English | Telugu

సినిమా పేరు:ఎవరు
బ్యానర్:పీవీపీ సినిమాస్
Rating:3.00
విడుదలయిన తేది:Aug 15, 2019

మిస్టరీ థ్రిల్లర్‌గా కొంత కాలంగా ఆసక్తి కలిగిస్తూ వచ్చిన 'ఎవరు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీవీపీ బేనర్‌లో ఇదివరకు అడివి శేష్ చేసిన క్రైం థ్రిల్లర్ 'క్షణం' మంచి విజయం సాధించడంతో 'ఎవరు'పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. పీవీపీలో కొన్నేళ్లుగా పబ్లిసిటీ విభాగంలో పనిచేస్తూ వస్తోన్న వెంకట్ రాంజీ 'ఎవరు'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ఉందా?

కథ:
డీఎస్పీ ర్యాంకులో ఉన్న అశోక్ (నవీన్ చంద్ర)ను హత్య చేసిందనే అభియోగంతో మహా కన్‌స్ట్రక్షన్ అధినేత భార్య సమీర (రెజీనా కసాండ్రా)ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనపై అశోక్ అత్యాచారం జరిపాడనీ, ఆత్మరక్షణ కోసమే అతడ్ని చంపాననీ చెబుతుంది సమీర. ఆమెకు బెయిల్ లభిస్తుంది. పోలీసుల తరపున పేరుపొందిన లాయర్ వాదిస్తున్నట్లు తెలియడంతో సమీరను కేసు నుంచి రక్షించడానికి సబ్ ఇన్‌స్పెక్టర్ విక్రం వాసుదేవ్ రంగంలోకి దిగుతాడు. డబ్బు కోసం విక్రం ఎలాంటి పనైనా చేయగలడనీ, సాక్ష్యాలు సృష్టించాలన్నా, వాటిని తారుమారు చేయాలన్నా అతనికి కష్టం కాదనీ పేరు. సమీర దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పమంటాడు విక్రం. సమీర చెబుతుంది. అయితే విక్రం ఆమె చెప్పిన కథను నమ్మడు. ఆమె అబద్ధాలు చెబుతున్నదని వాదిస్తాడు. నిజాలు చెబితేనే ఆమెను తాను రక్షించే అవకాశముందుంటాడు. అతనికి సమీర నిజం చెప్పిందా? అశోక్ హత్య వెనకున్న నిజమేమిటి? అతడిని చంపింది సమీరా, మరొకరా? ఈ కథలో అసలు బాధితులు 'ఎవరు'?


ఎనాలసిస్ :

అశోక్ హత్యతో మొదలైన 'ఎవరు' కథ సమీర, విక్రం వాసుదేవ్ మధ్య సుదీర్ఘంగా సాగే సంభాషణలతో కాస్త విసుగు తెప్పిస్తుందనుకొనేంతలో కథలో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ కథను ఆసక్తికరంగా మార్చేసింది. అశోక్‌కూ, తనకూ మధ్య ఉన్న పరిచయం గురించి సమీర చెప్పిన విషయాలు నమ్మని విక్రం, ఆమెని నిజం చెప్పమని గుచ్చి గుచ్చి అడిగితే ఆమె మరో కథ చెప్పడం, మధ్యలో విక్రం జోక్యం చేసుకొని ఎస్సైగా ఏడాది క్రితం జరిగిన ఒక మిస్సింగ్ కేసు గురించి చెప్పడం, ఆ కేసుపై సమీర ఆదుర్దా కనపర్చడం కథని రసకందాయంలో పడేస్తుంది. ఆ తర్వాత ఒక దాని తర్వాత ఒకటిగా వచ్చే ట్విస్టులతో ప్రేక్షకులు అవాక్కవుతుంటారు. విక్రం చెప్పిన కథలో కనిపించకుండా పోయిన వినయ్ వర్మ (మురళీశర్మ)కూ, అశోక్, సమీరకూ సంబంధం ఉందనే విషయం బయటపడటం, వినయ్ వర్మ కనిపించకుండా పోయాక కేన్సర్ బాధితుడైన అతని కొడుకు ఆదర్శ్‌వర్మ తండ్రి కోసం అల్లాడిపోవడం, పోలీసుల్ని ఆశ్రయించి పిచ్చివాడిలా తిరగడం మనసుని పిండేస్తుంది. వినయ్ వర్మకూ, అశోక్, సమీరకూ మధ్య వచ్చే సన్నివేశాలే 'ఎవరు' కథకు కీలకం. ఆ సన్నివేశాల చిత్రీకరణలో దర్శకుడి పనితనం స్పష్టం. డబ్బు కోసం గడ్డితినే ఎస్సైగా కనిపించే విక్రం వెనుక ఉన్న కథ, క్లైమాక్స్‌లో అతడికి సంబంధించి వచ్చే ట్విస్ట్ ఊహాతీతం. అది షాక్‌కు గురి చేస్తుంది. అలాగే అవినీతిపరుడిగా, ఆవేశం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తుల్ని చంపడానిక్కూడా వెనుకాడని సైకో తరహా పోలీసాఫీసర్‌గా కనిపించే అశోక్‌కు సంబంధించిన ట్విస్ట్ అనూహ్యం. ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా మలుపుల్ని సృష్టించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమా మొదలైన అరగంట తర్వాత నుంచి కథలో పూర్తిగా లీనమైపోతాం. వరుసగా వచ్చే మలుపులతో ఉక్కిరిబిక్కిరవుతాం.

