Read more!

English | Telugu

సినిమా పేరు:గాడ్‌ ఫాద‌ర్‌
బ్యానర్:కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్‌గుడ్ గుడ్ ఫిలిమ్స్‌
Rating:3.00
విడుదలయిన తేది:Oct 5, 2022

సినిమా పేరు: గాడ్‌ఫాద‌ర్‌
తారాగ‌ణం: చిరంజీవి, న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్‌, ముర‌ళీశ‌ర్మ‌, స‌ర్వ‌ద‌మ‌న్ బెన‌ర్జీ, సాయాజీ షిండే, స‌ముద్ర‌క‌ని, తాన్యా ర‌విచంద్ర‌న్‌, పూరి జ‌గ‌న్నాథ్‌, సునీల్‌, బ్ర‌హ్మాజీ, స‌మ్మెట గాంధీ, దివి వ‌డ్త్య‌, గంగ‌వ్వ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, స‌ల్మాన్ ఖాన్ (గెస్ట్ రోల్‌), ముర‌ళీ మోహ‌న్ (గెస్ట్‌), అన‌సూయ‌, భ‌ర‌త్‌రెడ్డి, క‌స్తూరి (గెస్ట్‌), ప్ర‌గ‌తి (గెస్ట్‌), గెట‌ప్ శ్రీ‌ను, ష‌ఫీ, ప‌వ‌న్‌తేజ్‌
సంభాష‌ణ‌లు: ల‌క్ష్మీ భూపాల్‌
పాట‌లు: అనంత శ్రీ‌రామ్‌, రామ‌జోగ‌య్య శాస్త్రి
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: నీర‌వ్ షా
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంక‌టేశ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సురేశ్ సెల్వ‌రాజ‌న్‌
స‌మ‌ర్ప‌ణ: కొణిదెల సురేఖ‌
నిర్మాత‌లు: ఆర్‌.బి. చౌద‌రి, ఎన్వీ ప్ర‌సాద్‌
స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న్ రాజా
బ్యాన‌ర్స్: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్‌గుడ్ గుడ్ ఫిలిమ్స్‌
విడుద‌ల తేదీ: 5 అక్టోబ‌ర్ 2022

మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'లూసిఫ‌ర్‌'ను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నార‌ని తెలిసిన‌ప్పుడు చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఎందుకంటే 'లూసిఫ‌ర్' అప్ప‌టికే తెలుగులో రిలీజ‌య్యింది క‌నుక‌. అయితే ఆ క్యారెక్ట‌ర్ త‌న‌ ఇమేజ్‌కు టైల‌ర్ మేడ్‌లాగా ఉంటుంద‌ని భావించిన చిరంజీవి, దాన్ని తెలుగులో 'గాడ్‌ఫాద‌ర్' టైటిల్‌తో చేయ‌డానికి ఇష్ట‌ప‌డ్డారు. త‌న‌కు ఎంతో ఆప్తుడైన నిర్మాత ఎడిట‌ర్ మోహ‌న్ త‌న‌యుడు మోహ‌న్ రాజా (జ‌యం రాజా)కు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. చిరు సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. 'లూసిఫ‌ర్‌'లోని ప్ర‌ధాన ఇతివృత్తాన్ని అలాగే ఉంచి, స్క్రీన్‌ప్లేలో ప‌ది వ‌ర‌కు మార్పులు చేశామ‌ని మోహ‌న్ రాజా ఈ సినిమా విడుద‌ల‌కు ముందు చెప్పారు. ఆ మార్పులు ఎలా ఉన్నాయి, 'లూసిఫ‌ర్‌'తో పోలిక అనివార్య‌మైన 'గాడ్‌ఫాద‌ర్‌'.. ఒరిజిన‌ల్‌కు స‌రితూగేలా ఉందా, దానికి మించి ఉందా?.. తెలుసుకుందాం...

