Read more!

English | Telugu

సినిమా పేరు:కోబ్రా
బ్యానర్:సెవెన్ స్క్రీన్ స్టూడియో
Rating:2.50
విడుదలయిన తేది:Aug 31, 2022

సినిమా పేరు: కోబ్రా
తారాగ‌ణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మేథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి
మ్యూజిక్:  ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్ర‌ఫీ: హరీష్ కణ్ణన్
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
నిర్మాత: లలిత్ కుమార్
ద‌ర్శ‌క‌త్వం: అజయ్ జ్ణానముత్తు
బ్యాన‌ర్: సెవెన్ స్క్రీన్ స్టూడియో
విడుద‌ల తేదీ: 31 ఆగ‌స్ట్ 2022

 

'శివ పుత్రుడు', 'అపరిచితుడు' వంటి సినిమాలతో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 'అపరిచితుడు' తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక తడబడుతున్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాజాగా విక్రమ్ నటించిన 'కోబ్రా' మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 'డిమోంటి కాలనీ' ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో 'కోబ్రా'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం వంటివి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కోబ్రా' అయినా విక్రమ్ కి ఆశించిన విజయాన్ని అందించేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:

గణితంలో దిట్ట అయిన లెక్కల మాస్టారు మది(విక్రమ్) ఓ వైపు పిల్లలకు పాఠాలు చెబుతూ, మరోవైపు హత్యలు చేస్తుంటాడు. భారీ సెక్యూరిటీ నడుమ ఏకంగా స్కాట్లాండ్ ప్రిన్స్ ని తన ఇంటలిజెన్స్ తో చంపేసి ఒక్క క్లూ కూడా దొరక్కుండా తప్పించుకుంటాడు. అయితే ఈ హత్య ఏడాది క్రితం ఇండియాలో జరిగిన ఒడిస్సా ముఖ్యమంత్రి హత్య తరహాలో ఉందని తెలుసుకున్న ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్(ఇర్ఫాన్ పఠాన్) మదిని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి అజ్జ్ఞాతంలో ఉన్న ఒక హ్యాకర్ మదిని పట్టించడానికి సాయం చేస్తుంటాడు. అసలు ఆ హ్యాకర్ ఎవరు? అతనికి, మదికి సంబంధం ఏంటి? మది హత్యలు చేయడానికి కారణమేంటి? అస్లాన్ అతనిని పట్టుకోగలిగాడా? తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఉత్తమ నటుల్లో విక్రమ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం నటనతోనే సినిమాలు విజయాన్ని అందుకోలేవు. ముందు మంచి స్క్రిప్ట్ ఉండాలి, దానికి మంచి నటన తోడవ్వాలి. కానీ విక్రమ్ తన క్యారెక్టర్, గెటప్స్ మీద పెట్టిన శ్రద్ధ.. స్క్రిప్ట్ మీద పెట్టడం లేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు 'కోబ్రా' విషయంలోనూ అదే పొరపాటు కనిపిస్తోంది.

ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. కానీ 'కోబ్రా' విషయంలో అడుగడుగునా తడబాటు కనిపించింది. నిజానికి ఇది చాలా సాధారణ కథ. కానీ స్క్రీన్ ప్లే కాస్త గందరగోళంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. ఒక ఇంటర్వెల్ ట్విస్ట్, కొన్ని సన్నివేశాలను నమ్ముకొని ప్రేక్షకులను మూడు గంటల పాటు ఎలా కూర్చోబెట్టగలను అనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. 

విక్రమ్ హత్యలు చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ అవి ఫస్టాఫ్ కే పరిమితం. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉన్నా సెకండాఫ్ పూర్తిగా తేలిపోయింది. పైగా చాలాసేపు స్క్రీన్ మీద విక్రమ్ కనిపించడు. అలాగే అతను గణితాన్ని ఉపయోగించి హత్యలు చేసినట్లు చెప్తుంటారు. కానీ చూసే మనకు కొన్నిచోట్ల అది కెమిస్ట్రీలా అనిపిస్తుంది. ఇక పదే పదే వచ్చే అతని హలూసినేషన్ సన్నివేశాలు అక్కడక్కడా చిరాకు తెప్పిస్తాయి. అలాగే అసలు హీరో మెయిన్ మోటివ్ ఏంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. చిన్నప్పుడు సాయం చేసిన తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి(కేఎస్ రవికుమార్)కి ఇచ్చిన మాట ప్రకారం, ఆయనేది చెప్తే అది విక్రమ్ చేస్తాడని డైలాగ్ రూపంలో చెప్పించినా అది అంత కన్విన్సింగింగ్ గా లేదు. అలాగే క్రూయల్ అండ్ యంగ్ బిజినెస్ మ్యాన్ రిషి(రోషన్) తన వ్యాపారానికి, ఎదుగుదలకి అడ్డుగా ఉన్నవాళ్ళని.. ముఖ్యమంత్రులను మొదలుకొని విదేశాలకు చెందిన యువరాజులను వరకు హత్యలు చేయించడం కూడా అంత నమ్మశక్యంగా అనిపించదు.

మూడు గంటలకు పైగా నిడివి ఉండటమే 'కోబ్రా' సినిమాకి మెయిన్ మైనస్ అయిందని చెప్పొచ్చు. నిజానికి ఈ చిత్రంలో కొన్ని కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే, నిడివి మీద శ్రద్ధ పెట్టుంటే ఔట్ పుట్ కాస్త బెటర్ గానే ఉండేది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. కొన్ని కొన్ని సన్నివేశాలను తన మ్యూజిక్ తో మరోస్థాయికి తీసుకెళ్లారు. అయితే సాంగ్స్ లో మాత్రం ఆయన మార్క్ కనిపించలేదు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ భువన్ శ్రీనివాసన్ ఎందుకనో చేతులు కట్టుకున్నట్లు అనిపించింది. కనీసం 30 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు. అలా చేసినా ఔట్ పుట్ బెటర్ గా ఉండేది. తెలుగు డబ్బింగ్ ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల పనితీరు:

విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మది పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. విభిన్న గెటప్పుల్లో కనిపించి మెప్పించాడు. ఇందులో ప్రధానంగా విక్రమ్ రెండు పాత్రలు పోషించాడు. ఆ రెండు పాత్రలకు ఆయన ఎప్పటిలాగే పూర్తి న్యాయం చేశాడు. శ్రీనిధి శెట్టి మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇంటర్ పోల్ అధికారిగా చక్కగా నటించాడు. ఇది ఆయన మొదటి సినిమా అన్న ఆలోచనే కలగదు. రోషన్ మేథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ట్రైలర్, విక్రమ్ గెటప్ లు చూసి భారీ అంచనాలతో కోబ్రా సినిమాకి వెళ్తే నిరాశ చెందక తప్పదు. గందరగోళానికి గురి చేసే స్క్రీన్ ప్లే, సహనానికి పరీక్ష పెట్టే నిడివితో అక్కడక్కడా మాత్రమే అలరించే ఈ చిత్రం విక్రమ్ కి విజయాన్ని అందించడం సందేహమే.

-గంగసాని