Read more!

English | Telugu

సినిమా పేరు:గంధర్వ
బ్యానర్:ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jul 8, 2022

సినిమా పేరు: గంధర్వ
తారాగ‌ణం: సందీప్ మాధవ్, గాయత్రీ సురేష్, శీతల్ భట్, సాయి కుమార్, సురేష్, బాబూమోహన్, పోసాని కృష్ణమురళి, రామ్ ప్రసాద్, రోహిణి
మ్యూజిక్: ర్యాప్ రాక్ షకీల్
సినిమాటోగ్ర‌ఫీ: జవహర్ రెడ్డి
ఎడిటింగ్: బస్వా పైడి రెడ్డి
ప్రొడ్యూసర్: ఎం.ఎన్.మధు
బ్యానర్: ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అఫ్సర్ హుస్సేన్.
విడుద‌ల తేదీ: జులై 8, 2022

'వంగవీటి', 'జార్జ్ రెడ్డి' బయోపిక్స్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాధవ్.. పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా చేసిన సినిమా 'గంధర్వ'. అప్సర్ హుస్సేన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రివర్స్ ఏజింగ్ కాన్సెప్ట్ కావడం, ఇందులో సందీప్ కుమారుడిగా సీనియర్ యాక్టర్ సాయి కుమార్ నటించడం వంటి అంశాలతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో అంతో ఇంతో ఆసక్తి నెలకొంది. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గంధర్వ' ఆశించిన స్థాయిలో ఉందో లేదో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:- 1971 సమయంలో భారత సైన్యంలో పనిచేసే అవినాష్(సందీప్) పెళ్ళైన కొద్ది రోజులకే అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్ తో యుద్ధం కారణంగా బోర్డర్ కి వెళ్తాడు. ఆ యుద్ధంలో మరణించిన 28 ఏళ్ళ అవినాష్.. 50 ఏళ్ళ తర్వాత 2021లో అంతే యవ్వనంతో తన కుటుంబాన్ని వెతుక్కుంటూ తిరిగొస్తాడు. అవినాష్ ఎలా బ్రతికాడు? 50 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా 28 ఏళ్ళ యువకుడిగా ఎలా ఉన్నాడు? ఆ యువకుడిని 68 ఏళ్ళ అమూల్య(గాయత్రీ సురేష్) తన భర్తగా అంగీకరించిందా? చనిపోయాడనుకున్న తండ్రి 50 ఏళ్ళ తర్వాత యువకుడిగా తిరిగి రావడంతో 50 ఏళ్ళ కొడుకు విజయ్(సాయి కుమార్) ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

రివర్స్ ఏజింగ్ లాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా హాలీవుడ్ సినిమాలలో కనిపిస్తుంటాయి. టాలీవుడ్ లోనూ 'డిస్కో రాజా' సినిమాలో కాస్త ఈ ఛాయలు ఉంటాయి. ఇలాంటి విభిన్న కాన్సెప్ట్ చిత్రాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, బలమైన సన్నివేశాలు తోడైతే ప్రేక్షకుల ఆదరణ ఖచ్చితంగా లభిస్తుంది. కానీ 'గంధర్వ' విషయంలో అదే లోపించింది. దర్శకుడు అప్సర్ ఆలోచన బాగున్నప్పటికీ దానిని ప్రేక్షకులను మెప్పించే చిత్రంగా మలచడంలో కొంతవరకే సక్సెస్ అయ్యాడు. రివర్స్ ఏజింగ్ కాన్సెప్ట్ కి రెగ్యులర్ కమర్షియల్ టచ్ ఇచ్చి సాదాసీదా సినిమాగా మలిచాడు.

