English | Telugu
బ్యానర్:ఎ.ఐ.స్టూడియోస్, శాస్త్ర మూవీస్
Rating:2.50
విడుదలయిన తేది:Aug 27, 2021
సినిమా పేరు: ఇచ్చట వాహనములు నిలుపరాదు
తారాగణం: సుశాంత్, మీనాక్షీ చౌదరి, వెంకట్, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమఠం, రవివర్మ, కృష్ణచైతన్య తదితరులు
కూర్పు: గ్యారీ బీహెచ్
మాటలు: సురేష్ బాబా
ఛాయాగ్రహణం: ఎం. సుకుమార్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగండ్ల
కథ, దర్శకత్వం: ఎస్. దర్శన్
విడుదల తేదీ: 27 ఆగస్టు 2021
‘చి.ల.సౌ’తో సుశాంత్‌కు హీరోగా ఓ విజయం దక్కింది. ఆ తర్వాత ‘అల... వైకుంఠపురములో’ కీలక పాత్ర చేశాడు. అదీ హిట్టే. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో హ్యాట్రిక్ అందుకుంటాడని దర్శకుడు త్రివిక్రమ్ ధీమా వ్యక్తం చేశారు. ‘చి.ల.సౌ’తో సుశాంత్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం మొదలు పెట్టారని ఆయన చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు బావున్నాయి. నో పార్కింగ్‌లో బండి పెట్టడం వల్ల యువకుడి జీవితంలో ఏం జరిగింది? అతడి ప్రేమకు, ప్రేమించిన అమ్మాయి కాలనీలో జనాలు (అమ్మాయి అన్నయ్య అనుచరులు)కు గొడవ ఏమిటి? అంటూ ట్రైలర్‌లో చూపించిన అంశాలు సినిమాపై ఆసక్తి రేపాయి. మరి, సినిమా ఎలా ఉంది? సుశాంత్ కొత్త దారిలో వెళ్లాడా? లేదా? రివ్యూలో చూద్దాం!
కథ
అరుణ్ (సుశాంత్) ఓ ఆర్కిటెక్. ఆఫీసులో అమ్మాయి మీనాక్షి (మీనాక్షీ చౌధరి)తో ప్రేమలో పడతాడు. ఏదో సమస్య ఉందంటే... పరిష్కరించడానికి ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ అనుకోకుండా కొన్ని ఘటనలు జరుగుతాయి. అనూహ్యంగా ఓ మర్డర్ జరుగుతుంది. ఆ హత్య అరుణ్ చేశాడని పోలీసులు అనుమానిస్తారు. కాలనీ జనాల అభిప్రాయం కూడా అదే! అందరూ అరుణ్‌ను పట్టుకోవాలని తీవ్రంగా వెతుకుతుంటారు. అసలు, అరుణ్ మర్డర్ కేసులో ఇరుక్కోవడం వెనుక బైక్ రోల్ ఏమిటి? కార్పొరేట్ రాజకీయాలు, కాలనీలో దొంగతనాలకు లింక్ ఏమిటి? అందర్నీ తప్పించుకొని ఆ కాలనీ నుంచి అరుణ్ సేఫ్‌గా ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా సినిమా.
ఎనాలసిస్ :
కథలో అంత దమ్ము లేదు. కానీ, కథనంలో దమ్ము ఉంది. చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ చక్కటి కథనం అల్లారు. కథను థ్రిల్లింగ్‌గా ముందుకు తీసుకువెళ్లిన విధానం బావుంది. హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్, వాళ్ల మధ్య పాటలు... ఆ తర్వాత సన్నివేశాలతో ఫస్టాఫ్ రొటీన్ అయినా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఇంటర్వెల్ నుంచి సినిమా స్పీడ్ అందుకుంది. అసలు కథ అక్కడ నుండే ప్రారంభమైంది. థ్రిల్లింగ్‌గా సాగింది. కథలో భాగంగా కామెడీ ఉంది. అయితే, కామెడీకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉన్నా... దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదని అనిపిస్తుంది. పతాక సన్నివేశాలకు వచ్చేసరికి మళ్లీ కథ ఊహాజనితంగా మారుతుంది.
సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా సెకండాఫ్‌లో కాలనీ సీన్స్ చాలా బాగా తీశారు. పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. మాటలు బావున్నాయి. దర్శన్ కొత్త దర్శకుడైనా సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. ఫస్టాఫ్‌ను ఎంటర్‌టైనింగ్‌గా తీసిన దర్శకుడు, సెకండాఫ్‌ను మరింత ఎఫెక్టివ్‌గా తీసి ఉంటే బావుండేది. మొత్తం మీద సెకండాఫ్ ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేస్తుంది. సినిమాకు ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
నటీనటుల అభినయం
దర్శన్ కథను, సినిమాను సుశాంత్ చాలా నమ్మాడు. వెండితెరపై అది కనిపించింది. కొత్తగా కనిపించే, నటించే ప్రయత్నం చేశాడు. గత చిత్రాలతో పోలిస్తే... నటనలో పరిణితి చూపించాడు. అందంగానూ కనిపించాడు. సైజ్ జీరో హీరోయిన్ల కేటగిరీలో మీనాక్షీ చౌధరి చేరుతుంది. అమ్మాయి పర్వాలేదు. సుశాంత్, మీనాక్షి మధ్య ఆన్‌స్ర్కీన్ కెమిస్ట్రీ కుదిరింది. షోరూమ్ మేనేజర్‌గా ‘వెన్నెల’ కిషోర్ నవ్వించాడు. అభినవ్ గోమఠం తనదైన శైలి నటనతో నవ్విస్తూ, టెన్షన్ పెడుతూ కీలక పాత్రలో కనిపించాడు. రాజకీయ నాయకుడిగా వెంకట్ కనిపించడం వల్ల పాత్రకు హుందాతనం వచ్చింది. అతని ప్రత్యర్థిగా రవివర్మ చక్కటి నటన కనబరిచాడు. సునీల్ అతిథి పాత్రలో కనిపించి కాసేపు నవ్వించాడు. ప్రియదర్శి, హరీష్ కోయలగండ్ల తదితరులు సినిమాలో ఉన్నారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. సుశాంత్ గత చిత్రాలతో పోలిస్తే బావుంది. అయితే, సినిమాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని థ్రిల్స్, కొంత సాగదీతతో శాటిస్‌ఫ్యాక్టరీ ఫీలింగ్ ఇస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు టైమ్‌పాస్ సినిమా. రెగ్యులర్ సినిమా ఆడియన్స్‌కు పర్వాలేనిపిస్తుంది.