English | Telugu

సినిమా పేరు:డీజే టిల్లు
బ్యానర్:సితార ఎంటర్టైన్మెంట్స్
Rating:2.75
విడుదలయిన తేది:Feb 12, 2022

సినిమా పేరు: డీజే టిల్లు
తారాగ‌ణం: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ప్రగతి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల
నేపథ్య సంగీతం: తమన్
సినిమాటోగ్ర‌ఫీ: సాయి ప్రకాష్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: నాగ వంశీ
ద‌ర్శ‌క‌త్వం: విమల్ కృష్ణ
బ్యాన‌ర్: సితార ఎంటర్టైన్మెంట్స్
విడుద‌ల తేదీ: 12 ఫిబ్ర‌వ‌రి 2022

'గుంటూరు టాకీస్', 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా' సినిమాలతో నటుడిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తనదైన శైలిలో అలరించడానికి 'డీజే టిల్లు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.

కథ:- తన తండ్రి పెట్టిన గొప్ప స్వాతంత్ర సమరయోధుని పేరు 'బాల గంగాధర్ తిలక్'ని 'టిల్లు'గా మార్చుకొని తండ్రికి తల నొప్పి తెప్పించే పనులు చేస్తుంటాడు డీజే టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ). మధ్య తరగతి యువకుడైన టిల్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసి తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టి చివరికి డీజే అవతారమెత్తుతాడు. తండ్రి చేత తిట్లు తింటూ, చుట్టూ పక్కల జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ లో డీజే వాయిస్తూ ఉండే టిల్లు.. ఒకసారి అనుకోకుండా క్లబ్ కి వెళ్లి అక్కడ సాంగ్స్ పాడే రాధిక(నేహా శెట్టి)తో ప్రేమలో పడతాడు. అప్పటిదాకా సరదాగా, సాఫీగా సాగిపోయిన టిల్లు లైఫ్ రాధిక రాకతో ఊహించని మలుపులు తిరుగుతుంది. ఒక హత్య కేసులో రాధికతో పాటు టిల్లు ఇరుక్కుంటాడు. ఆ హత్య చేయబడిన వ్యక్తి ఎవరు? అతనికి, రాధికకి మధ్య సంబంధం ఏంటి? ఈ హత్య కేసు నుంచి టిల్లు ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

డీజే టిల్లు సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేక్షకులను నవ్వించడం. ఆ విషయంలో సిద్ధు, విమల్ కృష్ణ చాలావరకు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో టిల్లు, రాధిక మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ముఖ్యంగా రాధిక మాజీ ప్రియుడి హత్య తర్వాత వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవించాయి. ఇదే కామెడీ డోస్ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ అయ్యుంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. ఫస్ట్ హాఫ్ లో విపరీతంగా నవ్వించిన టిల్లు.. సెకండాఫ్ లో మాత్రం అంతగా నవ్వించలేకపోయాడు. టిల్లు గతం మర్చిపోయే ఎపిసోడ్, కోర్టు ఎపిసోడ్ మరింత కామెడీగా మలిచి ఉంటే బాగుండేది.

ఈ సినిమాకి ప్రధాన బలం డైలాగ్స్. ఫస్టాఫ్ అంతా డైలాగ్ కామెడీతోనే నడిచింది. 'నాదసలే డెలికేట్ మైండ్', 'అట్లుంటది నాతోని' వంటి ఎన్నో మాటలతో ఫస్టాఫ్ నవ్వులు పూయించింది. ఇంటర్వెల్ వరకు ఫుల్ గా నవ్వుకున్న ఆడియన్స్ సెకండాఫ్ లో అంతకుమించిన నవ్వులు ఉంటాయని భావిస్తారు. కానీ టిల్లు ఆడియన్స్ అంచనాలను తలకిందులు చేశాడు. సెకండాఫ్ లో కామెడీ డోస్ తగ్గిపోయింది. దీంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతారు.

హీరో సిద్ధు, డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారు. అంతేకాదు మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సూచనలు కూడా వారు తీసుకున్నారు. కానీ సినిమా చూశాక మాత్రం సెకండాఫ్ మీద వారు మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది అన్న అభిప్రాయం కలుగుతుంది. 

శ్రీచరణ్ పాకాల సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ మిర్యాల తనే కంపోజ్ చేసి పాడిన 'టిల్లు అన్న డీజే పెడితే' సాంగ్ బాగుంది. ఇక ఈ సినిమాకి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయిందని చెప్పొచ్చు. సాయి ప్రకాష్ కెమెరా పనితనం బాగుంది.

ప్ల‌స్ పాయింట్స్‌:
సిద్ధు
ఫస్టాఫ్
డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్‌:
సెకండాఫ్ లో కామెడీ తగ్గడం

న‌టీన‌టుల ప‌నితీరు:- 'డీజే టిల్లు' టైటిల్ రోల్ పోషించిన సిద్ధు జొన్నలగడ్డ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. డీజే టిల్లు పాత్రను బాగా ఓన్ చేసుకొని బాడీ ల్యాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఓ వైపు ఆ పాత్రలో ఉన్న ఎనర్జీని చూపిస్తూనే, మరోవైపు ఆ పాత్రలో ఉన్న అమాయకత్వాన్ని పలికించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రేమ, ప్రియురాలిపై అనుమానం, హత్య కేసులో ఇరుక్కున్నాన్న ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూపిస్తూ పాత్రలో లీనమైపోయాడు సిద్ధు. రాధికగా నేహా శెట్టి మెప్పించింది. గ్లామర్, సాంగ్స్ కి పరిమితమైన పాత్ర కాదు తనది. ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర. నేహా శెట్టి  ఆ పాత్రకు న్యాయం చేసింది.  ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్రగతి, రాజా రవీంద్ర ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమయ్యారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫస్టాఫ్ లో ఫుల్ గా నవ్వించి, సెకండాఫ్ లో ఒక మాదిరిగా నవ్వించే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'డీజే టిల్లు'.

-గంగసాని

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25