Read more!

English | Telugu

సినిమా పేరు:డీజే (దువ్వాడ జగన్నాథమ్)
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jun 23, 2017

కొన్ని కొన్ని సినిమాలు కాంబినేష‌న్ ప‌రంగా ఎక్క‌డ లేని క్రేజ్ సంపాదించేసుకొంటుంటాయ్‌. టైటిల్‌తో హైప్ పెంచేసుకొంటుంటాయ్‌. అలాంటి సినిమాల్లో 'డీజే' కూడా ఉంటుంది. 'దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్' అనే టైటిల్ బ‌న్నీకి పెట్టిన‌ప్పుడే హ‌రీష్ శంక‌ర్ మార్కులు కొట్టేశారు. అల్లు అర్జున్ - దిల్ రాజు - హ‌రిష్ శంక‌ర్ కాంబో చూసి ఇక - 'ర‌చ్చః ర‌చ్చ‌స్య ర‌చ్చోభ్య' అనుకొన్నారంతా.  ట్రైల‌ర్లు బ‌న్నీ ఫ్యాన్స్‌కి ప‌ట్టేశాయి. పాట‌లు మాస్‌కి న‌చ్చేశాయ్‌. దాంతో 'సూప‌ర్‌.. సూప‌ర‌స్య‌..సూప‌ర‌భ్యో' సినిమా చూసేయ‌డం ఖాయం అని లెక్క‌లు వేసుకొన్నారు. మరి ఈ అంచ‌నాల్ని.. డీజే అందుకొన్నాడా, లేదా? 'డీజే' క‌థా, క‌మామిషూ ఏంటి??  ఆ లెక్క‌లు చూసేద్దాం... రండి.

*  క‌థ‌

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ (అల్లు అర్జున్‌) బ్రాహ్మ‌ణ యువ‌కుడు. కోపం ఎక్కువ‌. త‌న ముందు అన్యాయం జ‌రిగితే స‌హించ‌లేడు. అలాంట‌ప్పుడు డీజేగా అవ‌తారం ఎత్తుతాడు. ఓ పోలీస్ అధికారి (ముర‌ళీ శ‌ర్మ‌) అండ‌తో, ఇచ్చిన స‌మాచారంతో దుర్మార్గుల్ని వేటాడుతుంటాడు. డీజే వేటాడాల్సిన ఓ దుర్మార్గుడు రొయ్య‌ల నాయుడు (రావు ర‌మేష్‌). తొమ్మిదివేల కోట్ల రూపాయ‌ల స్కామ్‌లో ప్ర‌ధాన నిందితుడు. కానీ త‌ను ఎవ‌రో, ఎక్క‌డ ఉంటాడో, ఎలా ఉంటాడో తెలీదు. మ‌రోవైపు పూజా (పూజా హెగ్డే)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. కానీ.. పూజా మాత్రం 'నాకు స్టైలీష్ మొగుడు కావాలి' అంటూ జ‌గ‌న్నాథ‌మ్‌ని వ‌దిలేసి వెళ్లిపోతుంది. రొయ్య‌ల నాయుడిని డీజే ప‌ట్టుకొన్నాడా, లేదా??  పూజా మ‌ళ్లీ జ‌గ‌న్నాథ‌మ్‌కి ద‌గ్గ‌రైందా?  ఈ విష‌యాల‌న్నీ వెండి తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే. 


ఎనాలసిస్ :

