English | Telugu
బ్యానర్:రినాయిజన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ
Rating:2.50
విడుదలయిన తేది:Apr 8, 2022
సినిమా పేరు: గని
తారాగణం: వరుణ్ తేజ్, సాయీ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర, నరేశ్, తనికెళ్ల భరణి, హరిప్రియ, రఘుబాబు, భరత్‌రెడ్డి, బ్రహ్మాజీ, సత్య, సుదర్శన్, రాజా రవీంద్ర
కథ, స్క్రీన్‌ప్లే: కిరణ్ కొర్రపాటి
మాటలు: అబ్బూరి రవి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, రఘురామ్
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబీ
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
బ్యానర్స్: రినాయిజన్స్ పిక్చర్స్ అల్లు బాబీ కంపెనీ
విడుదల తేదీ: 8 ఏప్రిల్ 2022
తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిలిమ్స్ బాగా తక్కువ. ఆ వచ్చిన వాటిలో ప్రేక్షకుల్ని అలరించినవి ఎక్కువే. అందువల్ల బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్ తేజ్ 'గని' అనే సినిమా చేస్తున్నాడనేసరికి ఆడియెన్స్‌లో ఆసక్తి వ్యక్తమైంది. ఈ సినిమా కోసం అతను యు.ఎస్. వెళ్లి మరీ బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు. ఆమధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసింది. 20 ఏళ్లుగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ వచ్చిన కిరణ్ కొర్రపాటి డైరెక్టర్‌గా పరిచయమైన 'గని' ఎలా ఉందంటే...
కథ:- తండ్రి విక్రమాదిత్య (ఉపేంద్ర) నేషనల్ బాక్సింగ్ ఛాపియన్‌షిప్‌లో ఫైనల్స్ దాకా వెళ్లి, ఓటమి పాలవడంతో పాటు స్టెరాయిడ్స్ తీసుకున్నాడనే చెడ్డపేరు తెచ్చుకోవడంతో, అతడి మీద చిన్నతనం నుంచే ద్వేషం పెంచుకుంటాడు గని (వరుణ్ తేజ్). ఆ తర్వాత విక్రమాదిత్య ఏమయ్యాడో మనకు తెలీదు. తల్లి మాధురి (నదియా)కి బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేసి, ఆమెకు తెలీకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి, స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు వస్తాడు. అప్పుడు తల్లికి నిజం తెలుస్తుంది. ఈ మధ్యలో గనిని కాలేజ్‌మేట్ మాయ (సాయీ మంజ్రేకర్) ప్రేమిస్తున్నాంటూ వెంటపడ్తూ ఉంటుంది. ఫైనల్స్‌లో గనిని ఎమోషనల్‌గా రెచ్చగొట్టి, పోటీలో డిస్‌క్వాలిఫై అయ్యేట్లు చేసి, గెలుస్తాడు ఆది (నవీన్‌చంద్ర). ఆ సందర్భంలోనే గతంలో తండ్రితో నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో తలపడి గెలిచిన విజయేందర్ సిన్హా (సునీల్‌శెట్టి) పరిచయమవుతాడు గనికి. ఆయన వల్ల తండ్రి గురించిన అసలు నిజం గనికి తెలుస్తుంది. ఏమిటా నిజం? విక్రమాదిత్య ఏమయ్యాడు? అతడి కోచ్ ఈశ్వర్‌నాథ్ ఆడిన ఆట ఏమిటి? తండ్రి ఆశయాన్ని గని ఎలా సాధించాడు? అనే ప్రశ్నలకు సెకండాఫ్‌లో మనకు సమాధానాలు లభిస్తాయి.
