English | Telugu

సినిమా పేరు:హైప‌ర్‌
బ్యానర్:14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 30, 2016

క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు అనుగుణంగా క‌థ వండ‌డం.. దాన్ని జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్ద‌డం గొప్ప ఆర్ట్‌. పైసా వ‌సూల్ అనిపించే సినిమాలు తీయ‌డం రావ‌డం అరుదైన విద్య‌!  వినాయ‌క్‌, శ్రీ‌నువైట్ల‌, పూరి జ‌గ‌న్నాథ్ ఇలాంటి విష‌యాల్లో ఆరి తేరిపోయారు. దానికి తోడు గొప్ప సినిమా అనే ఫీలింగ్ రాక‌పోయినా... చూస్తున్నంత సేపూ కాల‌క్షేపం అయిపోతే చాలు.. అనుకొంటున్నారిప్ప‌టి ప్రేక్ష‌కులు. మ‌న దుర‌దృష్టం కొద్దీ అలాంటి సినిమాలూ రావ‌డం లేదు. కందిరీగ‌తో తాను మాస్ ద‌ర్శ‌కుడ్నే అని నిరూపించుకొన్నాడు సంతోష్ శ్రీ‌నివాస్‌. అయితే.., ర‌భ‌స‌లో ఆ మాసిజం విక‌టించి ఫ్లాప్ ద‌ర్శ‌కుల లిస్టులో చేరిపోయాడు. కందిరీగ హీరో రామ్‌తో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నం.... హైప‌ర్‌. మ‌రి ఈ సినిమా కందిరీగ‌లా హిట్ట‌య్యిందా?  ర‌భ‌స‌లా ఫ్లాప్ అయ్యిందా??  మాస్ ద‌ర్శ‌కుడిగా శ్రీ‌నివాస్ ఈ సినిమాలో ఏం నిరూపించుకొన్నాడు?   చూద్దాం.. రండి.


* క‌థ‌

నాన్న  నారాయ‌ణ‌మూర్తి (స‌త్య‌రాజ్‌) అంటే సూర్య (రామ్‌)కి ప్రాణం.  నాన్న‌పై ఈగ వాలినా త‌ట్టుకోలేడు. ఈ అతి ప్రేమ‌కి నారాయ‌ణ‌మూర్తి కూడా బెంబేలెత్తిపోతుంటాడు. నారాయ‌ణ‌మూర్తి ఓ సిన్సియ‌ర్ ప్ర‌భుత్వ ఉద్యోగి.  30 ఏళ్లుగా ఎలాంటి అవినీతికీ పాల్పడ‌లేదు. మ‌రో 30 రోజుల్లో రిటైర్‌మెంట్ అన‌గా... అత‌ని జీవితంలోకి రాజ‌ప్ప (రావు ర‌మేష్‌) ప్ర‌వేశిస్తాడు. త‌నో కాబోయే హోం మినిస్ట‌ర్‌. ఓ షాపింగ్‌మాల్ అప్రూవ‌ల్‌పై సంత‌కం పెట్ట‌డానికి నారాయ‌ణ‌మూర్తి నిరాక‌రిస్తాడు. గ‌జ (ముర‌ళీశ‌ర్మ‌) స‌హాయంతో నారాయ‌ణ‌మూర్తిని భ‌య‌పెట్టాల‌ని చూస్తాడు రాజ‌ప్ప‌. ఓసారి నాన్న‌ని కాపాడినందుకు ఆ గ‌జ‌తోనే స్నేహం చేస్తుంటాడు సూర్య‌.  త‌న తండ్రి నిజాయ‌తీకి రాజ‌ప్ప అడ్డంగా ఉన్నాడ‌ని తెలుసుకొన్న సూర్య ఏం చేశాడు?  త‌న తండ్రి నిజాయ‌తీని ఎలా కాపాడుకొన్నాడు?  కాబోయే హోం మినిస్ట‌ర్‌తో ఎలా త‌ల‌ప‌డ్డాడు. భానుమ‌తి (రాశీఖ‌న్నా)తో సూర్య న‌డిపిన ప్రేమాయ‌ణం ఎలాంటిది?  ఇవ‌న్నీ హైప‌ర్ చూసి తెలుసుకోవాల్సిందే.


