Read more!

English | Telugu

సినిమా పేరు:గుర్తుందా శీతాకాలం
బ్యానర్:నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వేదాక్షర మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Dec 9, 2022

సినిమా పేరు: గుర్తుందా శీతాకాలం
తారాగణం: సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
రచన, దర్శకత్వం: నాగశేఖర్
నిర్మాతలు: భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి
బ్యానర్స్: నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వేదాక్షర మూవీస్
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022

టాలీవుడ్ లో ఎంతో ప్రతిభ ఉన్న యువ నటుల్లో సత్యదేవ్ ఒకడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పిస్తాడు. ఇటీవల 'గాడ్ ఫాదర్' చిత్రంలో నెగటివ్ రోల్ లో నటించి మెప్పించిన సత్య దేవ్.. తాజాగా ఆయన హీరోగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కన్నడ ఫిల్మ్ 'లవ్ మాక్ టైల్'కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:-

దేవ్(సత్యదేవ్) బెంగళూరు నుంచి మంగళూరు కారులో వెళ్తుండగా అనుకోకుండా దివ్య(మేఘా ఆకాష్)ను కలుస్తాడు. ఆమెను ఒక ప్రమాదం నుంచి రక్షించి మంగళూరు వరకు లిఫ్ట్ ఇస్తాడు. ఈ ప్రయాణంలో దేవ్ తన జీవితంలో ఉన్న మూడు ప్రేమ కథల గురించి చెప్తాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దేవ్ స్కూల్ డేస్ లో ఒకమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ ప్రేమ పట్టాలెక్కదు. కాలేజ్ డేస్ లో అమ్ము(కావ్య శెట్టి)ని, ఆ తర్వాత నిధి(తమన్నా)ని ప్రేమిస్తాడు. దేవ్ ఇన్నిసార్లు ప్రేమలో ఎందుకు పడ్డాడు? నిజమైన ప్రేమ గురించి ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆ ముగ్గురిలో ఎవరితో జీవితం పంచుకోవాలి అనుకున్నాడు? అతని జీవితంలో చోటుచేసుకున్న విషాదమేంటి? తన ప్రేమ కథలను దివ్యకు చెప్పడానికి కారణమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

ఒక వ్యక్తి జీవితంలో విభిన్న దశల్లో జరిగే ప్రేమ కథలతో వచ్చిన సినిమాలను ఇప్పటికే మనం చూశాం. 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్', 'ప్రేమమ్' సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. ఆ తరహా చిత్రాలను తీసి మెప్పించడం అంత సులభం కాదు. సన్నివేశాలు నిజ జీవితంలో జరిగిన సంఘటనల్లా సున్నితంగా హృదయాలను హత్తుకునేలా ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు నాగశేఖర్ అంతగా సక్సెస్ కాలేకపోయాడు.

ప్రథమార్థం పర్లేదు హాస్యంతో కొంతవరకు బాగానే నడిచింది. స్కూల్ సన్నివేశాలు, సత్యదేవ్-ప్రియదర్శి మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగింది. కానీ ప్రేమ సన్నివేశాలే ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా లేకపోగా, విసిగించేలా ఉన్నాయి. సత్యదేవ్-కావ్య శెట్టి పదేపదే విడిపోవడం, తిరిగి మాట్లాడుకోవడం విసిగిస్తుంది. తమన్నా పాత్ర తాలూకు సన్నివేశాలు కూడా ఆమె పాత్రలాగే నెమ్మదిగా సాగుతాయి. దేవ్ తో టైమ్ స్పెండ్ చేస్తూ, గ్యాప్ లేకుండా మాట్లాడే ఆమె పాత్ర.. దేవ్ తో పాటు చూసే ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టిస్తుంది. పాత్రల తీరుని, ప్రేమ సన్నివేశాలను మరింత అందంగా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రాసుకుంటే బాగుండేది. సినిమా చాలా నీరసంగా నడిచింది. ముఖ్యంగా సెకండాఫ్ బాగా ల్యాగ్ అయినట్లు అనిపించింది. కన్నడ ప్రేక్షకులకు ఈ కథ కొత్తగా అనిపించి ఉండొచ్చు. కానీ తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఇలాంటి కథలు చూసేశారు. ఇక్కడికి తగ్గట్లుగా మార్పులు చేసినా బాగుండేది.

లక్ష్మీ భూపాల రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఆ సంభాషణల వల్ల వచ్చిన హాస్యమే సినిమాలో కాస్త రిలీఫ్ అని చెప్పొచ్చు. అయితే కొన్ని చోట్ల మాత్రం సన్నివేశాన్ని డామినేట్ చేసేలా సంభాషణలు ఉన్నాయి. ఇలాంటి చిత్రాలకు సంగీతం ప్రధాన బలంగా నిలవాలి. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు గానీ పాటలతో మ్యాజిక్ చేయలేకపోయాడు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను అందంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా మంగళూరు విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు సెకండాఫ్ లో చాలా సన్నివేశాలను ట్రిమ్ చేయొచ్చు. అసలే కథ నెమ్మదిగా నడుస్తుందంటే.. ఆ సన్నివేశాల్లోని ల్యాగ్ కారణంగా సెకండాఫ్ ప్రేక్షకులకు మరింత బోర్ కొట్టించేలా ఉంది. 

నటీనటుల పనితీరు:-

దేవ్ పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. జీవితంలో విభిన్న దశలకు తగ్గట్లుగా ఎక్స్ ప్రెషన్స్, బాడీ ల్యాంగ్వేజ్ తో మెప్పించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా రాణించాడు. నిధి పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. సెన్సిటివ్ గర్ల్ గా ఆకట్టుకుంది. కానీ సత్యదేవ్-తమన్నా జోడీ అంతగా ఆకట్టుకునేలా లేదు. దేవ్ ని వదిలేయాలో, పెళ్లి చేసుకోవాలా అనే సందిగ్దంలో ఉండే రిచ్ గర్ల్ అమ్ము పాత్రలో కావ్య శెట్టి మెప్పించింది. ఇక దివ్య అనే చురుకైన యువతి పాత్రలో మేఘా ఆకాష్ ఇంప్రెస్ చేసింది. అయితే ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. డాక్టర్ పాత్రలో మెరిసిన సీనియర్ నటి సుహాసిని ఎప్పటిలాగే మెప్పించారు. ఎప్పుడూ దేవ్ వెంటే ఉండే స్నేహితుడు ప్రశాంత్ పాత్రలో ప్రియదర్శి అలరించాడు. సత్యదేవ్ తో కలిసి బాగానే నవ్వించాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'గుర్తుందా శీతాకాలం' గుర్తుంచుకునే సినిమా అయితే కాదు. కథలో కొత్తదనం లేదు, కథనంలో వేగం లేదు. రొటీన్ కథాకథనాలతో సాదాసీదా సన్నివేశాలతో నడిచింది. హాస్యం కొంతవరకు బాగానే ఉన్నా ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకునేలా లేవు.

-గంగసాని