క‌థ‌
ప్ర‌జ‌ల‌లో మంచివాడుగా ఎంతో పేరున్న ముఖ్య‌మంత్రి పీకే రామ‌దాస్ (స‌ర్వ‌ద‌మ‌న్ బెన‌ర్జీ) మృతి చెంద‌డంతో, ఆయ‌న త‌ర్వాత ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతార‌నేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌యంగా మారుతుంది. ఆ ప‌ద‌విని హోమ్ మినిస్ట‌ర్ నారాయ‌ణ‌వ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ‌), రామ‌దాస్ అల్లుడు జ‌య‌దేవ్ (స‌త్య‌దేవ్‌) ఆశిస్తారు. జ‌య‌దేవ్ ఎంత‌టి కిరాత‌కుడో తెలియ‌డంతో, భ‌య‌ప‌డ్డ‌ నారాయ‌ణ‌వ‌ర్మ అత‌ను చెప్పిన‌ట్లు న‌డుచుకోవాల‌నుకుంటాడు. రామ‌దాస్‌కు అస‌లు భార్య కంటే ముందుగానే మ‌రో స్త్రీ ద్వారా పుట్టిన బ్ర‌హ్మ (చిరంజీవి) అంటే ఆయ‌న పెద్ద‌కుమార్తె స‌త్య‌ప్రియ (న‌య‌న‌తార‌)కు ఏమాత్రం గిట్ట‌దు. చిన్న‌త‌నంలోనే అత‌డిపై ద్వేషం పెంచుకొని, అత‌డి ముఖం చూడ్డానికి కూడా ఇష్ట‌ప‌డ‌దు. అందుకే చిన్న‌త‌నంలోనే ఆ కుటుంబం నుంచి దూరంగా వెళ్లిపోతాడు బ్ర‌హ్మ‌. 20 ఏళ్లు ఎక్క‌డున్నాడో కూడా తెలీని అత‌ను, ఆరేళ్ల క్రిత‌మే తిరిగి వ‌స్తాడు. అత‌డి చాణ‌క్య నీతితో స‌త్య‌ప్రియ సీఎం అభ్య‌ర్థిగా మారుతుంది. ఆమెకు తెలీకుండా ఆమె చెల్లెలు జాన్వి (తాన్యా ర‌విచంద్ర‌న్‌)ని డ్ర‌గ్స్‌కు ఎడిక్ట్ చేసిన జ‌య‌దేవ్‌, డ్ర‌గ్ మాఫియాతో చేతులు క‌లిపి, బ్ర‌హ్మ‌ను అంతంచేసి, సీయం కావాల‌ని ప్లాన్ చేస్తాడు. ఒక త‌ప్పుడు కేసును అత‌నిపై ప‌డేలా చేసి, జైలుకు పంపిస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? జైలు నుంచి బ్ర‌హ్మ బ‌య‌ట‌కు వ‌చ్చాడా? జ‌య‌దేవ్ ఎత్తుల్ని చిత్తుచేశాడా? త‌న‌ను అస‌హ్యించుకొనే స‌త్య‌ప్రియ‌కు ద‌గ్గ‌ర‌య్యాడా? ఇలాంటి విష‌యాలు మిగ‌తా క‌థ‌లో తెలుస్తాయి.


ఎనాలసిస్ :

