English | Telugu
బ్యానర్:మినీ స్టూడియోస్
Rating:2.75
విడుదలయిన తేది:Nov 4, 2021
సినిమా పేరు: ఎనిమీ
తారాగణం: విశాల్, ఆర్య, మమతా మోహన్‌దాస్, మృణాళినీ రవి, ప్రకాశ్‌రాజ్, తంబి రామయ్య, కరుణాకరన్
సంగీతం: తమన్
బ్యాగ్రౌండ్ స్కోర్: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్
ఎడిటింగ్: రేమాండ్ డెరిక్ క్రాస్టా
నిర్మాత: వినోద్ కుమార్
దర్శకత్వం: ఆనంద్ శంకర్
బ్యానర్: మినీ స్టూడియోస్
విడుదల తేదీ: 4 నవంబర్ 2021
పదేళ్ల క్రితం బాలా డైరెక్షన్‌లో 'వాడు వీడు' సినిమాలో కలిసి నటించిన విశాల్, ఆర్య.. ఇన్నాళ్లకు మళ్లీ కలిసి నటించిన సినిమాగా వార్తల్లో నిలిచింది 'ఎనిమీ'. 'నోటా' ఫేమ్ ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాళినీ రవి హీరోయిన్. ఈమధ్య రిలీజైన ట్రైలర్ ఈ సినిమా ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిందనే అభిప్రాయం కలిగించింది. నిజంగా 'ఎనిమీ' ఎలా ఉందంటే...
కథ
ఒక మాజీ సీబీఐ ఆఫీసర్ (ప్రకాశ్‌రాజ్) తన కొడుకు రాజీవ్‌తో పాటు, తన పక్కింటి వాళ్లబ్బాయి సూర్యకూ చిన్నతనం నుంచే పోటీతత్వం నేర్పిస్తాడు. ఆ ఇద్దరినీ మంచి పోలీస్ ఆఫీసర్లుగా తయారుచెయ్యాలనేది ఆయన ఆశయం. కానీ అతని కలకు విరుద్ధంగా ఆ ఇద్దరు పిల్లలు ఎదిగే కొద్దీ ఒకరంటే ఒకరికి పడని బద్ధ శత్రువులుగా మారతారు. వారిలో సూర్య (విశాల్) సింగపూర్‌లో ఒక సూపర్‌మార్కెట్ నడుపుతూ స్థానికంగా ఉండే తెలుగువాళ్లకు సాయపడుతుంటాడు. ఒక హత్యను నివారించడానికి చేసే ప్రయత్నంలో తన చిన్ననాటి స్నేహితుడు రాజీవ్ (ఆర్య)ను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం అతనికి తెలీదు. ఆ ఇద్దరికీ, అనీషా (మమతా మోహన్‌దాస్) అనే యువతికీ మధ్య కనెక్షన్ ఏంటి? సూర్య, రాజీవ్ మధ్య ఘర్షణ దేనికి దారితీసిందనేది తెలుసుకోవాలంటే తెరపై చూడాలి.
ఎనాలసిస్ :
ఇదివరకు మనం బద్ధ శత్రువులుగా మారిన స్నేహితుల కథతో వచ్చిన కొన్ని సినిమాలు చూశాం. 'ఎనిమీ' కూడా ఆ కోవకే చెందినప్పటికీ వాటిలో మనం చూడని కొత్త కోణం ఇందులో కనిపిస్తుంది. రెండు బలమైన పాత్రలు ఒకదానితో ఒకటి ఢీకొంటే చూడ్డానికి బావుంటుంది. డైరెక్టర్ సత్తా ఉన్నవాడైతే అది ఇంకా థ్రిల్ కలిగిస్తుంది. డైరెక్టర్ ఆనంద్ శంకర్ 'ఎనిమీ'ని ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రెజెంట్ చేయడానికి బాగా తపనపడ్డాడని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.
