English | Telugu
బ్యానర్:శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్
Rating:3.50
విడుదలయిన తేది:Mar 11, 2022
సినిమా పేరు: క్లాప్
తారాగణం: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, క్రిష కురుప్, నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ, మునీష్‌కాంత్, మైమ్ గోపి, మీనా (టీవీ ఆర్టిస్ట్)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కుమార్
ఎడిటింగ్: రగుల్
సమర్పణ: బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఐ.బి. కార్తికేయన్
నిర్మాతలు: రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి
రచన-దర్శకత్వం: పృథివి ఆదిత్య
బ్యానర్స్: శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్
విడుదల తేదీ: 11 మార్చి 2022 (ఓటీటీ - సోనీ లివ్)
ఆది పినిశెట్టి నటించిన ద్విభాషా చిత్రం 'క్లాప్' థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలవడంతో పెద్దగా ఎవరూ దానిపై ఆసక్తి ప్రదర్శించలేదు. కారణం.. అదే రోజు ప్రభాస్ లాంటి స్టార్ నటించిన రాధే శ్యామ్ థియేటర్లలో విడుదలవడం. అయితే క్రమేణా క్లాప్‌కు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు ఆ సినిమాపై పలువురు కుతూహలం వ్యక్తం చేస్తున్నారు.
కథ
అథ్లెట్‌గా రాణించాలని కలలు కనే విష్ణు (ఆది).. ఆ కలలను నిజం చేసుకొనే క్రమంలో 400 మీ. రన్నింగ్ రేస్‌లో స్టేట్ లెవల్‌లో టాపర్‌గా వచ్చి, నేషనల్స్‌కు ఎంపికవుతాడు. అనూహ్యంగా రోడ్ యాక్సిడెంట్‌కు గురై, తండ్రి (ప్రకాశ్‌రాజ్)ను కోల్పోవడంతో పాటు, తాను ఓ కాలును కోల్పోతాడు. దీంతో అతడి కలలన్నీ చెదిరిపోతాయి. అయితే అప్పటికే అతడిని ప్రేమించిన మిత్ర (ఆకాంక్ష సింగ్) అతడికి తోడునీడగా నిలవాలని తల్లితండ్రులను ఎదిరించి మరీ అతడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ విష్ణు డిప్రెషన్‌కు గురై, మిత్రతో ముభావంగా ప్రవర్తిస్తుంటాడు. ఆ పరిస్థితుల్లో ఎక్కడో ఓ మారుమూల ఊళ్లోని భాగ్యలక్ష్మి (క్రిష కురుప్) అనే అమ్మాయి ఆర్థిక పరిస్థితుల రీత్యా రన్నింగ్ రేస్‌లో పాల్గొనలేకపోతున్నదని, ఆమె చాలా ప్రతిభావంతురాలనీ అతడికి తెలుస్తుంది. మిత్రకు చెప్పకుండా అక్కడకు వెళ్లి, ఆమెకు తాను ట్రైనింగ్ ఇప్పించి, నేషనల్‌కు వెళ్లేలా చేస్తానని పెద్దవాళ్లను ఒప్పించి, తనతో ఇంటికి తీసుకువస్తాడు. మిత్ర ఆ ఇద్దర్నీ వదిలి తన పుట్టింటికి వెళ్లిపోతుంది. విష్ణు అంటే ఏమాత్రం గిట్టని వెంకట్రామ్ (నాజర్) సౌత్‌జోన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ హోదాలో భాగ్యలక్ష్మి సెలక్ట్ కాకుండా అడ్డుకుంటాడు. ఫ్రస్ట్రేషన్‌కు గురైన విష్ణు ఏం చేశాడు? భాగ్యలక్ష్మి అలియాస్ దుర్గ భవిష్యత్తు ఏమైంది? మిత్ర-విష్ణు మధ్య దూరం పెరిగిందా, తగ్గిందా? అనేవి మిగతా కథలో కనిపించే అంశాలు.
ఎనాలసిస్ :
ఒక పర్పస్‌ఫుల్ స్టోరీని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆసక్తికరమైన కథనంతో నడిపించిన దర్శకుడు పృథివి ఆదిత్యకు ఫుల్ మార్కులు ఇవ్వాలి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీని, అదీ కూడా ఒక అమ్మాయిని చాంపియన్‌గా నిలపడం కోసం ఒక హ్యాండీక్యాప్డ్ పర్సన్ ఏం చేశాడో చూపించే సబ్జెక్టుని జనరంజకంగా మలచడం అంత ఈజీ కాదు. పెద్ద స్టార్లు లేకుండా మెప్పించడం ఇంకా కష్టం. అయినా ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి, సక్సెసయ్యాడు దర్శకుడు. ఈ సినిమాలో అన్నింటికంటే ప్రధానమైంది ఆది పోషించిన విష్ణు పాత్ర. యాక్సిడెంట్‌లో మోకాలి పైదాకా ఓ కాలును పోగొట్టుకొని, కలలన్నీ ఛిద్రమైపోగా, తల్లిలేని తనను అన్నీ తానై పెంచిన తండ్రి కూడా యాక్సిడెంట్‌లో పోగొట్టుకున్న విష్ణు పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు ఇంప్రెసివ్‌గా, నేచురల్‌గా అనిపిస్తుంది. అవిటివాడైన తను మిత్రకు తగననే అపరాధ భావనకు గురైన విష్ణు పడే మానసిక ఘర్షణ మనల్ని కదిలిస్తుంది. అదే సమయంలో అతడి బాధ తెలిసిన మిత్ర మౌనంగా తనలో తనే కుమిలిపోతూ, అతడి అవసరాలన్నీ మౌనంగానే తీరుస్తూ తన ఔన్నత్యాన్ని నిలుపుకుంటూ ఉంటుంది.
