English | Telugu
బ్యానర్:2డి ఎంటర్‌టైన్‌మెంట్
Rating:4.00
విడుదలయిన తేది:Nov 2, 2021
సినిమా పేరు: జై భీమ్
తారాగణం: సూర్య, లిజో మోల్ జోస్, మణికంఠన్, రాజీష విజయన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, జయప్రకాశ్, తమిళ్, గురు సోమసుందరం, ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు, సూపర్‌గుడ్ సుబ్రమణి, సంజయ్ స్వరూప్
మ్యూజిక్: షాన్ రోల్డాన్
సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. కదిర్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
ఆర్ట్: కె. కదిర్
స్టంట్స్: అన్బరివ్
నిర్మాతలు: జ్యోతిక-సూర్య
రచన-దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్
బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 2 నవంబర్ 2021
ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
తమిళనాడు హైకోర్టు అడ్వకేట్‌గా ఉన్నప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో బాధితుల తరపున ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా వాదించిన జస్టిస్ చంద్రు నిజ జీవితంలోని ఒక ఘట్టం నేపథ్యంలో రూపొందిన చిత్రంగా 'జై భీమ్' వార్తల్లో నిలిచింది. చంద్రు పాత్రను పోషించడమే కాకుండా సొంతంగా దాన్ని నిర్మించాడు సూర్య. తన మునుపటి సినిమా 'సూరారై పొట్రు' తరహాలోనే ఈ సినిమానీ థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ (అమెజాన్ ప్రైమ్)లో రిలీజ్ చేశాడు. టి.జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ రియలిస్టిక్ మూవీ ఎలా ఉందంటే...
కథ
ఓటర్ల లిస్టులోనూ చోటు దక్కక ఊరి చివర ఉంటూ తన కుటుంబం, బంధువులతో కలిసి సామాజికంగా దయనీయ జీవితం గడిపే గిరిజనుడు రాజన్న (మణికంఠన్) పొట్ట కూటి కోసం రకరకాల పనులు చేస్తుంటాడు. వాటిలో పాములు పట్టడం కూడా ఒకటి. అలా ఒక పెద్దింటిలో పామును పట్టిన అతడిపైనే ఆ ఇంట్లో దొంగతనం చేశావనే నేరం మోపి, పోలీసులు అతడినీ, అతని తమ్ముడు, మేనల్లుడినీ చిత్రహింసలు పెడతారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ పారిపోయారని పోలీసులు చెబుతారు. తన భర్త ఆనుపానులు తెలుసుకోవడం కోసం గర్భిణి అయిన రాజన్న భార్య సినతల్లి (లిజో మోల్ జోస్), టీచర్ (రాజీష విజయన్) సాయంతో హైకోర్టు లాయర్ చంద్రు (సూర్య)ను కలుస్తుంది. ఆ కేసును చేపట్టిన చంద్రుకు ఎలాంటి అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? రాజన్న ఏమయ్యాడు? సినతల్లికి న్యాయం జరిగిందా? అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఒకవైపు కమర్షియల్ సబ్జెక్టులు చేస్తూనే, అప్పుడప్పుడు రియలిస్టిక్ స్క్రిప్టులు కూడా చేస్తూ వస్తున్న సూర్య.. ఇప్పుడు మరింత అర్థవంతమైన కథతో తెరమీదకు వచ్చాడు. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ నిజ జీవిత కథ ఆధారంగా 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు)లో నటించిన సూర్య.. ఆ వెంటనే దానికి మించిన రస్టిక్ స్టోరీ, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కథను ఎంచుకోవడం నిజంగా సాహసమే. ఈ సినిమాలో సూర్యకు హీరోయిన్ లేదు. ఒక గిరిజన కుటుంబానికి పోలీసుల వల్ల కలిగిన హక్కుల ఉల్లంఘన కేసును వాదించిన అడ్వకేట్ చంద్రుగా కేవలం ఆ కేసుకు మాత్రమే పరిమితమైన పాత్రను చేశాడు సూర్య. దర్శకుడు చంద్రు వ్యక్తిగత జీవితం జోలికి పోలేదు. తన ఇంట్లో ఒంటరిగా, తను వాదించే కేసును స్టడీ చేస్తూ కనిపిస్తుంటాడు. ఎవరైతే బాధితులో ఆ కుటుంబం పైనే డైరెక్టర్ ఫోకస్ పెట్టి కథకు న్యాయం చేశాడు. సూర్య ఉన్నాడని ఆయన చుట్టూ కథ నడపలేదు, ఆయనను హీరోయిక్‌గా చూపించడానికి తాపత్రయపడలేదు.
ఒక పెద్దింట్లో జరిగిన దొంగతనం కేసులో ఒక అమాయకుడ్ని ఇరికించి, ఆ నేరాన్ని ఒప్పుకోమంటూ అతడినీ, అతడి దగ్గరి బంధువుల్నీ పోలీసులు ఎంతగా హింసిస్తారో, తాము చేసిన దారుణాలు బయటపడకుండా ఉండటానికి ఇంకెన్ని దారుణాలు చేస్తారో కళ్లకు కట్టినట్లు చూపించింది 'జై భీమ్' ఫిల్మ్. రాజన్న, సినతల్లి జీవితంలో ఆర్థికంగా అష్టకష్టాలు పడుతూనే అన్యోన్యంగా ఉండే జంట. కూతురు లచ్చిని స్కూలుకు పంపిస్తుంటారు. వాళ్ల మధ్య సన్నివేశాలు ముచ్చటగా అనిపిస్తాయి. ఇద్దరూ కలిసి ఇటుకుల బట్టీల్లో పనిచేస్తుంటారు. చచ్చిపోయేలోపు అలాంటి ఇటుకలతో డాబా కట్టి, దానిలో నిన్ను ఉంచుతానని సినతల్లికి మాటిస్తాడు రాజన్న.
