Read more!

English | Telugu

సినిమా పేరు:గాయం -2
బ్యానర్:కర్త క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 3, 2010
ఈ చిత్రం కథ గతంలో వచ్చిన "గాయం"చిత్రానికి ఎక్స్టెటెన్షన్ మాత్రమే.కొత్త కథేం కాదు.ఇక కథలోకి వస్తే గాయం సినిమాలోని దుర్గా బ్యాంకాక్ లో రామ్(జగపతిబాబు) అని తన పేరు మార్చుకుని,ఒక రెస్టారెంట్ పెట్టుకుని,విద్య(విమలారామన్)అనే అమ్మాయిని పెళ్ళిచేసుకుని ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతుంటాడు.అయితే అక్కడ కొందరు నీగ్రోలు అతని రెస్టారెంటుకి,వేళకాని వేళలో వచ్చి,గొడవ చేస్తుంటే అనుకోకుండా వాళ్ళని కాల్చటంతో అక్కడి మీడియా దుర్గాని ఒక హీరోలా ఎలివేట్‍ చేస్తుంది.ఆ వీడియో క్లిప్పింగ్ ని ఇండియాలో ఉన్నగురునారాయణ (కోటశ్రీనివాసరావు)కొడుకు శంకర నారాయణ(కోట ప్రసాద్)చూసి అతన్ని వెంబడిస్తాడు.అప్పుడు జరిగిన గొడవలో రామ్ రివాల్వర్ తో ప్రత్యర్థిని కాలిస్తే అతని రక్తం విద్య ముఖం మీద పడుతుంది.దాంతో విద్య అతన్ని ఒక క్రిమినల్ గా చూసి అతన్నించి విడిపోవాలనుకుంటుంది.పోలీసాఫీసర్ పాండ్యన్(జీవా)చెప్పిన మాటలకు మనసు మార్చుకున్న విద్య తన భర్తను అతని గతం గురించి అడుగుతుంది.దుర్గా తన గతం గురించీ చెపుతూంటాడు.అదే సమయంలో వారి మీద శంకరనారాయణ మనుషులు కాల్పులు జరుపుతారు.ఆ కాల్పుల్లో దుర్గా కొడుకు గాయపడతాడు.ఇక అప్పుటి నుంచి దుర్గా తిరగబడతాడు.భార్యను,కొడుకుని బ్యాంకాక్ లోనే ఉంచి హైదరాబాద్ కి వచ్చి,బ్యాంకాక్ లో తన మీద దాడి చేయటానికి కారకులైన గురునారాయణ మనుషుల్ని చంపుతాడు.అక్కణ్ణించీ దుర్గా,గురునారాయణల మధ్య జరిగే గ్యాంగ్ వార్ లో,గురునారాయణ లాయర్ మీద శంకర నారాయణకి అనుమానం కలిగేలా చేసి శంకరనారాయణ చేతే ఆ లాయర్ చనిపోయేలా చేస్తాడు దుర్గా.ఆ తర్వాత శంకర నారాయణ కూడా దుర్గా చేతిలో చనిపోతాడు.ఆ తర్వాత గురునారాయణ ఏం చేశాడు...?దుర్గా దాన్ని ఎలా ఎదుర్కొన్నాడూ అన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
దర్శకుడు కొత్తవాడైనా ఈ సినిమాని బాగానే హ్యాండిల్ చేయగలిగాడనే చెప్పాలి.సినిమా తొలి సగం ఉన్నంత బాగా సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే ఇది చాలా పేద్ద హిట్టయ్యి ఉండేది.కానీ సెకండ్ హాఫ్ ఒక మోస్తరుగా నడపటంతో మామూలు సినిమాగా మారింది.దానికి స్క్రీన్ ప్లే కారణమని చెప్పాలి.అయినా దర్శకుడు పాత "గాయం"చిత్రాన్ని ఈ చిత్రంతో కలిపిన తీరు,ఆ చిత్రాన్ని ఈ చిత్రానికి వాడుకున్న తీరూ బాగుంది.