Read more!

English | Telugu

సినిమా పేరు:జక్కన్న
బ్యానర్:ఆర్‌.పి.ఎ.క్రియేషన్స్‌
Rating:2.00
విడుదలయిన తేది:Jul 29, 2016

కమెడియన్ గా ఉన్నప్పుడే చేతినిండా సినిమాలతో మాంచి బిజీగా గడిపిన సునీల్ పూర్తిస్థాయి కథానాయకుడీగా కెరీర్ ను మొదలెట్టిన అనంతరం సరైన సినిమా పడక ఖాళీ అయిపోయాడు. అందులోనూ "మిస్టర్ పెళ్ళికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి" వంటి వరుస డిజాస్టర్స్ తో బాగా ఢీలాపడ్డాడు. అందుకే మళ్ళీ తనకు బాగా అచ్చోచ్చిన కామెడీ టైమింగ్ మీద దృష్టి సారించి.. "రక్ష" అనే హారర్ సినిమాతో దర్శకుడీగా మారిన వర్మ శిష్యుడు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సునీల్ నటించిన చిత్రం "జక్కన్న". "ప్రేమకథా చిత్రమ్"తో సూపర్ హిట్ అందుకొన్న నిర్మాత సుదర్శన్ రెడ్డి తన రెండో ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రమ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి "జక్కన్న" మన సునీల్ బాబుకు హిట్ ను ఇవ్వగలిగాడా? ప్రేక్షకులను అలరించగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకొందాం..!!

కథ: చిన్నప్పుడెప్పుడో తన తండ్రి చెప్పిన పిట్ట (పావురం) కథలోని నీతిని నరనరాల్లో జీర్ణించేసుకొని తనకు ఎవరు ఏ సాయం చేసినా.. వారు చేసిన సాయానికి కొన్ని రెట్లు మించిన సహాయం చేయడం గణేష్ (సునీల్)కి అలవాటు. అయితే.. అతడు తిరిగి చేసే సాయం మాత్రం భరించలేని స్థాయిలో ఉంటుంది. అలాంటి వ్యక్తి వైజాగ్ వచ్చి బైరాగి (కబీర్ సింగ్) అనే ఓ గూండా కోసం వెతుకుతుంటాడు. ఈమధ్యలో సహస్ర (మన్నారా చోప్రా)తో ప్రేమలో పడి ఆమె ప్రేమ పొందడం కోసం కుంగ్ ఫూ పాండా (సప్తగిరి) నడిపే కుంగ్ ఫూ స్కూల్ లో పనికి చేరతాడు. అసలు బైరాగి కోసం గణేష్ ఎందుకు వెతుకుతుంటాడు? సహస్ర ప్రేమను గణేష్ గెలుచుకోగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే "జక్కన్న" చిత్రమ్.


ఎనాలసిస్ :

నటీనటుల పనితీరు: "జక్కన్న" చిత్రంలో మనం పాత సునీల్ ను చూసుకోవచ్చు. "సొంతం, నువ్వే నువ్వే" సినిమాల టైమ్ లో కామెడీతో కడుపుబ్బ నవ్వించిన సునీల్ గుర్తుకొస్తాడు. అయితే.. ఇప్పుడు బాడీ బాగా డెవలప్ చేశాడనుకోండి. కానీ.. మితిమీరిన ప్రాసలతో కూడిన పంచ్ డైలాగుల కారణంగా సునీల్ పడిన శ్రమ వృధా అయ్యింది. ఏపాట్లానే డ్యాన్సుల పరంగానూ అలరించాడు. ఇప్పటికి రెండు సినిమాల్లో నటించిన మన్నారా నటన పరమ్గా ఇంకా ఓనమాలు సైతం నేర్చుకోలేదని మనకి ప్రతి ఫ్రేములో తెలుస్తూనే ఉంటుంది. అందాల ప్రదర్శన మీదే కాకుండా నటన మీద కూడా అమ్మడు కాస్త కాన్సన్ ట్రేట్ చేయాల్సి ఉంది. "జిల్" సినిమాలో కేవలం తన లుక్స్ తోనే బెదరగొట్టిన కబీర్ సింగ్ ఈ సినిమాలో పెట్టుడు గెడ్డంతో (కొన్ని సన్నివేశాల్లో) అనుకొన్న రీతిలో అలరించలేకపోయాడు. కుంగ్ ఫూ గురువుగా సప్తగిరి, పోలీస్ ఆఫీసర్ గా పృధ్వీ పెర్ఫార్మెన్స్ పరంగా ఇరగదీసినప్పటికీ.. కథలో, కథనంలో కంటెంట్ లేకపోవడంతో వారి శ్రమ వృధా అయ్యింది.

సాంకేతికవర్గం పనితీరు: దినేష్ బాణీలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా మాత్రం సన్నివేశంలోని ఎమోషన్ తో సంబంధం లేకుండా దడదడలాడించేశాడు. సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ కోసం కాస్త కష్టపడినప్పటికీ.. పాటల థీమ్ సరిగా లేకపోవడంతో అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ పరంగా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సీన్ టు సీన్ కనెక్టివిటీ మిస్ అయ్యింది. కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్ లు కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లలో అతి కాస్త ఎక్కువయ్యింది. అయితే.. అది మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చు.
భవానీ ప్రసాద్ రాసిన సంభాషణాల్లో అర్ధం కంటే ప్రాసలే ఎక్కువగా కనిపిస్తాయి. మామూలుగా కొంతమంది రచయితలు ప్రాసల కోసం ప్రాకులాడితే భవానీ ప్రసాద్ డైలాగ్స్ లో పంచ్ లను ప్రాసలతో నింపడానికే ప్రత్యేకమైన శ్రద్ధ చూపాడు.

దర్శకుడిగా తన తొలి చిత్రమైన "రక్ష"తో ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించుకొన్న వంశీకృష్ణ ఆకెళ్ళ దాదాపు ఎనిమిదేళ్ళ విరామంతో "జక్కన్న"తో మళ్ళీ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. ఇప్పుడు కూడా అతడి ప్రతిభలో పెద్దగా మార్పు వచ్చినట్లుగా కనపడదు. "జక్కన్న" సినిమా కోసం రాసుకొన్న కథలో మెయిన్ థీమ్ బాగున్నప్పటికీ.. ఆ థీమ్ ను నడిపించే కథనాన్ని ఆకట్టుకొనేలా రాసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. ముఖ్యంగా.. "గబ్బర్ సింగ్" తరహాలో రౌడీ గ్యాంగ్ తో కామెడీ చేయించడం కోసం చేసిన ప్రయత్నం బెడిసిగొట్టింది.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

"జక్కన్న" ప్రమోషన్స్ లో ట్రైలర్, సాంగ్స్ కంటే బాగా అందర్నీ అలరించిన అంశం "సునీల్ ఈజ్ బ్యాక్ టు ఎంటర్ టైన్" అని వేసిన ట్యాగ్ లైన్ పోస్టర్స్. సునీల్ మళ్ళీ నవ్విస్తాడని ఆశగా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవ్వక తప్పదు. సునీల్ కామెడీ టైమింగ్ ను ఎంజాయ్ చేదామని వచ్చిన వారికి ప్రాసలతో పులిసిపోయిన్ పంచ్ ల కారణంగా చిరాకు రావడం ఖాయం. ఇక మన్నారా అందాల ప్రదర్శన బి,సి సెంటర్ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వచ్చు. ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా.. కేవలం సరదాకి ఒకసారి చూడదగ్గ సినిమా "జక్కన్న".