'లూసిఫ‌ర్‌'ను మ‌క్కీకి మ‌క్కీ దింప‌కుండా, దాని రీమేక్ అయిన‌ 'గాడ్‌ఫాద‌ర్' విష‌యంలో స్వేచ్ఛ తీసుకొని స్క్రీన్‌ప్లేలో, క్యారెక్ట‌ర్స్ ప‌రంగా కొన్ని మార్పులు చేశాడు డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా. వాటిలో ప్ర‌ధాన‌మైన‌వి రెండు. 'లూసిఫ‌ర్‌'లో సీయం రామ‌దాస్‌కు ఓ కూతురు, కొడుకు ఉంటారు. 'గాడ్‌ఫాద‌ర్‌'లో ఆయ‌న‌కు ఇద్ద‌రు కూతుళ్లు అన్న‌ట్లు చూపించారు. అంటే ఒరిజిన‌ల్‌లో టొవినో థామ‌స్ చేసిన జ‌తిన్ రామ‌దాస్ క్యారెక్ట‌ర్ తెలుగు రీమేక్‌లో లేదు. ఆ పాత్ర లేక‌పోవ‌డంతో దాని నిడివిని కూడా న‌య‌న‌తార చేసిన స‌త్య‌ప్రియ క్యారెక్ట‌ర్‌కు ఇచ్చారు. దీని వ‌ల్ల అస‌లు క‌థ‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా స్క్రీన్‌ప్లేను అల్లాడు మోహ‌న్ రాజా. అలాగే ఒరిజిన‌ల్‌లో సత్య‌ప్రియ‌కు జ‌య‌దేవ్ రెండో భ‌ర్త‌గా క‌నిపిస్తాడు. స‌త్య‌ప్రియ‌కు మొద‌టి భ‌ర్త ద్వారా క‌లిగిన కూతురు జాన్విపై క‌న్నేసి, ఆమెను పొందాల‌ని చూస్తుంటాడు. ఇది తెలుగు ప్రేక్ష‌కుల సెంటిమెంట్‌కు ఇబ్బందిక‌రంగా అవుతుంద‌ని భావించారేమో, ఆ జాన్వి పాత్ర‌ను ఇందులో స‌త్య‌ప్రియ చెల్లెలిగా మార్చారు. అంటే మ‌ర‌ద‌లి మీద క‌న్నేసిన వాడిగా ఇందులో జ‌య‌దేవ్ క్యారెక్ట‌ర్ మ‌న‌కు క‌నిపిస్తుంది. ఈ మార్పు బాగానే ఉంది. 

'గాడ్‌ఫాద‌ర్‌'లో చాలా క్యారెక్ట‌ర్లు ఉన్నాయి. వాటికి త‌గ్గ న‌టుల్ని ఎంచుకోవ‌డం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఓ స‌వాలు. ఆ స‌వాలును ద‌ర్శ‌క నిర్మాత‌లు అధిగ‌మించారు. పాత్ర‌కు స‌రిపోయే న‌టీన‌టుల్ని వారు ఎంచుకున్నారు. అందుకే ఒరిజిన‌ల్ త‌ర‌హాలోనే 'గాడ్‌ఫాద‌ర్‌'లోనూ దాదాపు అన్ని పాత్ర‌లూ మ‌న మ‌న‌సులో రిజిస్ట‌ర్ అయ్యేట్లు ఉన్నాయి. దీనికి కార‌ణం.. వాటిని పోషించిన న‌టుల అభిన‌య సామ‌ర్థ్యం. మ‌సూమ్ భాయ్‌గా స‌ల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ గొప్ప‌గా కాక‌పోయినా, అల‌రించే విధంగానే ఉంది.

సాధార‌ణంగా చిరంజీవి అంటే అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేసేది మాస్ ఎలిమెంట్స్‌. అంటే.. ఆయ‌న హీరోయిన్‌తో ఆడాలి, పాడాలి, రౌడీల‌తో ఫైట్లు చేయాలి, కామెడీ చేసి న‌వ్వించాలి, డైలాగ్స్‌తో అద‌ర‌గొట్టాలి. అప్పుడే బాక్స్ బ‌ద్ద‌ల‌వుతుంది అనేది వారి న‌మ్మ‌కం. ఆ ప‌రంగా చూసుకుంటే.. 'గాడ్‌ఫాద‌ర్‌'లోని బ్ర‌హ్మ పాత్ర వారిని డిజ‌ప్పాయింట్‌మెంట్‌కు గురిచేస్తుంది. ఇందులో బ్ర‌హ్మ అనే పాత్ర‌లో చిరు కామెడీ చెయ్య‌డు. ఆయ‌న‌కు అస‌లు హీరోయిన్ లేదు. అందువ‌ల్ల ఆడి పాడ‌టాలు లేవు. వారితో స‌ర‌సాలు లేవు. మిగ‌తావి ఆయ‌న చేశాడు. రౌడీల‌ను చిత‌గ్గొడ‌తాడు, ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో.. అందునా పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న డైలాగ్స్‌తో అద‌ర‌గొడ‌తాడు. క్లోజ‌ప్ షాట్స్‌లో హావ‌భావాల‌తో మెప్పిస్తాడు. 