ఎనాలసిస్ :
బాక్సింగ్‌ను గెలిపించాలని కలలుకని, స్వార్థపరుల చేతుల్లో ఓడిపోయిన విక్రమాదిత్య ఆశయాన్ని అతని కొడుకు గని ఎలా నెరవేర్చాడన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ 'గని'. ఇది కొత్త కథ కాదు, బలమైన కథ కూడా కాదు. అలాంటప్పుడు డైరెక్టర్ నమ్ముకోవాల్సింది స్క్రీన్‌ప్లేను, క్యారెక్టరైజేషన్స్‌ను, ఎమోషన్స్‌ను. కొత్త దర్శకుడైన కిరణ్ కొర్రపాటి స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా రాసుకోవడంలో పాక్షికంగానే సఫలమయ్యాడు. హీరో గని క్యారెక్టరైజేషన్‌ను బాగానే తీర్చిదిద్దినప్పటికీ, హీరో తండ్రి విక్రమాదిత్య క్యారెక్టర్‌ను, హీరోయిన్ మాయ క్యారెక్టర్‌ను సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. జగపతిబాబు పోషించిన ఈశ్వర్‌నాథ్ పాత్రను బాగానే మలిచినా, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ను అర్ధవంతంగా రాసుకోలేకపోయాడు.
ఫస్టాఫ్‌లో హీరోయిన్ మాయ పాత్ర మనకి ఒకింత చికాకును కలిగిస్తుంది. గని, మాయ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకొనేలా లేవు. సీన్‌లోకి మాయ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఎంత త్వరగా ఆమె సీన్ అయిపోయి, ఇంకో సీన్ వస్తుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు విక్రమాదిత్య క్యారెక్టర్‌లో ఉపేంద్రను రివీల్ చేయడం ఆసక్తిని కలిగించింది. సెకండాఫ్‌లో హీరో క్యారెక్టరైజేషన్‌ను ఓ ఎమోషన్‌తో కొనసాగించడం సినిమాను కొంతవరకు కాపాడింది. విక్రమాదిత్య క్యారెక్టర్ ఎంట్రీని బాగా తీసిన దర్శకుడు, ఆ తర్వాత ఆ క్యారెక్టర్‌ను చివరిదాకా శక్తిమంతంగా కొనసాగించడంలో ఫెయిలయ్యాడు. ఇది సినిమాకు మైనస్ అయ్యింది. నవీన్‌చంద్ర చేసిన ఆది పాత్రను పరిచయం చేసి, దాన్ని కొనసాగించిన తీరుకీ, చివరలో ఆ పాత్రను చూపించిన తీరుకీ పొంతన కుదరలేదు. క్రికెట్‌కు ఐపీఎల్ తరహాలో బాక్సింగ్‌కు ఐబీఎల్ అనే లీగ్‌ను క్రియేట్ చేయడం మంచి ఆలోచన. అయితే బెట్టింగ్ జరిగే తీరును పైపైన చూపించేయడం ఆసక్తి కలిగించలేదు. క్రికెట్ లీగ్ వెనుక కోట్లాది రూపాయల బెట్టింగ్ రాకెట్ ఎలా నడుస్తుందో ఇప్పటికే ఎంతో డీటైల్డ్‌గా, మనం నోరు వెళ్లబెట్టేలా రిచా చద్ధా, వివేక్ ఓబరాయ్ నటించిన ఇన్‌సైడ్ ఎడ్జ్ అనే వెబ్ సిరీస్ చూపించింది. దాంతో పోలిస్తే ఇందులోని బెట్టింగ్ సీన్లు తేలిపోయాయి. కాకపోతే క్లైమాక్స్‌లో బాక్సింగ్ రింగ్ సీన్లు యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటాయి.