ఇటువంటి కాన్సెప్ట్ చిత్రాలకు కథనం ఆసక్తికరంగా సాగాలి. కానీ 'గంధర్వ'లో అలా జరగలేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన రాజకీయ కుర్చీలాటను దీనికి జత చేశారు. వయసు మీద పడిన ముఖ్యమంత్రి చావు బతుకుల మధ్య ఉంటే.. సీఎం కుర్చీ కోసం వర్గ పోరు జరగడం ఇప్పటికే చాలాసార్లు చూశాం. ఈ రొటీన్ ట్రాక్ ని మరింత రొటీన్ గా తెరకెక్కించారు. సీఎం రేసులో సందీప్ కొడుకు పాత్రలో నటించిన సాయి కుమార్ కూడా ఉంటాడు. మంత్రి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమోట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ 28 ఏళ్ళ యువకుడిని పట్టుకొని తన భర్త అని అతని తల్లి చెప్పుకుంటే కొడుకు పరిస్థితి ఏంటి? అతని పొలిటికల్ కెరీర్ గతేంటి?. ఈ సంఘర్షణను అంత రసవత్తరంగా చూపించలేకపోయాడు దర్శకుడు. 50 ఏళ్ళ క్రితం చనిపోయాడనుకున్న వ్యక్తి యువకుడిగా తిరిగొచ్చి.. భర్తగా, తండ్రిగా, తాతగా ఆ కుటుంబసభ్యులను నమ్మించడమనేది ఎంత పెద్ద విషయం?. ఆ పెయిన్ మాటల రూపంలోనే తప్ప, బలమైన సన్నివేశాల ద్వారా మనసుకి తాకేలా చేయలేకపోయారు. పైగా కామెడీ ట్రాక్ ఇరికించి.. ప్రధాన పాత్రలతో ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ కాకుండా చేశారు. 50 ఏళ్ళ తర్వాత భర్త తిరిగొచ్చాడు. తన వయసు 68, భర్తకు 28 అంటే కుటుంబం, సమాజం అంగీకరిస్తుందా?. భర్త తిరిగొచ్చాడన్న ఆనందం, ప్రేమ ఒక వైపు.. ఇదంతా నిజమని అందరికి అర్థమయ్యేలా చెప్పలేని బాధ మరోవైపు. ఇంత కంటెంట్ ఉన్నప్పటికీ రెగ్యులర్ సీన్స్ తో లాగేసి మమా అనిపించారు.

ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధం సన్నివేశాలు సినిమా స్టాండర్డ్ లో లేవు. రైల్వే స్టేషన్ కి సంబంధించిన కొన్ని షాట్స్ కూడా అనుమతి తీసుకోకుండా సాధారణ కెమెరాతో చిత్రీకరించినట్లు ఉన్నాయి. రాప్ రాక్ షకీల్ సంగీతం, జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనేలా ఉన్నాయి. బస్వా పైడి రెడ్డి ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది.

నటీనటుల పనితీరు:-

సందీప్ ఎంత మంచి నటుడో 'వంగవీటి', 'జార్జ్ రెడ్డి' సినిమాలతో ఇప్పటికే రుజువు చేసుకున్నాడు. అయితే అవి బయోపిక్స్ కావడంతో రెగ్యులర్  హీరోగా అతన్ని ఆడియన్స్ ఓన్ చేసుకోవడానికి కాస్త టైం పట్టొచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో ఎప్పటిలాగే అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్స్ కూడా పర్లేదు. కానీ కామెడీ సన్నివేశాల్లో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. ఇక ఇందులో గాయత్రీ సురేష్ 18 ఏళ్ళ యువతిగా అలరించడంతో పాటు 68 ఏళ్ళ బామ్మగా వయసుకు మించిన పాత్రలో కనిపించింది. ఆమె తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేసినప్పటికీ.. మేకప్, పర్సనాలిటీ కారణంగా పాత్ర తేలిపోయింది. అక్కడక్కడా నవ్వు కూడా తెప్పించింది. నిజానికి ఆ పాత్రలో ఒక సీనియర్ నటిని పెట్టుంటే.. హీరో, హీరోయిన్ మధ్య నిజమైన వయసు వ్యత్యాసం కారణంగా ఆ ట్రాక్ నేచురల్ గా, ఆడియన్స్ మరింత కనెక్ట్ అయ్యేలా ఉండేదేమో అనిపించింది. శీతల్ భట్ గ్లామర్ రోల్ కి పరిమితమైంది. సాయి కుమార్, బాబు మోహన్, సురేష్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సీఐగా పోసాని కృష్ణమురళి ఉన్నంతలో బాగానే నవ్వించారు. పని మనిషి పాత్రలో రామ్ ప్రసాద్ భార్యగా రోహిణి కూడా కాసేపు నవ్వులు పూయిచింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కథ కొత్తగా ఉంటే సరిపోదు. కథనం కూడా ఆసక్తికరంగా సాగాలి. అప్పుడే సినిమా విజయాన్ని అందుకుంటుంది. ఒక సాధారణ కథకు కూడా అద్భుతమైన కథనం తోడైతే సినిమా ఫలితమే మారిపోతుంది. అలాంటిది 'గంధర్వ' కాన్సెప్ట్ విభిన్నంగా ఉన్నప్పటికీ.. దానిని మలిచిన తీరు ఆకట్టుకునేలా లేదు.

-గంగసాని