ఎనాలసిస్ :

*  విశ్లేష‌ణ‌

ర‌భ‌స‌తో డీలా ప‌డ్డ సంతోష్ శ్రీ‌నివాస్‌.. త‌న‌కు తొలి హిట్ ఇచ్చిన రామ్‌తోనే మ‌ళ్లీ జోడీ క‌ట్టి తీసిన సినిమా ఇది. ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు, హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఇవ‌న్నీ రామ్ కి త‌గిన‌ట్టుగానే మ‌ల‌చుకొన్నాడు. క‌థా ప‌రంగా కొత్త అంశం ఏమీ లేదు. కానీ వినోదం జోడించి, రామ్ శైలికీ, హైప‌ర్ అనే టైటిల్ కీ న్యాయం జ‌రిగేలా జాగ్ర‌త్త పడ్డాడు. తండ్రిపై కొడుకు ఉన్న అతి ప్రేమ చూపించే సన్నివేశాలు హిలేరియ‌స్‌గా సాగాయి. రాశీఖ‌న్నాతో ల‌వ్ ట్రాక్ కాస్త సాగ‌దీసినా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. గ‌జ‌తో స్నేహం కూడా... జ‌నాల‌కు న‌చ్చేలా తీసుకొచ్చాడు. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ అంద‌రూ ఊహించిన‌దే. సెకండాఫ్‌లో రావుర‌మేష్ - రామ్‌ల మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. తండ్రీ కొడుకుల ఎమోష‌న్‌ని చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. క్లైమాక్స్ ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కు అనుగుణంగా సాగినా... పాస్ అయిపోతుంది. మొత్తంగా చూస్తే.. శ్రీ‌న్‌వాస్ పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ పంథానే న‌మ్ముకొన్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది. నారాయ‌ణ‌మూర్తి కిడ్నాప్ డ్రామా, ఆసుప‌త్రి స‌న్నివేశాలు సెకండాఫ్‌కి బ‌లాన్ని చేకూర్చాయి. రావుర‌మేష్ - రామ్ నువ్వా నేనా అన్న‌ట్టు పోటీ ప‌డి న‌టించ‌డం, ఛాలెంజులు చేసుకోవ‌డం ర‌క్తి క‌ట్టాయి. మాస్‌కి కావ‌ల్సిన మ‌సాలా, లెంగ్తీ డైలాగులు ద‌ట్టించి కొట్ట‌డంతో బీ,సీల‌లో ఈసినిమా ప‌రిస్థితి చూసుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

క‌థంతా సెకండాఫ్‌కే అట్టి పెట్టుకోవాల‌ని చూడ‌డం పెద్ద మైన‌స్‌. దాంతో ఫ‌స్టాఫ్ కాల‌క్షేపానికి అన్న‌ట్టు సాగి, సెకండాఫ్ లెంగ్తీగా అనిపిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో లాజిక్కులు వ‌దిలేయాలి కాబ‌ట్టి.. ఇక్కడా ఆ ప్ర‌స్తావ‌న అన‌వ‌స‌రం. క‌థానాయిక పాత్ర తీర్చిదిద్దిన విధానం గ‌త సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. రేసుగుర్రం, జులాయి సినిమాల్లో క‌థానాయిక క్యారెక్ట‌రైజేష‌న్ ఇంచుమించు ఇలానే సాగుతుంది.  అక్క‌డ‌క్క‌డ కొన్ని లూప్ హోల్స్ ఉన్నా.. హైప‌ర్ కాల‌క్షేపానికి కొద‌వ లేకుండా చేస్తుంది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