టెక్నికల్‌గా చూస్తే సినిమా ఒకింత బెటర్‌గా అనిపిస్తుంది. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ సన్నివేశాల్లోని మూడ్‌ను పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. సెకండాఫ్‌లో కెమెరా పనితనం కొట్టొచ్చినట్లు కనిపించింది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి చెప్పేదేముంది! ఎప్పట్లా తన పని తాను సమర్ధవంతంగా చేసుకుపోయాడు. సినిమాలో ఉన్నది మూడు పాటలే. ఫస్టాఫ్‌లో వచ్చే ఒకే ఒక్క సాంగ్.. హీరోయిన్ ఇమాజినేషన్ డ్యూయెట్.. అలరించలేదు. 'గని' ఏంథమ్, తమన్నా స్పెషల్ సాంగ్ బానే ఉన్నాయి. రెండున్నర గంటల సినిమాలో ఫస్టాఫ్‌ను ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ ఇంకొంత ట్రిమ్ చేసుంటే బాగుండేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్ నటన, అతని క్యారెక్టరైజేషన్
సెకండాఫ్‌లో క్యారీ అయిన ఎమోషన్, క్లైమాక్స్
సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
కొత్తదనంలేని కథ, బలహీనంగా ఉన్న స్క్రీన్‌ప్లే
ఫస్టాఫ్‌లో హీరోయిన్‌కు సంబంధించిన సీన్లు
హీరో తండ్రితో పాటు మరికొన్ని కీలక పాత్రలను సరిగ్గా మలచలేకపోవడం
నటీనటుల పనితీరు
'గని' సినిమాను తన భుజాల మీద మోసుకువెళ్లాడు వరుణ్ తేజ్. అతని ఫిజిక్, అతని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ బాక్సింగ్ ఛాంపియన్‌కు తగ్గట్లే ఉన్నాయి. టైటిల్ రోల్‌లో చాలా బాగా రాణించాడు. ఆ క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌ను, ఎమోషన్స్‌ను సూపర్బ్‌గా పండించాడు. బాక్సర్ అంటే ఇలా ఉండాలి అన్నట్లే ఉన్నాడు వరుణ్. పాత్ర తీరువల్ల కావచ్చు, హీరోయిన్ సాయీ మంజ్రేకర్ ఆకట్టుకోలేదు. నటన పరంగా ఓకే కానీ, ఏమంత గ్లామరస్‌గా లేదు. విక్రమాదిత్యగా ఉపేంద్రకు వంక పెట్టాల్సిందేముంటుంది! అతి సునాయాసంగా ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయాడు. కాకపోతే అలాంటి స్టార్ చేయదగ్గ పాత్ర కాదు అది. హీరోయిన్ కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించిన గని తల్లి పాత్రలో నదియా చక్కగా ఒదిగిపోయారు. విక్రమాదిత్యతో పోటీపడే విజయేందర్ సిన్హా క్యారెక్టర్‌లో సునీల్‌శెట్టి రాణించాడు. ఈశ్వర్‌నాథ్ క్యారెక్టర్‌ను జగపతిబాబు తనదైన శైలిలో పండించారు. ఆదిగా నవీన్‌చంద్ర మంచి నటన కనపర్చాడు కానీ, ఆజానుబాహుడైన వరుణ్‌తేజ్ ముందు బాక్సింగ్ రింగ్‌లో తేలిపోయాడు. గని ఫస్ట్ కోచ్‌గా నరేశ్ ఎప్పట్లా తన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్లు సత్య, సుదర్శన్, సీనియర్ యాక్టర్లు బ్రహ్మాజీ, రఘుబాబుకు తగ్గ పాత్రలు పడలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కథ బలంగా లేకపోయినా ట్రీట్‌మెంట్ బలంగా ఉంటే.. ఆ సినిమా చూడబుద్ధేస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ను బాగా చేసుకొని, అతి కీలకమైన హీరో తండ్రి క్యారెక్టరైజేషన్ విషయంలో చేసిన పొరపాట్లు, బోర్ కొట్టించే హీరోయిన్ క్యారెక్టర్ వల్ల డల్ అయిన గని సినిమాను సెకండాఫ్‌లో హీరో క్యారెక్టర్ ద్వారా క్యారీ అయిన ఎమోషన్ ఒక్కటే రక్షించే అంశం.
- బుద్ధి యజ్ఞమూర్తి