క‌థాబ‌లం ఉన్న చిత్రాల‌కు పెద్ద పీట వేస్తాడ‌ని దిల్ రాజుకి మంచి పేరుంది. కానీ... తొలిసారి త‌న సినిమాలో ఇంత బ‌లహీన‌మైన క‌థ క‌నిపించ‌డం చూస్తే ఆశ్చ‌ర్యం వేస్తుంది.  క‌థాప‌రంగా డీజేలో మ‌లుపులు లేవు. చాలాఫ్లాట్ క‌థ‌. దాన్ని అంతే సాదాసీదాగా తెర‌కెక్కించాడు హ‌రీష్ శంక‌ర్‌. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే షేడ్ హీరోకి ఆపాదించ‌క‌పోతే... అస‌లు `డీజే` కోసం థియేట‌ర్ వ‌ర‌కూ వెళ్ల‌డం కూడా అన‌వ‌స‌ర‌మే. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ పాత్ర చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంటుంది. దాన్నుంచి పండించిన వినోదం, సన్నివేశాలే ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లం అయ్యింది. డీజే ఇంటి స‌న్నివేశాలు, పెళ్లిలో చేసిన గోల‌, పూజాతో కామెడీ ఇవ్వ‌న్నీ వ‌ర్క‌వుట్ అయ్యాయి. యాక్ష‌న్ సీన్స్ కూడా మాస్‌కి న‌చ్చేలా తీర్చిదిద్ద‌డం, డీజే క్యారెక్ట‌ర్ స్టైలీష్‌గా క‌నిపించ‌డం, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ ఓ ప్యాకేజీలా క‌ల‌ప‌డం - ఇవ‌న్నీ క‌లిసొచ్చాయి. దాంతో ఫ‌స్టాఫ్ లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి ఢోకా లేకుండా పోయింది. ద్వితీయార్థం లో మాత్రం ఆ జోరు బాగా త‌గ్గిపోయింది. హీరో - విల‌న్ల మ‌ధ్య న‌డ‌పాల్సిన డ్రామా పూర్తిగా పక్క‌దారి ప‌ట్టింది. చివ‌ర్లో సుబ్బ‌రాజుని జోక‌ర్‌గా చేసుకొని.. క‌థ‌ని ముగించ‌డం కూడా ఏమాత్రం ర‌క్తిక‌ట్ట‌లేదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌చ్చిప‌డిపోయే పాట‌లు బోర్ కొట్టిస్తాయి. కొన్ని చోట్ల కామెడీని బ‌ల‌వంతంగా ఇరికించిన భావ‌న క‌లిగింది. దాంతో పాటు.. దువ్వాడ పాత్ర బూతులు ప‌ల‌క‌డం.. చూళ్లేం. విన‌లేం.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

అల్లు అర్జున్ వ‌న్ మాన్ షో.. ఈసినిమాని కాపాడే ఎలిమెంట్‌. రెండు షేడ్స్‌లోనూ వేరియేష‌న్స్ బాగా చూపించాడు. ఎక్కువ మార్కులు వేయాల్సివ‌స్తే.. జ‌గ‌న్నాథ‌మ్ పాత్ర‌కే వేయాలి. అందులో బ‌న్నీ మాండ‌లికం కాస్త ఓవ‌ర్‌గా అనిపించినా ఆ మాత్రం చేయ‌గ‌లిగాడంటే గ్రేటే అనుకోవాలి. డాన్సుల్లో జోరు త‌గ్గింది. కాక‌పోతే.. వాటినీ స్టైలీష్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. పూజా పాత్ర గ్లామ‌ర్ కోస‌మే. ఆమె లిప్ సింక్ కుద‌ర్లేదు. కాక‌పోతే హాట్ హాట్ గా క‌నిపించింది. క‌థ‌కు అతికీల‌క‌మైన ముర‌ళీ శ‌ర్మ పాత్ర‌నే స‌రిగా డిజైన్ చేయ‌లేదు. ముర‌ళీ శ‌ర్మ క్యారెక్ట‌రైజేష‌న్‌కి ఇంకాస్త వెయిట్ ఇవ్వాల్సిందే. రొయ్య‌ల నాయుడుగా రావు ర‌మేష్ కూడా ఓకే అనిపిస్తాడు. 

* సాంకేతిక వ‌ర్గం

దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అంతంత మాత్ర‌మే. విన‌గానే ఆక‌ట్టుకొనే ట్యూన్లు లేవు. నేప‌థ్య సంగీతంలో త‌న జోరు చూపించాడు. దిల్ రాజు నుంచి వ‌చ్చే సినిమాల్నీ ఇంతే భారీగాఉండ‌డం కామ‌న్‌. ఆయ‌న ఖ‌ర్చుకి వెన‌కాడ‌లేదు. హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి ద‌ర్శ‌కుడిగా ఫెయిల్ అయ్యాడు. కాక‌పోతే ర‌చ‌యిత‌గా త‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది. దువ్వాడ చేత బూతులు ప‌లికించినందుకు... ఆ నింద ఆయ‌న కూడా మోయాల్సివ‌స్తుంది. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా జాగ్ర‌త్త‌గా లేక‌పోతే.. క్యారెక్ట‌రైజేష‌న్లు ఎంత కొత్త‌గా ఉన్నా లాభం లేద‌న్న సంగ‌తి... హ‌రీష్ తెలుసుకోవాలి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

డీజే.. బోరో.. బోర‌స్య‌.. బోర‌భ్యః