Read more!

English | Telugu

సినిమా పేరు:జెంటిల్ మన్
బ్యానర్:శ్రీదేవి మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Jun 17, 2016

 

తాను పోషించే ప్రతి పాత్రలో నటించడానికంటే జీవించడానికి ప్రయత్నిస్తుంటాడు యువ కథానాయకుడు నాని. అందుకే అతడికి "నేచురల్ స్టార్" అనే బ్రాండ్‌ నేమ్ వచ్చేసింది . అప్పటివరకూ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న తనను హీరోగా వెండితెరకు పరిచయం చేసి కథానాయకుడిగా తనకు కొత్త జన్మనిచ్చిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి కృతజ్ణతతో ఆయన లాస్ట్ మూవీ "బందిపోటు" దారుణంగా విఫలమైనప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా మోహనకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు నాని. ఇప్పటివరకూ తాను రాసిన కథలనే డైరెక్ట్ చేసిన ఇంద్రగంటి.. మొట్టమొదటిసారిగా డేవిడ్ నాథన్ అనే రచయిత అందించిన కథ డైరెక్ట్ చేశారు. నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నివేథా థామస్, సురభిలు కథానాయికలుగా నటించిన "జెంటిల్ మెన్"  ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ మూవీ రివ్యూ మీకోసం..!!

కథ: 
గౌతమ్ (నాని) ఒక సరదా కుర్రాడు. తొలిచూపులోనే కేథరీన్ (నివేథా థామస్) ను ఇష్టపడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకొందాం అని ఫిక్సయ్యాక.. కేథరీన్‌కు తన ఉద్యోగరీత్యా లండన్ వెళ్లాల్సి వస్తుంది. కేథరీన్ లండన్ నుంచి తిరిగివచ్చేసరికి గౌతమ్ ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోయాడని ఆమె తల్లి చెబుతుంది. ఆ షాక్ నుండి తేరుకోకముందే అచ్చుగుద్దినట్లు గౌతమ్ ను పోలిన జై (నాని)ని కలుస్తుంది. ఇంతలో.. క్రైమ్ రిపోర్టర్ నిత్య (శ్రీముఖి) కేథరీన్ ను కలిసి.. గౌతమ్ ది యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలనే చంపారని చెప్తుంది. అలాగే.. తన అనుమానంతా జై పైనే అని కూడా చెబుతుంది. ఈ క్రమంలో ఐశ్వర్య ఎస్టేట్స్ ఓనర్ కూతురు ఐశ్వర్య (సురభి)తో పెళ్ళికి సిద్ధమవుతుంటాడు జై. ఐశ్వర్యతో జై పెళ్లి చెడగొట్టడమే కాకుండా జై నిజస్వరూపాన్ని బయటపెట్టాలనుకొంటుంది కేథరీన్. అసలు జై, గౌతమ్ లు ఇద్దరా? లేక ఒకరేనా? గౌతమ్ మరణానికి కారణం ఎవరు ? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన థ్రిల్లర్ "జెంటిల్ మెన్".


ఎనాలసిస్ :

నటీనటుల పనితీరు: 
గౌతమ్, జై అనే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నాని అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా.. నివేథా థామస్ దగ్గర ఎమోషనల్ గా బరస్ట్ అయిపోయే సన్నివేశంలో నాని పలికించిన హావభావాలను మెచ్చుకోకుండా ఉండలేము. కేథరీన్ గా నివేదా థామస్ నటన ఈ సినిమాకి హైలైట్. చాలా సన్నివేశాల్లో నానిని డామినేట్ చేసే స్థాయిలో నటించింది. సురభికి సినిమాలో పెద్దగా క్యారెక్టర్ లేకపోయినా.. అందంగా, బబ్లీగా కనిపించి ఆకట్టుకొంది. నిన్నమొన్నటివరకూ కామెడి తరహా క్యారెక్టర్లలో అలరించిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను సునాయాసంగా పోషించేశాడు. మిగిలిన పాత్రధారులంతా తమతమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు. 

 

సాంకేతికవర్గం పనితీరు: 
మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆయన సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులు సన్నివేశంలోకి లీనమవ్వడానికి తోడ్పడింది. పి.జి.విందా కెమెరా వర్క్ బాగుంది. కాకపోతే.. విషాదకర సన్నివేశాల్లో నటీనటులకు పెట్టిన టైట్ క్లోజ్ లు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. సీన్ టు సీన్ కనెక్టివిటీ కూడా అద్భుతంగా కుదిరింది. సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువలు ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. ప్రతి ఫ్రేమూ చాలా రిచ్ గా కనిపిస్తుంది. డేవిడ్ నాధన్ సమకూర్చిన కథ బాగుంది. కానీ.. ట్విస్టులను రివీల్ చేసిన విధానం సెట్ అవ్వలేదు. అప్పటివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన కథనం, ఒక్కసారిగా మందగించడం మెయిన్ పాయింట్స్ లో ఒకటి. 

దర్శకుడిగా, మాటల రచయితగా మోహనకృష్ణ ఇంద్రగంటి "జెంటిల్ మెన్" విషయంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. అన్ని క్యారెక్టర్లను ఫస్టాఫ్ లోనే బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అందువల్ల సెకండాఫ్ డ్రామా నడిపించేప్పుడు ఎటువంటి సమస్యా తలెత్తలేదు. ముఖ్యంగా.. నాని క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు ప్రశంసనీయం. 

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మొత్తానికి.. ఊహించగలిగిన ట్విస్టులతో, ఆసక్తికరమైన కథనంతో సాగే "జెంటిల్ మెన్"ను అద్భుతమైన సినిమా అని చెప్పలేం కానీ.. క్యారెక్టర్ల గురించి, కథలోని లొసుగుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం రెండున్నర గంటల ఎంటర్ టైన్మెంట్ కోసం థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడ్ని మాత్రం చక్కగా అలరిస్తాడు "జెంటిల్ మెన్".