సినిమాలో ఇబ్బంది కలిగించే అంశమేదైనా ఉందంటే అది అశోక్, సమీరా మధ్య చిత్రీకరించిన 'రేప్' సీన్. దాన్ని కథనంలో భాగంగా పదే పదే చూపించడం ఫ్యామిలీ ఆడియెన్స్‌ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. సందర్భవశాతూ ఇంటర్మీడియేట్ చదువుతున్న కూతుర్ని తీసుకొని వచ్చిన ఒక తండ్రి ఈ సమీక్షకుడికి పక్క సీట్లో తారసపడ్డాడు. సినిమాలో మాటిమాటికీ వస్తోన్న ఆ సీన్లు చూడలేక ఆ తండ్రి పడిన అవస్థ చెప్పనలవి కాదు. ఆ తండ్రే అలా ఫీలవుతుంటే ఇక కూతురి గురించి చెప్పేదేముంది! ఆ ఇబ్బందికర సన్నివేశం వచ్చినప్పుడు ఆమె కళ్లు తెరను కాకుండా కింద నేలను చూస్తూ కనిపించాయి. అంటే.. ప్రతిసారీ ఆమె ఆ ఇబ్బందికి గురయ్యిందని అర్థం చేసుకోవచ్చు. నిజానికి మొదటిసారి 'రేప్' సీన్ చూపించడం వరకు ఓకే. కానీ తర్వాత ఆ సీన్‌ను చూపించాల్సి వచ్చినప్పుడు దాన్ని ట్రిం చేసి చూపించే అవకాశం ఉంది. ట్రిం చేసినందువల్ల కథనానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. ఈ విషయంలో దర్శకుడు సెన్సిబుల్‌గా వ్యవహరించి ఉండాల్సింది. ఆ సన్నివేశం మినహాయిస్తే మిగతా సినిమా అంతా చక్కని టెంపోతో నడిచి ఆకట్టుకుంటుంది.

ఇటీవలే అమితాబ్, తాప్సీ నటించగా బాలీవుడ్‌లో వచ్చి హిట్టయిన 'బద్‌లా' సినిమాకు 'ఎవరు' రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ప్లాట్ ఒకే విధంగా ఉన్నా, కథనం, సన్నివేశాల కల్పనలో తేడాలున్నాయి. నిజానికి 'ఎవరు' మూవీ 'కంట్రాటీంపో' (ది ఇన్‌విజిబుల్ గెస్ట్) అనే స్పానిష్ క్రైం థ్రిల్లర్‌కు రీమేక్. ఆ విషయాన్ని టైటిల్ కార్డ్ ఆరంభంలోనే తెలియజేశారు.

ప్లస్ పాయింట్స్:
గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే
సినిమాటోగ్రఫీ
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
అంచనాలకందని మలుపులు

మైనస్ పాయింట్స్:
'రేప్' సీన్‌ను అభ్యంతరకరంగా పదే పదే చూపించడం
అశోక్, సమీర మధ్య బంధానికి సంబంధించిన ట్విస్ట్స్ మరీ ఎక్కువవడం
రిలీఫ్ పాయింట్ లేకపోవడం

నటీనటుల అభినయం:
ఒకరు ఎక్కువా కాదు, ఇంకొకరు తక్కువా కాదన్నట్లు అందరూ తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు. అయితే ఇది ప్రధానంగా ఇద్దరి సినిమా. ఆ ఇద్దరు.. శేష్, రెజీనా. విక్రం (?)గా అడివి శేష్ మరోసారి తన అభినయ సామర్థ్యంతో ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా ఆ కేరెక్టర్‌కు అతికినట్లు సరిపోయాడు. భిన్నమైన కథాంశాలు, పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తోన్న అతనికి ఈ పాత్ర, ఈ సినిమా మరింత పేరు తెస్తుంది. చాలా కాలం తర్వాత నటిగా తనను తాను ప్రూవ్ చేసే సమీర అనే షాకింగ్ కేరెక్టర్‌తో ఆకట్టుకుంది రెజీనా. నటిగా ఆమెలోని మరో పార్శ్వాన్ని సమీర పాత్ర ఆవిష్కరించింది. ఈ కేరెక్టర్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పే అవకాశాలున్నాయి. సైకో తరహా పోలీసాఫీసర్ రోల్‌లో నవీన్ చంద్ర బాగా రాణించాడు. మంచి వేషాల కోసం ఎదురుచూస్తోన్న నవీన్ దాహాన్ని అశోక్ కేరెక్టర్ కొంతవరకు తీర్చిందని చెప్పాలి. వినయ్ వర్మ రోల్‌లో మురళీశర్మలోని ప్రొఫెషనల్ యాక్టర్ సునాయాసంగా ఇమిడిపోయాడు. వినయ్ వర్మ కొడుకు ఆదర్శ్‌గా కనిపించిన నిహాల్ కోదాటి భవిష్యత్తులో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అభ్యంతరకర 'అత్యాచార' సన్నివేశం ఘాటు తగ్గించినట్లయితే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పించే అవకాశం ఉన్న ఈ క్రైం థ్రిల్లర్, ఆ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను 'ఎవరు' బాగా ఆకట్టుకుంటుందని చెప్పాలి.

- బుద్ధి యజ్ఞమూర్తి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25