'గాడ్‌ఫాద‌ర్‌'కు సంబంధించి చెప్పుకోద‌గ్గ ఇంకో విష‌యం.. డైరెక్ట‌ర్‌కు టెక్నీషియ‌న్లు అండ‌గా నిలిచిన విధానం. బ్ర‌హ్మ క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేయ‌డానికి, కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్‌ను మ‌న‌సుకు హ‌త్తుకొనేట్లు చేయ‌డంలో త‌మ‌న్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చ‌క్క‌గా వ‌ర్క‌వుట్ అయ్యింది. త‌న‌ను ఎందుకు బీజీయం మాస్ట‌ర్ అంటారో, ఈ సినిమాతో మ‌రోసారి అత‌ను తెలియ‌జేశాడు. దేశంలోని టాప్ సినిమాటోగ్రాఫ‌ర్స్‌లో ఒక‌డైన‌ నీర‌వ్ షా.. ఈ మూవీకి ఇచ్చిన ఎలివేష‌న్ షాట్స్ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. సీనియ‌ర్ ఎడిట‌ర్ మార్తాండ్ కె. వెంక‌టేశ్ ప‌నిత‌నం కూడా మెచ్చుకోత‌గ్గ‌దే. స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌తో మెప్పించాడు సురేశ్ సెల్వ‌రాజ‌న్‌. లాస్ట్ బ‌ట్ నాట్ ద లీస్ట్‌.. డైలాగ్ రైట‌ర్ ల‌క్ష్మీ భూపాల్ రాసిన సంభాష‌ణ‌లు సినిమాకు ప్ర‌ధాన బ‌లాల్లో ఒక‌టిగా నిలిచాయ‌ని చెప్పాలి.

న‌టీన‌టుల ప‌నితీరు
గాడ్‌ఫాద‌ర్ అనేది ప్ర‌ధానంగా క్యారెక్ట‌రైజేష‌న్స్‌, న‌టుల పర్‌ఫామెన్స్ మీద ఆధార‌ప‌డిన సినిమా. బ్ర‌హ్మ అలియాస్ గాడ్‌ఫాద‌ర్‌గా మెగాస్టార్ చిరంజీవి గొప్ప‌గా రాణించి, ఆక‌ట్టుకున్నారు. ఆ క్యారెక్ట‌ర్‌లో ప‌ర్‌ఫెక్ట్‌గా ఆయ‌న ఇమిడిపోయారు. క్లోజ‌ప్ షాట్స్‌లో ఆయ‌న హావ‌భావ విన్యాసాల‌ను ఆస్వాదించ‌డం ఓ అనుభ‌వం. అయితే ఆయ‌న గెట‌ప్ విష‌యంలో డైరెక్ట‌ర్ ఇంకాస్త శ్ర‌ద్ధ‌పెట్టి ఉండాల్సింది. చిన్న‌వాళ్లుగా ఉన్న‌ప్పుడు బ్ర‌హ్మ‌, స‌త్య‌ప్రియ మ‌ధ్య వ‌య‌సు తేడా ఒక‌ట్రెండు సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ ఉండ‌ద‌నిపిస్తుంది. కానీ పెద్ద‌య్యాక స‌త్య‌ప్రియ గెట‌ప్ యంగ్‌గానే ఉండ‌గా, బ్ర‌హ్మ‌.. నెరిసిన గెడ్డం, జుట్టుతో మ‌ధ్య‌వ‌య‌స్కుడిగా క‌నిపిస్తాడు. ఇద్ద‌రూ ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న‌ప్పుడు ఇది మ‌రింత ప్ర‌స్ఫుటమ‌వుతుంది. స‌త్య‌ప్రియ పాత్ర‌లో న‌య‌న‌తార అతి సునాయాసంగా ఇమిడిపోయింది. క‌ళ్ల‌తో న‌టించ‌గ‌ల తార‌ల్లో ఒక‌ర్తె అయిన ఆమె ఆ పాత్ర‌లోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసింది. సునీత వాయిస్ కూడా ఆమెకు బాగానే న‌ప్పింది. జ‌య‌దేవ్ క్యారెక్ట‌ర్ చేసిన‌ స‌త్య‌దేవ్‌కు గాడ్‌ఫాద‌ర్ ఓ గేమ్ ఛేంజ‌ర్ అయితే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. అత‌నిలో ఎలాంటి న‌టుడున్నాడో జ‌య‌దేవ్ పాత్ర మ‌న‌కు తెలియ‌జేసింది. అత‌ను గ్రేట్ ప‌ర్ఫామెన్స్ ఇచ్చాడు. 

