English | Telugu
బ్యానర్:శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
Rating:2.50
విడుదలయిన తేది:Jun 14, 2024
సినిమా పేరు: హరోం హర
తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయప్రకాశ్, అక్షర, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
డీఓపీ: అరవింద్ విశ్వనాథన్
ఆర్ట్: ఏ రామాంజనేయులు
ఎడిటర్: రవితేజ గిరిజాల
రచన, దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత: సుమంత్ జి నాయుడు
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
విడుదల తేదీ: జూన్ 14, 2024
విభిన్న చిత్రాలు చేస్తూ, టాలీవుడ్ లో ఎంతో కష్టపడే హీరోలలో ఒకడిగా సుధీర్ బాబు పేరు తెచ్చుకున్నాడు. అయితే అతని కష్టానికి తగ్గ ఫలితాలు రావట్లేదనే చెప్పాలి. ఎక్కువగా పరాజయలే ఎదురవుతున్నాయి. ఓ మంచి విజయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. గతేడాది 'హంట్', 'మామా మశ్చీంద్ర' చిత్రాలతో పలకరించగా చేదు ఫలితాలే ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు 'హరోం హర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'సెహరి' ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుధీర్ బాబుకి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కుప్పంలో అరాచకం రాజ్యమేలుతుంది. ప్రజల మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండదు. తిమ్మారెడ్డి, అతని కుటుంబం చేసే అరాచలకు.. ఆ ప్రాంత ఎమ్మెల్యే సైతం భయపడతాడు. దీంతో వారికి ఎదురే లేకుండా పోతుంది. అలాంటి చోటుకి బతుకుదెరువు కోసం సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) వస్తాడు. పాలిటెక్నిక్ కాలేజ్ లో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా చేరతాడు. అయితే తిమ్మారెడ్డి మనుషులతో గొడవ కారణంగా.. సుబ్రహ్మణ్యం తన ఉద్యోగం కోల్పోతాడు. అదే సమయంలో తన తండ్రి(జయప్రకాశ్) ఊరి నిండా అప్పులు చేశాడని, ఆ అప్పులు తీరాలంటే చాలా డబ్బు అవసరమని తెలుసుకుంటాడు. డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సుబ్రహ్మణ్యంకి.. తన స్నేహితుడు పళని సామి(సునీల్) కారణంగా, గన్ తయారీ మొదలు పెట్టాలనే ఆలోచన వస్తుంది. తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత.. సుబ్రహ్మణ్యం జీవితం, కుప్పం ప్రజల జీవితాలు ఎలా మారాయి? తన గన్ వ్యాపారం కోసం తిమ్మారెడ్డి మనుషులతో చేతులు కలిపి, హింస మరింత పెరగడానికి కారణమైనప్పటికీ.. కుప్పం ప్రజలు ఎందుకు సుబ్రహ్మణ్యంని దేవుడిలా భావిస్తారు? తిమ్మారెడ్డి మనుషుల నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి లభించిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
బతుకుదెరువు కోసం ఒక ఊరికి వచ్చిన హీరో.. అక్కడి ప్రజలను హింసిస్తున్న వారిని ఎదిరించి దేవుడిలా కీర్తించబడటం.. లేదా ఒక సామాన్య వ్యక్తి అసామాన్యుడిగా ఎదగటం.. ఈ తరహా కథలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. 'హరోం హర' కూడా ఆ కోవలోకి చెందినదే. బతుకుదెరువు కోసం కుప్పం వచ్చిన సుబ్రహ్మణ్యం.. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం పోవడంతో.. అనుకోకుండా గన్స్ తయారు చేయడాన్ని వృత్తిగా మలచుకొని, చీకటి సామ్రాజ్యంలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతాడు. కథగా చూసుకుంటే కొత్తదనం ఏంలేదు. ఇలాంటి కథలకు హీరో క్యారెక్టరైజేషన్, కథనం కీలకం. హీరో పాత్రతో ప్రేక్షకులు ప్రయాణం చేసేలా రాసుకోవాలి. అతనికి ఎన్నో అడ్డంకులు ఎదురు కావాలి, ఆ అడ్డంకులను దాటుకొని అతను ఎదగాలి. అలాగే బలమైన యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఉంటే సరిపోదు.. ఎమోషన్ కూడా అదే స్థాయిలో పండాలి. కానీ 'హరోం హర' విషయంలో ఇవేమీ జరగలేదు. హీరో పాత్ర తనకి ఎదురే లేదన్నట్టుగా అన్నీ చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. దీంతో చూసే ప్రేక్షకులకు.. ఏదో కొన్ని సన్నివేశాలు చూస్తున్నట్లు అనిపిస్తుంది కానీ.. ఒక పాత్రతోనో, ఒక కథతోనో ప్రయాణిస్తున్నట్లు అనిపించదు.
ఫస్టాఫ్ కాస్త నయమే. హీరో పాత్ర పరిచయం, అతను ఎదిగే క్రమం చూడగలిగేలా ఉంటుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు కూడా మెప్పించాయి. కానీ సెకండాఫ్ పూర్తిగా తేలిపోయింది. యాక్షన్ సన్నివేశాలతో నడిపించడం తప్ప.. సెకండాఫ్ లో కథ చెప్పడానికి పెద్దగా స్కోప్ లేదు. దాంతో సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే పరిస్థితి వస్తుంది. దానికి తోడు, విలన్ పాత్రను కూడా క్లైమాక్స్ కోసమే అన్నట్టుగా చివరివరకు బ్రతికించినట్లు ఉంది.
దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక స్క్రిప్ట్ ని ఇంకా మెరుగ్గా రాసుకొని ఉండాల్సింది. ముఖ్యంగా సినిమా ఫలితాన్ని నిర్ణయించే సెకండాఫ్ మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది. యాక్షన్ సన్నివేశాలను మాత్రం సుధీర్ బాబుకి కాకుండా ఏదో స్టార్ హీరోకి అన్నట్టుగా డిజైన్ చేశారు. అయితే బలమైన ఎమోషన్స్ లేకుండా.. కేవలం యాక్షన్ సన్నివేశాలతోనే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టడం కష్టమనే విషయాన్ని గ్రహించాలి.
టెక్నికల్ గా సినిమా బాగానే ఉంది. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. చాలా సన్నివేశాలను తన బీజీఎంతో నిలబెట్టాడు. అరవింద్ విశ్వనాథన్ కెమెరా పనితనం బాగానే ఉంది. ఎడిటర్ రవితేజ గిరిజాల కత్తెరకు పని చెప్పి, నిడివిని కుదించే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ఆర్టిఫిషియల్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
సుబ్రహ్మణ్యం పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. యాక్షన్ సన్నివేశాల్లో రెచ్చిపోయాడు. సుబ్రహ్మణ్యం స్నేహితుడిగా పళని సామి అనే ఫుల్ లెంగ్త్ పాత్రలో సునీల్ కనిపించాడు. సునాయాసంగా ఆ పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం ప్రేయసి పాత్రలో మాళవిక శర్మ ఉన్నంతలో మెప్పించింది. జయప్రకాశ్, అక్షర, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
యాక్షన్ ప్రియులకు ఈ సినిమా నచ్చే అవకాశముంది. అలా అని అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం.. నిరాశ చెందుతారు.
- గంగసాని