తమకు నచ్చనివాళ్లను, ఎదురొచ్చిన వాళ్లను అణగదొక్కడానికి తమ పవర్‌ను ఉపయోగించి ఔత్సాహికులైన ప్రతిభావంతుల కలల్ని చిదిమేయడానికి ఎంతదాకా వెళ్తారో నాజర్ పోషించిన వెంకట్రామ్ క్యారెక్టర్ మనకు తెలియజేస్తుంది. భాగ్యలక్ష్మి అనే అమ్మాయిని తీసుకొచ్చి, ఆమెను ఛాంపియన్‌గా నిలబెట్టాలని విష్ణు చూస్తున్నాడని తెలుసుకున్న వెంకటరామ్ ఆమె కలల్ని చిదిమేయడానికి చేసే పనులు మనకు అసహ్యం కలిగిస్తాయి. అదే సమయంలో ఇటు విష్ణుపైనా, అటు భాగ్యలక్ష్మి పైనా మనకు సానుభూతిని ప్రేరేపిస్తాయి. వెంకట్రామ్ దుష్ట దృష్టి నుంచి తప్పించుకోవడానికి భాగ్యలక్ష్మి పేరును దుర్గగా మార్చి విష్ణు వేసిన ఎత్తు బెడిసికొట్టినప్పుడు అతడి బాధ మన బాధవుతుంది. ఎలాగైనా అతడి ఆకాంక్ష నెరవేరి భాగ్యలక్ష్మి నేషనల్స్‌కు ఎంపికవ్వాలని మనం బలంగా కోరుకుంటాం. భాగ్యలక్ష్మి కూడా విష్ణు మనోగతాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తూ, ఎలాగైనా రన్నింగ్ రేస్‌లో నెగ్గాలనే తపనని ప్రవర్తిస్తుంటే ఆమె పాత్రతో మనం ప్రేమలో పడిపోతాం. ఆమెకు ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనప్పుడల్లా ఆమెతో పాటు మనమూ బాధపడతాం. ఆమె విజయం సాధించినప్పుడు తన కలను ఓ గురువుగా సాధించాననే తృప్తి విష్ణులో కనిపించినప్పుడు మనం ఆనందపడతాం.
ఒక ప్రయోజనాత్మక కథను ప్రేక్షకులు మెచ్చేగా తీయడంలో దర్శకుడికి టెక్నీషియన్లు అందరూ బాగా తోడ్పాటునందించారు. మ్యాస్ట్రో ఇళయరాజా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎస్సెట్‌గా నిలిచింది. పలు సన్నివేశాలకు ఆయన ఇచ్చిన బీజియం వల్ల ఎలివేషన్ వచ్చింది. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. కథను అర్థం చేసుకొని సహజమనిపించేలా ఆయా సన్నివేశాల్ని మనకు ప్రెజెంట్ చేశాడు. రగుల్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది.
నటీనటుల పనితీరు:- నటులందరూ తమ పాత్రల్ని అవగాహన చేసుకొని నటిస్తే, ఎలా ఉంటుందో క్లాప్‌ని చూస్తే అర్థమవుతుంది. విష్ణు పాత్రలో ఆది పినిశెట్టి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్‌ను ఇచ్చాడు. ఇప్పటికే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న అతను విష్ణు క్యారెక్టర్‌లోని భిన్నమైన షేడ్స్‌ను సూపర్బ్‌గా ప్రదర్శించాడు. అవిటి కాలు ప్రతిరోజూ రాత్రిపూట విపరీతమైన నొప్పిని కలిగిస్తుంటే, ఆ నొప్పికి అతడు విలవిల్లాడుతుంటే మన గుండెలు అల్లాడిపోతాయంటే.. అది అతడి నటనలోని నైపుణ్యానికి నిదర్శనం. నిస్సందేహంగా అతడిది అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. అతడిని ప్రేమించి పెళ్లి చేసుకొని, అతడి మౌనంతో నరకం అనుభవించే మిత్ర పాత్రకు ఆకాంక్ష సింగ్ అతికినట్లు సరిపోయింది. ఎంతో సంఘర్షణతో కూడిన ఆ పాత్రను ఆమె సమర్థవంతంగా పోషించింది.
భాగ్యలక్ష్మి అలియాస్ దుర్గగా కొత్తమ్మాయి క్రిష కురుప్ నటనను మెచ్చుకోకుండా ఉండలేం. రన్నింగ్ రేసుల్లో పరిగెత్తే అథ్లెట్‌గా కనిపిస్తూ, తన కలను నిజం చేసుకొనే క్రమంలో కష్టాలు ఎదురైనప్పుడు చక్కని హావభావాలు ప్రదర్శించింది. వెంకట్రామ్ లాంటి నెగటివ్ రోల్ నాజర్‌కు నల్లేరు మీద బండి నడక. విష్ణు తండ్రిగా స్పెషల్ రోల్‌లో ప్రకాశ్‌రాజ్ మెరిశారు. విష్ణు పై ఆఫీసర్‌గా బ్రహ్మాజీ, విష్ణుకు తోడుగా నిలిచే ఆఫీస్ అటెండర్ బాబుగా మునీష్‌కాంత్, కోచ్‌గా మైమ్ గోపి తమ పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అర్థవంతమైన, ప్రయోజనాత్మక కథకు చక్కటి ట్రీట్‌మెంట్ ఇచ్చిన 'క్లాప్'.. తప్పకుండా చూడాల్సిన సినిమా. విష్ణు పాత్రలో ఆది పినిశెట్టి ప్రదర్శించిన ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కోసమైనా ఈ సినిమాని చూసేయొచ్చు.
- బుద్ధి యజ్ఞమూర్తి