సినిమా రిచ్‌గా ఉంది. కెమెరా ప‌నిత‌నం ఓకే. సాయికార్తిక్ ఏం కొట్టాడో అత‌నికే తెలియాలి. ఎడిటింగ్ లో లోపాలున్నాయి. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు చాలా ఉన్నాయి. ద‌ర్శ‌కుడికి ఇదే తొలి సినిమా. ఆ అనుభ‌వ రాహిత్యం క‌నిపించింది. నరేష్ సినిమా అంటే న‌వ్వుకోవ‌డానికి వెళ్తారు. అంత‌కు మించి ప్రేక్ష‌కులు కూడా పెద్ద‌గా ఆశించ‌రు. కానీ.. ఆ ఆశ‌లూ.. ఈ సినిమా అడియాశ‌లుగా మార్చింది. అంతిమంగా... జెమ్స్ బాండ్ గురి త‌ప్పింది.