చిన్నప్పట్నుంచే పిల్లలు మంచిగా లేదా చెడుగా ఎలా ఎదుగుతూ వస్తారనే విషయాన్ని డైరెక్టర్ ఆనంద్ శంకర్ 'ఎనిమీ'తో చెప్పాలనుకున్నాడు. ఇద్దరు బాల్య స్నేహితుల్లో ఒకడు మంచివాడు, ఇంకొకడు చెడ్డవాడై, ఆ ఇద్దరూ ముఖాముఖి తలపడితే ఎలా ఉంటుందనే పాయింట్.. చెప్పడానికి బాగా ఉన్నా, చూడ్డానికి ఎలా ఉందనేదే మనకు కావాల్సింది. ఆ విషయంలో ఆనంద్ శంకర్ పాక్షికంగానే సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో బలంగా ఉండాల్సిన స్క్రీన్‌ప్లే కాస్త గాడితప్పినట్లు తోస్తుంది. హీరో, విలన్ పాత్రల తీరు తెన్నులు మున్ముందు ఎలా ఉండబోతున్నాయో తొలి అరగంట కథలో డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఉత్కంఠను పెంచింది.
విశాల్, ఆర్య పరస్పరం తారసపడినప్పుడల్లా నెక్ట్స్ ఏం జరుగుతుందనేది సునాయాసంగా ఊహించేవిధంగా సీన్లు వస్తాయి. కొత్తదనం ఎక్స్‌పెక్ట్ చేసినవాళ్లు రెగ్యులర్ రివెంజ్ డ్రామా తరహాలో సీన్లు రావడంతో అసంతృప్తికి గురవుతారు. అయినప్పటికీ వాళ్ల యాక్షన్ సీన్స్ మాస్ ఆడియెన్స్‌ను అలరిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసిన తీరు మరీ ఆకట్టుకుంటుంది. సినిమా అంతా విశాల్, ఆర్య క్యారెక్టర్ల చుట్టూనే తిరగడం వల్ల హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌కు తక్కువ స్కోప్ లభించింది. ఉన్న కొన్ని సీన్లు కూడా కథనానికి మేలు చేకూర్చే రీతిలో లేవు.
'ఎనిమీ'ని ఎక్కువగా కాపాడింది సామ్ సియస్ బ్యాగ్రౌండ్ స్కోర్. కొన్ని సీన్లు ఒళ్లు జలదరించేలా, రోమాలు నిక్కబొడుచుకొనేలా వచ్చాయంటే అతడి పనితనం వల్లే. అతనికి ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగా తోడ్పాటునిచ్చింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. తమన్ మ్యూజిక్ సమకూర్చిన పాటలేవీ అంతగా అలరించలేదు.
నటీనటుల పనితీరు:
హీరో విశాల్ అయినప్పటికీ విలన్ పాత్ర గురించే మొదట మనం మాట్లాడుకోవాలి. రాజీవ్ అనే బలమైన విలన్ క్యారెక్టర్‌లో ఆర్య బాగా ఇమిడిపోయాడు. అతని లుక్స్, పర్ఫార్మన్స్ ఆ పాత్రకు వన్నె తెచ్చాయి. క్యారెక్టరైజేషన్‌పై మరింత శ్రద్ధ పెడితే, ఆ పాత్రపోషణ కోసం ఆర్య పడ్డ శ్రమకు ఇంకా గుర్తింపు వచ్చి ఉండేది. ఎప్పట్లా విశాల్ హీరో సూర్య క్యారెక్టర్‌లో రాణించాడు. అంచనాలకు తగ్గట్లే అభినయం ప్రదర్శించాడు. హీరోయిన్ అస్మితగా మృణాళినీ రవి గ్లామరస్‌గా ఉంది. అనీషా క్యారెక్టర్ ద్వారా చాలా కాలం తర్వాత మమతా మోహన్‌దాస్‌ను స్క్రీన్‌పై చూడగలిగాం. పర్ఫార్మెన్స్ పరంగా ఆమెకు వంక పెట్టాల్సింది లేదు. ప్రకాశ్‌రాజ్, విశాల్ తండ్రిగా తంబి రామయ్య పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
యాక్షన్ ప్రియులను మెప్పించే అంశాలు 'ఎనిమీ'లో పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతగా ఈ మూవీని ఆస్వాదించలేరు. ఆర్య-విశాల్ పర్ఫార్మెన్స్, వాళ్లపై తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమాని చూడవచ్చు.
- బుద్ధి యజ్ఞమూర్తి