హైప‌ర్ టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగా రామ్‌ చాలా ఎన‌ర్జిటిక్ గా చేశాడు. నేను శైల‌జ లో కాస్త డౌన్ టూ ఎర్త్ అన్న‌ట్టు క‌నిపించిన రామ్‌... ఈసారి డ‌బుల్ డోస్ చూపించాడు. డైలాగులు ప‌ల‌క‌డంలో, డాన్సులు చేయ‌డంలో `టూమ‌చ్‌` హైప‌ర్ క‌నిపించింది. ఎమోష‌న్ సీన్స్ వ‌ర‌కూ నేను శైల‌జ మ్యాజిక్ రిపీట్ చేశాడు.  తొలి స‌న్నివేశాల్లో డీ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ వ‌చ్చిన రాశీ.. రాను రానూ రెచ్చిపోయింది. డ‌బుల్ మీనింగ్ డైలాగులూ బాగానే ప‌ల‌కింది. ఈ సినిమాతో పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా అవ‌త‌రించింది. అయితే సెకండాఫ్‌లో మాత్రం చుట్ట‌పు చూపుగా వ‌చ్చి వెళ్లిపోయింది. మరోసారి స‌త్య‌రాజ్‌కి మంచి పాత్ర ద‌క్కింది. నిజాయ‌తీగ‌ల ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకొంటుంది. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్ కోసం ఆయ‌న ఇచ్చిన స్పీచ్‌కు క్లాప్స్ ప‌డాల్సిందే.  ఇలాంటి పాత్ర‌లు రావు ర‌మేష్‌కి అల‌వాటే. రామ్ కంటే ఎక్కువ ఎన‌ర్జిటిక్‌గా న‌టించాడు. అయితే అక్క‌డ‌క్క‌డ రావు శ్రుతి మించిన న‌ట‌న‌, ఆవేశం ప్ర‌ద‌ర్శించారు.. అల‌వాటు ప్ర‌కారం. గ‌జ‌గా ముర‌ళీది డిఫ‌రెంట్ రోలే. ముందు నెగిటీవ్ పాత్ర‌లో క‌నిపించినా.. ఆ త‌ర‌వాత పాజిటీవ్ గా ట‌ర్న్ అయ్యే మంచి పాత్ర‌.

* టెక్నిక‌ల్‌గా..

జిబ్రాన్ పాట‌లు ఇంకాస్త బాగుంటే బాగుండేది. ఒక‌ట్రెండు పాట‌ల్లో సౌండింగ్ కూడా అర్థ‌మ‌వ్వ‌లేదు. జిబ్రాన్ కూడా త‌మ‌న్ లా మారిపోతాడేమో అనే భ‌యం వేస్తోంది.  అబ్బూరి ర‌వి క‌లం బాగా ప‌రిగెట్టింది. కొన్ని చోట్ల స్పీచ్‌లా సాగినా... చాలా చోట్ల ఆక‌ట్టుకొనే సంభాష‌ణ‌లు అందించాడు. కెమెరా ప‌నిత‌నం చ‌క్క‌గా కుదిరింది. సినిమా రిచ్‌గా ఉంది. యాక్ష‌న్ సీన్స్‌ని బాగా పిక్చ‌రైజ్ చేశారు. ర‌భ‌స‌తో ప‌ది అడుగులు వెన‌క్కి వేసిన సంతోష్‌.. ఈ సినిమాతో మ‌రో నాలుగు అడుగులు ముందుకు వేసే ప్ర‌య‌త్నం చేశాడు. ద‌ర్శ‌కుడిగా తాను ఎంచుకొన్న క‌థ‌ని స‌రిగ్గా, క‌మ‌ర్షియ‌ల్ సినిమా అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా అందించాడు. నిజాయ‌తీగా ఉండ‌డం గొప్ప అదృష్టం అనే కంటెంట్‌ని అండ‌ర్ క‌రెంట్‌గా చెప్ప‌డం బాగుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మొత్తానికి హైప‌ర్ మాస్‌కి హై ఎన‌ర్జీని ఇచ్చే సినిమాగా మిగులుతుంది.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25