Read more!

English | Telugu

సినిమా పేరు:ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
బ్యానర్:హాస్య మూవీస్‌
Rating:2.75
విడుదలయిన తేది:Nov 25, 2022

సినిమా పేరు: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సంపత్ రాజ్, రఘు బాబు, శ్రీతేజ్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
రచన, దర్శకత్వం: ఎ.ఆర్‌.మోహన్‌ 
నిర్మాత: రాజేష్‌ దండు
బ్యానర్: హాస్య మూవీస్‌
విడుదల తేదీ: నవంబర్ 25, 2022

విభిన్న పాత్రలు పోషించి మెప్పించగల సత్తా ఉన్న నటుడు అల్లరి నరేష్. అయితే అతను ఎక్కువగా కామెడీ సినిమాలు చేయడంతో, అడపాదడపా విభిన్న పాత్రలు పోషించినప్పటికీ అతనిపై కామెడీ హీరో అనే ముద్ర పడింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 'నాంది' సినిమాతో దానికి బలమైన పునాది వేసుకున్న నరేష్.. ఇప్పుడు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. మరి అల్లరోడు 'నాంది' లాంటి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడో లేదో తెలుసుకుందాం.

కథ:-

మారేడుమిల్లి అనే అటవీ ప్రాంతంలో కొండపైన సుమారు 300 మంది నివసిస్తుంటారు. చుట్టూ ప్రపంచమంతా ఇంత అభివృద్ధి చెందుతున్నా, వారికి కనీస వసతులు కూడా ఉండవు. బడి ఉండదు, ఆసుపత్రి ఉండదు, రోడ్డు కూడా ఉండదు. ఆపదలో ఉన్నవారిని సిటీలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లాలంటే.. భుజాలపై మోసుకుంటూ అంతంత దూరం తీసుకెళ్లేసరికి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. అందుకే అడవిని ఆనుకొని ఉన్న వాగుపై వంతెన నిర్మిస్తే తమ ప్రాణాలు నిలబడతాయని భావించి ఎన్నో ఏళ్ళ నుంచి వేడుకుంటున్నా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పట్టించుకోరు. ఇంతలో ఆ గ్రామం ఉన్న నియోజకవర్గంలో ఎన్నికలు వస్తాయి. ఆ జిల్లా కలెక్టర్(సంపత్ రాజ్) ఈసారి వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. అందులోభాగంగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఓటుపై అవగాహన కలిగించడం కోసం ఎలక్షన్ డ్యూటీలో ఉన్న తెలుగు టీచర్ శ్రీనివాసరావు(అల్లరి నరేష్) కాస్త ముందుగానే అక్కడికి వెళ్తాడు. అయితే తమ బతుకుల్ని పట్టించుకోనప్పుడు తాము ఓటు ఎందుకు వేయాలంటూ మారేడుమిల్లి ప్రజలు ఎదురు తిరుగుతారు. సాటి మనిషి కష్టంలో ఉంటే స్పందించే మనసున్న శ్రీనివాసరావు మారేడుమిల్లి ప్రజల కోసం ఏం చేశాడు? వారందరి చేత ఓట్లు వేయించడానికి వెళ్లిన అతని లక్ష్యం నెరవేరిందా? ఏ సంబంధంలేని వారి కోసం అతను ప్రాణాలకు తెగించి ఎందుకు పోరాడాల్సి వచ్చింది? అతని పోరాటం వల్ల మారేడుమిల్లి ప్రజల బ్రతుకులు మారాయా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కథలో నిజముంది, ఆవేదన ఉంది. దానిని నిజాయితీగా వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎ.ఆర్‌.మోహన్‌. ఎన్నో ఏళ్ళ నుంచి మారేడుమిల్లి ప్రజలు పడుతున్న బాధని, తెలుగు టీచర్ శ్రీనివాసరావు పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తూ ప్రథమార్థం ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఇంగ్లీష్ టీచర్ వెన్నెల కిషోర్ తో కలిసి నరేష్ మారేడుమిల్లికి వెళ్లడం, అక్కడ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓ వైపు కదిలించే, మరోవైపు నవ్వించే సన్నివేశాలతో ప్రథమార్ధాన్ని నడిపించిన తీరు బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. మారేడుమిల్లి ప్రజలకు హీరో పాత్రను దగ్గర చేసే సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ ని కూడా బాగా ప్లాన్ చేశారు. 