దానికి తగ్గట్టే రేవతి,శివకృష్ణ,కోట,తనికెళ్ళ భరణిలతో పాటు హీరో జగపతి బాబు కూడా కాలానుగుణంగా కనపడతారు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి.నేడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అంటూ ఆత్మహత్యలతో తమ ప్రాణాలను పణంగా పెట్టే విద్యార్థలు, నేటి రాజకీయ నాయకులు తమ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో,ఎలా తమను తమ రాజకీయావసరాలకు వినియోగించు కుంటున్నారో ఈ చిత్రం ఒకసారి లోతుగా పరిశీలించి చూస్తే వారికి అర్థమవుతుంది.ఈ చిత్రంలోని గురునారాయణ పాత్రను దర్శకుడు ఈ విషయం నేటి విద్యార్థులకు చెప్పటానికి బాగా వాడుకున్నాడు.ఈ చిత్రం చుసిన పదిమంది విద్యార్థులు వాస్తవం గ్రహించినా ఈ సినిమాకి సార్థకత. నటన - నటన విషయానికొస్తే జగపతిబాబు గాయం చిత్రం కన్నా ఈ చిత్రంలో తను చెప్పినట్టే నిజంగా బాగా నటించాడు.విమలారామన్ కూడా తన నటనలో పరిణితి కనపరిచింది.ఇక కోట శ్రీనివాసరావు నటన గురించి చెప్పటం హాస్యాస్పదమవుతుంది.ఆయన గురునారాయణ పాత్రకు జీవం పోశాడు.ఆయన కొడుకు కోట ప్రసాద్ కూడా బాగా నటించాడు.ఈ చిత్రంలో తన కొడుకు చనిపోయినప్పుడు నటించిన సీన్,కోట శ్రీనివాసరావుకి దేవుడు నిజ జీవితంలో జరిగే సంఘటనకు రిహార్సిల్ చేయించినట్లనిపించింది. ఇక మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం- ఇళయరాజా సంగీత దర్శకత్వంలోని ఈ చిత్రంలోని పాటలు వినసొంపుగా,చక్కగా,శ్రావ్యంగా ఉన్నాయి.రీ-రికార్డింగ్ కూడా సీన్ మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉండి బాగుంది. సినిమాటోగ్రఫీ - చాలా నీట్ గా ఉంది.లైటింగ్ స్కిమ్ కూడా బాగుంది. మాటలు - అవసరమయినంత వరకూ మాత్రమే ఈ చిత్రంలోని మాటలు మనకు వినిపిస్తాయి.కానీ ఆ ఉన్న కొన్ని మాటలు కూడా పదునుగా ఉండటం విశేషం. పాటలు - ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా అర్థవంతంగా,సందర్భోచితంగా సాహిత్యపు విలువలతో ఉన్నాయి. ఎడిటింగ్ - బాగుంది. కొరియోగ్రఫీ - ఈ సినిమాకి కొరియోగ్రఫీ అవసరం లేదు.ఎందుకంటే వెర్రి మొర్రి గంతులేయాల్సిన పాటలు ఈ చిత్రంలో లేనేలేవు. యాక్షన్ - హీరో తంతే మనుషులు గాల్లోకి ఎగరటాలు,ఎముకలు విరగటాలూ గట్రాల వంటివి ఈ చిత్రంలో ఉండవు.ఈ చిత్రంలో చాలా సహజంగా ఉండేలా యాక్షన్ కొరియోగ్రఫీని కంపోజ్‍ చేశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
"గాయం"సినిమా చూసినా చూడకపోయినా,ఏ అంచనాలు లేకుండా గనక ఈ సినిమా చూస్తే ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు.ఈ సినిమా ఒకసారి చూడవచ్చు.ఫరవాలేదు.