English | Telugu

సినిమా పేరు:హే సినామికా
బ్యానర్:జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్
Rating:2.00
విడుదలయిన తేది:Mar 3, 2022

సినిమా పేరు: హే సినామిక
తారాగ‌ణం: దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరీ, కాజల్ అగర్వాల్
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: ప్రీత జయరామన్
ఎడిటింగ్: రాధ శ్రీధర్
బ్యానర్స్: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్
రచన: మదన్‌ కర్కి
దర్శకత్వం: బృంద
విడుదల తేదీ: మార్చి 3, 2022

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తమిళ్ మూవీ 'హే సినామిక'. అదే పేరుతో నేడు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది ఈ సినిమా. అదితిరావు హైదరీ, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకురాలిగా పరిచయం కావడం విశేషం. మరి దర్శకురాలిగా ఆమె తొలి ప్రయత్నంతో మెప్పించారా?, 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ మరోసారి ఆకట్టుకున్నాడా? అనేది రివ్యూ చదివి తెలుసుకుందాం.

కథ:- చెన్నైలో ఒక పెద్ద తుఫాను వలన ఆర్యన్(దుల్కర్), మౌన(అదితి) అనుకోకుండా పరిచయమవుతారు. ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లితో ఇద్దరూ ఒకటవుతారు. మౌనను ఎంతగానో ప్రేమించే ఆర్యన్ ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటూ వంటలు, మాటలతో గడిపేస్తూ ఉంటాడు. మౌన మాత్రం ఆర్యన్ నసను భరించలేక ఉద్యోగం పేరుతో కొంతకాలం తనకి దూరంగా ఉండాలి అనుకుంటుంది. కానీ అవేవి వర్కౌట్ కాకపోవడంతో.. సైకాలజిస్ట్ మలర్(కాజల్) సాయంతో భర్త నుంచి పూర్తిగా విడిపోదామని నిర్ణయించుకుంటుంది. మలర్ రాకతో ఆర్యన్, మౌన జీవితాలలో వచ్చిన మార్పులు ఏంటి?, మౌన కోరుకున్నట్లుగా ఆర్యన్ నుంచి విడిపోయిందా? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్ :

ముందుగా ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అర్థంకాని పేర్లతో పలకరిస్తున్నాయి. ఇటీవల తమిళ్ మూవీ 'వలిమై' అదే పేరుతో తెలుగులో విడుదలైంది. తమిళ్ పేరుతో విడుదల కావడంతో ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా చేరువ కాలేదు. ఇక ఇప్పుడు 'హే సినామిక'. తమిళ్ పేరుతోనే ఇక్కడా విడుదల చేశారు. దుల్కర్, కాజల్ ఉన్నా ఈ సినిమాపై కొంచెం కూడా బజ్ రాలేదు. పేరుతో పాటు సరైన ప్రమోషన్స్ లేకపోవడం ఈ సినిమాపై బజ్ రాకపోవడానికి కారణమని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ తెలుగు విడుదలపై ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, సినిమా ప్రారంభంలో వచ్చిన టైటిల్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు అక్షరాలు తెరపై రకరకాల భంగిమలలో దర్శనమిచ్చి, పేర్ల అర్థాలనే మార్చేశాయి.

ఇక కథ విషయానికొస్తే, అందరి జీవితాల్లో ఏదోక సమయంలో నసగాళ్లు తగులుతారు. వాడు పెద్ద నసగాడు, వాడిని గంట కూడా భరించలేమని అనుకున్న సందర్భాలు ఉంటాయి. అలాంటిది ఒక నసగాడిని పెళ్లి చేసుకొని, వాడితో జీవితం పంచుకోవాల్సి వస్తే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ. కథ చిన్నది కావడం, కథనం నెమ్మదిగా సాగడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు నీరసం వచ్చింది. షార్ట్ ఫిల్మ్ కథని సాగదీసి సినిమాగా తీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ఉంది.

పెళ్లి తర్వాత భార్య భర్తల బంధం గురించి సినిమాలు అరుదుగా వస్తున్నాయి. ఇలాంటి పాయింట్ తో దుల్కర్, కాజల్ వంటి స్టార్స్ ని పెట్టుకొని బృంద మాస్టర్ దర్శకురాలిగా తొలి అడుగు వేయడం సాహసం అనే చెప్పొచ్చు. ఇలాంటి సెన్సిబిల్ సబ్జెక్ట్ ని డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిది. ఆడియన్స్ ని ఎమోషనల్ గా కథకి కనెక్ట్ అయ్యేలా చేయాలి, లేదా నేచురల్ కామెడీతో ఎంటర్టైన్ మెంట్ అయినా అందించాలి. కానీ ఈ విషయంలో రచయిత, దర్శకులు పూర్తిగా విఫలమయ్యారు. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే అసహనం ప్రేక్షకుల్లో కలిగేలా చేశారు.

సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పరవాలేదు. బృంద మాస్టర్ బేసిక్ గా కొరియోగ్రాఫర్ కావడంతో సాంగ్స్ పిక్చరైజేషన్ పై శ్రద్ధ తీసుకున్నారు. అదే శ్రద్ధ స్క్రిప్ట్ పై కూడా తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:
దుల్కర్, అదితి, కాజల్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే కథనం
నీరసం తెప్పించే సన్నివేశాలు

న‌టీన‌టుల ప‌నితీరు:- నసగాడి క్యారెక్టర్ లో దుల్కర్ లీనమైపోయాడు. ఎంతలా అంటే సినిమాలోని పాత్రలతో పాటు, చూసే ప్రేక్షకులను కూడా తన నసతో ఇబ్బందిపెట్టాడు. ఆ పాత్రలోని అమాయకత్వాన్ని, నిజాయితీని చక్కగా పలికించాడు. భర్త నసని భరించలేని భార్య పాత్రలో అదితి చక్కగా ఒదిగిపోయింది. భర్త దగ్గరున్నంత కాలం చిరాకు, నిజంగానే దూరమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు బాధను చక్కగా పలికించింది. సైకాలజిస్ట్ పాత్రలో కాజల్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో కాజల్ ముఖంలో మునుపటి కళ తప్పినట్లు అనిపించింది. మేకప్, డబ్బింగ్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఇబ్బందిపెట్టింది. దొంగబాబాగా కమెడియన్ యోగిబాబు ఒక సీన్ లో మెరిశాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సినిమా 'హే సినామిక'.

 

-గంగసాని

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25