హోమ్ మినిస్ట‌ర్ నారాయ‌ణ‌వ‌ర్మ‌గా ముర‌ళీశ‌ర్మ‌, బ్ర‌హ్మ అనుచ‌రుడు కోటిగా సునీల్‌, ఏసీపీ ఇంద్ర‌జిత్ క్యారెక్ట‌ర్‌లో స‌ముద్ర‌క‌ని, సీయం రామ‌దాస్‌గా 'సిరివెన్నెల' హీరో స‌ర్వ‌ద‌మ‌న్ బెన‌ర్జీ రాణించారు. జ‌ర్న‌లిస్ట్ గోవ‌ర్ధ‌న్‌గా పూరి జ‌గ‌న్నాథ్ త‌న అభిన‌యంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. న‌టునిగా ఆయ‌న‌కు గిరాకీ పెర‌గ‌వ‌చ్చు. స‌త్య‌ప్రియ చెల్లెలు జాన్వీ పాత్ర‌లో తాన్యా ర‌విచంద్ర‌న్ ముచ్చ‌ట‌గా ఉంది. టీవీ చాన‌ల్ నిర్వాహ‌కులు రామ్‌ప్రసాద్‌, శ్వేత పాత్ర‌ల్లో భ‌ర‌త్‌రెడ్డి, అన‌సూయ‌, ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు నాయుడు పాత్ర‌లో సాయాజీ షిండే, బ్ర‌హ్మ చెప్పిన‌ట్లు చేసే ఎమ్మెల్యేలుగా బ్ర‌హ్మాజీ, స‌మ్మెట గాంధీ, సునీల్ భార్య‌గా దివి వ‌డ్త్య‌, పార్టీ కార్య‌క‌ర్త‌లుగా ష‌ఫీ, గెట‌ప్ శ్రీ‌ను క‌నిపించారు. ముర‌ళీమోహ‌న్ లాంటి నిన్న‌టి త‌రం హీరోను ఒక‌ట్రెండుకు మించి డైలాగ్స్ లేని చిన్న పాత్ర‌లో చూడాల్సి రావ‌డం బాధాక‌రం. స్పెష‌ల్ అప్పీరెన్స్‌తో స‌ల్మాన్ ఖాన్ అల‌రించాడు. రామ‌దాస్ భార్య‌లుగా ప్ర‌గ‌తి, క‌స్తూరి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'గాడ్‌ఫాద‌ర్' లాంటి సీరియ‌స్ రోల్‌లో చిరంజీవిని చూడ్డం ఆయ‌న అభిమానుల్లో కొందరికి రుచించ‌క‌పోవ‌చ్చు కానీ, ఆయ‌న‌ను భిన్న త‌ర‌హా పాత్ర‌ల్లో చూడాల‌ని ఆకాంక్షించే అంద‌రినీ ఈ మూవీ ఆక‌ట్టుకుంటుంది. చిరు డాన్సుల్ని కాకుండా ఆయ‌న హావ‌భావ విన్యాసాల‌ను చూడాల‌నుకొనేవారిని 'గాడ్‌ఫాద‌ర్' మెప్పిస్తాడు. ఫైట్ల ప‌రంగానూ ఆయ‌న ఎక్క‌డా అసంతృప్తికి గురిచేయ‌లేదు. ఒరిజిన‌ల్ అయిన 'లూసిఫ‌ర్' మూవీని చూసిన‌వాళ్లు, దానితో పోల్చుకోకుండా ఉంటే.. క్యారెక్ట‌ర్స్ ప‌రంగా, స్క్రీన్‌ప్లే ప‌రంగా డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా చేసిన మార్పులు న‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి