Read more!

English | Telugu

సినిమా పేరు:హిట్ 2
బ్యానర్:వాల్ పోస్టర్ సినిమా
Rating:2.75
విడుదలయిన తేది:Dec 2, 2022

సినిమా పేరు: హిట్-2
తారాగణం: అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, రావు రమేష్, సుహాస్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి 
నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఏడూరి
సినిమాటోగ్రఫీ: మణికందన్
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
రచన, దర్శకత్వం: శైలేశ్ కొలను
నిర్మాత: ప్రశాంతి త్రిపురనేని
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022

అడివి శేష్ ప్రధాన పాత్రధారిగా శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'హిట్: ది సెకండ్ కేస్'. 2020లో విడుదలై విజయం సాధించిన 'హిట్: ది ఫస్ట్ కేస్'కి సీక్వెల్ కావడంతో పాటు 'మేజర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేష్ నటించిన సినిమా కావడంతో 'హిట్-2'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను పెంచేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుండేలా ఉందో లేదో తెలుసుకుందాం.

కథ:
వైజాగ్ లో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్(HIT)లో పనిచేసే ఎస్పీ క్యాడర్ అధికారి కృష్ణ దేవ్ అలియాస్ కేడీ(అడివి శేష్)కి సిన్సియారిటీ, స్పీడ్, నోటిదూల అన్ని ఎక్కువే. ఎలాంటి కేసునైనా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. క్రిమినల్స్ వి కోడి బుర్రలు.. వాళ్ళు నేరం చేసినా ఈజీగా దొరికిపోతారనే అభిప్రాయం కేడీకి ఉంటుంది. అలాంటి కేడీకి ఒక కేసు సవాల్ గా మారుతుంది. శరీర భాగాలు వేరు చేసి దారుణంగా హత్య చేయబడిన ఒక యువతి శవం కనిపిస్తుంది. అయితే విచారణలో తల మాత్రమే ఆ యువతిదని, మిగతా శరీర భాగాలు మరో ముగ్గురువని తెలుస్తుంది. చనిపోయినవాళ్లు ఎవరు?.. వాళ్ళని ఎవరు చంపారు? ఎందుకు చంపారు?.. చంపిన కిల్లర్ ని కేడీ ఎలా పట్టుకోగలిగాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

హిట్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చే సినిమాల స్టోరీలు ఎలా ఉంటాయో ఇప్పటికే మనకు ఓ క్లారిటీ వచ్చేసింది. హత్యలు జరుగుతాయి.. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని హీరో ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెడతాడు. ఇదే కథ. అయితే స్క్రీన్ ప్లే ఎంత ఎంగేజింగ్ గా ఉంది, ఇన్వెస్టివషన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగింది, కిల్లర్ మోటివ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనే దాని మీద సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆ పరంగా చూస్తే హిట్-2 కి మంచి మార్కులే పడతాయి.

దర్శకుడు శైలేశ్ ను ఒక విషయంలో మెచ్చుకోవాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కథ నుంచి ఎక్కడా బయటకు వెళ్లకుండా సినిమాని చక్కగా నడిపించాడు. కేడీ పాత్ర తీరుని పరిచయం చేసి, కాసేపటికే అసలు కథలోకి వెళ్లడం బాగుంది. అయితే కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఫస్టాఫ్ ఆశించినంత ఎంగేజింగ్ గా లేదు. దొరికిన ఆధారాలతో కిల్లర్ గా భావించి ప్రథమార్థంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అతను కిల్లర్ కాదనే విషయం ప్రేక్షకులకు ముందే అర్థమైపోతుంది. ఎందుకంటే కిల్లర్ అంత ఈజీగా దొరకడు. అందుకే ఆ సన్నివేశాలు చూసే ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వవు. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు, ఇంటర్వెల్ బాగానే ఉన్నాయి. సెకండాఫ్ పై ఆసక్తి కలిగేలా చేశాయి.

సెకండాఫ్ లో ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని పాత్రల మీద అనుమానం కలుగుతుంది గాని.. ఈ పాత్రే హత్యలు చేసిందని ఖచ్చితంగా చెప్పలేము. ఆ సస్పెన్స్ ని మైంటైన్ చేయడంలో దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే సెకండాఫ్ సగం అయ్యాక ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయనేది మాత్రం ఒక ఐడియా వస్తుంది. కానీ కిల్లర్ ఎవరనేది మాత్రం చివరిలో రివీల్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఇంకా బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. సినిమా అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ ఓ రెగ్యులర్ సైకో థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మన మధ్య మామూలుగా తిరుగుతున్నట్టు ఉండే ఓ వ్యక్తి సైకోలా హత్యలు చేస్తుండటం, అతను అలా మారడానికి ఫ్యామిలీ చెందిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. ఇందులో కూడా అలాంటిదే చూస్తాం.

సినిమా నిడివి రెండు గంటలే కావడం కలిసొచ్చింది. ఎక్కడా బోర్ అనిపించకుండా నడిచింది. జాన్ స్టీవర్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మణికందన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి.

నటీనటుల పనితీరు:
అడివి శేష్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో మెప్పించాడు. కృష్ణ దేవ్ పాత్రకి ఏం కావాలో అది చేశాడు. తన యాటిట్యూడ్, బాడీ ల్యాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయి. శేష్ ప్రేయసిగా మీనాక్షి చౌదరి ఆకట్టుకుంది. ఇక శేష్ టీమ్ లో పోలీస్ ఆఫీసర్ గా కోమలి ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రావు రమేష్, సుహాస్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

హిట్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన 'హిట్-2' కూడా ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇది ఒక రెగ్యులర్ సైకో థ్రిల్లర్ సినిమాలాగా అనిపిస్తుంది. హిట్ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలు మిగతా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ప్రత్యేకతను చాటుకునేలా ఉంటాయనే అంచనాలతో వెళ్తే కాస్త నిరాశచెందుతారు.

-గంగసాని