అయితే ద్వితీయార్ధంలోనే కాస్త తడబాటు కనిపించింది. అటవీ ప్రాంతంలోని ప్రజలను చైతన్య పరిచి, వారితో కలిసి ఒక సాధారణ ఉపాధ్యాయుడు.. ప్రభుత్వంతో, ప్రభుత్వ అధికారులతో పోరాడాలంటే ఎంత సంఘర్షణ ఉండాలి, ఎంత ఉత్కంఠభరితంగా సాగాలి. ఆ విషయంలో దర్శకుడు కొంతవరకే విజయం సాధించాడు. సన్నివేశాలన్నీ హీరోకి, అక్కడి ప్రజలకు అనుకూలంగా జరుగుంటాయి. బలమైన సంఘర్షణ కనిపించదు, ఏం జరుగుతుందో ఉన్న ఉత్కంఠ కలగదు. సెకండాఫ్ లో ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు వారధిగా ఉండి న్యాయం కోసం హీరో పోరాడే సన్నివేశాలు మరింత బలంగా ఉండుంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ ఆలోచన బాగుంది కానీ బడ్జెట్ పరిమితుల వల్ల వీఎఫ్ఎక్స్ తేలిపోయి విజువల్ గా ఆకట్టుకోలేకపోయింది.

సాయి చరణ్ పాకాల స్వరపరిచిన పాటల్లో లచ్చిమితో పాటు థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సన్నివేశాలకు తగ్గట్టు చక్కగా కుదిరింది. సినిమాకి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. అటవీ ప్రాంతాలను చక్కగా చిత్రీకరించాడు. సన్నివేశాలకు సహజత్వం తీసుకొచ్చాడు. మారేడుమిల్లి ప్రజలు దేవుడిలా కొలిచే పోతురాజు సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే బడ్జెట్ పరిమితుల వలన ఆ సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉంది. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలను వదిలేస్తే మిగతా పరంగా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. అబ్బూరి రవి రాసిన సంభాషణలు బాగున్నాయి. కొన్ని కొన్ని మాటలు మనసుకి హత్తుకునేలా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:-

అల్లరి నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ సన్నివేశాల్లో ఎంతలా నవ్వించగలడో, ఎమోషనల్ సన్నివేశాల్లో అంతలా కంటతడి పెట్టించగలడు. తెలుగు టీచర్ శ్రీనివాసరావు పాత్రలో నరేష్ చక్కగా ఒదిగిపోయాడు. ఒక హీరోలా కాకుండా ఆ కథకి, ఆ పాత్రకి ఏం అవసరమో అది చేశాడు. అటవీ ప్రాంతంలో ఉండి కూడా ఏడో తరగతి వరకు చదివి తనతో పాటు తన వాళ్ల బతుకుల్లో మార్పు వస్తుందనే ఆశతో బతుకుతున్న లక్ష్మి(లచ్చిమి) అనే పాత్రలో ఆనంది మెప్పించింది. ఇక ఇంగ్లీష్ టీచర్ గా వెన్నెల కిషోర్ నవ్వులు పూయించాడు. సంపత్ రాజ్, ప్రవీణ్, రఘు బాబు, శ్రీతేజ్ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'నాంది' తర్వాత అల్లరి నరేష్ నుంచి వచ్చిన మరో మంచి ప్రయత్నం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ప్రేక్షకులను ఆలోచనలో పడేసే ఆవేదన ఈ కథలో ఉంది. హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఉన్నాయి. ద్వితీయార్థం మీద మరింత దృష్టి పెట్టుంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

-గంగసాని