సినతల్లి రెండోసారి గర్భం దాల్చి, నెలలు నిండుతుంటే, ఆమెను ఇంటి దగ్గరే ఉండి కూతుర్ని చూసుకోమని చెప్పి, దూరప్రాతంలో ఉండే ఇటుకుల బట్టీలో పనిచేయడానికి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చేసరికి దొంగతనం నేరంమోపి పెడరెక్కలు విరిచికట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోతారు. అప్పటికే అక్కడ సినతల్లి, రాజన్న తమ్ముడు సాంబయ్య, మేనల్లుడు బుచ్చిబాబు, అక్క పైడితల్లి, ఇంకొందరిని చిత్రహింసలు పెడతారు ఎస్సై గురుమూర్తి (తమిళ్) ఆధ్వర్యంలో పోలీసులు. వాటిని చూస్తుంటే మనకు గుండెలవిసిపోతుంటాయి.
సినతల్లితో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయించి, ఇద్దరు జడ్జిల ధర్మాసనంతో ఆ కేసు విచారణ జరిగేలా చూసిన చంద్రు.. కోర్టులో కేసు వాదించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఒక మానవ హక్కుల ఉల్లంఘన కేసు హైకోర్టులో ఎలా నడుస్తుందో చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. చంద్రు, పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ (రావు రమేశ్) కోర్టులో వాదించే సన్నివేశాలు బాగా వచ్చాయి. హైకోర్టు నియమించిన ఎంక్వైరీ ఆఫీసర్ (ప్రకాశ్‌రాజ్), చంద్రు మధ్య సీన్లు కూడా మెప్పిస్తాయి. డిజీపీ (జయప్రకాశ్), సినతల్లి మధ్య వచ్చే సీన్ సూపర్బ్.
ఇలాంటి సినిమాలకు కథనమే ప్రాణం అవుతుంది. ఆ విషయంలో జ్ఞానవేల్ తన సామర్థ్యాన్ని బాగా ప్రదర్శించాడు. సెకండాఫ్ అంతా దాదాపు కేసు హియరింగ్, కేసు ఇన్వెస్టిగేషన్ మీదే నడిచినా ఎక్కడా బోర్ కొట్టలేదంటే అది దర్శకుడి పనితనమే. అంబేద్కర్ భావజాలం అడుగడుగునా ఈ సినిమా కథలో, సంభాషణల్లో కనిపిస్తుంది. హంగులు, ఆర్భాటాలు లేకుండా ఒక వాస్తవిక ప్రపంచాన్ని మన కళ్లముందు ఉంచింది ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రఫీ. షాన్ రోల్డాన్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఇంప్రెసివ్‌గా అనిపించాయి.
నటీనటుల పనితీరు
హైకోర్ట్ అడ్వకేట్ చంద్రు పాత్రలో ఎప్పట్లా అమోఘంగా రాణించాడు సూర్య. కేసు వాదించే సమయంలో ఆయన ప్రదర్శించే భావోద్వేగాలు సహజంగా తోస్తాయి. సినిమాలో అందరికంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ లభించింది సినతల్లి పాత్రధారి లిజో మోల్ జోస్‌కే. ఆ పాత్రలో ఆమె జీవించేసింది. భవిష్యత్తుపై ఎన్నో కలలు పెట్టుకున్న ఆమె, ఆ కలలన్నీ కూలిపోగా, తనను ప్రాణంలా చూసుకొనేవాడు పోలీసుల పాలపడగా దిక్కుతోచని స్థితికి గురయ్యే ఆ పాత్రను లిజో మోల్ పోషించిన తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువే. చదువు చెప్పడం ద్వారా గిరిజనుల్లో జ్ఞానజ్యోతులు వెలిగించడానికి ప్రయత్నించే టీచర్ పాత్రకు రాజీష విజయన్ న్యాయం చేసింది. ఎక్వైరీ ఆఫీసర్ పెరుమాళ్‌స్వామి పాత్రలో ప్రకాశ్‌రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! రాజన్నగా మణికంఠన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అతడిని చిత్రహింసలు పెట్టే ఎస్సైగా తమిళ్, అడ్వకేట్ జనరల్‌గా రావు రమేశ్, డీజీపీగా జయప్రకాశ్, ఇతర నటులు తమ పరిధుల మేరకు నటించారు. కృష్ణ రెండో అల్లుడు సంజయ్ స్వరూప్ (ఘట్టమనేని మంజుల భర్త) హైకోర్టు జడ్జిగా కనిపించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో బాధితుల తరపున నిలిచి, వారికి న్యాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన జస్టిస్ చంద్రు జీవితంలోని ఒక ఘట్టం ఆధారంగా రూపొందిన 'జై భీమ్' మూవీ తప్పకుండా చూడాల్సిన ఒక గొప్ప చిత్రం. కాల్పనిక ప్రపంచంలో తిరుగాడేవాళ్లకు వాస్తవిక జగత్తును పరిచయం చేసే ఒక ఉత్తమ చిత్రం. థియేటర్లలో రిలీజయితే ఇలాంటి సినిమా తీసినందుకు మరింత అర్థం చేకూరేది.
- బుద్ధి యజ్ఞమూర్తి