English | Telugu
బ్యానర్:సన్ పిక్చర్స్
Rating:2.25
విడుదలయిన తేది:Mar 10, 2022
సినిమా పేరు: ఈటీ(ఎవరికీ తలవంచడు)
తారాగణం: సూర్య, ప్రియాంక మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, శరణ్య, సూరి
సంగీతం: డి.ఇమాన్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
బ్యానర్: సన్ పిక్చర్స్
నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం: పాండిరాజ్
విడుదల తేదీ: మార్చి 10, 2022
కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ప్రతి సినిమాని తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల చేసే సూర్య తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఈటీ(ఎవరికీ తలవంచడు). పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్. సూర్య గత రెండు చిత్రాలు 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. రెండు అద్భుతమైన సినిమాల తర్వాత సూర్య నటించిన సినిమా కావడంతో పాటు.. రెండున్నరేళ్ల తర్వాత థియేటర్స్ లో విడుదలవుతున్న సూర్య సినిమా కావడంతో ఈటీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను అలరించడంలో విజయం సాధించిందో లేదో తెలుసుకుందాం.
కథ:- వృత్తిరీత్యా లాయర్ అయిన కృష్ణ మోహన్(సూర్య) ఊరి జనాల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు. తాను సొంత చెల్లెళ్ళులా భావించే ఆ ఊరి ఆడబిడ్డలకు ఊహించని కష్టం వస్తుంది. పక్క ఊరికి చెందిన బడా వ్యాపారవేత్త, సెంట్రల్ మినిస్టర్ తనయుడు అయిన కామేష్(వినయ్ రాయ్) మరియు అతని గ్యాంగ్ వందల్లో అమ్మాయిలను ట్రాప్ చేసి.. కొందరి చావుకి, మరి కొందరి కన్నీళ్ళకి కారణమవుతారు. ఆ అమ్మాయిలను కాపాడటం కోసం కృష్ణ.. కామేష్ తో తలపడతాడు. ఈ క్రమంలో తాను కష్టాలు పడిందే గాక తన ఫ్యామిలీని కూడా కష్టాల్లోకి నెడతాడు. అసలు ఆ రెండు ఊళ్ళ మధ్య గొడవ ఏంటి? కామేష్ కారణంగా కృష్ణ కుటుంబానికి వచ్చిన కష్టమేంటి? నల్లకోటు వేసుకొని వాదించాల్సిన లాయర్ కత్తి పట్టి ఎందుకు శిక్షించాల్సి వచ్చింది? కామేష్ కారణంగా బాధించబడిన కుటుంబాలకు కృష్ణ ఎలా న్యాయం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాల తర్వాత సూర్య నటించిన సినిమా అంటే ఖచ్చితంగా మరో బలమైన కంటెంట్ తో వచ్చి ఉంటాడని ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం. కానీ ఆ అంచనాలతో సినిమాకి వెళ్తే నిరాశచెందక తప్పదు. ఒక చిన్న ప్లాట్ ని తీసుకొని, దానిని పరమ రొటీన్ కమర్షియల్ సినిమాగా మలిచి నిరాశపరిచాడు డైరెక్టర్ పాండిరాజ్.
ఫైట్ తో హీరో ఇంట్రడక్షన్, ఆ వెంటనే ఓ మసాలా సాంగ్ తో ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ తో సినిమాని స్టార్ట్ చేశాడు డైరెక్టర్. సూర్య పేరెంట్స్ గా సత్యరాజ్, శరణ్య నటించారు. వారికి, సూర్యకి మధ్య వచ్చే సన్నివేశాలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. ఇక సూర్య, ప్రియాంక మోహన్ ప్రేమ, పెళ్లి ట్రాక్ పరమ రొటీన్ గా సాగింది. కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇలా ఫస్టాఫ్ అంతా రొటీన్ సీన్స్ తో సాగిపోయి ఇంటర్వెల్ కి ముందు అసలు కథలోకి ఎంటరైంది సినిమా.
ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ బెటర్ గా ఉంది. ముఖ్యంగా చివరి 30 నిముషాలు ఎమోషనల్ గా ఆకట్టుకునేలా సాగింది. సెకండాఫ్ లో సూర్య, ప్రియాంక మధ్య వచ్చే ఓ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది. తనని సీక్రెట్ గా విలన్ గ్యాంగ్ వీడియో తీశారని కుమిలిపోతున్న భార్యతో సూర్య చెప్పే మాటలు కదిలిస్తాయి. స్త్రీ గొప్పతనం గురించి చెప్పి, పోరాడాలని ఆమెలో స్ఫూర్తి నింపుతాడు. ఆ సీన్ చాలా బాగుంది. అక్కడినుంచి సినిమా అసలు కథలోకి వెళ్లి ఆకట్టుకుంటుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ప్రేక్షకులు నీరసపడిపోయారు.
స్త్రీల పై జరిగే అఘాయిత్యాలను అరికట్టాలి, వాటిని మనం చూసే కోణం మారాలి అంటూ డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. కానీ ఇప్పటికే అలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి పాయింట్ తో సినిమా చేస్తే ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయగలగాలి, సినిమాలోని పాత్రలకు కనెక్ట్ అయ్యి ఆ పెయిన్ వాళ్ళు ఫీలయ్యేలా చేయాలి. కానీ ఆ విషయంలో డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యాడు. దాదాపు రెండు గంటల పాటు సినిమాని రొటీన్ కమర్షియల్ సినిమాల లాగించేసి, చివరిలో తూతూ మంత్రంగా మెసేజ్ ఇచ్చి సినిమాని ముగించాడు.
రత్నవేలు కెమెరా పనితనం బాగుంది. ఇమాన్ సంగీతం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సాంగ్స్ కూడా సినిమాకి మైనస్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
సూర్య
సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
రొటీన్ గా సాగే ఫస్టాఫ్
పాటలు
నటీనటుల పనితీరు:- నటుడిగా సూర్య ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాడు. కృష్ణ మోహన్ పాత్రని సునాయాసంగా చేశాడు. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. ఫస్టాఫ్ లో రెగ్యులర్ క్యారెక్టర్ లో కనిపించిన ప్రియాంక మోహన్ సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది. విలన్ గా నటించిన 'వాన' ఫేమ్ వినయ్ రాయ్ తన పాత్రకి న్యాయం చేశాడు. సత్యరాజ్, శరణ్య వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. కమెడియన్ సూరి ఉన్నంతలో కాస్త నవ్వించాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాల తర్వాత సూర్య నటించిన సినిమా అనే అంచనాలతో 'ఈటీ' చూడటానికి వెళ్తే నిరాశచెందక తప్పదు. మంచి మెసేజ్ తో తెరకెక్కిన రొటీన్ డ్రామా 'ఈటీ'.
-గంగసాని